ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

25, జులై 2010, ఆదివారం

ద్రౌపది సౌశీల్యం - ౧


















అర్జునుడు అశ్వత్థామను కట్టితెచ్చి ద్రుపదరాజనందిని ముందు పడవేశాడు......ద్రౌపది అశ్వత్థామ వంక చూచింది..అప్పుడా అశ్వత్థామ ఎల్లా ఉన్నాడయ్యా అంటే,సిగ్గుతో తలవంచుకుని ఉన్నాడట....ఎందుకూ?ఆమె అయిదుగురు పుత్రుల్నీ,నిద్రపోతున్నవారిని అతికిరాతకంగా చంపింది తానే కదా మరి!పైగా అది ఎంత అధర్మమో ఎరిగినవాడయ్యె తను....అలా ఉన్న అశ్వత్థామను చూచి ముందు నమస్కరించింది ఆ మహాసాధ్వి....తనకు ఎంత ద్రోహం చేసినా విప్రుడాయె,పైగా గురుపుత్రుడాయె....అంతటి ధర్మ విచక్షణగలది ద్రౌపది..అంతటి సుస్వభావ...

అప్పుడు ఇలా అంది,

"పరఁగన్ మా మగవార లెల్లరును మున్బాణ ప్రయోగోప సం
హరణాద్యాయుధ విద్యలన్నియు ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్రాకృతి నున్న ద్రోణుఁడవు నీ చిత్తంబులో లేశమున్
కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే!"
(భాగ - ప్ర - ౧౫౯)

ఈ పద్యం చాలా ప్రసిద్ధమైన పద్యం.....ఇక్కడ మనం తిక్కనగారి ద్రౌపదిని,పోతనగారి ద్రౌపదిని చక్కగా పోల్చుకోవచ్చు....అక్కడ అభిమన్యుడు,ఘటోత్కచుడు,బభ్రువాహనుడు మొదలైన వాళ్ళు కూడా తనకు పుత్రు(సమాను)లే...వాళ్ళు మరణించినపుడు ఎంతో ఉద్వేగ పడుతుంది...కాని ఇక్కడ ఎంత ఊటాడినా దైన్యాన్నే ప్రదర్శిస్తుంది....

పరగన్-- ఈ మాటతో ఈ పద్యం మొదలౌతుంది..ఇది కొందరికి వ్యర్థమైన మాటగా కనిపిస్తుంది.కొందఱు మధ్యకాలపు కవులు ఇల్లాంటి మాటలకు వెగటు పడటం నేర్చుకున్నారు.ఆధునికులైన యువకులలో కొన్ని వెఱ్ఱివేషాలున్నై...అవి కొంత పెద్దజీతము,ఒక పదవి ఉన్నవాడి సాహిత్యాభిప్రాయాలలో వెఱ్ఱులు...అవి వారికపకారం చేసేది చాలక, వాడి అనుయాయులకు కూడా చేస్తున్నై. వీళ్ళంతా ఆ వెఱ్ఱులు పెట్టుకోటం మూలంగా ఆంధ్రసరస్వతి సమిష్టి స్వరూప పరిజ్ఞానం లేని వాళ్ళవుతున్నారు.ఒక మహాకావ్య నిర్మాణానికి సమర్థులు కాలేకపోతున్నారు.....ఏవో అల్పపు రాతలతో మురిసి పోతుంటారు.వాటిల్లో ఉండే మంచిగుణాలు కూడా లేకపోలేదు........కానీ, వాళ్ళు ఇల్లాంటి సంకుచితాభిప్రాయాల వల్ల సర్వంకషమైన ప్రతిభగల కావ్యాలు రాయటానికి చాలకున్నారు....

మనం మాటాడేప్పుడు కొన్ని అనవసరమైన శబ్దాలు ప్రయోగిస్తాం. "అదికాదురా- వాడు నన్నలా అన్నాడు!", ఈ ’అదికాదు’ కి అర్థంలేదు...." మరి, నువ్వెప్పుడు వచ్చావు?!",,..ఇక్కడ ఈ ’మరి’ కీ అర్థంలేదు....మన ప్రసంగంలోని మాటపాటులిలాంటివి.ఇల్లాంటి శబ్దాలకి వాక్యాలంకారాలని పేరు...ఇలాంటివి ఏ భాషలోనైనా ఉంటాయి.--భాషా స్వభావము తెలియని వాళ్ళు చెప్పే మాటలు వేఱుగా ఉంటాయి. పరగన్ - అన్నమాటకి అర్థముందా, లేదా? సరిపోతుందా, లేదా? వాక్యాలంకారమవుతుందా, కాదా? అనేకమైన జీవితశాఖలలో ఎంతో మందికి ఎన్నో రకాలైన వెఱ్ఱులుంటై...కాని ఇలాంటి వెఱ్ఱులు పెట్టుకున్నవాడు రసాస్వాదనం చెయ్యలేడు..అది చెయ్యలేని కావ్యపఠనం ఎందుకూ కొఱగాదు......

మా మగవారలెల్లను--- ఇలాంటి పదాల వల్లనే పోతన్నగారి వాణి తెలుగువాళ్ళ హృదయానికి హత్తుకుపోయింది....’మా మగవారలు’ అనటంలో ఎంతో స్త్రీత్వముంది..సంసార లక్షణముంది.

మున్+బాణ ప్రయోగోపసంహారణాయుధ విద్యలన్నియు---- ధనుర్విద్య రెండు రకాలు..ఒకటి శస్త్ర విద్య. అంటే లాఘవంగా అమ్ముతొడిగి గురి తప్పకుండా కొట్టగలగటం,ఒక్కసారి వదిలిన తర్వాత ఇక వెనక్కు తేవడం ఉండదు....రెండవది అస్త్రవిద్య. బ్రహ్మాస్త్రం,ఆగ్నేయాస్త్రం,వారుణాస్త్రం,వాయవ్యాస్త్రం... ఇల్లాంటివి. ఇది మంత్ర స్వ్రరూపమైనది...ఆయా అస్త్రాలకి ఒక్కో అధిదేవత ఉంటుంది..ఆ అస్త్రాధిదేవతని ఎంతో నిష్ఠతో అర్చించాలి...ఇక్కడ ప్రయోగం, ఉపసంహారం రెండూ ఉంటాయి....రెండిటినీ తెలిసినవాడే ప్రయోగించాలి..దానికి ఎంతో పరిశ్రమ కావాలి...సర్వాస్త్రఘాతి అని ఒక అస్త్రముంది..అది అన్ని అస్త్రాలకీ ఉపసంహరణ......ఇక్కడ మనం కొంత ఆక్షేపణ అన్వయించుకోవచ్చు.(ముందు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాన్ని ఉపసంహారం తెలియకుండానే ప్రయోగిస్తాడు కదా.)...

ద్రోణాచార్యుచే నభ్యసించిరి---- ఇక్కడ ’ద్రోణాచార్యుతో’ అనో, ’ద్రోణాచార్యువల్ల’ అనో అనలేదు...చదువైతే ’తో’ అనవచ్చు....కానీ ఇది ధనుర్విద్య, కనుక ’చే’........అభ్యసించిరి- ఇక్కడ ప్రాస ’పరగన్’ అన్న శబ్దం మూలంగా రమణీయంగా అతికింది....ఈ రామణీయకత కోసం ’పరగన్’ అన్న మాటతో మొదలు పెడితే తప్పేంటి?

పుత్రాకృతినున్న ద్రోణుడవు----- నీకును, ద్రోణుడికి ఆకృతిలో భేదమే తప్ప యదార్థమైన స్వరూపంలో, ఆత్మలో భేదం లేదని అర్థం......" ఆత్మావై పుత్రనామాసి".

నీ చిత్తంబులో లేశమున్ కరుణాసంగము లేక--- ఏమయ్యా! నీ మనసులో ఏ మూలన కూడా కొంచెమైనా కరుణ,దయ ఆర్ద్రత అనేవి లేవే!

శిష్యుసుతులన్--- వాళ్ళు నీ తండ్రి శిష్యుల కొడుకులు కాదు, నీ శిష్యుల కొడుకులే....

ఖండింపగా పాడియే --- వధించటం నీకు ధర్మమేనా!

5 కామెంట్‌లు:

  1. పోతన గారి చక్కటి పద్యానికి మేచ్చేటి వివరణ. నీ చిత్తంబులో లేశమున్ కరుణాసంగము లేక -- ఎంత సున్నితముగా ద్రౌపది చేత చెప్పించారు.
    వాక్యాలంకారాలకి మీ ఉదాహరణలు చాలా బాగున్నాయి. అవి నిజముగా వాక్య రంజితాలే.
    థాంక్స్ ఫర్ ది పోస్ట్.
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  2. మహాభారత సంగ్రామానంతరం శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళితే తన కుమారుల మరణానికి కారణమైనందుకు ఆయన వంశ నాశనం కావాలని శపిస్తుంది. కానీ ద్రౌపది తన పుత్ర హంతకుడైన అశ్వత్థామ వచ్చి ఎదురుగా నిలబెడినా ఎంత సంయమనం పాటించిందో ఈ పద్యంలో చక్కగా వివరించారు. టపా పేరు సార్థకం అయింది.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది. ’పరగన్’ వివరణ - విశ్వనాథవారే మీనుంచి పలికినట్లుంది. :-)

    రిప్లయితొలగించండి
  4. @కొత్తపాళీ గారు,
    ధన్యవాదాలు
    @రామకృష్ణ గారు,
    అవునండీ అదే మరి పోతన్న గారి వాణి.

    @రవిచంద్ర,
    మీ పోలిక చాలా బాగుందండీ..నాకస్సలు తట్టనే లేదు...

    @నాగమురళి గారు,
    హయ్యో..ఆయన నానుంచి పలకటం కాదండీ,నిజంగా ఆయనే పలికిన మాటలవి(కొంత నా పైత్యమే అనుకోండి)..నాకంత విశ్లేషించే విద్వత్తులేదండీ..

    రిప్లయితొలగించండి