ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

22, ఆగస్టు 2010, ఆదివారం

అల్లసాని పెద్దన - ఆంధ్ర కవితా పితామహుడా?? ఎలా???


పెద్దన్నగారికి "ఆంధ్ర కవితా పితామహు"డని బిరుదు..కాని పెద్దన కంటె పూర్వులు తెలుగులో చాలామంది ఉన్నారు..కవిత్రయము,నాచన సోమన్న,శ్రీనాథుడు,పోతన్న మొదలైన మహానుభావులు చాలామంది ఉన్నారు...అసలు కవిత్రయంలో ఒకడైన ఎఱ్ఱాప్రెగడకి "ప్రబంధ పరమేశ్వరు"డన్న బిరుదుంది....మరి అలాంటప్పుడు పెద్దన్నగారికి ఆంధ్రకవితా పితామహుడన్న బిరుదు ఎలా వచ్చిందో, ఎలాగ చెల్లుబడైందో ఇక్కడ మనం విచారించవలసిన విషయం..........

అసలు ఈ బిరుదు పెద్దన్నగారికి శ్రీకృష్ణదేవరాయల వారిచ్చినది....కృష్ణరాయడు విద్వత్ప్ర్రభువు,భావుకుడు, సహజంగా గొప్పకవి..మరి ఆ ప్రభువుకి ముందు మహామహులున్నారని తెలియదా? శ్రీనాథుడున్నాడని తెలియదా? నాచన సోమన్న ఉన్నాడని తెలియదా? పెద్దన్నకి ఈ బిరుదివ్వటమేంటి? తాను చక్రవర్తి గనుక తన కభిమానుడైన కవికి ఈ బిరుదిచ్చాడా? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్న కూడా వైష్ణవుడే. మరి ఈ అభిమానంచేత ఇచ్చాడా? లేదా, "ఆంధ్ర కవిత" అంటేనే, కృష్ణరాయని అభిప్రాయం వేరా????...

ఇన్ని ప్రశ్నలు పుడతాయ్!! లౌకికమైన కారణాలు ఇక్కడ పొసగవు..విప్రతిపత్తు లెన్నైనా చెప్పుకోవచ్చు....

ఒక భాష ఉందనుకుందాం....దానికి గొప్ప సారస్వతం ఉందనుకొందాం....ఆ సారస్వతం వృధ్ధిపొందే లక్షణాలలో కొన్ని దశలుంటై.....వాటిలో ప్రథమదశ పురాణదశ. రెండవది కావ్యదశ....కవిత్రయం, నాచన సోమన్న, పోతన్న మొదలైనవారిది పురాణదశ....వీళ్ళంతా సంస్కృత కావ్యాలని తెలుగు చేశారు... శ్రీనాథుడు ఈ పురాణదశలో చివరివాడు...కాని ఆయన రాసిన "శృంగార నైషధము" దానంతట అది కావ్యం...అది అనువాదమే కాని, స్వతంత్ర గ్రంథం కాదు....

అదలా ఉంచితే, అల్లసాని పెద్దన్న మనకి ఆంధ్రభాషలో మొట్టమొదట స్వతంత్రకావ్యం రాసినవాడుగా కనపడతాడు...."మనుచరిత్ర" అనువాదం కాదు...మార్కండేయ పురాణంలోని ఒక కథ తీసుకుని దానిని స్వతంత్ర కావ్యంగా నిర్మించాడు....కాని పూర్వపు కవుల తెలుగుసేత కూడా మరీ మక్కికి మక్కిగా ఉండదు..కాబట్టి 'ఇదే' ఆంధ్రకవితా సమారంభమనటానికి, రాయలవారి బుద్ధిలో ’పద్యరచన’ అనికాదు...తెలుగుసేత అనీ కాదు..’స్వతంత్ర కావ్యం’ అని అనిపించుకోదగ్గ ఆంధ్ర పద్యగ్రంథం అని నిర్ణయం చేసుకోవచ్చు.....అసలిక్కడ ప్రాధాన్యత ’కావ్య’ శబ్దానికి...కావ్యలక్షణాలని పట్టిస్తే మనుచరిత్రే ప్రథమ కావ్యం...ఒక గ్రంథాన్ని కావ్యంగా నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ప్రసిధ్ధమైన మార్గం ఒకటుంది...అది ఏకరసాశ్రయమైన కథ..ఇక్కడిది శృంగార రసము...

అసలుకి ఈ గ్రంథం పేరు "స్వారోచిష మనుసంభవం"...కాని మనుచరిత్రయని అలవాటైంది..ఆ పేరే చెల్లుబడౌతున్నది....ఒక మహావిషయాన్ని స్థాపించటానికి తొట్టతొలుత వ్రాయబడిన కావ్యం ఇదే అని చెప్పుకోవచ్చు...అందులోను, స్వతంత్రంగా కథానిర్మాణంచేసి, కథాంశాలని తానే సమకూర్చుకుని చేయబడిన మొదటిగ్రంథం ఆంధ్ర సారస్వతంలో ఇదే!

ప్రధానమైంది ఇంకో విషయముంది....కవులందరికి తలా ఒక శైలి ఉంటుంది. పురాణకవుల శైలులు పురాణకవులవి. కావ్యకవుల శైలులు కావ్యకవులవి. ఆ రెండిటికి చాలా భేదముంటుంది...పురాణకవులు ప్రధానంగా కథ చెప్పుకుపోవటం మీద దృష్టి పెడతారు. కావ్యకవుల దృష్టి ప్రధానంగా వర్ణన మీద ఉంటుంది...పురాణ కవులు పద్యరచన చక్కగా చెయ్యాలనే ప్రయత్నం ఎక్కువ చెయ్యరు. వారు రాసేప్పుడు దాని సందర్భాన్ని బట్టి ఒక మంచి రచనగల పద్యం రావచ్చు...కాని కావ్యకవుల్లో ఆ ప్రయత్నం అధికం.అలాంటి పద్యాల సంఖ్యా ఎక్కువే! పురాణాలు చదివేటప్పుడు పాఠకుడి బుధ్ధి కథాగమనం, భిన్నాంశాలు మొదలైన వాటిమీద ఉంటుంది....కాని కావ్యాలు చదివేప్పుడు అలా కాదు..ఇక్కడ పాఠకుడి బుద్ధి ప్రతి పద్యంలో ఉండే చమత్కారం, వాటిలో చెయ్యబడ్డ సూక్ష్మమైన కల్పన, రచనా సౌందర్యం వీటి మీద ఉంటుంది....వారిని వీరిని పోల్చిచూడకూడదు...

సామాన్య సంసారాలు ఉన్నై...సంపన్నమైనవీ ఉన్నై...రెండిటికీ ప్రాధాన్యం బ్రతకటమే...కాని సామాన్యుల ఇళ్ళల్లో అతిథులొస్తే చాపవేసి కూర్చోబెడతారు.మర్యాదచేసి మాటాడి పంపిస్తారు. అదే, గొప్ప సంపత్తుకల సంసారాలలో అతిథులు వస్తే పరుపులు, తివాసీలు, పట్టుతో కుట్టిన సోఫాలు, ఏసిలు, అగరొత్తులు- మొదలైన భోగాలుంటై...పురాణకవులకి, కావ్యకవులకి భేదం ఇది...

మరిన్నూ, తొలుతటి రాజులు వేఱు. తరువాత వచ్చిన రాజులు వేఱు. శ్రీకృష్ణరాయల నాటికి ఆంధ్రసామ్రాజ్యం ఏర్పడింది.విజయనగర సామ్రాజ్యం స్థిరపడింది. విజయనగరం, నాటి ప్రపంచకాలలో ఒక మహానగరం. అనంతమైన ఒక భోగభూమి. భోగాలలో సూక్ష్మమైన విషయాలని అనుభవించుటకు కావలసినంత సంపత్తు కలది. పాలు తాగితే వట్టి వెండిగిన్నెలో తాగరు. బంగారుగిన్నెకాని, వజ్రపుగిన్నె కాని కావాలి..ఆ గిన్నె చుట్టు, అది పట్టుకునే ’పిడి’ శిల్పాలతో, నగిషీ చెక్కబడి ఉండాలి...ఇదొక భోగలక్షణం... ఈ భోగలక్షణం ఆనాటి సర్వశిల్పవిద్యలందు భాసించింది...అదే కవిత్వంలోకి కూడా వచ్చింది...

అందువల్లనే పెద్దన్నగారి పద్యరచన, పరమ మాధుర్యగుణాలన్నిటికీ విధానమైంది...క్రొత్త క్రొత్త పలుకుబళ్ళకు,రమ్యమైన సమాసాలకు కాణాచిగా నిలబడింది..పరమేశ్వరుడు పరమ మధుర సరస్వతీరూపంగా, చిక్కటి శారదారూపంగా పెద్దన్నగారి వాక్కులో వచ్చికూర్చున్నాడు...ఆయనలాగా చక్కని మధురమైన పద్యరచన చెయ్యగల కవి ఆంధ్రసారస్వతంలో మరొకడుండడు..మన సారస్వతంలో ఉన్న మహాకవులందరి విషయంలో వారివారి శైలి, వారివారి ప్రత్యేకత అని చెప్పొచ్చు.కాని పెద్దన్నగారి విషయంలో ఈ ప్రత్యేకతలో కూడా ఒక వైలక్షణ్యం ఉంది....ఆ విజయనగర సామ్రాజ్య సూక్ష్మభోగ పరమ మాధుర్య లక్షణం ఆ శైలిలో ఉంది. ఇది అనుభవైక వేద్యం......

శ్రీనాథుడు దీనికి మార్గదర్శిగా కనిపిస్తాడు..కాని ఈ లక్షణం ఆయనలో పరాకాష్ట పొందలేదు...పెద్దన్నగారియందు పొందింది. అందుచేత ఆయన "ఆంధ్ర కవితా పితామహుడు. పితామహుడంటే ’తాత’ కాదు, "బ్ర్రహ్మ"...బ్రహ్మకి పూర్వం సృష్టి లేదా? బ్రహ్మనెవరు సృష్టించారు? ఈ కనపడే సృష్టిని బ్రహ్మ చేశాడు....ఈ రీతిగా ఆయన ఆంధ్రభాషలో ప్రథమ ప్రబంధ నిర్మాత. అంటే ప్రబంధ సర్వలక్షణాలు కలిగిన గ్రంథనిర్మాత అని అర్థం..

ఆంధ్ర సారస్వతానికి అదొక కొత్త భోగము..ఆ భోగమును ఆరంభించింది ఆయన...................

7 కామెంట్‌లు:

 1. చక్కగా చెప్పారు.

  స్వకపోల కల్పిత ప్రభంధాలు రాయల వారి అష్టదిగ్గజ కాలం నుంచే మొదలయ్యింది.

  వసుచరిత్ర దీనికో మంచి ఉదాహరణ.

  రిప్లయితొలగించండి
 2. కౌటిల్య గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

  హారం

  రిప్లయితొలగించండి
 3. @wit real గారు,
  అవునండీ..

  @భారారె గారు,
  ధన్యవాదాలు..చాలా ఓపిగ్గా హారం సభ్యులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు చెప్పినట్టున్నారే!

  రిప్లయితొలగించండి
 4. తెలుగులో మనుచరిత్రని ప్రథమ స్వతంత్ర్య కావ్యంగా కాకుండా, తొలి సంపూర్ణ ప్రబంధంగా స్వీకరించాలి. అంతకు పూర్వం కావ్యాలలో ప్రబంధ లక్షణాలు కన్పించేవి కానీ, ప్రబంధాలు కావు. విశ్లేషణ మీది బావుంది
  http://vennelalu.blogspot.com

  రిప్లయితొలగించండి
 5. శ్రీకాంత్ గారూ...ప్రథమ స్వతంత్రకావ్యం ఎలా అవుతుందో కూడా గురువుగారు చెప్పిన రకంగా పైన వివరంగా రాశాను...ధన్యవాదాలు..

  రిప్లయితొలగించండి