ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

27, జులై 2010, మంగళవారం

ద్రౌపది సౌశీల్యం - ౨


అశ్వత్థామతో ద్రౌపది ఇంకా ఇల్లా అంటోంది..

"తండ్రీ! భూసురుడవు...పైగా వీరాగ్రేసరుడివి..సకల ధర్మాలూ ఎరిగినవాడివి..దయ, కరుణ ఇవే కదా విప్రులకు ఆభరణాలు... దయమాలి చిన్నపిల్లలని కౄరంగా వధించావు..ఇలాంటి రాక్షసకృత్యం నీకు తగునా!"

"ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాపల రణప్రౌఢ క్రియాహీనులన్
నిద్రాసక్త్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!"
(భాగ - ప్ర - ౧౬౧).

ఇది కూడా ద్రౌపది అశ్వత్థామను ఊటాడిన మాటలలోనిదే.....

ఉద్రేకంబునరారు శస్త్రధరులై--- ఆ నా చిన్నపిల్లలు ఎప్పుడూ ఆవేశకావేశాలతో ఆయుధాలు పట్టుకుని ఎవరిమీదకీ ఊరకే వెళ్ళినవారు కాదు..

యుద్ధావనిన్ లేరు---- ఒక వేళ యుద్ధభూమిలో ఉంటే చంపావనుకోను అదీ కాదు కదా!

కించిత్+ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో---- మితిమీరిన బలగర్వంతో నీకు ఏ ద్రోహమూ చేసినవారు కాదు కదా! కనీసం మాటమీరి తూలనాడిన వారైనా కాదే!

భద్రాకారుల, పిన్నపాపల, నిద్రాసక్తుల--- ఆ ఉపపాండవులు ఎంతో అందమైన పిల్లవాండ్రు....పైగా నిద్రపోతున్నారు

రణప్రౌఢ క్రియాహీనులన్---- యుద్ధవిద్యలలో అంత ఆరితేరినవారైన కాదు..రేపు నిన్నెదిరించి పోరాడతారనుకోవటానికి....

సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!----అలాంటి వారిని చంపటానికి నీకు చేతులెట్లు వచ్చెను. నీ చేతులెట్లాడెనో?

ఇక్కడ అందమేమిటంటే? తనకు మహాపకారం చేసిన బ్రాహ్మణుడు ఎదురుగా ఉన్నాడు.అతడు గురుపుత్రుడవటం కొంత విచారింపదగిందే....అయినా ద్రౌపది తన దుఃఖాన్ని ఎంత ఆకట్టుకుంది! ఎంత మాటనియమాన్ని పాటిస్తోంది! ఒక్క తూలుమాట లేదు. ఇక్కడ ద్రౌపది శీలము ఎంతో ఉదాత్తంగా ఉంది.....వెనుక పద్యంలో మా మగవారలనుట, ఇందులో నీ చేతులెట్లాడెనో అనటం, హృదయాన్ని కదిలిస్తున్నాయి.....ఇలాంటి మాటలతోనే హృదయం కదులుతుంది.........రససాక్షాత్కారానికి హృదయాన్ని పట్టిచ్చే ఇలాంటి భావాలు,ఇలాంటి మాటలే ఆయువుపట్లు....

ఇలా అంటూ, ఒక్కసారి వెఱగుపడి," అయ్యో!ఇక్కడ పుత్రశోకంతో నేనెంత దుఃఖిస్తున్నానో! నిన్ను అర్జునుడు పట్టి తేవటం సహించలేక నీ తల్లి ఇంకెంత దుఃఖిస్తుందో కదా!" అని పలికి కృష్ణార్జునులను చూచి ఇలా అంది." ద్రోణుని భార్య ’కృపి’, భర్తతో సహగమనం చెయ్యక ఇంటనే ఉంది.ఆ తల్లి ఆశలన్నీ ఈ బిడ్డపైనేకదా!బిడ్డల చావుకి నేనెంత కలతపడుతున్నానో, తన బిడ్డకోసం ఆ తల్లీ అంతే కదా! పైగా హంతకుడైనా, బ్రాహ్మణుణ్ణి హింసించటం మహాపాపం.....భూపాలకులకి విప్రులను బాధించటం తగదు....విప్రులకోపం మహాగ్ని వంటిది.అది దేశమంతటినీ కాల్చివేస్తుంది...కనుక అందరి క్షేమంకోరి ఈతడిని విడిచిపెట్టండి".

ఇక్కడ కూడా ద్రౌపది ఉదాత్తత,ధర్మవిచక్షణ మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది...తను ఎంత వేదనతో ఉన్నా, సాటి స్త్రీ దుఃఖాన్ని ఆలోచించగలటం....ఆ క్షమాగుణం,ఆ ధర్మవిచక్షణ పోల్చసరిలేనివి..అందుకే ద్రౌపది భారతనారీశిరోమణి అయింది....మగువలందరికీ ఆదర్శమూర్తిగా నిలిచింది..

ఇలా పొగడదగ్గ రీతిలో, ఎంతో సమంజసంగా, ఎంతో దయతో ద్రౌపది పలికిన మాటలకి, ధర్మరాజు సంతోషించాడు.(తన సద్భావాలకు అనుగుణంగా భార్య నడుచుకుంటే, అంతకన్నా భర్తకి వేరే ఆనందమేముంటుంది.) కృష్ణార్జునులు, నకుల సహదేవులు కూడా సమ్మతించారు. కాని భీముడు ఒప్పుకోక ఆవేశంతో ఇలా అన్నాడు."తన బిడ్డలని చంపాడని ఒకింతైనా కోపపడదే! పైగా విడిచి పెట్టమంటోంది....ఎంత వెఱ్ఱిది ఈ ద్రౌపది! భాలఘాతకుడు వీడు విప్రుడా! కానేకాదు. వీడిని వదలవద్దు.తక్షణం వధించండి...చంపటానికి మీరు వెనకాడితే, ఒక్క పిడికిటి పోటుతో వీడి శిరస్సు వెయ్యివక్కలు చేస్తాను.చూడండి."

ఇలా ఆవేశంగా పలికి, అశ్వత్థామ మీదికి లంఘిస్తున్న భీముణ్ణి చూచి, ద్రౌపది అశ్వత్థామకి అడ్డునిలబడింది.(అంతటి ధీరోదాత్త ద్రౌపది.తన పతి ఎక్కడ ధర్మచ్య్తుతుడౌతాడోనని ఆ సాధ్వి తలచి చేసిన మెచ్చదగిన పని ఇది.) భీముని సంరంభం చూసి వెంటనే, కృష్ణుడు చతుర్భుజుడై వచ్చాడు. రెండు చేతులతో భీముణ్ణి వారించి,రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు నెట్టి, నవ్వురాజిల్లెడి ఆ మోముతో(ఎంతటి ఆవేశాన్నైనా,ఏ మనస్తాపాన్నైనా ఇట్టే పోగొట్టగల ముగ్ధమోహన దరహాసం మరి, భీముడి కోపం ఎప్పుడో కరిగిపోయుంటుంది.) ఇలా అన్నాడు." భీమసేనా! వీడు శిశుహంతకుడు, విడిచిపెట్టదగిన వాడు కాదు.కాని విప్రుడన్న మాట మాత్రం నిజం. "బ్రాహ్మణో న హంతవ్య" అని వేదం నిర్దేశిస్తోంది కదా! అందువలన ధర్మదృష్టితో చూచి వీడిని విడిచిపెట్టు."

ఇలా మెత్తటి మాటలతో ఆ పవనపుత్రుణ్ణి శాంతపఱచి,కృష్ణుడు అర్జునుణ్ణి చూచి," అర్జునా! నాకు, ద్రౌపదికి, భీమసేనునికి సమ్మతమయ్యేట్లు, నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరేట్లు ఈ శిశుహంతకుణ్ణి శిక్షించు"అని పలికాడు. అప్పుడా శక్రసూనుడు(శక్రుడనగా ఇంద్రుడు), అశ్వత్థామ శిరోజాలు తఱిగి, అతని తలలో మహాకాంతితో వెలుగుతున్న మణిని గ్రహించాడు...పిమ్మట అతని కట్లు విప్పి "పొమ్మ"ని శిబిరం బైటకి నెట్టివేశాడు. మణిని, తేజస్సుని పోగొట్టుకుని ఆ ద్రౌణి సిగ్గుతో, వడి వడిగా ఆ ప్రదేశం విడిచి వెళ్ళాడు.

" ధనము గొనుటయొండెఁ దలఁ గొఱుగుట
యొండె నాలయంబు వెడలనడచుటొండెఁ
గాని చంపఁదగిన కర్మంబు సేసినౕఁ
జంపఁదగదు విప్రజాతిఁ బతికి"

(భాగ - ప్ర - ౧౭౩)

" ఎంతటి ఘోరకృత్యం చేసినా రాజు విప్రులని వధించరాదు. ధనహీనుణ్ణి చెయ్యటం, తల గొఱిగించటం, దేవాలయ ప్రవేశం నిషేధించటం బ్రాహ్మణునికి మరణదండనతో సమానం".

లోకాః సమస్తాస్సుఖినో భవంతు.

5 కామెంట్‌లు:

  1. ద్రౌపది తన దుఃఖాన్ని అణుచుకుని పలికిన ఈ మాటలు అశ్వత్థామకు జీవితాంతం శిక్షయే. అంతకు మించిన శిక్ష లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది అతన్ని మానసికంగా చిత్రవధ చేసినట్టే.

    అశ్వత్థామ తలపై నున్న మణి గురించి(ఎలా వచ్చింది? వగైరా) ఏదైనా కథ ఉన్నదా? ఉంటే ఈ వ్యాఖ్య గానో ఓ టపాగానో రాస్తే బాగుంటుంది.

    అన్నట్టు పెయింటింగ్ లు ఎక్కడివి? చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది మీ టపా. మీరొదిలేసిన ఒక రెండు పద్యాలు తల్చుకుంటున్నాను -

    భూసురుఁడవు బుద్ధి దయా
    భాసురుఁడవు శుద్ధవీర భట సందోహా
    గ్రేసరుఁడవు శిశుమారణ
    మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ !
    ’తండ్రీ’ అన్న సంబోధన చూడండి!!

    అక్కట ! పుత్త్రశోకజనితాకులభావ విషణ్ణచిత్తనై
    పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
    డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ
    డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో ?

    ద్రౌపది ఎంతటి కరుణామయురాలో ఈ మాటల్లో తెలుస్తుంది. ఆవిడది ఎంత గొప్ప మాతృహృదయమో కూడా అర్థమౌతుంది. భాగవతమంటేనే అటువంటి వ్యక్తుల కథలు, కదా!!

    మరొక సంగతి. అశ్వత్థామ సహజంగా దుష్టుడు కాదు. కేవలం ఆవేశపరుడు. ఉన్మాదంతో వివేకాన్ని కోల్పోయినవాడు. పాండవులకి గురుపుత్రుడు, కాబట్టి చాలా ఆదరపాత్రుడు. అతన్ని ఆవహించినది ఒక ‘యుద్ధానంతర ఉన్మాదం’ మాత్రమే (ఇది నా బ్లాగులో రామాయణం గురించి నాగరాజుగారన్నమాట). అతను సహజంగా దుష్టుడు కాదు కాబట్టే ద్రౌపది అతన్ని బుజ్జగిస్తూ మాట్లాడింది. ఈ ఘట్టంలో ఆవిడ వివేకం, పెద్దరికం చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి.

    రిప్లయితొలగించండి
  3. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు --- తండ్రి వంటి వాడివి. ఎందుకయ్యా ఈ పని చేశావు? --- నీ చేతులెట్లాడెనో!"

    జగన్నాటకం కళ్ళకి కట్టినట్లు చెబుతున్నారు --- పోతన గారు మీ ద్వారా మాకు.
    పెయింటింగ్ లు చాలా బాగున్నాయి. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  4. @ రవిచంద్ర,
    అవును అది చాలు ఏ మూలన్నా అతడికి మనసన్నది మిగిలుంటే...
    ఆ శిరోమణి గురించి నాకు తెలిసిందేమిటంటే...అది అశ్వత్థామకి పుట్టుకతో ఉన్నది....ఆకలి దప్పులు, అలసట తెలియనివ్వనిదని..మరి ఇంకా ఏమైనా కథ ఉందేమో పెద్దలెవరైనా చెప్పాలి....

    @నాగమురళి గారు,
    మిగతా పద్యాలకి ధన్యవాదాలు....కింద చెప్పిన మంచి విషయాలకి కూడా..

    @రావు గారు,
    అవునండీ..అది నా భాగ్యం,పూర్వజన్మ సుకృతం అనుకుంటుంటా...

    ఇక పైన పెట్టే చిత్రాలంటారా..గూగుల్ వాడి దయ...కొద్దిగా కష్టపడి వెతికి పెడుతున్నా, అంతే...

    @అశ్విన్..
    మంగిడీలు.

    రిప్లయితొలగించండి