ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

16, డిసెంబర్ 2010, గురువారం

LOVE IS NOT DIVINE; ప్రేమ దైవమూ కాదు; పెళ్ళామన్నా, భార్యన్నా ఒకటీ కాదు

"ప్రేమే దైవం", "LOVE IS DIVINE" ఇవి ఈ రోజుల్లో సినిమాల్లో,సీరియళ్ళలో చూసి యువత ముక్కుకెక్కించుకుంటున్న పవిత్ర వాక్యాలు...."అసలు ప్రేమంటే ఏంటో, దైవమంటే ఏంటో తెలుసుకుని మాటాడదాం,మరీ చిలకపలుకులు పలికితే ఎలా?" అన్న కాస్త ఇంగితం కూడా ఈ జనాలకి తట్టదు....

పాశ్చాత్య(ఎందుకో నాకు ఈ పదం అంతగా నచ్చదు....వాళ్ళకి మనం ’తూర్పు వాళ్ళం’ అయ్యామని, వాళ్ళని ’పడమటివాళ్ళు’ అని పిలవాలా?....’మ్లేఛ్ఛులు’ సరైనపదం నాకు మట్టుక్కు నాకు) నాగరికత మన నెత్తిమీద రుద్ది,బుఱ్ఱల్లోకి సూదులుపెట్టి మరీ ఎక్కించివెళ్ళిన భావజాలాల్లో ఇది ఒకటి......ఇప్పుడు అంత ఎక్కువగా కనపడట్లేదు కాని అప్పట్లో చక్కగా సమాజాలు పెట్టి మరీ ఈ "ప్రేమ" తత్త్వాలు ప్రచారం చేసేవాళ్ళట......"ఫ్రీ లవ్ అసోసియేషన్","డివైన్ లవ్" ఇలాంటి సమాజాలు పెట్టి మరీ జోరుగా ప్రచారం చేసేవాళ్ళు....మనలో పైత్యం ప్రకోపించిన కొన్ని వెఱ్ఱి తలకాయలు ఆ సమాజాలకి వెళ్ళి జీవితాన్ని "తరింప"జేసుకునేవాళ్ళట!

"ఫ్రీలవ్" అంటే ’ఉచిత ప్రేమ’ కాదండోయ్! "విడి ప్రేమ" అనట! అంటే పెళ్ళాం దగ్గర ప్రేమ లేదనుకుంటున్న మగ మహారాజులు,మొగుడి ప్రేమ చాలట్లేదనుకున్న స్త్రీమూర్తులూ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినంత "విడి ప్రేమ" పొందొచ్చట! "మనుషులంతా సమానం, అందరికీ అందరూ సమానంగా ప్రేమ పంచాలి" ఇలాంటి పిచ్చి నినాదాలు పెట్టుకుని అక్కడ ఉపన్యాసాలు గుప్పించి,చక్కగా బుఱ్ఱ్రల్ని మార్చేవారు.ఎటువైపుకి? వాళ్ళ దృష్టిలో స్త్రీ,పురుషుల శారీరక సంబంధం మాత్రమే ప్రేమ కాబట్టి ఆ దిశగా వాళ్ళ కార్యనిర్వహణ చక్కగా జరిగేది...అందరికీ సమానంగా "ప్రేమ" పంచాలి కాబట్టి, "బహు"జన సాంగత్యం అక్కడికి వెళ్ళినవాళ్ళందరికీ చక్కగా సిద్ధించేది.....

ఎవరన్నా నిజమైన ప్రేమపిపాసులు(LOVE SICK MINDED) పొరపాట్న అక్కడికి వెళితే అంతే! ఎటూ తేల్చుకోలేని సంధిగ్ధావస్థలో పడి, నిజమైన ప్రేమ వీళ్ళ దగ్గర దొరుకుంతుదేమో, వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో అని వెతికి వెతికి, అటు మానసికంగా,ఇటు జీవితపరంగా దగాపడి, అంతకు ముందున్న కాస్త ప్రశాంతత కరువై, చివరికి మతులు పోగొట్టుకునేవాళ్ళు...అసలు ఈ సమాజాల ముఖ్య ఉద్దేశ్యం,"సుసంపన్నంగా,పటిష్ఠంగా ఉన్న భారతీయ కుటుంబ సంస్కృతిని,వివాహ వ్యవస్థని కూలదోయడం".....చాలావరకు వాళ్ళు సఫలీకృతులయ్యారనే చెప్పుకోవచ్చు...సమిష్టి కుటుంబాలు విఛ్ఛిన్నం కావడం, ఈనాడు కనిపిస్తున్న సహజీవనాలు వారి విజయానికి తార్కాణాలు...

అలా మొదలై, ఈ రోజు అల్లాంటి సమాజాల అవసరమే లేకుండా, మన సినిమా రచయితలు, వారిని అనుసరిస్తూ యువత, చక్కగా వారి ఆశయాల్ని పండిస్తూ కొనసాగిస్తున్నారు....

అసలు ఈ "ప్రేమ","వివాహం" అన్న పదాలకి అర్థం తెలిస్తే, వాళ్ళ భావాల్ని కొనసాగించుకున్నా కనీసం ఈ పదాల్ని వాడకుండా ఉంటారేమో!

ప్రేమంటే, అదేమీ దివ్యమైన వస్తువు కాదు, బ్రహ్మపదార్థం అంతకన్నా కాదు....ప్రేమంటే, "ప్రీ‍ఞ్ తర్పణే కాఁతౌ" అన్న ధాతువునుండి పుట్టిన శబ్దం....దానిమీద "ఇమనిచ్" అన్న ప్రత్యయం చేరితే "ప్రేమ" అవుతుంది.....అంటే, "సంతోషించుట, తృప్తి పడుట, ఇష్టపడుట, ప్రకాశించుట" -- అని అర్థం... అంటే, ఒక పురుషుడు కాని, స్త్రీ కాని మఱొక వ్యక్తిని ఇష్టపడటం ప్రేమ. వాళ్ళిద్దరూ కలిసి తగాదాలూ,కుమ్ములాటలూ లేకుండా ఉండటం....అప్పుడు ఇద్దరికీ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది...ఒకళ్ళందు ఒకళ్ళు స్నిగ్ధులవుతారు[అతుక్కుంటారు :-)]....అనురాగ బద్ధులవుతారు..వాళ్ళు చేసే పనులు వీళ్ళకిష్టం,వీళ్ళు చేసేవి వాళ్ళకిష్టం....కామవిషయమైన(కామం=కోర్కె; మోహం మాత్రమే కాదు) తృప్తి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి కలుగుతుంది కాబట్టి అలాంటి తృప్తి మోక్షం కాదు,వైరాగ్యం కాదు.....కాబట్టి దాన్ని"దైవం" అనలేం..అది దివ్యమైన వస్తువు కాదు....అది జీవితంలో ఒక సుఖ సాధనం మాత్రమే!

అసలు ఈ మోక్షం,వైరాగ్యం,బ్రహ్మ పదార్థం,దివ్యం,దైవం....అన్నీ వట్టి బూటకం(ట్రాష్) అంటారా...అల్లాంటప్పుడు దానిని వట్టి "ప్రేమ"గా చూసుకోండి, లేదా దానికి మీకు నచ్చిన వేరే పేరు పెట్టుకోండి....ఈ "ప్రేమే దైవం","LOVE IS DIVINE" లాంటి వెఱ్ఱి కూతలు దేనికి......కొన్ని జన్మలకి అంతే, యదార్థ వస్తు పరిజ్ఞానం ఎన్ని జన్మలెత్తినా కలగదు.....

"మూఢతకు మొదలేమి తుదియేమి - మొగిడిపోయెడు మనసు
గాఢమగు చీఁకటిని గప్పుకొన్నదిలే - జమిలి దుప్పటివోలే కప్పుకొన్నదిలే

మూఢమందే క్రమ్ముకొను వేళ - మొగుడు కన్నులయందు
కూడి యేవస్తువును గోచరించదులే - ప్రతిబింబమునుబోలె గోచరించదులే

వాడవాడల తిరుగు బైరాగి - బోడిపాటలయందు
కాడినీ వొక వెలను కట్టబోవవులే - చిల్లిగవ్వంతైన కట్టబోవవులే"

మరి మన సంప్రదాయం ప్రకారం పెళ్ళాడిన స్త్రీ,పురుషులు ఎలా దివ్యాన్ని తలకెత్తుకుంటారు? అసలు ’వివాహమం’టే ఏంటి? వివాహం అంటే " విశేషముగా వహించునది" అని అర్థం...విశేషంగా అంటే ఇక్కడ ఐహికంగా ఈ జీవితంలో మాత్రమే కాక పారలౌకికంగా కూడ అని అర్థం. అంటే, పరలోకంలో, చనిపోయిన తర్వాత మనం కాబోయే మార్పులకు సానుకూలపడటానికి ఈ జన్మలో కొన్ని కార్యాలు చెయ్యాల్సి ఉంటుంది. అలాంటి పనులు స్త్రీ పురుషులు కలిసి దంపతులుగా ఏర్పడి ఇక్కడ చేస్తారు.అప్పుడది వివాహం అవుతుంది....అలా ఎలా అవుతుంది? సమంత్రకంగా,తంత్రక్రియా రూపంగా జరిగిన వివాహంలో ఉద్భవించిన శక్తి ఆ ’దృఢ బంధా’న్ని ఏర్పరుస్తుంది......

కాని పెళ్ళాం, భార్య ఒకటి కాదు....పై విధంగా పెళ్ళి జరిగి ఆ పారలౌకికమైన బంధం ఏర్పడితేనే "పెళ్ళాం"......మరి "భార్య" అంటే????.....’భార్య’ అనగా ’భరింపబడునది’ అని, ’భర్త’ అనగా భరించువాడు అని అర్థం.....అంటే ఈ రోజుల్లో సహజీవనం చేసేవాళ్ళని కూడా భార్యాభర్తలనొచ్చు...."అక్కడ భరించేదేముంది, ఇద్దరూ ఉద్యోగాలు చేసి ఎవరి జీతం వాళ్ళు తెచ్చుకుని, స్వపోషణ చేసుకుంటున్నారు కదా" అంటారేమో! ఇక్కడ భరించటమంటే శరీరాన్ని మాత్రమే భరించటం కాదు. లోకంలో ఆ స్త్రీ ప్రతిష్ఠనో, అప్రతిష్ఠనో పురుషుడు భరిస్తాడు. ఆమె మర్యాదని భరిస్తాడు,కాపాడతాడు. ఆమె బ్రతుకులోని లౌకికమైన సమంజసతని భరిస్తాడు. అలా కాకపోతే ఆ స్త్రీ బహు పురుషులచేత వాంఛింపబడుతుంది.........

13, డిసెంబర్ 2010, సోమవారం

విశ్వనాథ వారి తత్త్వాలు -- మనసు-కడలి

ముందుపాట పాడిన తర్వాత, బైరాగిని అక్కడే ఉన్న యువకుడొకడు ఇంకో పాట పాడమని అడుగుతాడు..అప్పుడు ఈ పాట పాడతాడు...

మనసులో కలవరము వున్నది
కడలిలో కలవరము వున్నది

మనసు లోకపు హద్దులో విరుగున్
కడలి చెలియలికట్టలో విరుగున్

మనసులో కలవరము హెచ్చిన
కడలిలో కలవరము పొంగిన
మనసు లోకపుకట్ట తెగి పోవున్
కడలి చెలియలికట్ట తెగివచ్చున్

మనసు లోకపు కట్ట తెగితే
కడలి చెలియలికట్ట తెగితే
మనసు చచ్చిన ప్రేతకళలీనున్
కడలి భైరవు కాలిమువ్వలగున్....

అది విన్న యువకుడు "ఇందాకటి పాట బాగుంది,పాటలా ఉంది..ఇదేదో కవిత్వంలా ఉంది" అంటాడు..దానికి బైరాగి,"మీరేదో చదువుకున్నవారిలా ఉంటే ఇది పాడాను"..అంటాడు.......

కథాసారం మెత్తం ఈ కవితలో చెప్పేస్తారు...జరగబోయేదానికి చిన్న హెచ్చరికలా చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో ఆ యువకుడు ఉండడు....మళ్ళా మధ్యలో ఇంటిముందుకు వచ్చి పాడినప్పుడు ఆశ్చర్యపోతాడు.....

10, డిసెంబర్ 2010, శుక్రవారం

మనసు గుఱ్ర్ర్రమురోరి మనిసీ!!!

నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఏదో యాదలాపంగా రాగం తీస్తూ పాడుతున్నారు....తీరా వింటే అప్పుడెప్పుడో నేను చదివిన గురువుగారి తత్త్వపు పాటలు.."చెలియలికట్ట"లోవి..నాకు ఎంత ఇష్టమో ఈ పాటలు....చిన్నప్పుడు తోచిన రాగం కట్టుకుని పాడుకుంటుండే వాణ్ణి....చక్కటి పల్లె పదాలతో గురువుగారు అల్లిన తీరు...అద్భుతం......జీవితపు సారాన్నంతటినీ ఆ బైరాగి గొంతులో పలికిస్తారు.......మచ్చుకు కొన్ని మీకు పరిచయం చేస్తున్నాను....విజ్ఞులు, సంగీత సరస్వతులు ఎవరన్నా రాగంకట్టి పాడితే వినాలన్నది నా చిరకాలకోరిక...

మనసు గుఱ్ఱమురోరి మనిసీ
మనసు కళ్ళెము లాగు మనిసీ!

కళ్ళెమును వదిలితే కంచెలో బడద్రోయు
కళ్ళు తేలేస్తావు జనుడా! ఆ పైని
కార్యమేమున్నదిర జనుడా!

మనసు ఆగముదిరా మనిసీ!
మనసు బోగముదిరా మనిసీ!

రొక్కమంటే సరీ ప్రక్క చేరతదిరా
చిక్కిపోతవురోరి జనుడా! అద్దాని
టక్కులో పడతావు జనుడా! II మనసు గుఱ్ఱము II

ఈ పాటతో సముద్రం ఒడ్డున కథ మొదలవుతుంది.....మట్టి చిలుములో గంజాయి వేసుకుని, సముద్రం గాలికి తంటాలుపడి దాన్ని వెలిగించి,పీలుస్తూ..కళ్ళుతేలేస్తూ, నిషా ఎక్కిన కొద్దీ చేతిలో ఉన్న సొరకాయబుఱ్ఱ మీటుతూ ఈ పాట ఎత్తుకుంటాడు....

తర్వాత మధ్యలో కథ నడుస్తున్నపుడు ఆ సందర్భానికి తగ్గట్టు ఇంటి ముందు మళ్ళా ప్రత్యక్షమవుతాడు, మరో పాటతో.....


22, సెప్టెంబర్ 2010, బుధవారం

కృష్ణరాయని కీర్తి


మ.అల పోత్రిప్రభు దంష్ట్ర భోగివర భోగాగ్రాళిఱా లుద్భటా
చలకూటోపలకోటి రూపుచెడ నిచ్చల్ రాయగానైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహామృగనాభి సంకుమద సాంద్రాలేప పంకమ్మునన్
(మను-ప్ర-౩౫)


{పోత్రిప్రభుడు - పందిరాజు; అనగా ఆదివరాహం; దంష్ట్ర - కోర; భోగివర - సర్పరాజు అనగా ఆదిశేషుని; భోగాగ్రాళిఱాలు - పడగచివళ్ళ యొక్క సమూహమందలి రత్నాలు; ఉద్భటాచలకూట - భయంకరమైన పర్వతాల కూటములందలి; ఉపలకోటి - రాళ్ళసమూహము; నిచ్చల్ - నిత్యమూ; రూపుచెడ - రూపము పాడయ్యేట్లు; రాయగానైన మొక్కలు భూకాంతకు - ఒరిపిడి పెట్టగా భూమికి పడ్డ గంట్లు; నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరాయల - నరసరాయల కుమారుడైన శ్రీకృష్ణరాయల; బాహా - చేతులకు పూసుకున్న; మృగనాభి - కస్తూరి; సంకుమద - జవ్వాది; సాంద్ర+ఆలేప - చిక్కనైన పూతగా ఉన్న; పంకమ్మునన్ - బురదచేత; నున్ననయ్యె - నున్నగా అయ్యాయట!}

ఇదీ మనుచరిత్ర అవతారికలోని పద్యమే....పెద్దన్నగారు మొదట ఇష్టదేవతాస్తుతి,గురుస్తుతి చేసి,పూర్వకవుల్ని ప్రస్తుతించి,రాయలవారు తనని మార్కండేయ పురాణంలోని ఈ "స్వారోచిష మనుసంభవాన్ని" కావ్యంగా రాయమని కర్పూర తాంబూలమిచ్చి అర్థించారనీ చెప్పి, కృతిపతియైన రాయలవారి వంశానుక్రమం అద్భుతంగా వర్ణిస్తారు...తర్వాత రాయలవారి ప్రతాపాన్నీ,కీర్తినీ వర్ణిస్తూ ఆ క్రమంలో చెప్పిందే ఈ పద్యం........

ఆదివరాహం తనకోరలమీద భూమిని మోస్తూ ఉంటుంది...ఆదిశేషువు కూడా తన పడగలమీద భూమిని మోస్తూ ఉంటాడు....ఇవి పురాణకథలు...పర్వతాలు భూమిని వ్రీలి(చీలి)పోకుండా బిగిసేట్టు పట్టుకుని ఉంటై.ఇది ఇప్పటి మన ప్రకృతిశాస్త్రానికి తెలియని ఒక మహావిషయం...ఈ మూడూ భూమిని ధరిస్తున్నాయని చెప్తారు. పర్వతాలకి ’భూధరాల’నే పేరు!.....ఈ మూడూ నిత్యం ఒరిపిడి పెట్టటంవల్ల, గుండ్రంగా ఉన్న భూమిలో గంట్లు పడ్డాయట..అంటే బొత్తలు బొత్తలుగా అయిందన్నమాట!రాజుని భూమికి భర్త, పతి అంటారు.రాజుకి భూమి భార్య - భార్యని భర్త కౌగిలించుకుంటాడు. ఆ సమయంలో, అప్పటి భర్త అయిన కృష్ణరాయలు, తన చేతులకి రాసుకున్న కస్తూరి జవ్వాది బురదలాటి పూత ఆ భూదేవి మేని గంట్లలోకి చొచ్చి అవి పూడిపొయ్యాయని అర్థం...

ఇలాంటి కల్పనలు మన కావ్యాలలో సమృద్ధిగా ఉంటై.నిజంగా చూస్తే దీనికి అర్థంలేదు...కాని దీంట్లో ఒక మహార్థం ధ్వనితమవుతుంది,ప్రాధాన్యత దానికి.ఆయన ప్రజలు సుఖపడేట్లు రాజ్యపాలన చేశాడని దీనిలో ధ్వని.అది లేకపోతే ఎందుకూ పనికిరాని పద్యం ఇది...కాని పురాణకథానుసంధానం చేత, కవి చేసిన కల్పనాచాతుర్యం చేత పాఠకులకి ఆనందం కలిగిస్తుంది...

పద్యం రచించే నేర్పువల్ల అధికానందం కలుగుతుంది..రచించటం అంటే ఒకటి అక్షర సన్నివేశ చారుత్వం.రెండవది, మాటల కూర్పులో నేర్పు. భోగాగ్రాళి తర్వాత ’రాలు’-తెలుగుమాట;’రూపుసెడ’-తెలుగుమాట; ’నిచ్చల్ రాయగానైన మొక్కలు నున్ననయ్యె’- ఇవన్నీ తెలుగుమాటలు. ప్రోతి ప్రభుదంష్ట్ర; భోగివర భోగాగ్రాళి; ఉద్భటాచల కూటోపలకోటి; ఇలాంటి క్లిష్టమైన సంస్కృత శబ్దాలు కొన్ని సమాసాలు....వాటిని,వీటిని కలిపి గ్రుచ్చియెత్తటంలో ఒక రచనా సౌందర్యం ఉంది.....ఒక విలక్షణమైన శైలీ మాధుర్యం ఉంది. చివరి పాదంలో ఉన్న మధురసమాసం, పద్యానికి ఎంతో సౌందర్యాన్నిస్తోంది...ఈ లక్షణాలచేత, ఈ పద్యం ప్రౌఢి,మాధుర్య,సౌకుమార్య గుణాల కలయికతో ధగద్ధగాయమానంగా ఉంది....ఈ రచనలో తెనాలి రామకృష్ణయ్య లక్షణం కొద్దిగా కనిపిస్తుంది...శ్రీనాథుడి కొన్ని గడుసు రచనల్లోని వాసన ఉంది...

ఇది ఒక లోకోత్తరమైన పద్యం - శైలి చేత.ఈ కల్పనలందరూ చేసేదే - వెనుకనున్న పురాణ కథల చేత!కాని పెద్దన్న గారి ఈ రచనలో ఒక వైశిష్ట్యముంది.అదేంటంటే..........ఇక్కడ పోత్రి, భోగి, అచలం, ఈ మూడు శబ్దాలచేత మూడు వేఱు వేఱు విషయాలు ధ్వనిస్తున్నాయి.....

పోత్రం అన్న శబ్దానికి రెండర్థాలున్నై. ఒకటి పంది ముట్టె; రెండోది నాగలి కొన; పోత్రము కలది పోత్రి. అది పంది కావచ్చు, నాగలి కావచ్చు.....కాబట్టి ఇక్కడ విశేషార్థం ఏమిటంటే, నాగలితో పొలందున్నుకు బ్రతికే వాళ్ళు కృషికులు.దుష్టులైన రాజులు రైతుల్ని పన్నులెక్కువ వేసి బాధిస్తారు..అందువల్ల పంటలు తగ్గిపోతాయి.ఇది ఒక గంటు భూమికి...

భోగి కి కూడా రెండర్థాలు. భోగము అంటే పడగ; అది కలది భోగి-పాము; భోగమంటే ఇంకొక అర్థం ధనవంతులు అనుభవించే సుఖం - అది అనుభవించేవాడు భోగి.మహాధనవంతులుంటారు.వాళ్ళ దగ్గర రత్నాలుంటై. రాజుకి రత్నహారి అని పేరు. వాళ్ళ రత్నాలని రాజు లాక్కుంటాడు.అలా ఎక్కువ ధనం తీసుకోటంవల్ల వాళ్ళ భోగాలు చెడిపోతయ్యి.ఇది ఇంకొక గంటు.......

అచలం అంటే పర్వతం. అచలుడు అంటే చలించనివాడు.దేనికీ నివ్వెరపోనివాడు,కష్టపెట్టుకోనివాడు అచలయోగి అనబడతాడు. ఆ అచలయోగులకి ఏదీ పట్టదు.వాళ్ళకి ఏది ఎలా పోయినా సరే! కాని రాజులు వాళ్ళని కూడా హింసిస్తారు.వాళ్ళని యోగమార్గాన పోనివ్వరు.ఆ యోగులు ఆస్తికులు,ధర్మాన్నే విశ్వసిస్తారు..కాని కృత్రిములైన ఈ రాజులు,నాస్తికులు. వీళ్ళు విశ్వసించే విషయాలతోటి యోగుల్ని బాధిస్తారు..శిక్షిస్తారు...

పూర్వపు రాజుల్లో ఈ లక్షణాలున్నాయి, కాని కృష్ణరాయలందు లేవు అని అంతరార్థం....అంతేకాదు, ఇతని చేతులకి పూసుకున్న కస్తూరి జవ్వాది లేపనాలతో భూదేవికి గంట్లు నున్ననైనవంటే, పూర్వపు రాజులు చేసిన అన్యాయాల్ని రాయలు సరిదిద్దాడని అర్థం...ఇంకా, అది మృగనాభి సంకుమదాలేపం కనుక, ఆ పూత భూమికి రాసుకుంది కాబట్టి ప్రజలు భోగాలు అనుభవిస్తున్నారనీ అర్థం చేసుకోవచ్చు.......

మహాకవుల కల్పన ఇలా ఉంటుంది.- ఇలానే ఉండవలె..........

22, ఆగస్టు 2010, ఆదివారం

అల్లసాని పెద్దన - ఆంధ్ర కవితా పితామహుడా?? ఎలా???


పెద్దన్నగారికి "ఆంధ్ర కవితా పితామహు"డని బిరుదు..కాని పెద్దన కంటె పూర్వులు తెలుగులో చాలామంది ఉన్నారు..కవిత్రయము,నాచన సోమన్న,శ్రీనాథుడు,పోతన్న మొదలైన మహానుభావులు చాలామంది ఉన్నారు...అసలు కవిత్రయంలో ఒకడైన ఎఱ్ఱాప్రెగడకి "ప్రబంధ పరమేశ్వరు"డన్న బిరుదుంది....మరి అలాంటప్పుడు పెద్దన్నగారికి ఆంధ్రకవితా పితామహుడన్న బిరుదు ఎలా వచ్చిందో, ఎలాగ చెల్లుబడైందో ఇక్కడ మనం విచారించవలసిన విషయం..........

అసలు ఈ బిరుదు పెద్దన్నగారికి శ్రీకృష్ణదేవరాయల వారిచ్చినది....కృష్ణరాయడు విద్వత్ప్ర్రభువు,భావుకుడు, సహజంగా గొప్పకవి..మరి ఆ ప్రభువుకి ముందు మహామహులున్నారని తెలియదా? శ్రీనాథుడున్నాడని తెలియదా? నాచన సోమన్న ఉన్నాడని తెలియదా? పెద్దన్నకి ఈ బిరుదివ్వటమేంటి? తాను చక్రవర్తి గనుక తన కభిమానుడైన కవికి ఈ బిరుదిచ్చాడా? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్న కూడా వైష్ణవుడే. మరి ఈ అభిమానంచేత ఇచ్చాడా? లేదా, "ఆంధ్ర కవిత" అంటేనే, కృష్ణరాయని అభిప్రాయం వేరా????...

ఇన్ని ప్రశ్నలు పుడతాయ్!! లౌకికమైన కారణాలు ఇక్కడ పొసగవు..విప్రతిపత్తు లెన్నైనా చెప్పుకోవచ్చు....

ఒక భాష ఉందనుకుందాం....దానికి గొప్ప సారస్వతం ఉందనుకొందాం....ఆ సారస్వతం వృధ్ధిపొందే లక్షణాలలో కొన్ని దశలుంటై.....వాటిలో ప్రథమదశ పురాణదశ. రెండవది కావ్యదశ....కవిత్రయం, నాచన సోమన్న, పోతన్న మొదలైనవారిది పురాణదశ....వీళ్ళంతా సంస్కృత కావ్యాలని తెలుగు చేశారు... శ్రీనాథుడు ఈ పురాణదశలో చివరివాడు...కాని ఆయన రాసిన "శృంగార నైషధము" దానంతట అది కావ్యం...అది అనువాదమే కాని, స్వతంత్ర గ్రంథం కాదు....

అదలా ఉంచితే, అల్లసాని పెద్దన్న మనకి ఆంధ్రభాషలో మొట్టమొదట స్వతంత్రకావ్యం రాసినవాడుగా కనపడతాడు...."మనుచరిత్ర" అనువాదం కాదు...మార్కండేయ పురాణంలోని ఒక కథ తీసుకుని దానిని స్వతంత్ర కావ్యంగా నిర్మించాడు....కాని పూర్వపు కవుల తెలుగుసేత కూడా మరీ మక్కికి మక్కిగా ఉండదు..కాబట్టి 'ఇదే' ఆంధ్రకవితా సమారంభమనటానికి, రాయలవారి బుద్ధిలో ’పద్యరచన’ అనికాదు...తెలుగుసేత అనీ కాదు..’స్వతంత్ర కావ్యం’ అని అనిపించుకోదగ్గ ఆంధ్ర పద్యగ్రంథం అని నిర్ణయం చేసుకోవచ్చు.....అసలిక్కడ ప్రాధాన్యత ’కావ్య’ శబ్దానికి...కావ్యలక్షణాలని పట్టిస్తే మనుచరిత్రే ప్రథమ కావ్యం...ఒక గ్రంథాన్ని కావ్యంగా నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ప్రసిధ్ధమైన మార్గం ఒకటుంది...అది ఏకరసాశ్రయమైన కథ..ఇక్కడిది శృంగార రసము...

అసలుకి ఈ గ్రంథం పేరు "స్వారోచిష మనుసంభవం"...కాని మనుచరిత్రయని అలవాటైంది..ఆ పేరే చెల్లుబడౌతున్నది....ఒక మహావిషయాన్ని స్థాపించటానికి తొట్టతొలుత వ్రాయబడిన కావ్యం ఇదే అని చెప్పుకోవచ్చు...అందులోను, స్వతంత్రంగా కథానిర్మాణంచేసి, కథాంశాలని తానే సమకూర్చుకుని చేయబడిన మొదటిగ్రంథం ఆంధ్ర సారస్వతంలో ఇదే!

ప్రధానమైంది ఇంకో విషయముంది....కవులందరికి తలా ఒక శైలి ఉంటుంది. పురాణకవుల శైలులు పురాణకవులవి. కావ్యకవుల శైలులు కావ్యకవులవి. ఆ రెండిటికి చాలా భేదముంటుంది...పురాణకవులు ప్రధానంగా కథ చెప్పుకుపోవటం మీద దృష్టి పెడతారు. కావ్యకవుల దృష్టి ప్రధానంగా వర్ణన మీద ఉంటుంది...పురాణ కవులు పద్యరచన చక్కగా చెయ్యాలనే ప్రయత్నం ఎక్కువ చెయ్యరు. వారు రాసేప్పుడు దాని సందర్భాన్ని బట్టి ఒక మంచి రచనగల పద్యం రావచ్చు...కాని కావ్యకవుల్లో ఆ ప్రయత్నం అధికం.అలాంటి పద్యాల సంఖ్యా ఎక్కువే! పురాణాలు చదివేటప్పుడు పాఠకుడి బుధ్ధి కథాగమనం, భిన్నాంశాలు మొదలైన వాటిమీద ఉంటుంది....కాని కావ్యాలు చదివేప్పుడు అలా కాదు..ఇక్కడ పాఠకుడి బుద్ధి ప్రతి పద్యంలో ఉండే చమత్కారం, వాటిలో చెయ్యబడ్డ సూక్ష్మమైన కల్పన, రచనా సౌందర్యం వీటి మీద ఉంటుంది....వారిని వీరిని పోల్చిచూడకూడదు...

సామాన్య సంసారాలు ఉన్నై...సంపన్నమైనవీ ఉన్నై...రెండిటికీ ప్రాధాన్యం బ్రతకటమే...కాని సామాన్యుల ఇళ్ళల్లో అతిథులొస్తే చాపవేసి కూర్చోబెడతారు.మర్యాదచేసి మాటాడి పంపిస్తారు. అదే, గొప్ప సంపత్తుకల సంసారాలలో అతిథులు వస్తే పరుపులు, తివాసీలు, పట్టుతో కుట్టిన సోఫాలు, ఏసిలు, అగరొత్తులు- మొదలైన భోగాలుంటై...పురాణకవులకి, కావ్యకవులకి భేదం ఇది...

మరిన్నూ, తొలుతటి రాజులు వేఱు. తరువాత వచ్చిన రాజులు వేఱు. శ్రీకృష్ణరాయల నాటికి ఆంధ్రసామ్రాజ్యం ఏర్పడింది.విజయనగర సామ్రాజ్యం స్థిరపడింది. విజయనగరం, నాటి ప్రపంచకాలలో ఒక మహానగరం. అనంతమైన ఒక భోగభూమి. భోగాలలో సూక్ష్మమైన విషయాలని అనుభవించుటకు కావలసినంత సంపత్తు కలది. పాలు తాగితే వట్టి వెండిగిన్నెలో తాగరు. బంగారుగిన్నెకాని, వజ్రపుగిన్నె కాని కావాలి..ఆ గిన్నె చుట్టు, అది పట్టుకునే ’పిడి’ శిల్పాలతో, నగిషీ చెక్కబడి ఉండాలి...ఇదొక భోగలక్షణం... ఈ భోగలక్షణం ఆనాటి సర్వశిల్పవిద్యలందు భాసించింది...అదే కవిత్వంలోకి కూడా వచ్చింది...

అందువల్లనే పెద్దన్నగారి పద్యరచన, పరమ మాధుర్యగుణాలన్నిటికీ విధానమైంది...క్రొత్త క్రొత్త పలుకుబళ్ళకు,రమ్యమైన సమాసాలకు కాణాచిగా నిలబడింది..పరమేశ్వరుడు పరమ మధుర సరస్వతీరూపంగా, చిక్కటి శారదారూపంగా పెద్దన్నగారి వాక్కులో వచ్చికూర్చున్నాడు...ఆయనలాగా చక్కని మధురమైన పద్యరచన చెయ్యగల కవి ఆంధ్రసారస్వతంలో మరొకడుండడు..మన సారస్వతంలో ఉన్న మహాకవులందరి విషయంలో వారివారి శైలి, వారివారి ప్రత్యేకత అని చెప్పొచ్చు.కాని పెద్దన్నగారి విషయంలో ఈ ప్రత్యేకతలో కూడా ఒక వైలక్షణ్యం ఉంది....ఆ విజయనగర సామ్రాజ్య సూక్ష్మభోగ పరమ మాధుర్య లక్షణం ఆ శైలిలో ఉంది. ఇది అనుభవైక వేద్యం......

శ్రీనాథుడు దీనికి మార్గదర్శిగా కనిపిస్తాడు..కాని ఈ లక్షణం ఆయనలో పరాకాష్ట పొందలేదు...పెద్దన్నగారియందు పొందింది. అందుచేత ఆయన "ఆంధ్ర కవితా పితామహుడు. పితామహుడంటే ’తాత’ కాదు, "బ్ర్రహ్మ"...బ్రహ్మకి పూర్వం సృష్టి లేదా? బ్రహ్మనెవరు సృష్టించారు? ఈ కనపడే సృష్టిని బ్రహ్మ చేశాడు....ఈ రీతిగా ఆయన ఆంధ్రభాషలో ప్రథమ ప్రబంధ నిర్మాత. అంటే ప్రబంధ సర్వలక్షణాలు కలిగిన గ్రంథనిర్మాత అని అర్థం..

ఆంధ్ర సారస్వతానికి అదొక కొత్త భోగము..ఆ భోగమును ఆరంభించింది ఆయన...................

15, ఆగస్టు 2010, ఆదివారం

అల్లసాని వారి "అల్లరి" వినాయకుడుఉ. అంకముఁజేరి శైలతనయా స్తన దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంక కుచంబుఁ గాన కహివల్లభహారముఁ గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికై.
(మను చరిత్రము-ప్ర.ఆ -౪)


మనుచరిత్ర, నేను చదివిన రెండో కావ్యం......మన తెలుగు ప్రబంధాలన్నీ కథారూపంగా చదుకున్నా, మొత్తం కావ్యంగా చదివింది రెండే రెండు.....మొదటిది కళాపూర్ణోదయం, రెండవది మనుచరిత్ర.......కళాపూర్ణోదయం చదవడం మాకు వారసత్వంగా వచ్చిన ఒక అలవాటులాంటిది అనుకోవచ్చు....మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర్నుంచో మరి అంతకుముందునుంచో మరి నాకు సరిగ్గా తెలియదు....మా అమ్మమ్మ కళాపూర్ణోదయం పేర్లన్నీ మా అమ్మవాళ్ళకి పెట్టేసింది...(అమ్మ పేరు సుగాత్రి, ఒక పిన్నిపేరు మధురలాలస, ఇంకో పిన్నిపేరు కలభాషిణి)......నాన్న అంటూ ఉంటారు.."అసలు, పేర్లు చూసే అనుకున్నా,మంచి సాహిత్య పరిచయం ఉన్న కుటుంబం అని....ఇంకో మాటలేకుండా పెళ్ళికి ఒప్పేసుకున్నా" అని.........నాకు కళాపూర్ణోదయం కథంటే చిన్నప్పట్నుంచీ ఎంత ఇష్టమో.....

ఇక మనుచరిత్ర విషయానికొస్తే.... నాకు కావ్యం చదవకముందు ఒఠ్ఠి కథ చదుకునేప్పుడు "ఎందుకు పెద్దన్న గారు, కథేమీలేకపోయినా కేవలం వరూథినీ ప్రవరాఖ్యం కోసం ఎందుకు మూడాశ్వాసాలు వృథా చేశాడా" అనిపించేది....నాకు మట్టుక్కు నాకు ఇప్పటికీ స్వరోచి కథే ఇష్టం....చక్కగా ఎంతమంది చుక్కల్లాంటి అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుంటాడో! కట్నంగా ఎన్ని "విద్యలు" తెచ్చుకుంటాడో! తర్వాత.... పదోతరగతి పుస్తకంలో "ఇందీవరాక్షుని వృత్తాంతం" ఉండేది....ఏడో తరగతిలో ఉన్నప్పుడు అక్క దగ్గర ఆ పుస్తకం తీసుకుని చదుకున్నా....(మనకి ముందు తరగతి పుస్తకాలు ముందు ముందే చదవడం కూడా జన్యురీత్యా వచ్చిన లక్షణమే!).....అసలే పద్యాలంటే బహు ఇష్టమాయే!..అందులో ఉన్న ఆ పద్యాల అందానికి,తియ్యదనానికి ఇక ఆపబట్టలేక మనుచరిత్ర తీసి పద్యం,పద్యం చదుకోడం మొదలెట్టా.....అర్థం కాకపోతే నాన్నని అడగడం,నిఘంటువుల్లో వెతుక్కోడం....అలా ఎట్టకేలకు ఒక సంవత్సరానికి ముగించా......తర్వాత గురువుగారి వ్యాఖ్యానాలు....అప్పుడర్థమైంది!! అసలు మనుచరిత్రంతా మొదటి మూడాశ్వాసాలే అని........కానీ ఇప్పుడు ఒక్క పద్యం కూడా,కనీసం లేశమాత్రంకూడా గుర్తులేవు......ఆ తియ్యటి పద్యాల్ని మళ్ళా గుర్తుచేసుకుంటూ, పనిలో పనిగా మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.......

ఇక మన పద్యంలోకొస్తే....

అంకము జేరి--- తొడనెక్కి.....తల్లి తీసి తొడమీద ఎక్కించుకోలేదు.....ఈయనే ఎక్కినాడు....ఎందుకోసమట అంత ఆరాటం?

శైలతనయా స్తన దుగ్ధములు------ తల్లియైన పార్వతి చనుబాలకోసమట! పాపం ఎంత ఆకలిమీదున్నాడో! అసలా తల్లి ఎవరు....కొండకూతురు....ఆమెయందు స్తన్యసమృద్ధి ఎంతయుండునో తెలియదు.....

బాల్యాంక విచేష్టన్----- బాల్యానికి చిహ్నమైన విశేషమైన చేష్టతో; ఆయన ఉంది శైశవంలో కాదట! బాల్యంలో.....అంటే ’మకురుపాలు’ తాగుతున్నాడు కాబోలు! ఆ తల్లి ఇంకా పాలు మాన్పించలేదన్నమాట!....మనిళ్ళల్లో ఐతే ఆర్నెల్లు నిండగానే మాయచేసో, అదిలించో మాన్పిస్తారు...... ఈయనకేం! పోటీ లేదుగా....వెనకాయనకి అఱువు తల్లులు ఆరుగురున్నారాయె!

తొండమున అవ్వలిచన్గబళింపబోయి---- పిల్లలు సాధారణంగా పాలుతాగుతూ విడిగాఉన్న చేత్తో తల్లి రెండవ ఱొమ్మును స్పృశిస్తుంటారు..పుణుకుతుంటారు....ఈ చేష్ట సరియే! కాని ఈ విఘ్నేశ్వరుడు తల్లి యొక్క అవ్వలి చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు.ఎందుకు?తనకు చెయ్యుంది కదా! ఇది అసలు బాల్యాంక విచేష్టకాదు......ఏనుగు మొగము ఉన్నవాని లక్షణము......

అవ్వలి చన్+కబళింపబోయి----- కబళించుట అనగా తినుట....కబళము - ముద్ద; (మాధవ కబళమని వింటూంటాం కదా!)....మరి చన్నును కబళింపబోవుట ఏమిటి?---సరే!

ఆవంక కుచంబు గానక---- వెదకినాడు...ఆతలనున్న చన్ను కనపడలేదట! మరి ఏం కనపడిందో!

అహివల్లభ హారము గాంచి----- హారముగానున్న పాము కనిపించింది. అహివల్లభుడే హారమట! ఇక్కడ పాము హారంగా ఎక్కణ్ణుంచొచ్చింది? అమ్మ ఎప్పుడూ పాములు మెళ్ళో వేసుకోదే! వేసుకునేదెవరు? ఆ అయ్య పరమేశ్వరుడు......అదన్నమాట సంగతి.....ఈ అమ్మ, ఆ అయ్యతో సగం మేనుగా కలిసి అర్థనారీశ్వరరూపంతో ఉన్నారన్నమాట!.....సరే ఆ పాముని చూచినాడు.చూచినాడనగా తెలుసుకున్నాడని అర్థం.....ఇక్కడ కాంచి అనకూడదు....ఎందుచేత?

మృణాళాంకుర శంకనంటెడి------ మృణాళాంకురమనగా తామరతూటి మొక్క; ఆయన అది ’అహివల్లభహారము’గా తెలుసుకోలేదట! అక్కడ అహివల్లభహారము ఉండటం చేత అది మృణాళాంకుర మనుకొన్నాడు.....అమ్మ మంచి తామరపూల హారం వేసుకుందనుకున్నాడో ఏమో! పైగా తామరతూండ్లంటే ఏనుగులకి బహు ప్రీతికరమైన వస్తువాయే! అసలిక్కడ అహివల్లభుడంటే వాసుకి.....వాసుకి సర్పాలకి రాజు....శివునికి భూషణం....ఆ వాసుకి శరీరము మహాదీర్ఘమై,మహాస్థూలమై ఉండి ఉండాలి! మరి అతనిని మృణాళాంకురం అనుకోవటం ఎల్లా?

గజాస్యుని------ ఇది అర్థనారీశ్వర మూర్తి వర్ణన....ఈతడు గజాస్యుడు...అంటే ఏనుగు మొగము కలవాడు...

కొల్తున్+అభీష్ట సిద్ధికై----- అభీష్ట సిద్ధికి ఇలాంటి గజాననుని కొలుస్తానంటున్నాడు మన పెద్దన్నగారు......అసలు ఇక్కడ అభీష్టసిద్దికై ఇతనిని కొలవటానికి అతనియందు అభీష్టాలు సమకూర్చే లక్షణాలు లేవు...అలాంటి లక్షణాలు ఇక్కడ వర్ణితం కాలేదు...

వ్యుత్పత్తిచేత ’గజ’ శబ్దానికి అర్థం "మదము కలది" అని...అనగా యదార్థ పరిశీలన చేయనిది. అది లోకం యొక్క స్వభావము...ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖము. ఈ లోకము వట్టి భ్రాంతిమయం....తెలిసికూడ వట్టి భ్రాంతి....చనిపోతామని ఎవరికి తెలియదు? లోకం యొక్క ప్రవర్తనకి ఈ తెలియటానికి ఏం సంబంధం? ఇది భ్రాంతి......

అర్థనారీశ్వరుడనగా ఈ లోకంయొక్క మహాతత్త్వము పుంజీభూతమై దేవతారూపము కట్టినవాడు.....పార్వతి, దుర్గ..ఆమే ప్రకృతి...పంచభూతముల సమాహారం....పరమేశ్వరుడు ఈ పంచభూతాలయందు అభివ్యాప్తమైయున్న చైతన్యము...ముఖ్య ప్రాణము...విజ్ఞానమయ బ్రహ్మము మొదలైనవి కావచ్చును....అట్టి వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టినాడు......మదమును మినహాయించినచో వీడు పరమ చైతన్య స్వరూపం....అతనిని కూడ మనము దేవతగా కల్పించి,(మన మదము మనకు తగ్గకూడదు.మన పనులు మాత్రం మనకి చక్కగా జరిగిపోవాలి) అట్టి విఘ్నేశ్వరుని స్తోత్రం చేస్తున్నాము............

దీనిని బట్టి ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే...... కావ్యకవులు సామాన్యంగా వేదాంతార్థాలని ఉద్దేశించి వ్రాయరు....వారికి కావలసింది వాక్చమకృతి, పాఠకుని మనస్సుకు చక్కిలిగింతలు పెట్టటం, లోకంలో ఉండే లీలలు చిత్రించటం...మనం మరీ లోపలకి వెళ్ళి చూడకూడదు......

అసలు ఈ కావ్యకవుల ఊహలో కవిత అంటే, చల్లని గాలికి తగిలినట్టు....వెన్నెల్లో విహరించినట్టు..... మాంఛి పచ్చకప్పురపు పొడి చల్లుకున్నట్టు...కమ్మటి జుంటి తేనె జుఱ్రుకున్నట్టు.....అంతే!

27, జులై 2010, మంగళవారం

ద్రౌపది సౌశీల్యం - ౨


అశ్వత్థామతో ద్రౌపది ఇంకా ఇల్లా అంటోంది..

"తండ్రీ! భూసురుడవు...పైగా వీరాగ్రేసరుడివి..సకల ధర్మాలూ ఎరిగినవాడివి..దయ, కరుణ ఇవే కదా విప్రులకు ఆభరణాలు... దయమాలి చిన్నపిల్లలని కౄరంగా వధించావు..ఇలాంటి రాక్షసకృత్యం నీకు తగునా!"

"ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాపల రణప్రౌఢ క్రియాహీనులన్
నిద్రాసక్త్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!"
(భాగ - ప్ర - ౧౬౧).

ఇది కూడా ద్రౌపది అశ్వత్థామను ఊటాడిన మాటలలోనిదే.....

ఉద్రేకంబునరారు శస్త్రధరులై--- ఆ నా చిన్నపిల్లలు ఎప్పుడూ ఆవేశకావేశాలతో ఆయుధాలు పట్టుకుని ఎవరిమీదకీ ఊరకే వెళ్ళినవారు కాదు..

యుద్ధావనిన్ లేరు---- ఒక వేళ యుద్ధభూమిలో ఉంటే చంపావనుకోను అదీ కాదు కదా!

కించిత్+ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో---- మితిమీరిన బలగర్వంతో నీకు ఏ ద్రోహమూ చేసినవారు కాదు కదా! కనీసం మాటమీరి తూలనాడిన వారైనా కాదే!

భద్రాకారుల, పిన్నపాపల, నిద్రాసక్తుల--- ఆ ఉపపాండవులు ఎంతో అందమైన పిల్లవాండ్రు....పైగా నిద్రపోతున్నారు

రణప్రౌఢ క్రియాహీనులన్---- యుద్ధవిద్యలలో అంత ఆరితేరినవారైన కాదు..రేపు నిన్నెదిరించి పోరాడతారనుకోవటానికి....

సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!----అలాంటి వారిని చంపటానికి నీకు చేతులెట్లు వచ్చెను. నీ చేతులెట్లాడెనో?

ఇక్కడ అందమేమిటంటే? తనకు మహాపకారం చేసిన బ్రాహ్మణుడు ఎదురుగా ఉన్నాడు.అతడు గురుపుత్రుడవటం కొంత విచారింపదగిందే....అయినా ద్రౌపది తన దుఃఖాన్ని ఎంత ఆకట్టుకుంది! ఎంత మాటనియమాన్ని పాటిస్తోంది! ఒక్క తూలుమాట లేదు. ఇక్కడ ద్రౌపది శీలము ఎంతో ఉదాత్తంగా ఉంది.....వెనుక పద్యంలో మా మగవారలనుట, ఇందులో నీ చేతులెట్లాడెనో అనటం, హృదయాన్ని కదిలిస్తున్నాయి.....ఇలాంటి మాటలతోనే హృదయం కదులుతుంది.........రససాక్షాత్కారానికి హృదయాన్ని పట్టిచ్చే ఇలాంటి భావాలు,ఇలాంటి మాటలే ఆయువుపట్లు....

ఇలా అంటూ, ఒక్కసారి వెఱగుపడి," అయ్యో!ఇక్కడ పుత్రశోకంతో నేనెంత దుఃఖిస్తున్నానో! నిన్ను అర్జునుడు పట్టి తేవటం సహించలేక నీ తల్లి ఇంకెంత దుఃఖిస్తుందో కదా!" అని పలికి కృష్ణార్జునులను చూచి ఇలా అంది." ద్రోణుని భార్య ’కృపి’, భర్తతో సహగమనం చెయ్యక ఇంటనే ఉంది.ఆ తల్లి ఆశలన్నీ ఈ బిడ్డపైనేకదా!బిడ్డల చావుకి నేనెంత కలతపడుతున్నానో, తన బిడ్డకోసం ఆ తల్లీ అంతే కదా! పైగా హంతకుడైనా, బ్రాహ్మణుణ్ణి హింసించటం మహాపాపం.....భూపాలకులకి విప్రులను బాధించటం తగదు....విప్రులకోపం మహాగ్ని వంటిది.అది దేశమంతటినీ కాల్చివేస్తుంది...కనుక అందరి క్షేమంకోరి ఈతడిని విడిచిపెట్టండి".

ఇక్కడ కూడా ద్రౌపది ఉదాత్తత,ధర్మవిచక్షణ మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది...తను ఎంత వేదనతో ఉన్నా, సాటి స్త్రీ దుఃఖాన్ని ఆలోచించగలటం....ఆ క్షమాగుణం,ఆ ధర్మవిచక్షణ పోల్చసరిలేనివి..అందుకే ద్రౌపది భారతనారీశిరోమణి అయింది....మగువలందరికీ ఆదర్శమూర్తిగా నిలిచింది..

ఇలా పొగడదగ్గ రీతిలో, ఎంతో సమంజసంగా, ఎంతో దయతో ద్రౌపది పలికిన మాటలకి, ధర్మరాజు సంతోషించాడు.(తన సద్భావాలకు అనుగుణంగా భార్య నడుచుకుంటే, అంతకన్నా భర్తకి వేరే ఆనందమేముంటుంది.) కృష్ణార్జునులు, నకుల సహదేవులు కూడా సమ్మతించారు. కాని భీముడు ఒప్పుకోక ఆవేశంతో ఇలా అన్నాడు."తన బిడ్డలని చంపాడని ఒకింతైనా కోపపడదే! పైగా విడిచి పెట్టమంటోంది....ఎంత వెఱ్ఱిది ఈ ద్రౌపది! భాలఘాతకుడు వీడు విప్రుడా! కానేకాదు. వీడిని వదలవద్దు.తక్షణం వధించండి...చంపటానికి మీరు వెనకాడితే, ఒక్క పిడికిటి పోటుతో వీడి శిరస్సు వెయ్యివక్కలు చేస్తాను.చూడండి."

ఇలా ఆవేశంగా పలికి, అశ్వత్థామ మీదికి లంఘిస్తున్న భీముణ్ణి చూచి, ద్రౌపది అశ్వత్థామకి అడ్డునిలబడింది.(అంతటి ధీరోదాత్త ద్రౌపది.తన పతి ఎక్కడ ధర్మచ్య్తుతుడౌతాడోనని ఆ సాధ్వి తలచి చేసిన మెచ్చదగిన పని ఇది.) భీముని సంరంభం చూసి వెంటనే, కృష్ణుడు చతుర్భుజుడై వచ్చాడు. రెండు చేతులతో భీముణ్ణి వారించి,రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు నెట్టి, నవ్వురాజిల్లెడి ఆ మోముతో(ఎంతటి ఆవేశాన్నైనా,ఏ మనస్తాపాన్నైనా ఇట్టే పోగొట్టగల ముగ్ధమోహన దరహాసం మరి, భీముడి కోపం ఎప్పుడో కరిగిపోయుంటుంది.) ఇలా అన్నాడు." భీమసేనా! వీడు శిశుహంతకుడు, విడిచిపెట్టదగిన వాడు కాదు.కాని విప్రుడన్న మాట మాత్రం నిజం. "బ్రాహ్మణో న హంతవ్య" అని వేదం నిర్దేశిస్తోంది కదా! అందువలన ధర్మదృష్టితో చూచి వీడిని విడిచిపెట్టు."

ఇలా మెత్తటి మాటలతో ఆ పవనపుత్రుణ్ణి శాంతపఱచి,కృష్ణుడు అర్జునుణ్ణి చూచి," అర్జునా! నాకు, ద్రౌపదికి, భీమసేనునికి సమ్మతమయ్యేట్లు, నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరేట్లు ఈ శిశుహంతకుణ్ణి శిక్షించు"అని పలికాడు. అప్పుడా శక్రసూనుడు(శక్రుడనగా ఇంద్రుడు), అశ్వత్థామ శిరోజాలు తఱిగి, అతని తలలో మహాకాంతితో వెలుగుతున్న మణిని గ్రహించాడు...పిమ్మట అతని కట్లు విప్పి "పొమ్మ"ని శిబిరం బైటకి నెట్టివేశాడు. మణిని, తేజస్సుని పోగొట్టుకుని ఆ ద్రౌణి సిగ్గుతో, వడి వడిగా ఆ ప్రదేశం విడిచి వెళ్ళాడు.

" ధనము గొనుటయొండెఁ దలఁ గొఱుగుట
యొండె నాలయంబు వెడలనడచుటొండెఁ
గాని చంపఁదగిన కర్మంబు సేసినౕఁ
జంపఁదగదు విప్రజాతిఁ బతికి"

(భాగ - ప్ర - ౧౭౩)

" ఎంతటి ఘోరకృత్యం చేసినా రాజు విప్రులని వధించరాదు. ధనహీనుణ్ణి చెయ్యటం, తల గొఱిగించటం, దేవాలయ ప్రవేశం నిషేధించటం బ్రాహ్మణునికి మరణదండనతో సమానం".

లోకాః సమస్తాస్సుఖినో భవంతు.

25, జులై 2010, ఆదివారం

ద్రౌపది సౌశీల్యం - ౧


అర్జునుడు అశ్వత్థామను కట్టితెచ్చి ద్రుపదరాజనందిని ముందు పడవేశాడు......ద్రౌపది అశ్వత్థామ వంక చూచింది..అప్పుడా అశ్వత్థామ ఎల్లా ఉన్నాడయ్యా అంటే,సిగ్గుతో తలవంచుకుని ఉన్నాడట....ఎందుకూ?ఆమె అయిదుగురు పుత్రుల్నీ,నిద్రపోతున్నవారిని అతికిరాతకంగా చంపింది తానే కదా మరి!పైగా అది ఎంత అధర్మమో ఎరిగినవాడయ్యె తను....అలా ఉన్న అశ్వత్థామను చూచి ముందు నమస్కరించింది ఆ మహాసాధ్వి....తనకు ఎంత ద్రోహం చేసినా విప్రుడాయె,పైగా గురుపుత్రుడాయె....అంతటి ధర్మ విచక్షణగలది ద్రౌపది..అంతటి సుస్వభావ...

అప్పుడు ఇలా అంది,

"పరఁగన్ మా మగవార లెల్లరును మున్బాణ ప్రయోగోప సం
హరణాద్యాయుధ విద్యలన్నియు ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్రాకృతి నున్న ద్రోణుఁడవు నీ చిత్తంబులో లేశమున్
కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే!"
(భాగ - ప్ర - ౧౫౯)

ఈ పద్యం చాలా ప్రసిద్ధమైన పద్యం.....ఇక్కడ మనం తిక్కనగారి ద్రౌపదిని,పోతనగారి ద్రౌపదిని చక్కగా పోల్చుకోవచ్చు....అక్కడ అభిమన్యుడు,ఘటోత్కచుడు,బభ్రువాహనుడు మొదలైన వాళ్ళు కూడా తనకు పుత్రు(సమాను)లే...వాళ్ళు మరణించినపుడు ఎంతో ఉద్వేగ పడుతుంది...కాని ఇక్కడ ఎంత ఊటాడినా దైన్యాన్నే ప్రదర్శిస్తుంది....

పరగన్-- ఈ మాటతో ఈ పద్యం మొదలౌతుంది..ఇది కొందరికి వ్యర్థమైన మాటగా కనిపిస్తుంది.కొందఱు మధ్యకాలపు కవులు ఇల్లాంటి మాటలకు వెగటు పడటం నేర్చుకున్నారు.ఆధునికులైన యువకులలో కొన్ని వెఱ్ఱివేషాలున్నై...అవి కొంత పెద్దజీతము,ఒక పదవి ఉన్నవాడి సాహిత్యాభిప్రాయాలలో వెఱ్ఱులు...అవి వారికపకారం చేసేది చాలక, వాడి అనుయాయులకు కూడా చేస్తున్నై. వీళ్ళంతా ఆ వెఱ్ఱులు పెట్టుకోటం మూలంగా ఆంధ్రసరస్వతి సమిష్టి స్వరూప పరిజ్ఞానం లేని వాళ్ళవుతున్నారు.ఒక మహాకావ్య నిర్మాణానికి సమర్థులు కాలేకపోతున్నారు.....ఏవో అల్పపు రాతలతో మురిసి పోతుంటారు.వాటిల్లో ఉండే మంచిగుణాలు కూడా లేకపోలేదు........కానీ, వాళ్ళు ఇల్లాంటి సంకుచితాభిప్రాయాల వల్ల సర్వంకషమైన ప్రతిభగల కావ్యాలు రాయటానికి చాలకున్నారు....

మనం మాటాడేప్పుడు కొన్ని అనవసరమైన శబ్దాలు ప్రయోగిస్తాం. "అదికాదురా- వాడు నన్నలా అన్నాడు!", ఈ ’అదికాదు’ కి అర్థంలేదు...." మరి, నువ్వెప్పుడు వచ్చావు?!",,..ఇక్కడ ఈ ’మరి’ కీ అర్థంలేదు....మన ప్రసంగంలోని మాటపాటులిలాంటివి.ఇల్లాంటి శబ్దాలకి వాక్యాలంకారాలని పేరు...ఇలాంటివి ఏ భాషలోనైనా ఉంటాయి.--భాషా స్వభావము తెలియని వాళ్ళు చెప్పే మాటలు వేఱుగా ఉంటాయి. పరగన్ - అన్నమాటకి అర్థముందా, లేదా? సరిపోతుందా, లేదా? వాక్యాలంకారమవుతుందా, కాదా? అనేకమైన జీవితశాఖలలో ఎంతో మందికి ఎన్నో రకాలైన వెఱ్ఱులుంటై...కాని ఇలాంటి వెఱ్ఱులు పెట్టుకున్నవాడు రసాస్వాదనం చెయ్యలేడు..అది చెయ్యలేని కావ్యపఠనం ఎందుకూ కొఱగాదు......

మా మగవారలెల్లను--- ఇలాంటి పదాల వల్లనే పోతన్నగారి వాణి తెలుగువాళ్ళ హృదయానికి హత్తుకుపోయింది....’మా మగవారలు’ అనటంలో ఎంతో స్త్రీత్వముంది..సంసార లక్షణముంది.

మున్+బాణ ప్రయోగోపసంహారణాయుధ విద్యలన్నియు---- ధనుర్విద్య రెండు రకాలు..ఒకటి శస్త్ర విద్య. అంటే లాఘవంగా అమ్ముతొడిగి గురి తప్పకుండా కొట్టగలగటం,ఒక్కసారి వదిలిన తర్వాత ఇక వెనక్కు తేవడం ఉండదు....రెండవది అస్త్రవిద్య. బ్రహ్మాస్త్రం,ఆగ్నేయాస్త్రం,వారుణాస్త్రం,వాయవ్యాస్త్రం... ఇల్లాంటివి. ఇది మంత్ర స్వ్రరూపమైనది...ఆయా అస్త్రాలకి ఒక్కో అధిదేవత ఉంటుంది..ఆ అస్త్రాధిదేవతని ఎంతో నిష్ఠతో అర్చించాలి...ఇక్కడ ప్రయోగం, ఉపసంహారం రెండూ ఉంటాయి....రెండిటినీ తెలిసినవాడే ప్రయోగించాలి..దానికి ఎంతో పరిశ్రమ కావాలి...సర్వాస్త్రఘాతి అని ఒక అస్త్రముంది..అది అన్ని అస్త్రాలకీ ఉపసంహరణ......ఇక్కడ మనం కొంత ఆక్షేపణ అన్వయించుకోవచ్చు.(ముందు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాన్ని ఉపసంహారం తెలియకుండానే ప్రయోగిస్తాడు కదా.)...

ద్రోణాచార్యుచే నభ్యసించిరి---- ఇక్కడ ’ద్రోణాచార్యుతో’ అనో, ’ద్రోణాచార్యువల్ల’ అనో అనలేదు...చదువైతే ’తో’ అనవచ్చు....కానీ ఇది ధనుర్విద్య, కనుక ’చే’........అభ్యసించిరి- ఇక్కడ ప్రాస ’పరగన్’ అన్న శబ్దం మూలంగా రమణీయంగా అతికింది....ఈ రామణీయకత కోసం ’పరగన్’ అన్న మాటతో మొదలు పెడితే తప్పేంటి?

పుత్రాకృతినున్న ద్రోణుడవు----- నీకును, ద్రోణుడికి ఆకృతిలో భేదమే తప్ప యదార్థమైన స్వరూపంలో, ఆత్మలో భేదం లేదని అర్థం......" ఆత్మావై పుత్రనామాసి".

నీ చిత్తంబులో లేశమున్ కరుణాసంగము లేక--- ఏమయ్యా! నీ మనసులో ఏ మూలన కూడా కొంచెమైనా కరుణ,దయ ఆర్ద్రత అనేవి లేవే!

శిష్యుసుతులన్--- వాళ్ళు నీ తండ్రి శిష్యుల కొడుకులు కాదు, నీ శిష్యుల కొడుకులే....

ఖండింపగా పాడియే --- వధించటం నీకు ధర్మమేనా!

19, జులై 2010, సోమవారం

పుత్ర హంతకుడైన అశ్వత్థామను అర్జునుడు బంధించి తెచ్చుట"వెఱచినవాని దైన్యమున వేఁదుఱు
నొందినవాని నిద్ర మై

మఱచినవాని సౌఖ్యముగ మద్యము ద్రావినవాని భగ్నుఁడై

పఱచినవాని సాధు జడభావము వానిని గావుమంచు వా

చఱచినవానిఁ గామినుల జంపుట ధర్మముగాదు ఫల్గునా!"ఇవి, పుత్రహంతకుడైన అశ్వత్థామను బంధించి, చంపబోతున్న అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసూక్ష్మాలు......
" అర్జునా! భయపడ్డవాణ్ణి, ఉన్మత్తుడై అతిదీనంగా ఉన్నవాణ్ణి, మైమరిచి నిద్రించేవాణ్ణి, మధువు సేవించి మత్తులో ఉన్నవాణ్ణి, శక్తి ఉడిగిపోయి భంగపడి ఉన్నవాణ్ణి, సాధువై తపస్సు చేసుకుంటూ కదలక,మెదలక ఉన్నవాణ్ణి, రక్షించమని గొంతెత్తి అడిగినవాణ్ణి, స్త్రీలను చంపటం ధర్మంకాదు."


"నారదమహర్షి వెళ్ళిన తర్వాత వ్యాసుడు, బ్రహ్మనదియైన సరస్వతీనదికి పడమటి ఒడ్డునున్న తన ఆశ్రమానికి వెళ్ళాడు...అది ఫలవంతాలైన రేగుచెట్లతో (అందుకే వ్యాసుణ్ణి "బాదరాయణుడు" అంటారు. బదరీ వృక్షం=రేగుచెట్టు) నిండిఉంది...దానిపేరు శమ్యాప్రాసం.....అక్కడ వ్యాసుడు పవిత్ర సరస్వతీ జలాల్లో స్నానమాచరించి,సంధ్య వార్చుకుని వచ్చి ఒడ్డున కూర్చుని, భక్తినిండిన మనస్సుతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు....మాయామోహితుడైన జీవికి హరిభక్తి తప్ప వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకుని........... ఈ భూమిమీద ఎవ్వరైనా,ఎప్పుడైనా,ఎక్కడైనా విన్న,చదివినంత మాత్రాన, ఈ సర్వ భవబంధాల్ని తొలగించి ముక్తిని ప్రసాదించే ఆ హరిభక్తిని కలిగించేటువంటి భాగవతమహాపురాణాన్ని రచించాడు....దానిని తన కుమారుడైన శుకమహర్షి చేత చదివించాడు...." అని సూతమహర్షి వివరించాడు...అది విన్న శౌనకుడు" శుక మహర్షి సర్వ విరాగి కదా! ఏ కారణంచేత భాగవతాన్ని పఠించాడు" అని అడిగాడు.....

అప్పుడు సూతుడు," మునులు నిరపేక్షులు...వాళ్ళు కారణమేమీ లేకుండానే హరిని కీర్తిస్తుంటారు...ఏదో ప్రయోజనం ఆశించి చెయ్యరు! అలా ఆ హరితత్పరుడైన బాదరాయణి(శుకుడు), త్రైలోక్య మంగళకరమైన భాగవతాన్ని భక్తితో పఠించాడు.....వేదాలు వెయ్యిమార్లు చదివినా ముక్తి మార్గం సులభంకాదు..కానీ ఈ భాగవతవేదాన్ని శ్రద్ధ్హతో ఒక్కమారు చదివినా మోక్షమార్గం ఎంతో సులభమౌతుంది.......ఇక పరీక్షిత్తు జన్మకర్మ ముక్తినీ, పాండవుల మహాప్రస్థానాన్నీ, కృష్ణకథోదయాన్నీ చెప్తాను వినండి." అని పలికి ఇంకా ఇలా చెప్పసాగాడు......

"కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది....ఎన్నో అక్షౌహిణుల సైన్యం నాశనమయ్యింది..ఎందరో వీరులు స్వర్గగతులయ్యారు.....భీముడి గదాఘాతానికి దుర్యోధనుడు తొడలువిరిగి నేలకూలాడు....అప్పుడు అశ్వత్థామ తన రాజు,మిత్రుడు ఐన దుర్యోధనుడికి ప్రియం చేకూర్చాలని భావించి, నిద్రపోతున్న ద్రౌపదీపుత్రుల శిరసులు ఖండించి తెచ్చి సమర్పించాడు.....ఇది మహా కౄరకర్మ అని లోకులు నిందించారు.....

తనయుల చావువార్త విన్న ఆ ద్రుపదరాజపుత్రి ఎంతో కలతపడ్డది.కన్నీళ్ళు చెక్కిళ్ళవెంట ధారగా కారుతుండగా దుఃఖించి,దుఃఖించి నేలపైబడి మూర్ఛిల్లింది....అది చూసిన అర్జునుడు ద్రౌపదిని కూర్చుండబెట్టి,సేదదీర్చి, తలనిమురుతూ, మెత్తటి గొంతుకతో ఇలా అన్నాడు.."మహారాజ పుత్రివి, మరో మహారాజు ఇల్లాలివి...ఇలా బేలవై దుఃఖించుట తగునా? ఆ ద్రోణపుత్రుడు నిర్దయుడై బాలుర్ని హతమార్చాడు...నేడు, నా గాండీవం వదిలే భీకర శరాలతో వాని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదాల దగ్గర పడవేస్తాను...అది చూచి నువ్వు ఆనందనర్తనం చెయ్యాలి.."....అని ద్రౌపదిని ఓదార్చి అర్జునుడు, కవచం తొడిగి,గాండీవం ధరించి....తన సఖుడు,భగవంతుడు ఐన ఆ శ్రీకృష్ణుడు సారథికాగా, కపిధ్వజయుతమైన రథాన్ని అశ్వత్థామ వద్దకు పరుగెత్తించాడు...

తనని చంపటానికి వస్తున్న అర్జునుణ్ణి చూసి అశ్వత్థామ, భయంతో ప్రాణాలరచేత పట్టుకుని,రథమెక్కి పారిపోవటం మొదలెట్టాడు....అలా ఓపికున్నంత వరకూ వెళ్ళాడు...గుర్రాలు కూడా అలిసిపోయాయి.... వెనక అర్జునుడు తరుముతూ వస్తున్నాడు....ఇక ప్రాణరక్షణకి వేరే మార్గంలేదని నిశ్చయించుకుని, జలాన్ని అభిమంత్రించి, అర్జునుడి మీదకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని(ప్రయోగమే కాని,ఉపసంహారం తెలియక పోయినా ప్రాణరక్షణకోసం) ప్రయోగించాడు...ఆ అస్త్రాగ్ని దిక్కులన్నీ వ్యాపించి, ఆకాశమంతా కమ్ముకుని మహాభీకరంగా వస్తుంటే చూసి అర్జునుడు ఆ వాసుదేవునితో,"కృష్ణా! భక్తాభయప్రదా!పరమపురుషుడవు, నీ ప్రబొధంతో మాయను అణచివేస్తావు..... ఇదేదో మహాగ్ని భూమ్యాకాశాలూ,దిక్కులన్నీ నిండి ఎదురుగా వస్తున్నది..ఏంటో అర్థం కాకుండా ఉంది....నాకు త్వరగా,వివరంగా చెప్పు దేవేశా!" అని ప్రార్థించాడు...

అప్పుడు ఆ శ్రీహరి," అర్జునా! ప్రాణేఛ్ఛతో పారిపోతున్న ద్రోణపుత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు...ఇది ఆ మహాస్త్రాగ్ని...తిరుగు బ్రహ్మాస్త్రంతోగానీ దీన్ని నివారించలేము..కనుక త్వరగా నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు." అన్నాడు....అప్పుడు అర్జునుడు ఆ శ్రీహరికి ప్రదక్షిణచేసి, జలాన్ని అభిమంత్రించి. అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రంపైకి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.....అప్ఫుడా రెండు మహాస్త్రాలూ, తమ అగ్నితో భూనభోంతరాళాలు నింపుతూ తలపడగా లోకమంతా గడగడలాడింది....ప్రజలు యుగాంతమేమోనని భయపడ్డారు....అప్పుడు ఆ శ్రీహరి ఆజ్ఞమేరకు, అర్జునుడు రెండు అస్త్రాలనీ ఉపసంహరించాడు....అప్పుడు ఆ ధనంజయుడు,రోషారుణిత నేత్రుడై, అశ్వత్థామను తఱిమి పట్టుకుని బంధించి, శిబిరానికి తీసుకువెళ్ళి వధిస్తానని పలకగావిని కృష్ణుడు ఇలా అన్నాడు.."అర్జునా! ఎదురాడలేని పసిపాపలని, నిద్రలో ఉన్నవారిని,రాత్రివేళ చంపిన ఈ పాతకుణ్ణి వదలవద్దు...కానీ ప్రాణభయంతో పారిపోయేవాడిని వధించరాదని ధర్మం చెప్తోంది...కనుక ఈ విప్రుణ్ణి రాజధర్మానుసారం దండించు...".

అని ఇలా కృష్ణుడు ఆనతివ్వగా అర్జునుడు, బ్రాహ్మణుడు ఎంత అపరాధియైనా, వధింపదగడనే ధర్మాన్ని తలచి, చంపక, ద్రౌపదికి తానిచ్చినమాట గుర్తుకుతెచ్చుకుని బంధితుడైన అశ్వత్థామను తీసుకుని శిబిరం దగ్గరికి వచ్చి,

"సురరాజసుతుఁడు సూపెను
దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకున్
బరిచలితాంగ శ్రేణిం
బరుష మహాపాశబద్ధ పాణిన్ ద్రౌణిన్."

12, జులై 2010, సోమవారం

నారదుని పూర్వజన్మ వృత్తాంతము

సీ. విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును
లేదు విశ్వమునకు
భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీ ముఖమున
నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము కావున హరిపరాక్రమములెల్ల

ఆ. వినుతిసేయు మీవు వినికియుఁ జదువును
దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమికెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

నారద మహర్షి వ్యాకులతతో ఉన్న వ్యాసునితో ఇంకా ఇల్లా చెప్పసాగాడు......"మునీంద్రా! ఈ విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువే. ఆతనికి మించినది,వేరైనది ఏదీ ఈ విశ్వాంతరాళంలో లేదు.సర్వ సృష్టి,స్థితి,వృద్ధి,లయాలన్నీ ఆ పరమేశ్వరుని వలననే జరుగునని నీకు తెలిసిన విషయమే కదా! నీవు ఈ లోకకళ్యాణానికై విష్ణ్వంశతో జన్మించినాడవు..కావున ఆ హరి లీలలన్నిటినీ భాగవత కథారూపాన లోకానికి వివరించు..ఆ కమలనాభుని కీర్తించగలిగినప్పుడే కదా సర్వ రూపమైన తపస్సులూ,సర్వమైన సంపదలూ సఫలాలౌతాయి!

మహాత్మా! నేను నా పూర్వజన్మలో(ఇంతకు ముందు కల్పాన) సదాచారులైన వేదవాదుల ఇంటి దాసికి జన్మించాను. వాళ్ళు,నా చిన్నతనంలో ఒక వానాకాలంలో, చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకచోట నిలిచి ఉండే యోగులకు పరిచర్య చేయటానికి నన్ను నియమించారు.(చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి-శయనైకాదశి తో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది.ఈ నాల్గునెలలూ నిత్య సంచారులైన యోగులు ఒక్కచోట కదలకుండా ఉండి ఆ నారాయణున్ని అర్చిస్తారు.) నేను నేర్పుగా,ఓర్పుగా అన్ని పనులు చేస్తూ, అందరు బాలురవలే ఆటలకు వెళ్ళక, ఏ ఇతర జంజాటాలు లేకుండా భక్తితో వారిని సేవించాను. వారు మిగిల్చిన ఎంగిలి శుభంగా భావించి భుజిస్తూ,ఎండ వానల్ని లెక్కచేయకుండా వారిని వర్షాకాల,శరత్కాలాలు సేవించాను.వాళ్ళు విష్ణుచరితలు చదువుతూ,పాడుతూ ఉంటే, అవి నా చెవులకు అమృతంలా అనిపించేవి.మనసుకు అపరిమితమైన ఆనందం కలిగేది.దానితో నేను కూడా హరినామకీర్తనం చెయ్యటం మొదలెట్టాను.అలా ఆ మహాజనులవల్ల నాలో రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’ కలిగింది.....

కొంతకాలానికి వారి చాతుర్మాస్య వ్రతం ముగిసి, ఆ యోగులు తిరిగి దేశాటనానికి బయల్దేరారు...అంతట వారు, ఎటువంటి అపచారం లేకుండా భక్తితో నిత్యపరిచర్య చేసిన నన్ను పిలిచి, పరమ ప్రీతితో,కరుణతో నాకు అతిరహస్యమైన ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశం వల్ల ఆ వాసుదేవుని సర్వ మాయావిలాసాన్ని తెలుసుకున్నాను. ఏ పదార్థం వలనైతే వ్యాధి వస్తుందో, ఆ వ్యాధి మాన్చటానికి అదే పదార్థం ఎలా పనికిరాదో, అలానే సంసారహేతుకమైన కర్మలు ఈశ్వర సన్నిధానానికి ప్రతిబంధకాలుగా మారతాయి.వాటిని ఈశ్వరార్పితంగా భావించి ఆచరించాలి. అప్పుడు భక్తియోగం కలుగుతుంది. ప్రణవ సహితంగా వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అనే ఈ నాలుగు నామాల్ని భక్తి పూర్వకంగా పలికి, నమస్కారం చేసి, మంత్రమూర్తియైన ఆ యజ్ఞపురుషుని పూజించిన వాడు సమ్యగ్దర్శనుడౌతాడు.నేను ఆ విధంగా చేయగా, ఆ హరి సంతసించి తనయందలి పరమేశ్వర జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.నా తల్లి మా యజమానుల ఇంట భక్తితో పనులన్నీ చేసి, నావద్దకు రేపు మాపు వచ్చి నేను అలసితినని, ఆకొంటినని నాకు అన్నమిడి, నన్ను ముద్దాడి, చుంచు దువ్వి, నన్ను కౌగిలించుకుని ప్రేమగా ఒళ్ళంతా నిమిరెడిది. ఒకనాటి రాత్రి, నా తల్లి పాలు పితకటానికి వెళ్ళ్గి చీకటిలో చూడక పాముతోక తొక్కగా,అది వెంటనే నా తల్లిని కరిచింది. ఆ విషప్రభావాన నా తల్లి విగతజీవియై వెంటనే నేలకూలింది.అది చూచి నేను మోహం పొందక, సంసారబంధాలు తొలగిపోయాయని భావించి,విష్ణుపద ధ్యానంమీద బుద్ధి నిలిపి ఇల్లు వదిలి ఉత్తరాభిముఖంగా బయలుదేరాను.అలా బయలుదేరి, పట్టణాలు,జనపదాలు,పల్లెలు,నదులు,పర్వతాలు,అడవులు దాటి సర్వజంతు వాసితమైన ఒక భీకరారణ్యం ప్రవేశించాను.అక్కడ ఒక సరస్సులో స్నానమాడి, శుచినై, ఒక రావిచెట్టు క్రింద కూర్చుని, నేను విన్న విధంగా నా హృదయగతుడైన ఆ పరమాత్మని,హరిని చింతించాను.అలా ధ్యాననిమగ్నుడనైన నాకు, ఆనందాశ్రువులు రాలగా, రోమాంచం కలుగుతుండగా, నా తలపులో ఆ దేవదేవుడు కనిపించినట్లైంది.కాని ఆ హరి దివ్యరూపం నా కన్నులకు కనపడలేదు.ఆ హరికోసం శోకిస్తూ, నేను ఆ వనం అంతా కలియతిరుగుతుండగా, నన్నుద్దేశించి ఆ హరి మృదు మధుర స్వరంతో ఇలాపలికాడు."కుమారా!దుఃఖించకు.ఈ జన్మలో నన్ను చూడలేవు. నీవు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట, నా భక్తుడవై జన్మిస్తావు.ఈ సృష్టి లయం జరిగి, పునఃసృష్టి జరిగినప్పుడు నా కృపతో జన్మించి, శుద్ధసత్వులందరిలోకి అగ్రగణ్యుడవై వర్ధిల్లుతావు."

అలా ఆ అశరీరవాణి పలుకగా, నేను తలవంచి నమస్కరించితిని. కామక్రోధాదులైన అరిషడ్వర్గాన్ని వర్జించి, ఆ అనంతుని నామాలు పఠిస్తూ,విషయవిరక్తుణ్ణై, కాలానికై ఎదురుచూస్తూ తిరుగుతూ ఉండగా కొంతకాలానికి మెఱుపు మెఱిసినట్టు మృత్యువు రాగా,ఈ పాంచభౌతికదేహాన్ని విడిచి, ఆ శ్రీహరి కృపవల్ల శుద్ధసత్వమయమైన భాగవత దేహాన్ని పొందాను.అంత ముల్లోకాల్నీ లయంచేసి, ఆ ప్రళయకాల జలరాశిమధ్య శయనించి ఉన్న నారాయణమూర్తి యొక్క నాభికమలగతుడై శయనించబోతున్న బ్రహ్మ నిశ్వాస వెంట ఆతని లోనికి ప్రవేశించాను.తరువాత వెయ్యి యుగాల కాలం గడిచిన తర్వాత నిద్రలేచి, లోకాల్ని సృష్టించడానికి ఉపక్రమిస్తున్న ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాస వెంట నేను, మరీచి మొదలైన మునులు జన్మించాము. అప్పుడు నేను అఖండమైన బ్రహ్మచర్యాన్ని పూని, ఈశ్వరదత్తమై,బ్రహ్మనుంచి పుట్టిన సప్తస్వరాలని తనంతట తానుగా మోగించే ఈ మహతి(అనే వీణ)ని పూని, ఈ ముల్లోకాలలో ఆ నారాయణుని అనుగ్రహంతో ఏ అడ్డంకి లేకుండా, నారాయణ కథాగానం చేస్తూ చరిస్తూ ఉన్నాను.అంత ఆ మహావిష్ణువు పిలిచిన పలికే వాని లాగా నా మనసులో నిత్యం దర్శనమిస్తుంటాడు.మునీంద్రా!ఈ సంసారమనే సాగరంలో మునిగి, కర్మ వాంఛలచేత వేదన పడేవారికి, ఆ శ్రీహరి నామకీర్తనం తెప్పలాంటిది.అందువల్ల ఆ హరికథామృతాన్ని ప్రవచించి లోకాల్ని పావనం చెయ్యి." అని చెప్పి నారదుడు వ్యాసుని వద్ద వీడ్కోలు తీసుకుని వీణానాదం చేస్తూ ఆకాశమార్గాన వెళ్ళాడు అని సూత మహర్షి చెప్పి ఇలా అన్నాడు.

"వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుంద గీతములు జగములకున్
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే! "

లోకాఃసమస్తాస్సుఖినో భవంతు.

4, జులై 2010, ఆదివారం

శ్రీమద్భాగవత రచనాది వృత్తాంతము - వ్యాకుల చిత్తుడైన వ్యాసుని వద్దకు నారదుడు ఏతెంచుట

"హరినామ స్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరసస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ

హరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమైయుండ దయోగ్య దుర్మద నదత్కాకోల గర్తాకృతిన్."


ఇది నాకు ఎంతో ఇష్టమైన పద్యం.....వేదాల్ని విభజించినా, పురాణేతిహాసాలెన్ని రాసినా తెలియని వెలితితో చింతిస్తున్న వ్యాసునితో నారదమహర్షి అన్న మాటలివి...."హరిని కీర్తించే కావ్యమేదైనా బంగారు కమలాలతో,హంసలతో నిండి ఉన్న మానససరోవరంలా శోభిస్తుంది. కాని హరినామకీర్తన లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది....".

నారాయణుని అవతారాల్ని వర్ణించిన పిమ్మట, సూతముని ఇలా అన్నాడు," సకలపురాణ రాజము, భువనేశ్వరుడైన ఆ శ్రీహరి చరితము ఐన భాగవతాన్ని భగవంతుడైన వ్యాసమహర్షి రచించి, మొదట తన కుమారుడైన శుకుని చేత చదివించాడు....సకల వేదేతిహాస సారమైన ఈ మహా పురాణాన్ని ఆ శుక మహర్షి, ఘనవిరక్తితో గంగ మధ్యలో సకల మునులతో కూడి ఉన్న ఆ పరీక్షిన్మహారాజు అడుగగా వినిపించాడు....ఆ మునివల్ల నే విన్నది అంతా మీకు వినిపిస్తాను,వినండి. కలికాల దోషాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జనులకు ఈ భాగవతం, కమలబాంధవుడైన ఆ సూర్యుని వలె వెలుగునిచ్చి దారిచూపుతుంది..".

అది విన్న శౌనకుడు,"మహర్షీ! ఏ కారణంచేత,ఎవరు కోరితే వ్యాసమహర్షి భాగవతాన్ని రచించాడు?అసలు ఆ శుకముని నిత్య నిర్వికల్పుడు కదా! ఆ మహాముని గృహస్థుల ఇళ్ళలో, ఆవు పాలు పిదికినంత తడవు కూడా నిలవడంటారే! ఆ మాత్రం నిలిచిన చోటు మహా తీర్థమవుతుంది కదా! అలాంటిది అంతకాలం ఆ ముని ఒక్కచోట,హస్తినలో ఎలా నిలిచి ఉన్నాడు? అంత ప్రీతితో పరీక్షిత్తుకి భాగవతాన్ని ఎలా వినిపించాడు! అదియును గాక, మహా గాఢకీర్తియగు ఆ మహారాజు,రాజ్యాన్ని విడిచి ఏ కారణాంతరం చేత ప్రాయోపవేశం చేసి, గంగ మధ్యలో విరక్తితో ఉన్నాడు?ఆ కథనంతా మాకు వివరించు" అన్నాడు.

అప్పుడు సూతమహాముని ఇల్లా చెప్పటం మొదలెట్టాడు.
"మూడవదైన ద్వాపరయుగం చివరలో, ఉపరిచరవసువు వీర్యాన జన్మించిన సత్యవతియందు పరాశరునకు, హరి అవతారంగా మహాజ్ఞానియైన వ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆ మహాముని బదరికాశ్రమంలో,సరస్వతీనదిలో స్నానమాచరించి,ఎవరూలేని చోట ఒంటిగా కూర్చుని,"యుగధర్మాలకు భువి సాంకర్యం చెందుతుంది.యుగయుగానికీ భౌతికశక్తి సన్నగిల్లుతోంది. మానవులు ధైర్యహీనులుగా, మందబుద్ధితో,అల్పాయువులుగా,దుర్బలులుగా అవుతారని", దివ్యదృష్టితో వీక్షించాడు. అంత సర్వ వర్ణాశ్రమాలకీ హితం చేయాలని సంకల్పించి, నలుగురు హోతలచే అనుష్ఠింపబడి, ప్రజాశ్రేయస్సు చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు ఎడతెగకుండా జరిగేందుకు వీలుగా, ఒకటిగా ఉన్న వేదాన్ని, నాలుగుగా విభజించాడు. మిగిలిన ఇతిహాసాలు, పురాణాలు అన్నీ పంచమవేదం అని చెప్పాడు.

వాటిలో ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదం వైశంపాయనుడు, నాల్గవదైన అధర్వాన్ని సుమంతుడు పఠించారు. సకల పురాణేతిహాసాల్ని మా తండ్రి రోమహర్షణుడు చదివాడు. ఇలా ఆయా మునులు తాము నేర్చిన వేదాల్ని, తమ తమ శిష్యులకు బోధించారు. అలా వారి వలన ఆ వేదజ్ఞానమంతా ఈ భూమి మీద విస్తరించింది.తరువాత దీనవత్సలుడైన వ్యాసుడు, స్త్రీలకు శూద్రులకు వేదార్హత లేదు కనుక వారి మేలుకొరకు మహాభారతాన్ని రచించాడు.

కాని ఎంత చేసినా మనసులో ఆనందం,తృప్తి కలగకపోవడంతో ఒకనాడు సరస్వతీ తీరాన కూర్చుని తనలో తాను ఇలా వ్యాకుల పడసాగాడు. "సర్వ కర్మానుష్ఠాన రూపమైన వేదాల్ని ప్రవచించాను. సర్వ వేదార్థ భావాన్ని మహాభారత మిషతో తెలిపాను.ఇంత జేసినా ఆత్మలో ఈశ్వరుడు సంతసించినట్లు లేదు. ఏం చేయాలి?ఏం చేస్తే ఈ వెలితి తీరుతుంది?"అని ఆలోచిస్తుండగా......మింటనుండి, మధుర నారాయణ గానం చేస్తూ, మహతిమీద మంద్ర మధుర స్వరాలు పలికిస్తూ, కపిలవర్ణంతో ఉన్న జటలు సూర్య సమాన దీప్తిని ప్రసరిస్తుండగా నారదమహర్షి అరుదెంచాడు......
అలా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షికి, వ్యాసుడు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదుల పూజించి, కూర్చుండబెట్టిన పిమ్మట, నారద మహర్షి నవ్వు మోముతో,విపంచికా తంత్రిని మీటుతూ వ్యాసునితో,"వ్యాసమహర్షీ! వేదార్థ పదార్థ విజ్ఞాతవు.... మహాభారత ప్రవక్తవు.... కామ,క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించినవాడవు.....బ్రహ్మతత్వాన్ని చక్కగా ఎఱిగి బ్రహ్మసూత్రాల్ని నిర్దేశించిన వాడవు...ఇలా వ్యాకులత చెందడానికి కారణమేమిటయ్యా!" అని అడిగాడు.

దానికి వ్యాసుడు ఇలా అన్నాడు."మహానుభావా! నీవు బ్రహ్మమానసపుత్రుడవు.నిరంతర నారాయణ కీర్తనా గాన విలాసివి.సూర్యుడిలా ముల్లోకాలూ చుట్టివస్తావు.వాయువులా అన్ని లోకాల జనులతో మెలుగుతావు. నీవు సర్వజ్ఞుడివి.నీకు తెలియనిది ఈ ముల్లోకాల్లోనూ లేదు.....కనుక నా మనసులో ఉన్న ఈ కొఱతేమిటో, ఆ వెలితిని పూడ్చే ఉపాయమేమిటో దయతో నాకు వివరింపగలవు".

అంతట నారదుడు లేనగవుతో,

"అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం
చించుకగాని విష్ణుకథలేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!"

.సర్వేజనాస్సుఖినో భవంతు.

1, ఏప్రిల్ 2010, గురువారం

ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుని ఇరవయ్యొక్క అవతారాలు


భగవంతుండగు విష్ణువు

జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్

దగ నవ్వేళల దయతో

యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
(భాగ - ప్ర - ౬౩)


శౌనకాది మునులు, సూతమహర్షిని నారాయణుని కథలు తెలుపమని అడగగా, సకలపురాణ ద్రష్టయైన ఆ మహర్షి, శ్రీమద్భాగవత వక్తయైన శుకమునిని స్మరించి, వ్యాసుని పాదాలకు నమస్కారం చేసి,నరనారాయణులకున్నూ,భారతికిన్నీ మొక్కి ఇలా చెప్పటం మొదలెట్టాడు..."మునీంద్రులారా! సర్వలోకాలకీ మంగళప్రదమైన విషయాన్ని అడిగారు...కర్మనిర్మూలన హేతువులైన ఆ కమలలోచనుని కథలు ఎవడైతే వినడానికి ఇష్టపడతాడో, వాడికి ఇతరమైన విషయాలేవీ రుచించవు...పుణ్యశ్రవణ కీర్తనుడైన ఆ విష్ణువు తన కథలు వినేవాళ్ళ హృదయాల్లో నిలిచిఉండి సర్వశుభాల్నీ కలిగిస్తాడు..అశుభాల్ని పోగొడతాడు....అలాంటి వారికి నిశ్చలమైన భక్తి కలుగుతుంది...భక్తి ఉన్నవాడి మనస్సు అరిషడ్వర్గాలకి చిక్కక సత్వగుణప్రసన్నమై, ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకుంటుంది....అలాంటి వారికి సర్వ సంశయనివృత్తికలిగి, సర్వ కర్మలూ నశిస్తాయి......

అగ్ని ఒక్కటే ఐనా, వేరువేరు కట్టెలకి తగిలి మండేప్పుడు వేరువేరుగా కనిపించినట్టు, విశ్వాత్ముడైన ఆ ఆదిపురుషుడొక్కడే ఐనా అతడు దేవ,తిర్యక్, మనుష్య జాతుల్లో అవతరించి లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు.....ఆ భువనైకకర్త,బహుసుందరమైన పదునారు కళలతో,పంచమహాభూత భాసితుడై, శుద్ధసత్వుడై, సర్వావయవాలూ,సర్వేంద్రియాలూ వేలకొద్దీ("సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షా సహస్రపాత్" అని పురుషసూక్తం) వెలుగుతుండగా,హార కిరీటకుండలాలు పెక్కువేలతో, సహస్ర శిరస్కుడై పురుషరూపం ధరించి, అపారజలరాశి మధ్య,యోగనిద్రావిలాసియై వెలుగుతూ ఉంటాడు...అది సకలావతారాలకూ మూలమైన శ్రీమన్నారాయణుని దివ్యరూపం....దానిని పరమయోగీంద్రులైనవారు దర్శిస్తారు....ఆ పరమేశ్వరుని నాభికమలంలోనుంచి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ జన్మించాడు....ఆయన అవయవాలనుండే సర్వలోకాలూ సృష్టించబడ్డాయి.......

మొట్టమొదట ఆ శ్రీమన్నారాయణుడు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులనే నల్వురిపేర బ్రహ్మమానసపుత్రులుగా జన్మించి, బ్రాహ్మణుండై కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు....

రెండవసారి, జగజ్జననం కోసం యజ్ఞవరాహరూపంతో హిరణ్యాక్షుణ్ణి వధించి,ఆ హిరణ్యాక్షుడిచేత రసాతలానికి తొయ్యబడ్డ భూమిని, తన కోరలపై నిలబెట్టాడు.....

మూడవమారు, నారదుడను దేవరుషిగా బ్రహ్మమానసపుత్రుడై, సర్వకర్మనిర్మూలనము, సర్వపాపహారియగు వైష్ణవతంత్రాన్ని చెప్పి,మహతి అనే వీణను పూని నారాయణ కథాగానంతో లోకాల్ని పావనం చేశాడు......

నాల్గవపరి, నరనారాయణ రూపాలతో బదరికావనంలో దుష్క్రరమైన తపస్సొనరించాడు....

ఐదవ అవతారంలో, కర్దమ ప్రజాపతికి, స్వాయంభువమనువు రెండవపుత్రిక దేవహూతికి కపిలాచార్యుడుగా జన్మించాడు.....ఆ కపిలాచార్యుడు, దేవహూతికి పిండోత్పత్తిక్రమాన్ని ఉపదేశిస్తాడు....తత్త్వజ్ఞాన రూపమైన సాంఖ్యయోగాన్ని ఆసురి అనే బ్రాహ్మణునికి ఉపదేశిస్తాడు....

ఆరవ అవతారం దత్తాత్రేయుడు.....అనసూయాదేవియందు అత్రిమహామునికి జన్మించి, అలర్కుడు,ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యని బోధించాడు....

ఏడవరూపంలో, రుచి ప్రజాపతికి, స్వాయంభువమనువు పెద్ద కుమార్తె ఆకూతికి శ్రీయజ్ఞుడనే పేర జన్మించి, దివ్యమైన ప్రకాశంతో యామాది దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు....

ఎనిమిదవ అవతారం ఋషభుడు......ఈయననే ఉరుక్రముడనీ అంటారు......ఈయన మేరుదేవియందు నాభికి కలిగినవాడు....ఈ అవతారంలో ఆ మహావిష్ణువు సకల విద్ద్వజ్జనులకీ పరమహంస మార్గాన్ని బోధించాడు......

తొమ్మిదవదైన అవతారంలో, ఋషుల కోరికమీద పృథుచక్రవర్తిగా జన్మించి, భూమిని ధేనువుగా చేసి సకల ఓషధులనీ పిదికె.....

పదవది మత్స్యావతారం.....మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో,వేదాల్ని దొంగిలించిన సోమకుణ్ణి వధించి,సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావనెక్కించి, సప్తర్షులతో,సకల బీజాల్నీ,ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు.....ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వత మనువు......

పదకొండవదైన కూర్మావతారంలో, క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు...

పన్నెండవ అవతారం ధన్వంతరి.....క్షీరసాగరమథనంలో చివరిగా అమృత కలశహస్తుడై జన్మించి,దేవవైద్యుడై, సర్వ వైద్యవిద్యలకీ ఒజ్జయై విలసిల్లాడు...

పదమూడవది అసురులని మోహింపజేసి, సురలకి అమృతాహారాన్నందించి,పరమేశ్వరుణ్ణి సైతం మోహింపజేసిన జగన్మోహినీ అవతారం.....

పద్నాల్గవదైన ఉగ్రనరసింహరూపంతో, కనకకశిపుని వధించి,ప్రహ్లాదుణ్ణి రక్షించాడు....

పదిహేనవదైన కపటవామనావతారంతో బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు....

పదహారవది పరశురామావతారం....కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు....

పదిహేడవరూపంలో వ్యాసుడై, అల్పులైన మానవులని కరుణించ, వేదాల్ని విభజించి, అష్టాదశపురాణాల్ని రచించాడు....

పద్ధెనిమిదవ అవతారంలో శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు....

పందొమ్మిది,ఇరవై అవతారాలైన బలరామ,కృష్ణావతారాలతో భూమి భారాన్ని తగ్గించాడు....

కలియుగాదిలో రాక్షససమ్మోహనంకోసం, కీకటదేశంలో(మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్ధ్హుడనే పేర ప్రకాశిస్తాడు...అదే ఇరవై ఒకటవ అవతారం......

చివరగా కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు....సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు....." అని వివరించి సూతమహర్షి ఇంకా ఇలా అన్నాడు..

" అతిరహస్యంబైన హరిజన్మకథనంబు
మనుజుఁ డెవ్వఁడేని మాపురేపుఁ
జాలభక్తి తోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు."
(భాగ - ప్ర -౬౪)

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

భారతీ విద్యాపరిపూర్ణుడు శుకమహర్షి

సముఁడై యెవ్వఁడు ముక్తకర్మ చయుఁడై సన్న్యాసియై యొంటి బో

వ మహాభీతి నొహోకుమార యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టి భూ

తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.
(భాగ - ప్ర - ౫౩)ఆ శౌనకాది మహామునులు సూతమాహామునితో,ఇంకా ఇలా అంటున్నారు...."ఓ మునిశ్రేష్ఠా! కలియుగం సమీపిస్తోందని తెలిసి, ఆ కలిదోషహరణమైన శ్రీహరి కథలు వినాలని మా మనస్సుల్లో కలిగింది.అందుకే, మేమీ వైష్ణవక్షేత్రమైన నైమిశారణ్యంలో ఈ దీర్ఘమైన సత్రయాగాన్ని తలపెట్టాం.....దైవవశాత్తూ, సకల పురాణవ్రాతుడవైన నువ్వు మాకు కనిపించావు...ఆ గోవింద కథాసుధల్ని మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి స్వామీ!....".

అప్పుడు, ఆ రోమహర్షణుని పుత్రుడు, ఉగ్రశ్రవసుడనే పేర ప్రసిద్ధ్హుడై, సకల పురాణ వ్యాఖ్యాన వైఖరులన్నీ పుక్కిట బట్టిన ఆ సూతమహాముని, ఆ శుకబ్రహ్మని స్మరించి, వర్ణిస్తూ అన్నదీ పద్యం.....సర్వ వేదాంతాలకీ నిలయం ఈ పద్యం........

వ్యాసుడు భారతీవంశవివర్థనుడు.....ఈ మాట రాసినవారు తిక్కన్నగారొక్కరే! (మహాభారతంలో,భీష్మపర్వంలో సంజయుడు ధృతరాష్ట్ర్రుడికి భారతయుద్ధ్హం చెప్పబోతూ,వ్యాస మహర్షిని స్తోత్రం చేస్తూ,"ప్రాంశుఁబయోద నీలతనుభాసితు" అన్న పద్యం చెప్తాడు...అందులోది ఈ మాట.) ఇదొక ఆశ్చర్యమైన మాట.....భారతి అనగా సరస్వతి- ఆమె వంశాన్ని వృద్ధ్హిపొందించినవాడట! భారతి బ్రహ్మదేవుని భార్య.వారి సంతానం వసిష్ఠమహర్షి...ఆ సరస్వతీదేవి సర్వతేజస్సూ విద్యారూపంలో వసిష్ఠులవారికి సంక్రమించింది..ఆయన కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరుని కొడుకు వ్యాసుడు. అలా ఆ శారదాదేవి విజ్ఞానమంతా వ్యాసునికి పరంపరగా సంక్రమించింది.

ఆ విద్యని వ్యాసమహర్షి వృద్ధ్హిపొందించాడు.ఎలా?వేదాల్ని విభజించి,అష్టాదశ పురాణాలు విరచించి.... బ్రహ్మసూత్రాలు రాసి,భగవద్గీత రాసి....మహాభాగవతాన్ని మనకందించి.... ఆ భారతీవిద్యాసర్వస్వాన్ని, గ్రథనం చేసి వ్యాసమహర్షి వివర్థనం చేశాడు......ఆ వ్యాసుని కుమారుడైన శుకమహర్షియందు ఈ విద్య పండింది....ఆ శుకుడు భారతీ విద్యాపరిపూర్ణ స్వరూపుడు. అద్వైతమత పరమార్థమంతా మూర్తిదాల్చినవాడు....... ఉపనిషత్తుల అర్థమంతా బొమ్మకట్టినవాడు........తరువాత ఆ భారతీవిద్య మన శంకరాచార్యులవారితో భాష్యరూపం పొందింది......విద్యావివర్థునుడు మాత్రం వ్యాసమహర్షి.........భారతి - వసిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు - గౌడపాదాచార్యులవారు - గోవింద భగవత్పాదాచార్యుల వారు - శ్రీ శంకర భగవత్పాదులు - ఇదీ భారతీ వంశము..............

ఇక మన పద్యంలోకొస్తే........

సముఁడై------సమానుడై...సర్వభూతాలతో ఒక్కటైన వాడై.......అన్ని జీవరాసులందు ఆ మహా మహర్షి ఒక్కటిగానే వర్తిస్తున్నాడు.....

ముక్తకర్మ చయుఁడై------కర్మ సమూహాన్నంతటినీ వదిలిపెట్టినవాడై; విద్యకి, అవిద్యకి ఒక్కటే భేదం...... ఈ కర్మసంఘాత వాసన-అవిద్య........ఆ వాసన లవలేశం కూడా లేకపోవటమే విద్య........ వాసన ఉన్నవాడు - సంసారి....అది వదిలినవాడు - ముక్తుడు.......ఇది నిష్కృష్టమైన అర్థం. శుకమహర్షి అటువంటి ముక్తిని పొందినవాడు.....కాదుకాదు,పొందినవాడన్న మాట వ్యావహారికం....ఆయన అదే అయినవాడు....

సన్న్యాసియై------ సన్న్యాసము కలవాడై; ఆయన పుట్టుసన్న్యాసి.....కాదుకాదు, అసలాయనకి సన్న్యాసమే లేదు....లోకానికి సన్న్యాసిలాగా కనిపిస్తాడు......భాగవతంలో తరువాత ఒక సన్నివేశం వస్తుంది.......ఒకసారి దేవకన్యలు స్నానం చేస్తుంటారు..శుకమహర్షి పక్కగా వెళ్తుంటాడు, ఆయన వంటిమీద గోచీకూడా లేదట....కానీ ఆ అప్సరసలు గమనించీ పట్టించుకోరు, వాళ్ళ జలక్రీడల్లో మునిగిపోతారు......వెంట, శుకుణ్ణి పిలుస్తూ వ్యాసుడు వస్తుంటాడు....ఆయన్ని చూడగానే, ఆ దేవకన్యలు సిగ్గుపడి, గబగబా తమ చీరలు కప్పుకుని తప్పుకుంటారు......అదిచూసి, వ్యాసుడు ఆ దేవకన్యల్ని" నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు,పైగా నగ్నంగా ఉన్నాడు...అయినా ఆయన్ను చూసి మీరు సిగ్గుపడలేదు....కానీ నేను వస్త్రధారిని, పైగా వృద్ధ్హుణ్ణి. నన్ను చూసి సిగ్గుపడి మీరు చీరలు కప్పుకున్నారు. కారణమేంటి" అని అడుగుతాడు.....దానికి వాళ్ళు," ఓ వ్యాసమునీంద్రా! నీ కొడుక్కి ఈమె స్త్రీ, వీడు పురుషుడు అన్న భేదదృష్టి ఉండదు...ఆయన నిర్వికల్పుడు...కనుక ఆయనకి నీకు చాలా అంతరం ఉంది." అన్నార్ట........అలాంటి వాడు శుకుడు....

ఒంటి బోవన్------ఒక్కడే పోతుంటే; "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అన్న ఉపనిషదుక్తికి అర్థంగా ఉన్నాడట.....తానే బ్ర్హహ్మపదార్థం అన్న స్థితిని పొందినవాడని అర్థం....

అలా పోతున్న కుమారుణ్ణి వ్యాసుడు చూసి,
మహాభీతిన్------- మహాభయంతో; భయము అంటే సంసారంలో నిమగ్నమైపోయి వేరేది పట్టకపోవడం........భయమంటే వేరే ఒకటి ఏదో కాదు, అజ్ఞానమే!!!!

ఒహో కుమార! అనుచున్ వ్యాసుండు సీరంగ-----ఓ కుమారా అంటూ వ్యాసుడు పిలుస్తూ వెళుతుంటే....

వృక్షములుం దన్మయతం ప్రతిధ్వనులు సక్కంజేసె మున్ను------- చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా తన్మయత్వంతో ప్రతిధ్వనులు చేస్తున్నాయట!

అట్టి భూతమయున్------ ఈ రీతిగా శ్రీ శుకమహర్షి పంచభూతాల్లో లీనమయ్యాడు.......అసలు పంచభూతాలకి,ఆయనకి భేదమే లేకపోయింది.......

బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్------ మహా తపశ్శక్తి సంపన్నుడై, సర్వ మునులకీ కిరీటమణి వంటివాడైన ఆ బాదరాయణికి, ఆ శుకమహర్షికి.......

మ్రొక్కెద--------- శిరసువంచి మనసారా నమస్కరిస్తున్నాను..........

ఇది అద్వైతంలోని పరమరహస్యాలన్నీ చెప్తున్న పద్యం.......ఈ పద్యంలోని రహస్యాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నై....అసలు ఈ ఒక్క పద్యానికి ఉపనిషత్తులన్నీ వ్యాఖ్యానాలనాలి!!!!!!

22, ఫిబ్రవరి 2010, సోమవారం

అంత్యానుప్రాస చక్రవర్తి మన పోతన్నగారు


భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యు చిత్త భీషణములు హృ
త్తోషణములు గల్యాణ వి
శేషణములు హరి గుణోపచిత భాషణముల్.
(భాగ - ప్ర - ౪౪)మన పోతన్నగారు ముందు ఉపోద్ఘాతం పద్యాలయ్యాక, తన వంశ వర్ణనం చెప్తారు......తరువాత తన వేలుపుతండ్రి శ్రీ రామనారాయణునికి భాగవతాన్ని సమర్పిస్తున్నానంటూ, షష్ఠ్యంతాలు చెప్తారు......"హారికి నందగోకుల విహారికి","శీలికి నీతిశాలికి వశీకృతశూలికి","క్షంతకు కాళీయోరగ విశాల ఫణోపరినర్తన క్రియారంతకు","న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనస్స్థాయికి".......అంటూ చెప్తారు... అబ్బబ్బ.....ఏం పద్యాలు!..ఒక్కోటీ అంత్యానుప్రాసల అమృతగుళికలు.....తియ్యటి చక్కెర చిలకలు....

తర్వాత అద్భ్హుతమైన నైమిశారణ్య వర్ణన.........ఆ శ్రీవిష్ణుక్షేత్రమైన నైమిశంలో శౌనకాది మహామునులు హరిని చేరుకోవటానికి సత్రయాగం చేస్తున్నారట...ఆ యాగం సహస్రవర్షాలు అనుష్ఠానకాలం కలదట.....ఒకరోజు నిత్యహోమాదులైన తర్వాత మునులందరూ, సకల పురాణవ్రాతుడైన సూతమహాముని దగ్గరికొచ్చి మాకేవైనా నాలుగు మంచిమాటలు చెప్పమని అడిగార్ట......

అవికూడా ఎల్లాంటి మాటలయ్యా అంటే.......

భూషణములు వాణికిన్----సరస్వతికి నగలవ్వాలట,గొప్ప అలంకారాలుగా ఉండాలట....

అఘపేషణములు-------పాపాల్ని పిండిపిండి చేసెయ్యాలట!

మృత్యు చిత్త భీషణములు-----మృత్యువు యొక్క చిత్తానికి భయంగొలిపేవట, అంటే మనమా మాటలంటూంటే, మృత్యువు భయపడి పారిపోవాలట....దాని ఆలోచనా రూపాలైన రోగాలుకూడా దరిచేరకూడదట!

హృత్తోషణములు-------హృదయాన్ని సంతోషపెట్టునవి అంటే, మన మనసుని ఆనందపు జల్లుల్లో తడపాలన్నమాట!

కళ్యాణ విశేషణములు----శుభాలని విశేషంగా కల్పించేవట......

మరి ఇంతటి మహత్తు వేటికుందో కదా............
హరి గుణోపచిత భాషణముల్------అదీ! ఆ హరి, ఆ శ్రీమహావిష్ణువు గుణగణాలు కూర్చిన మాటలన్నమాట! (ఉపచిత-సమకూర్చబడిన)

మన పోతన్నగారి భాగవతంలో ఇలాంటి పద్యాలు చాలా ఉంటై....వీటిలో అంత్యప్రాసలు,యమకాలు సమకూర్చి ఉంటాయ్....ఒక మాటతో కందపద్యం మొదలు పెట్టటం, అలాంటి మాటలతోనే పద్యమంతా పూర్తచెయ్యటం...ఈరకమైన కందాన్ని వారే ప్రారంభించారు...వారే సమర్థించారు..వారే అక్కడ చక్రవర్తిగా ఏలారు....వట్టి చక్రవర్తి కాదు, ఏకఛ్ఛత్రాధిపత్యం వహించారు.......

ఇంకొకడు ఇలాంటి పద్యాలు వ్రాయలేడు...వ్రాసినా అంత అందంగా ఉండవు......ఇతర కవుల కొన్ని పద్యాల్ని అనుకరించవచ్చు.అనుకరిస్తే అనుకరించాడని తెలుస్తుంది......అనుకరణలో ఒక చమత్కారం ఉంది, అనుకరింపబడ్డవాడి లక్షణం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళా అనుకరించినవాడి లక్షణంకూడా కొంత కనిపిస్తూనే ఉంటుంది........కాని పోతన్నగారి ఇల్లాంటి పద్యాల్ని అనుకరిస్తే మనకు వాడు అనుకరించాడనే తెలియదు. పోతన్నగారి శక్తిలో వాడు మునిగిపోతాడు.అక్కడ వాడికి నామరూపాలుండవు.... పోతన్నగారే మనకి గోచరిస్తారు; పోతన్నగారి యిట్టి కందపద్యరచన అట్టిది.......ఆ పద్యం సర్వమూ పోతన్నగారి మయము..........

10, ఫిబ్రవరి 2010, బుధవారం

భాగవత కల్పవృక్షం


లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామమ్ము మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయన్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
(భాగ - ప్ర - ౨౦)

నా చిన్నప్పుడు,నాన్న క్షీరసాగరమథనం కథ చాలా అందంగా చెప్పేవారు....అందులో ఒక్కో వస్తువూ మెల్లగా రావడం మొదలెడతాయ్.....మొదట హాలాహలం వస్తుంది....దాన్ని మన శివయ్య తాగేస్తాడు....బైటే కాదు,శివుయ్య పొట్టలో కూడా మనలాంటి లోకాలుంటాయంట! అందుకని మన పార్వతీదేవి,శివుడి గొంతు గట్టిగా పట్టుకుని ఆ విషాన్ని అక్కడే ఆపేసిందట! అంతే మరి! నాన్నలకి మన మీద ప్రేమున్నా తొందరెక్కువ.....’అమ్మ’నే అన్నీ ఆలోచించి చేస్తుంది......సరే అది అయిపోయిందిగా! తర్వాత కల్పవృక్షం వచ్చిందట! అప్పుడు నేనున్నాగా అనుమానాల పుట్టని.....అడిగా..."నాన్నా!కల్పవృక్షమంటే ఏంటీ?" అని......"మన కోర్కెలన్నీ తీర్చేది" అని చెప్పాడు నాన్న......మనం ఒక్క అనుమానంతో ఆగం కదా! మళ్ళా అడిగా..."నాన్నా! మరి ఆ కల్పవృక్షం ఎలా ఉంటుంది? మన చెఱువొడ్డున జువ్విచెట్టుందే, అల్లా పెద్దగా ఉంటుందా!" అని.......అప్పుడు నాన్న నవ్వి ఈ పద్యం చెప్పి ,"కల్పవృక్షమంటే, మన భాగవతంలాంటిదన్నమాట!" అనేవారు....నేనేమో ఈ పద్యంలోలా కల్పవృక్షాన్ని,మన భాగవతంతో పోల్చుకుని తెగ ఊహించేసుకునేవాణ్ణి.........

ఇక మన పద్యంలోకొస్తే......

మన పోతన్నగారు భాగవత పురాణం యొక్క గొప్పదనాన్నంతా ఈ పద్యంలో చెప్తారు....భాగవతము కల్పవృక్షమల్లే చెప్పబడింది.......అంటే, వృక్షానికి ఉన్న లక్షణాలు, భాగవతానికి ఉన్న లక్షణాలు సరిపోల్చబడ్డాయన్నమాట......

భాగవతాఖ్య కల్పతరువు---- భాగవతపురాణమనే ఈ కల్పవృక్షం

ఉర్విన్----ఆ కల్పతరువు దేవలోకంలో ఉంటే, ఈ భాగవత కల్పవృక్షం మన భూలోకంలో వెలిసిందట, ఎందుకూ...

సద్ద్విజ శ్రేయమై---- మానవుల శ్రేయస్సుకోసమట...

వెలయన్-----ఆ భాగవతం ఎలా ఉందయ్యా అంటే...

లలితస్కంధము------- స్కంధము అంటే చెట్టుబోద; అంటే కల్పవృక్షం బోద అంత లలితంగా ఉందట!(మరీ అల్లా ఉంటే ఎల్లా! గట్టిగా గాలొస్తే పడిపోదూ! కాదులే,దేవతావృక్షం కదూ...ఏం అవదు)......మన భాగవతంలో కూడా పన్నెండు స్కంధాలున్నాయిగా! ఒక్కో స్కంధమూ మందార మకరందమూ,లలిత రసాల పల్లవమూ కదా! (భలే!మన భాగవతం పన్నెండు కల్పవృక్షాలతో సమానమన్నమాట!).

’కృష్ణ’మూలము-------- అంటే నల్లనివేళ్ళు కలది!(చాలా గట్టివేళ్ళన్నమాట!ఇంకెలా పడిపోతుందీ!).......భాగవతం కృష్ణుడు మూలమైన కథ కదా!

శుకాలాపాభిరామమ్ము----------శుకము అనగా చిలుక; ఆలాపము-మాట; అభిరామము-మనోహరము; అంటే, కల్పవృక్షం చిలకల కిల కిలలతో, మనోహరంగా ఉందట......మన భాగవతమంతా భారతీవిద్యాపరిపూర్ణుడైన శుకమహర్షి, పరీక్షిన్మ్గహారాజుకు ’సముడై’ సర్వోపనిషదర్థరూపంగా బోధించిన కథే కదా!

మంజులతా శోభితము-------- మంజు-మనోహరమైన; లతా-తీగల చేత; అందమైన తీగలు పాకి కల్పవృక్షం మహా మనోహరంగా ఉన్నదట!
మంజులతా----మనోహరత్వము చేత శోభితమైనది మన భాగవతం; భగవంతుని కథలు మనోహరములు కనుక......

సువర్ణ సుమనస్సుజ్ఞేయము------- సువర్ణ-బంగారు; సుమనః-పువ్వుల చేత; లేదా దేవతల చేత; సుజ్ఞేయము-చక్కగా తెలిసికొన దగినది.....అంటే, కల్పవృక్షానికి బంగారు వన్నెగల పువ్వులుంటాయన్నమాట! దాని కింద పసిడికాంతుల దేహాలతో దేవతలుంటారన్నమాట!
సువర్ణ--మంచి అక్షరాలు అనగా మంచి మాటలు; సుమనః--మంచి మనసు; సుజ్ఞేయము--తెలిసికొనదగినది.మన భాగవతం నిండుగా అన్నీ మంచి మాటలే,,,,మంచి మనసుతో అవన్నీ నేర్చుకోవలసిందే...

సుందరోజ్వల వృత్తంబు------- అందమైన ప్రకాశించుచున్న వృత్తము కలది......కల్పవృక్షం గొగ్గిరి,గొగ్గిరిగా కాకుండా చక్కగా గుండ్రంగా,నున్నగా ప్రకాశిస్తోందట......మన భాగవతం నిండా కూడా ఉత్పలమాల,చంపకమాల,శార్దూలం,మత్తేభం మొదలైన ఎన్నో అందమైన వృత్తాలతో పద్యాలున్నాయిగా! అవి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాయి..

విమల వ్యాసాలవాలంబు------ అలా ఆ కల్పవృక్షం ప్రతి భాగమూ చాలా అందంగా ఉన్నదట! మన భాగవతాన్ని మొదట వ్యాసమహర్షి ఎంతో అందంగా చెప్పాడు కదా!

మహా ఫలంబు--------- కల్పవృక్షం అన్ని కోరికలూ తీరుస్తుంది.....భాగవతం కూడా చదివినవారికీ,విన్నవారికీ సర్వవాంఛలనూ సమకూరుస్తుంది......

”సర్వేజనాస్సుఖినోభవంతు”

4, ఫిబ్రవరి 2010, గురువారం

కలుగనేటికి తల్లుల కడుపుచేటు


చేతులారంగ శివుని పూజింపఁడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని

దయయు సత్యంబులోనుఁగాఁ దలపఁడేనిఁ

గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.
(భాగ - ప్ర - ౧౨)


నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పద్యం ఇది. ఇలాంటి పద్యాలు మన వాళ్ళకు చిన్నతనంలోనే నేర్పితే,ఆ భావాలు వాళ్ళ మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి...మన సంస్కృతి బీజాలు వాళ్ళ మనసుల్లో మొలకెత్తి, పెరిగి, శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి.....మహావృక్షాలుగా కలకాలం నిలిచి ఉంటాయి...

చేతులారంగ శివుని పూజింపడేఁని నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేఁని---- నాన్న ఈ పద్యం చెప్పేప్పుడు చాలామందిలానే నాకూ ఓ అనుమానం వచ్చేది.అడిగేవాణ్ణి."నాన్నా! అంటే, చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరు నొప్పుట్టేట్లు హరినామసంకీర్తనం చెయ్యాలన్నమాట! అంతేగా! ఏం శివుణ్ణి కీర్తించి, విష్ణువుని పూజించకూడదా!". దానికి నాన్న "అలా ఏంకాదు...శివకేశవులిద్దరూ ఒకటే....అభేదప్రతిపత్తి....అసలు ఏ దేవుడికైనా ఇలానే చెయ్యాలి." అని చెప్పేవారు.....ఇక్కడ చేతులారా అంటే, వఠ్ఠి చేతులతో అని కాదు...మనసారా అని.....ఏ భావమైనా మనసు నిండుగా కలిగితేనే, ఆ పని చేతులు కూడా మెండుగా చేస్తాయి....(కాని కొంతమంది ఉంటారు,పక్కవాడు చూస్తున్నాడు కదా అని, మరీ బారలేసి చేస్తుంటారు...అలా కాకుండా,మనసారా పూజించమని మన పోతయ్య గారి భావం.).....
ఇక నోరునొవ్వంగ అంటే, మనం ఎక్కడ ఉన్నా,ఎంతమందిలో ఉన్నా ఎటువంటి అంతర్గతమైన అడ్డుగోడలు లేకుండా నామకీర్తనం చెయ్యాలి...చిన్నప్పుడు ఇంట్లో పూజలోనైనా, దేవాలయానికెళ్ళినా నాన్న ఏదో ఒక స్తోత్రమో,గోవిందనామమో పెద్దగా చదివేవాళ్ళు...నేను ఒకసారి,"నాన్నా!ఎందుకంత పెద్దగా చదువుతారు,చుట్టూ అందరూ మిమ్మల్నే చూస్తున్నారు!ఏమన్నా అనుకుంటారు, బాగుండదు."అన్నా...దానికి నాన్న ఈ పద్యం చెప్పి"ఎవరో ఏదో అనుకుంటారని చదవకపోతే, దేవుడు ఏమన్నా అనుకోడూ....పైగా, మనం పెద్దగా చదివితే ముందు వింతగా చూసినా, కాసేపటికి వాళ్ళల్లో కూడా భక్తిభావం పెరుగుతుంది."అన్నారు...అంతే నేను కూడా అన్ని అంతరాలూ వదిలేసి నాన్నతో గొంతు కలిపా..అంతే! వెంటనే మా చుట్టుపక్కలంతా కూడా "గోవింద"నామం మారుమోగింది...(ఒకసారి దుర్గగుళ్ళో,దసరాలప్పుడు క్యూ చాలా పెద్దగా ఉంది..నేను వరసగా నాకొచ్చిన స్తోత్రాలన్నీ గొంతంతా విప్పి, మైమరిచి చదువుకుంటున్నా..దర్శనం అయ్యి వచ్చేప్పుడు ఒకావిడ పిలిచి,"బాబూ!మేం ఎప్పుడు క్యూలో నుంచున్నా ఏదో ఒక సోది కబుర్లు చెప్పుకున్నేవాళ్ళం..కాని ఇవాళ,దర్శనం అయ్యేవరకు మనసు అసలు పక్క విషయాల మీదకు వెళ్ళలేదు" అంది.)....ఇంకా కొంతమంది అంటుంటారు..మనసులో అనుకుంటే చాలదా అని....అసలు ఆ అంతఃకరణ శుధ్ధ్హి కోసమే, ఈ నామ కీర్తనమూ, నవవిధభక్తిక్రమమూ....

దయయు సత్యంబులోనుఁగాఁ దలపఁడేఁనిఁ----దయ,సత్యం మనసు అంతరాల్లోంచి పుట్టుకురావాలి కానీ, పేరుప్రతిష్ఠల కోసం పైపై మెరుగులు మెరిపించకూడదు.....

కలుగ నేటికి తల్లుల కడుపుచేటు----అసలు ఈ పద్యం అర్థమంతా ఇందులోనే ఉంది....ఈ పద్యం నోటికి రానివాడు ఆంధ్రభారతీయుడు కాదు..దానంతటదే నోటికొస్తుంది.రాకుండా ఎలా ఉంటుంది?అది రాకుండా నువ్వు నీ నోటికొక తాళం వేసుకొంటే రాదేమో! ఎంత తాళం వేసుకున్నా తెరవొచ్చుకదా! కొన్ని తాళాలు సురక్షితంగా ఉంటయ్.అంటే వాటికి వేరే తాళంచెవి పట్టదు....ఎంత చిక్కుతాళమైనా గజదొంగలుంటారు..మనదేశంలో లేకపోయినా పాశ్ఛాత్యదేశాల్లో ఉంటారు.ఇప్పుడు మనవాళ్ళు కూడా వాళ్ళదగ్గర్నుండి అన్ని విద్యలూ సంపాదించుకున్నారు గనుక ఆ తాళంచెవులు కూడా సంపాదిస్తారేమో!

అసలు ఈ తాళాలు విలక్షణమైనవి.బయట చేసినవి కాదు.లోపల చేసినవే. అంటే వాడు నాస్తికుడై, ఇలాంటి పద్యాలు నేను చదవనని ప్రతిజ్ఞపూనటం..శివుడు,విష్ణువు భగవంతుని రూపాలు కాదనటం..అసలు భగవంతుడే లేడనటం.....తాళం వాడే చేశాడు, వాడే బిగించుకున్నాడు, చెవి వాడిదగ్గరే ఉంది...అల్లాంటి వారిని గురించి పోతన్నగారంటున్నారు,"కలుగనేటికి తల్లుల కడుపుచేటు"అని! ఆ మహానుభావుణ్ణి ఆ తల్లి తొమ్మిదినెలలు మోసింది....ప్రసూతిబాధ పడ్డది..వాడికి నానా చాకిరీ చేసింది..చివరకు వీడు సిద్ధ్హమైనాడు!!!

కాదయ్యా వీడు గొప్ప ఉద్యోగం చేశాడు,గొప్ప ప్రచారం చేశాడు,ఒక మంత్రి, ఒక కవి, ఒక కలెక్టరు, ఒక పత్రికాధిపతి, లోకాన్ని ఊగించి పడేశాడంటారేమో!నిజమే కావచ్చు.అనంతదేశాలలో,అనంతకాలంలో ఇలాంటి పనులు చేసినవాళ్ళు అంత సంఖ్య ఉన్నారు.ప్రయోజనమేముంది! చివరకు చనిపోయారు.అయితే శివపూజ చేసినవాడు,హరిభజన చేసినవాడు చావకుండా మిగిలారా అనేది ప్రశ్న? వాళ్ళూ పోయారు....చచ్చి ఉత్తమజన్మలు పొందారు....."అమ్మలగన్నయమ్మ" పద్యానికి రాసిన వ్యాఖ్యానం ఇక్కడ సంధించుకోవచ్చు,,,

ఈ పంచభూతాలు వేఱు, ఆ జీవుడు వేఱు...ఆ భక్తులు జీవలక్షణానికి సంబంధించినవారు. వీళ్ళు వట్టి మట్టిపదర్థానికి సంబంధించినవారు...అందువల్ల వీళ్ళు తల్లుల కడుపుచేటు. అంటే ఈ మట్టిలోకి(పంచభూతాత్మకమైన శరీరంలోకి) జీవుడు ప్రవేశించి సత్క్యార్యాలు చేస్తే మట్టికి చరితార్థం...ఆ మట్టిలో మళ్ళా మన్నే ప్రవేశిస్తే రెట్టింపు బరువు....తల్లుల కడుపుచేటంటే అర్థం ఇది...జీవుడు వెలుతురు,అగ్ని,ప్రకాశం. అది ప్రవేశించిన మట్టిపాత్ర తేలిపోతుంటుంది..అందులోనూ కొంత ఆకాశముంది.ఆ మట్టిపాత్ర తేలిక...కాని ఇలాంటి నాస్తిక జీవుడు ప్రవేశించిన పాత్ర, అసలది పాత్ర కాదు, వఠ్ఠి మట్టిముద్ద, లేకపోతే మన్నుతో నింపిన కుండ.........ఆ కుండ పదిరెట్లు బరువు...తల్లుల కడుపుచేటు కాదా!!!!

28, జనవరి 2010, గురువారం

అమ్మలగన్నయమ్మఅమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
(భాగ -ప్ర -౮)

ఇది దుర్గాదేవి స్తోత్రం...."అమ్మ" అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన పోతన్న గారి అసమాన ప్రతిభ....భక్తుడికీ,భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి పిలుపు....,"దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా,ప్రేమగా పిలుచుకునే భావనని,భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు నా శతకోటి వందనాలు......ఈ పద్యం రాసిందెవరో తెలియకపోయినా కూడా ఎప్పుడోకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడుండనుకుంటా.....నా నిత్యపూజలో ఎన్ని స్తోత్రాలు చదివినా,ఎన్ని మంత్రాలు జపించినా,,’అమ్మ’పూజ మొదలెట్టేది మాత్రం ఈ తియ్యటి పిలుపుతోనే..ఈ మహామంత్రంతోనే....

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ------ అసలు స్త్రీ దేవతలంతా దుర్గనుండే పుట్టారట!! లక్ష్మీ,సరస్వతీ,పార్వతులు..చిట్టచివరకు గంగానమ్మ వరకు గూడా దుర్గమ్మ అంశతో పుట్టినవారేనట!! అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింపబడ్డది........ పురుష లక్షణంకల దేవతలందఱు విష్ణువునుండి గాని,శివుడినుండి గాని పుట్టినట్టు చెప్పబడరు.... కాని కాళీ,దుర్గ,లలిత,మహేశ్వరి,పార్వతి,లక్ష్మి,సరస్వతి మొదలైన దేవతలు..వారాహి,చండీ,బగళా మొదలైన మాతలు....రేణుక ఇత్యాది శక్తులు...చివరకు గ్రామదేవతలు కూడా శ్రీమహాదుర్గా దేవతాంశసంభూతులుగా చెప్పబడతారు...దీనికి కారణమేంటి?
ఏంటంటే...
ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది....పురుషుడు ప్రాణదాత, స్త్రీ శరీరదాత్రి.....అసలు ఈ కార్యకారణ సంఘాతమంతా పంచభూతాలనుండి పుడుతోంది.....చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు..............కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం...అంతా ఒక ముద్ద...ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహారమై, పంచేంద్రియ లక్షణ భూతమై పుడుతోంది....(పంచభూతాలంటే భూమి,గాలి,నీరు,అగ్ని,ఆకాశం....పంచేంద్రియాలంటే ప్రపంచాన్ని చూసే కళ్ళు, రకరకాల వాసనలు పీల్చే ముక్కు, ప్రతి పదార్థం రుచినీ తెలిపే నాలుక, ఈ సృష్టిలో శబ్దాలన్నిటినీ వినిపించే చెవులు, స్పర్శని తెలియజేసే చర్మం...ఈ ఐదిటివల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి)............కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటోంది...అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది.....బహుజీవులుగా పుడుతోంది, చస్తోంది,,మళ్ళాజన్మిస్తోంది.............కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు.అది సర్వదా ఒక్కటే శక్తి.......రూపాన్ని బట్టి, దేశకాల పరిస్థితులని బట్టీ భిన్నమౌతుందే కాని,,,, చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మనిబట్టి మారదు......అదే మహాశక్తి.....ఆమే దుర్గ....

చాల పెద్దమ్మ-------- ఆమె సనాతని....ఇప్పటిదికాదు....ఎప్పటిదో......ఈ సృష్టి ఉన్నప్పుడూ,లేనప్పుడూ ఆమే ఉంది..

సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ ---------- నాకు మొదట్నుంచీ ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చదివితే ఓ లాగా అనిపిస్తాయి......కలిపి చదివితే---- సురారులు అంటే రాక్షసులు..వారి తల్లి దితి...వీళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు,బాధ....మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది మన అమ్మలగన్నయమ్మ(ఆఱడి అంటే గాయం,బాధ....పుచ్చుట అంటే మాన్పటం).............
విడదీసి చదివితే------సురారులమ్మ----ఆ తల్లి దేవతలకే కాదు,రాక్షసులకీ తల్లే....మంచివాళ్ళకీ,చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా!!.....కడుపాఱడి పుచ్చినయమ్మ----మనకి ఏ బాధ వచ్చినా,కష్టమొచ్చినా తీర్చేది ఆ అమ్మేకదా (శ్యామశాస్త్రుల వారి కడుపు బాధ కూడా)...

తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ----- వేల్పుటమ్మల అంటే సర్వదేవతామూర్తులయందు నిలిచిఉండెడిదని.....తనని లోనుగా తలచిన వారికి మనసులోనే నిలిచిఉంటుందని అర్థం.....

కృపాబ్ధియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్------అలాంటి అమ్మవు, మాయమ్మవు, సముద్రమంత కృపతో మాకు సర్వసంపదల్నీ (అంటే ధనమే కాదు,విద్యనీ,కవితా శక్తినీ,ఆయురారోగ్యాల్నీ) ప్రసాదించు తల్లీ!!!


21, జనవరి 2010, గురువారం

కవితా సరస్వతి కన్నీళ్ళు తుడిచిన మన పోతన్నగారు
మా చిన్నప్పుడు, రాత్రిపూట భోజనాలయ్యాక నాన్నగారు పిల్లలందర్నీ ఆరుబయట వెన్నెట్లో కూర్చోబెట్టుకుని,మన పురాణాల్లో కథలు చెప్పేవారు...వట్టి కథలు కాదండోయ్...పద్యాలతో సహా చెప్పేవారు..అందుకే ఆ పద్యాలన్నీ మా బుఱ్ఱల్లోకి తేలిగ్గా ఎక్కేవి...ఓ రోజు నేను "నాన్నా!పోతన్నగారు,ఇన్ని మంచి మంచి కథలు, పద్యాలతో సహా రాశారు కదా!అసలు ఆ పోతన్నగారి కథేంటో చెప్పవూ" అని అడిగా.(అప్పటికి నేను భక్తపోతన సినిమా చూళ్ళేదు)....నాన్న పోతన్నగారి కథంతా చెప్పి పడుకోబెట్టారు....నా మనసులో ఆ కథే తిరుగుతూ ఉంది....ముఖ్యంగా సరస్వతీదేవి పోతన్నగారి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునే సన్నివేశం.....అది గుర్తొస్తుంటే మనసుకు ఏదో తెలియని ఉద్వేగం......లోకంలో ఎక్కడన్నా భక్తుడు వెళ్ళి భగవంతుడితో తన బాధలన్నీ చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు......కానీ ఇక్కడ దేవుడే వచ్చి పోతన్నగారి దగ్గర బాధచెప్పుకున్నాడు....నిజంగా అంత అదృష్టం ఒక్క పోతన్నగారికే దక్కిందేమో....

అసలు పోతన్నగారి దగ్గరికి వచ్చి సరస్వతమ్మ ఏమని బాధపడిందంటే,....."ఏవయ్యా పోతన్నా!లోకంలో కవులందరూ,వాళ్ళ నాలుకల చివర నేను కూర్చుని పలుకుతుంటే, నన్ను,కవితాసరస్వతిని తీసుకెళ్ళి ఈ రాజులకీ,రమణప్పలకీ అమ్మేసి, వాళ్ళిచ్చే కానుకలతో ఆనందిస్తున్నారు.......నువ్వేదో భాగవతాన్ని రాముడికిచ్చి నన్ను సంతోషపెడతావనుకుంటే, నువ్వు కూడా వాళ్ళూ,వీళ్ళూ బలవంతపెట్టారనో, నీకేదో ఇబ్బందులొచ్చాయనో నన్ను ఆ దుష్టరాజులకిచ్చేస్తావా ఏంటి!.....ముందుకంటే ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ దుఃఖంగా ఉందయ్యా...." అందట..

అప్పుడు మన పోతన్నగారు ఏమన్నారంటే,

"కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల!యో మదంబ! యో
హాటకగర్భురాణి!నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ
! "

అప్పుడు సరస్వతీదేవి ఆనందపడి,పోతన్నగారిని ఆశీర్వదించి వెళ్ళిపోయిందట!

తర్వాత తనదగ్గరికి వచ్చి,భాగవతాన్ని రాజుకు అంకితం ఇవ్వమన్నవాళ్ళతో పోతన్నగారు ఇల్లా అన్నారట!

"ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరమువాసి కాలుచే
సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్."


సమ్మతి శ్రీహరి కిచ్చి----నేను భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాను.....నరాంకితం చెయ్యనని ప్రతిజ్ఞ పట్టాను...రాజులకైతే అసలే ఇవ్వను... అసలు రాజులకెందుకివ్వాలి?
పురంబులు వాహనంబులున్ సొమ్ములు----అగ్రహారాలిస్తారని, గుఱ్ఱాలు,నగలు ఇస్తారని....నాకవి అక్కర్లేదు.....దాని దుంపతెగిరితే! వాళ్ళకిస్తే నీకేం నష్టం.....వాళ్ళిచ్చేవి నువ్వు వాడుకోవద్దు....నీ కొడుకులు వాడుకొంటారు.....ఐనాకూడా ఇవ్వనంటావా! ఏం? ఎందుచేత?

ఇ+మనుజేశ్వరాధముల కిచ్చి--------వాళ్ళు పేరుకి మనుజేశ్వరులే కాని వట్టి అధములు..అంటే పాపులు, దుర్జనులు, జారులు, మనుషుల్ని పీడించుకుతింటారు...అధికారంకోసం దుష్టపు పనులెన్నైనా చేస్తారు...వాళ్ళకిస్తే పాపం....అందుకే ఇవ్వను...పైగా వాళ్ళకంకితమిచ్చాననుకోండి, వాళ్ళకు స్వర్గసుఖాలొస్తాయ్...వాళ్ళు నిజంగా దాతలు కారు, నేను వాళ్ళని దాతల్లాగా కనిపించేట్లు చేస్తాను........వాళ్ళ కీర్తి ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండి పోతుంది...వాళ్ళు అన్నాళ్ళూ స్వర్గంలో ఉంటారు.....దాని వల్ల నాకు వచ్చే ఫలితమేంటి?

శరీరము వాసి కాలుచే సమ్మెట పోటులంబడక-------నేను మామూలు జీవుణ్ణి..నాకు కామ,క్రోధాలుంటాయ్...నేనూ కొన్ని పాపాలు చేస్తాను,వాటి వల్ల నరకానికి పోతాను...అవి చాలవన్నట్లు, యముడు(కాలుడంటే యముడు) "పాపులైన రాజులకి నువ్వు మహాభాగవతాన్ని అంకితమిచ్చి, వాళ్ళు స్వర్గంలో ఉండేట్లు చేశావ్" అని నన్ను ఇంకా సమ్మెట పెట్లు పెడతాడు......దారిన పోవు తద్దినమా మాయింటికి రమ్మన్నట్టు- నేను చేసే కర్మప్రకారం నాకొచ్చే ధనం చాలనట్టు,ఈ కొత్త యమబాధలు కొని తెచ్చుకోవడమెందుకు?
అయితే, నువ్వు కావ్యం రాస్తున్నావు.దానివల్ల కొంత పుణ్యం వస్తుంది కదా! ఆ పుణ్యమంతా నువ్వే తీసుకుంటావా? నువ్వు చూస్తుంటే మంచివాడిలా ఉన్నావు....ఆ పుణ్యాన్ని కొంతమందికి పంచిపెట్టొచ్చు కదా! ఆ రామచంద్రుడేంచేసుకుంటాడూ! ఎవరికన్నా నువ్వు మంచివాడనుకున్నవాడికి అంకితమిచ్చి,వాడికి స్వర్గసుఖం చేర్చిపెట్టొచ్చు కదా!అదీ నీకు పుణ్యమే కదా! అంటే అలా కాదు. మరి ఎలా?

జగద్ధితంబుగన్----- నేను భాగవతం లోకహితం కోరి రాస్తున్నాను..ఈ పుణ్యం లోకానికి పంచిపెడ్తాను....ఆ పుణ్యం నేనే తీసుకుంటే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. అదే శ్రీరామచంద్రుడికి ఈ భాగవతాన్నిస్తే, ఈ లోకానికిచ్చినట్టు....ఈ లోకానికిస్తే వాళ్ళు దీనిని చదువుతారు...ఊరికే చదవరు,చింతన చేస్తారు(ఆలోచిస్తారు), భక్తులవుతారు. ఆ పుణ్యం వేలాది పిల్లల్ని పెడుతుంది.........నాతో పాటు లక్షలాదిమంది పుణ్యవంతులవుతారు....అదీ నా ఆకాంక్ష..
ఆహా!అదన్నమాట కారణం....నువ్వు అలా అంటే మేమింకేమంటాం.....మాదీ అదే మాట.......
"లోకాః సమస్తాస్సుఖినోభవంతు"