ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

12, జులై 2010, సోమవారం

నారదుని పూర్వజన్మ వృత్తాంతము





























సీ. విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును
లేదు విశ్వమునకు
భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీ ముఖమున
నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము కావున హరిపరాక్రమములెల్ల

ఆ. వినుతిసేయు మీవు వినికియుఁ జదువును
దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమికెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

నారద మహర్షి వ్యాకులతతో ఉన్న వ్యాసునితో ఇంకా ఇల్లా చెప్పసాగాడు......"మునీంద్రా! ఈ విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువే. ఆతనికి మించినది,వేరైనది ఏదీ ఈ విశ్వాంతరాళంలో లేదు.సర్వ సృష్టి,స్థితి,వృద్ధి,లయాలన్నీ ఆ పరమేశ్వరుని వలననే జరుగునని నీకు తెలిసిన విషయమే కదా! నీవు ఈ లోకకళ్యాణానికై విష్ణ్వంశతో జన్మించినాడవు..కావున ఆ హరి లీలలన్నిటినీ భాగవత కథారూపాన లోకానికి వివరించు..ఆ కమలనాభుని కీర్తించగలిగినప్పుడే కదా సర్వ రూపమైన తపస్సులూ,సర్వమైన సంపదలూ సఫలాలౌతాయి!

మహాత్మా! నేను నా పూర్వజన్మలో(ఇంతకు ముందు కల్పాన) సదాచారులైన వేదవాదుల ఇంటి దాసికి జన్మించాను. వాళ్ళు,నా చిన్నతనంలో ఒక వానాకాలంలో, చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకచోట నిలిచి ఉండే యోగులకు పరిచర్య చేయటానికి నన్ను నియమించారు.(చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి-శయనైకాదశి తో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది.ఈ నాల్గునెలలూ నిత్య సంచారులైన యోగులు ఒక్కచోట కదలకుండా ఉండి ఆ నారాయణున్ని అర్చిస్తారు.) నేను నేర్పుగా,ఓర్పుగా అన్ని పనులు చేస్తూ, అందరు బాలురవలే ఆటలకు వెళ్ళక, ఏ ఇతర జంజాటాలు లేకుండా భక్తితో వారిని సేవించాను. వారు మిగిల్చిన ఎంగిలి శుభంగా భావించి భుజిస్తూ,ఎండ వానల్ని లెక్కచేయకుండా వారిని వర్షాకాల,శరత్కాలాలు సేవించాను.వాళ్ళు విష్ణుచరితలు చదువుతూ,పాడుతూ ఉంటే, అవి నా చెవులకు అమృతంలా అనిపించేవి.మనసుకు అపరిమితమైన ఆనందం కలిగేది.దానితో నేను కూడా హరినామకీర్తనం చెయ్యటం మొదలెట్టాను.అలా ఆ మహాజనులవల్ల నాలో రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’ కలిగింది.....

కొంతకాలానికి వారి చాతుర్మాస్య వ్రతం ముగిసి, ఆ యోగులు తిరిగి దేశాటనానికి బయల్దేరారు...అంతట వారు, ఎటువంటి అపచారం లేకుండా భక్తితో నిత్యపరిచర్య చేసిన నన్ను పిలిచి, పరమ ప్రీతితో,కరుణతో నాకు అతిరహస్యమైన ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశం వల్ల ఆ వాసుదేవుని సర్వ మాయావిలాసాన్ని తెలుసుకున్నాను. ఏ పదార్థం వలనైతే వ్యాధి వస్తుందో, ఆ వ్యాధి మాన్చటానికి అదే పదార్థం ఎలా పనికిరాదో, అలానే సంసారహేతుకమైన కర్మలు ఈశ్వర సన్నిధానానికి ప్రతిబంధకాలుగా మారతాయి.వాటిని ఈశ్వరార్పితంగా భావించి ఆచరించాలి. అప్పుడు భక్తియోగం కలుగుతుంది. ప్రణవ సహితంగా వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అనే ఈ నాలుగు నామాల్ని భక్తి పూర్వకంగా పలికి, నమస్కారం చేసి, మంత్రమూర్తియైన ఆ యజ్ఞపురుషుని పూజించిన వాడు సమ్యగ్దర్శనుడౌతాడు.నేను ఆ విధంగా చేయగా, ఆ హరి సంతసించి తనయందలి పరమేశ్వర జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.నా తల్లి మా యజమానుల ఇంట భక్తితో పనులన్నీ చేసి, నావద్దకు రేపు మాపు వచ్చి నేను అలసితినని, ఆకొంటినని నాకు అన్నమిడి, నన్ను ముద్దాడి, చుంచు దువ్వి, నన్ను కౌగిలించుకుని ప్రేమగా ఒళ్ళంతా నిమిరెడిది. ఒకనాటి రాత్రి, నా తల్లి పాలు పితకటానికి వెళ్ళ్గి చీకటిలో చూడక పాముతోక తొక్కగా,అది వెంటనే నా తల్లిని కరిచింది. ఆ విషప్రభావాన నా తల్లి విగతజీవియై వెంటనే నేలకూలింది.అది చూచి నేను మోహం పొందక, సంసారబంధాలు తొలగిపోయాయని భావించి,విష్ణుపద ధ్యానంమీద బుద్ధి నిలిపి ఇల్లు వదిలి ఉత్తరాభిముఖంగా బయలుదేరాను.అలా బయలుదేరి, పట్టణాలు,జనపదాలు,పల్లెలు,నదులు,పర్వతాలు,అడవులు దాటి సర్వజంతు వాసితమైన ఒక భీకరారణ్యం ప్రవేశించాను.అక్కడ ఒక సరస్సులో స్నానమాడి, శుచినై, ఒక రావిచెట్టు క్రింద కూర్చుని, నేను విన్న విధంగా నా హృదయగతుడైన ఆ పరమాత్మని,హరిని చింతించాను.అలా ధ్యాననిమగ్నుడనైన నాకు, ఆనందాశ్రువులు రాలగా, రోమాంచం కలుగుతుండగా, నా తలపులో ఆ దేవదేవుడు కనిపించినట్లైంది.కాని ఆ హరి దివ్యరూపం నా కన్నులకు కనపడలేదు.ఆ హరికోసం శోకిస్తూ, నేను ఆ వనం అంతా కలియతిరుగుతుండగా, నన్నుద్దేశించి ఆ హరి మృదు మధుర స్వరంతో ఇలాపలికాడు."కుమారా!దుఃఖించకు.ఈ జన్మలో నన్ను చూడలేవు. నీవు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట, నా భక్తుడవై జన్మిస్తావు.ఈ సృష్టి లయం జరిగి, పునఃసృష్టి జరిగినప్పుడు నా కృపతో జన్మించి, శుద్ధసత్వులందరిలోకి అగ్రగణ్యుడవై వర్ధిల్లుతావు."

అలా ఆ అశరీరవాణి పలుకగా, నేను తలవంచి నమస్కరించితిని. కామక్రోధాదులైన అరిషడ్వర్గాన్ని వర్జించి, ఆ అనంతుని నామాలు పఠిస్తూ,విషయవిరక్తుణ్ణై, కాలానికై ఎదురుచూస్తూ తిరుగుతూ ఉండగా కొంతకాలానికి మెఱుపు మెఱిసినట్టు మృత్యువు రాగా,ఈ పాంచభౌతికదేహాన్ని విడిచి, ఆ శ్రీహరి కృపవల్ల శుద్ధసత్వమయమైన భాగవత దేహాన్ని పొందాను.అంత ముల్లోకాల్నీ లయంచేసి, ఆ ప్రళయకాల జలరాశిమధ్య శయనించి ఉన్న నారాయణమూర్తి యొక్క నాభికమలగతుడై శయనించబోతున్న బ్రహ్మ నిశ్వాస వెంట ఆతని లోనికి ప్రవేశించాను.తరువాత వెయ్యి యుగాల కాలం గడిచిన తర్వాత నిద్రలేచి, లోకాల్ని సృష్టించడానికి ఉపక్రమిస్తున్న ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాస వెంట నేను, మరీచి మొదలైన మునులు జన్మించాము. అప్పుడు నేను అఖండమైన బ్రహ్మచర్యాన్ని పూని, ఈశ్వరదత్తమై,బ్రహ్మనుంచి పుట్టిన సప్తస్వరాలని తనంతట తానుగా మోగించే ఈ మహతి(అనే వీణ)ని పూని, ఈ ముల్లోకాలలో ఆ నారాయణుని అనుగ్రహంతో ఏ అడ్డంకి లేకుండా, నారాయణ కథాగానం చేస్తూ చరిస్తూ ఉన్నాను.అంత ఆ మహావిష్ణువు పిలిచిన పలికే వాని లాగా నా మనసులో నిత్యం దర్శనమిస్తుంటాడు.మునీంద్రా!ఈ సంసారమనే సాగరంలో మునిగి, కర్మ వాంఛలచేత వేదన పడేవారికి, ఆ శ్రీహరి నామకీర్తనం తెప్పలాంటిది.అందువల్ల ఆ హరికథామృతాన్ని ప్రవచించి లోకాల్ని పావనం చెయ్యి." అని చెప్పి నారదుడు వ్యాసుని వద్ద వీడ్కోలు తీసుకుని వీణానాదం చేస్తూ ఆకాశమార్గాన వెళ్ళాడు అని సూత మహర్షి చెప్పి ఇలా అన్నాడు.

"వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుంద గీతములు జగములకున్
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే! "

లోకాఃసమస్తాస్సుఖినో భవంతు.

9 కామెంట్‌లు:

  1. ఒక స్నేహితురాలి దగ్గర నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం విన్నాను. మీరు మరింత వివరం గా చెప్పారు. ధన్యవాదాలు.

    కల్పన

    రిప్లయితొలగించండి
  2. రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’, ఈశ్వరజ్ఞానం, పరమేశ్వరజ్ఞానం పట్ల అవగాహన కలిగేలా చక్కగా రాసారు. మరీచి ముని గురించి కూడా వీలు వెంబడి తెలుపగలరు. రాజయోగ ధ్యాన పద్దతిలో సాధన చేత గోచరమయ్యే సిద్దపురుషుల్లో నారదులవారిది తొలిస్థానమని చదివాను. అంత భాగ్యరేఖ ఇంకా కలుగపోయినా ఆ మహర్షి సులభసాధ్యుడేనని నా నమ్మకం. మీ ప్రయత్నానికి నెనర్లు.

    రిప్లయితొలగించండి
  3. నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం నేను ఇప్పటి దాకా వినలేనేదు... చాలా మందికి తెలియని ఇలాంటి విశేషాలను రాస్తూ ఉండండి....

    రిప్లయితొలగించండి
  4. భక్తి మార్గ ఆచార్యుడైన నారదులవారి దివ్యచరితం చాలాబాగా వర్ణించారు .ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. "నార" అంటే జ్ఞానము, "ద" అంటే ఇచ్చువాడు అని అర్థం. అటువంటి నారద ముని వంటి భాగవతోత్తముని వృత్తాంతము తెలుసుకోవడం పూర్వజన్మ సుకృతము గా భావించాలి. అందరితో పంచుకొన్నందుకు మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  6. @కల్పన గారు,@రవిచంద్ర,@దుర్గేశ్వర గారు
    ధన్యవాదాలు
    @ఉషగారు,
    ధన్యవాదాలు.నేను భాగవతం మొదలుపెట్టి వరుసగా రాసుకుంటూ వస్తున్నానండీ....మరీచిమహర్షి గురించి ఆ ప్రకారంలో వస్తే తప్పకుండా రాస్తాను..
    @సురేష్ గారు,
    అవునండీ ఇలా భాగవతసుధల్ని అందరితో పంచుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  7. నాకు చాలా ఇష్టమైన, మనసుని కదిలించే కథల్లో నారదుని పూర్వజన్మ వృత్తాంతం ఒకటి.

    వారల్ కృష్ణచరిత్రముల్ చదువగా, వర్ణింపగా, పాడగా
    ఆ రావంబు సుధారసప్రతిమమై, అశ్రాంతమున్ వీనులదోరంబై
    మదిసంతోషించినంత .....

    పూర్తిగా గుర్తు రావడం లేదుకానీ, చాలా ఆనందాన్ని కలగజేసే పద్యం ఇది నాకు.

    రిప్లయితొలగించండి
  8. నాగమురళి గారూ...ఆ మిగతా పద్యం ఇదిగోనండీ..
    "వారల్ కృష్ణచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగాఁ బాడగా
    నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
    దోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నే నంతటన్
    బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై."

    రిప్లయితొలగించండి
  9. చాలా అద్భుతంగా ఉంది చదువుతుంటే , మొదటి సారి వింటున్నాను నారదుడికి పూర్వ జన్మ వృత్తాంతం. ధన్యవాదాలు కౌటిల్య గారు.

    రిప్లయితొలగించండి