ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

4, జులై 2010, ఆదివారం

శ్రీమద్భాగవత రచనాది వృత్తాంతము - వ్యాకుల చిత్తుడైన వ్యాసుని వద్దకు నారదుడు ఏతెంచుట





"హరినామ స్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరసస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ

హరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమైయుండ దయోగ్య దుర్మద నదత్కాకోల గర్తాకృతిన్."






ఇది నాకు ఎంతో ఇష్టమైన పద్యం.....వేదాల్ని విభజించినా, పురాణేతిహాసాలెన్ని రాసినా తెలియని వెలితితో చింతిస్తున్న వ్యాసునితో నారదమహర్షి అన్న మాటలివి...."హరిని కీర్తించే కావ్యమేదైనా బంగారు కమలాలతో,హంసలతో నిండి ఉన్న మానససరోవరంలా శోభిస్తుంది. కాని హరినామకీర్తన లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది....".

నారాయణుని అవతారాల్ని వర్ణించిన పిమ్మట, సూతముని ఇలా అన్నాడు," సకలపురాణ రాజము, భువనేశ్వరుడైన ఆ శ్రీహరి చరితము ఐన భాగవతాన్ని భగవంతుడైన వ్యాసమహర్షి రచించి, మొదట తన కుమారుడైన శుకుని చేత చదివించాడు....సకల వేదేతిహాస సారమైన ఈ మహా పురాణాన్ని ఆ శుక మహర్షి, ఘనవిరక్తితో గంగ మధ్యలో సకల మునులతో కూడి ఉన్న ఆ పరీక్షిన్మహారాజు అడుగగా వినిపించాడు....ఆ మునివల్ల నే విన్నది అంతా మీకు వినిపిస్తాను,వినండి. కలికాల దోషాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జనులకు ఈ భాగవతం, కమలబాంధవుడైన ఆ సూర్యుని వలె వెలుగునిచ్చి దారిచూపుతుంది..".

అది విన్న శౌనకుడు,"మహర్షీ! ఏ కారణంచేత,ఎవరు కోరితే వ్యాసమహర్షి భాగవతాన్ని రచించాడు?అసలు ఆ శుకముని నిత్య నిర్వికల్పుడు కదా! ఆ మహాముని గృహస్థుల ఇళ్ళలో, ఆవు పాలు పిదికినంత తడవు కూడా నిలవడంటారే! ఆ మాత్రం నిలిచిన చోటు మహా తీర్థమవుతుంది కదా! అలాంటిది అంతకాలం ఆ ముని ఒక్కచోట,హస్తినలో ఎలా నిలిచి ఉన్నాడు? అంత ప్రీతితో పరీక్షిత్తుకి భాగవతాన్ని ఎలా వినిపించాడు! అదియును గాక, మహా గాఢకీర్తియగు ఆ మహారాజు,రాజ్యాన్ని విడిచి ఏ కారణాంతరం చేత ప్రాయోపవేశం చేసి, గంగ మధ్యలో విరక్తితో ఉన్నాడు?ఆ కథనంతా మాకు వివరించు" అన్నాడు.

అప్పుడు సూతమహాముని ఇల్లా చెప్పటం మొదలెట్టాడు.
"మూడవదైన ద్వాపరయుగం చివరలో, ఉపరిచరవసువు వీర్యాన జన్మించిన సత్యవతియందు పరాశరునకు, హరి అవతారంగా మహాజ్ఞానియైన వ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆ మహాముని బదరికాశ్రమంలో,సరస్వతీనదిలో స్నానమాచరించి,ఎవరూలేని చోట ఒంటిగా కూర్చుని,"యుగధర్మాలకు భువి సాంకర్యం చెందుతుంది.యుగయుగానికీ భౌతికశక్తి సన్నగిల్లుతోంది. మానవులు ధైర్యహీనులుగా, మందబుద్ధితో,అల్పాయువులుగా,దుర్బలులుగా అవుతారని", దివ్యదృష్టితో వీక్షించాడు. అంత సర్వ వర్ణాశ్రమాలకీ హితం చేయాలని సంకల్పించి, నలుగురు హోతలచే అనుష్ఠింపబడి, ప్రజాశ్రేయస్సు చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు ఎడతెగకుండా జరిగేందుకు వీలుగా, ఒకటిగా ఉన్న వేదాన్ని, నాలుగుగా విభజించాడు. మిగిలిన ఇతిహాసాలు, పురాణాలు అన్నీ పంచమవేదం అని చెప్పాడు.

వాటిలో ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదం వైశంపాయనుడు, నాల్గవదైన అధర్వాన్ని సుమంతుడు పఠించారు. సకల పురాణేతిహాసాల్ని మా తండ్రి రోమహర్షణుడు చదివాడు. ఇలా ఆయా మునులు తాము నేర్చిన వేదాల్ని, తమ తమ శిష్యులకు బోధించారు. అలా వారి వలన ఆ వేదజ్ఞానమంతా ఈ భూమి మీద విస్తరించింది.తరువాత దీనవత్సలుడైన వ్యాసుడు, స్త్రీలకు శూద్రులకు వేదార్హత లేదు కనుక వారి మేలుకొరకు మహాభారతాన్ని రచించాడు.

కాని ఎంత చేసినా మనసులో ఆనందం,తృప్తి కలగకపోవడంతో ఒకనాడు సరస్వతీ తీరాన కూర్చుని తనలో తాను ఇలా వ్యాకుల పడసాగాడు. "సర్వ కర్మానుష్ఠాన రూపమైన వేదాల్ని ప్రవచించాను. సర్వ వేదార్థ భావాన్ని మహాభారత మిషతో తెలిపాను.ఇంత జేసినా ఆత్మలో ఈశ్వరుడు సంతసించినట్లు లేదు. ఏం చేయాలి?ఏం చేస్తే ఈ వెలితి తీరుతుంది?"అని ఆలోచిస్తుండగా......మింటనుండి, మధుర నారాయణ గానం చేస్తూ, మహతిమీద మంద్ర మధుర స్వరాలు పలికిస్తూ, కపిలవర్ణంతో ఉన్న జటలు సూర్య సమాన దీప్తిని ప్రసరిస్తుండగా నారదమహర్షి అరుదెంచాడు......
అలా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షికి, వ్యాసుడు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదుల పూజించి, కూర్చుండబెట్టిన పిమ్మట, నారద మహర్షి నవ్వు మోముతో,విపంచికా తంత్రిని మీటుతూ వ్యాసునితో,"వ్యాసమహర్షీ! వేదార్థ పదార్థ విజ్ఞాతవు.... మహాభారత ప్రవక్తవు.... కామ,క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించినవాడవు.....బ్రహ్మతత్వాన్ని చక్కగా ఎఱిగి బ్రహ్మసూత్రాల్ని నిర్దేశించిన వాడవు...ఇలా వ్యాకులత చెందడానికి కారణమేమిటయ్యా!" అని అడిగాడు.

దానికి వ్యాసుడు ఇలా అన్నాడు."మహానుభావా! నీవు బ్రహ్మమానసపుత్రుడవు.నిరంతర నారాయణ కీర్తనా గాన విలాసివి.సూర్యుడిలా ముల్లోకాలూ చుట్టివస్తావు.వాయువులా అన్ని లోకాల జనులతో మెలుగుతావు. నీవు సర్వజ్ఞుడివి.నీకు తెలియనిది ఈ ముల్లోకాల్లోనూ లేదు.....కనుక నా మనసులో ఉన్న ఈ కొఱతేమిటో, ఆ వెలితిని పూడ్చే ఉపాయమేమిటో దయతో నాకు వివరింపగలవు".

అంతట నారదుడు లేనగవుతో,

"అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం
చించుకగాని విష్ణుకథలేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!"

.సర్వేజనాస్సుఖినో భవంతు.

6 కామెంట్‌లు:

  1. కలికాల దోషాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జనులకు ఈ భాగవతం, కమలబాంధవుడైన ఆ సూర్యుని వలె వెలుగునిచ్చి దారిచూపుతుంది..".

    వెలితి ఉందని గ్రహించటం, అది తీరటానికి ప్రయత్నించటం, వెలితి ఎల్లా తీరుతుందో తెలుసుకోవటం కలికాలంలో మనకీ నారద రూపం లో తారసిల్లు తాయి కానీ వాటిని భగవంతుని దర్శనం గ గుర్తించలేరు ఏకొందరో తప్ప. ఆ గుర్తించే శక్తీ మనకిస్తే అదే చాలు జీవితానికి. కొంచం ఇమ్మోషనల్ అవుతున్నాను. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. కౌటిల్య గారు,

    ఆ నారద ఉవాచ అయిన చివరి శ్లోకాని/పద్యాని/కీ కూడా మీరు తాత్పర్యం కలిపితే బావుండేది. వాడాలని మమ్మల్ని మేము తోసుకురావటమే కానీ మన తేనెపలుకులు లేకపోయినా గడిపేయగల గడ్డమీదున్నాం కనుక ఒక్కోసారి చిన్న పదాలే పెద్ద అయోమయాన్ని కల్పిస్తాయి. అందుకనే ఈ మనవి.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ కౌటిల్య గారికి, నమస్కారములు.

    P.G. పరీక్షలు బాగా వ్రాసారని అనుకుంటున్నాను.
    ఈ వ్యాసంలో వివరణ బాగుంది. ఒకచోట, "స్త్రీలకు శూద్రులకు వేదార్హత లేదు కనుక వారి మేలుకొరకు మహాభారతాన్ని రచించాడు." అని వ్రాసారు. వేదాలు, వేదమాత స్వరూపాలేకదా? ఆ తల్లి బిడ్డలైన ఈ రెండు వర్గాల వారికి ఎందుకు అర్హత లేదు? తెలియచేయగలరా?


    భవదీయుడు,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
  4. @రామకృష్ణ గారు,
    ఆధ్యాత్మికమైన ఉద్వేగం పొందగలగడం ఎంతో అదృష్టమండీ..

    @ఉషగారు,
    అక్కడెక్కడో ఉన్నా తెలుగుతల్లికి మీరు చేస్తున్న సేవ బహుదా ప్రశంసనీయం....ఈ మధ్య నేను ప్రతీ టపాలో ఒక మంచి పద్యానికి వివరణ ఇచ్చి చివర్లో దానిని అనుసరించుకుని వచ్చేపద్యాన్ని
    (బాగా తేలికగ ఉండేదాన్ని) ఉదహరించి ముగిస్తున్నా...దానిని పాఠకులు పైన ఇచ్చిన వివరణని అనుసరించుకుని వారి వారి భావాలతో అన్వయించుకుని విశ్లేషించుకుంటారని వదిలేస్తున్నా...కాని కొన్ని పదాలు మరీ అయోమయాన్ని కల్పిస్తున్నాయని మీ వ్యాఖ్యవల్ల అర్థమైంది...ఇకనుంచి అన్నిటికీ రాయటానికి ప్రయత్నిస్తాను.

    ఇక పై పద్యంలోకొస్తే,
    "ఓ వ్యాసమునీంద్రా!ఎన్నో గొప్పవైన(అంచితము-పూజింపదగిన) ధర్మాల్ని(చయము-సమూహము) చెప్పావు,కానీ వాటిలో లవలేశమైనా(ఇంచించుక-కొంచెమైనా)ఆ శ్రీ మహావిష్ణువు దివ్యకథల్ని చెప్పనేలేదు.విశేషమైన ధర్మాలు ఎన్ని ప్రచారం చేసినా, ఆ శ్రీహరి గుణవిశేషాల్ని కీర్తిస్తేనే ఆత్మతృప్తి చెందుతుంది.నీకు ఈ వెలితి(కొంచెము-బాధ,వెలితి)కలగటానికి కారణం అదే..కనుక ఆ హరిని నుతించి ధన్యుడవు కమ్ము"..

    రిప్లయితొలగించండి
  5. @ మాధవరావు గారు,
    మీ అభిమనానికి ధన్యవాదాలు.పీజీ సీటు రాలేదండీ..మళ్ళా దండయాత్ర మొదలెట్టా...అప్పుడప్పుడూ నా భాగవత గమనాన్ని సాగిస్తూ,ఆ అమృతాన్ని సేవిస్తూ సేదదీరుతున్నా....మీరు మంచి చిక్కుప్రశ్నే అడిగారు...చాలా సూక్ష్మమైన ధర్మం అది..దాన్ని అందుకునే అంత జ్ఞానం నాకు లేదనుకుంటా! ఆ వ్యాసమహర్షి సంస్కృతాన చెప్పిన దాన్ని మన పోతన్నగారు తెలుగున రాశారు.ఆ మహానుభావుడు చెప్పినదాన్ని నేను యథాతథంగా రాశాను...పైగా ఇది ఎప్పటినుంచో ప్రతి ఒక్కరితో అడగబడ్డ ప్రశ్నే....నాకు ఉన్న జ్ఞానంతో వివరించటానికి ప్రయత్నిస్తాను....

    తల్లి అందరికీ ఒకటే!కాని ఒక పిల్లవాడు కొంచెం మందబుద్ధ్హిగా,బలహీనంగా ఉంటే,వాణ్ణి ఒకమాదిరిగా సులభంగా ఉండే చదువే చదివిస్తాం..వాడికి ప్రతిపనీ ఎదురు చేసిపెడతారు తల్లీ,మిగతా పిల్లలూ కూడా..అలానే ఆ వేదమాత వ్యాసులవారి రూపంలో ఆ వేదార్థసారాన్నంతా మహాభారతరూపాన చెప్పించింది.....

    వేదం శబ్దస్వరూపం(శృతి)...అది చక్కగా ఉఛ్ఛరించాలంటే ఎంతో సాధన కావాలి..ఎన్నో నియమాలకి(ఆహార,విహార) ఒదిగి ఉండాలి..అప్పుడే సరైన స్వరం పలికి శక్తి ఉత్పన్నమౌతుంది...రకరకాల వృత్తులు ఆచరించే శూద్రులు ఈ నియమాలకి ఒదిగి ఉండటం కష్టం...స్త్రీలకి కూడా రజస్వలాది దోషాలు వస్తూనే ఉంటాయి...అందువల్ల వారికీ అది నిషిద్ధం...ఆ వేదసారమంతా మహాభారతరూపంలో,పురాణాల రూపంలో సులభంగా అందుతుంటే అంత కష్టపడాల్సిన అవసరమేముంది..కానీ ప్రతిదాంట్లో సామాన్య, విశేష ధర్మాలున్నట్టు ఇక్కడకూడా విశేషరూపాలున్నాయి..గార్గేయి,మైత్రేయి లాంటి మహామహులు వేదాల్ని ఔపోశన పట్టినవాళ్ళే...కాని వాళ్ళలా అందరూ ఉండలేరు కదా!

    రిప్లయితొలగించండి
  6. మాధవరావు గారూ, నాకూ ఆ సందేహము వచ్చింది. దానికి ఒక విధంగా సమాధానము చెప్పుకున్నాను.
    మనము వేల సంవత్సరాల క్రిందటి పరిస్తుతుల గురించి మాట్లాడు కుంటున్నాము. అప్పుడున్న సంఘ సంస్కృతికి మనోభావాలని ఇప్పటి వాటితో పోల్చలేము.మనము జీవించాలంటే ఇవి మనకు కావాలి అని నిర్ధారించు కోవటమే చాలా గొప్ప. ఏవిధంగా అవి సాధించ గలము అని ఆలోచించి వాటి ప్రక్రియలు(పనిచేసే విధానాలు) నిర్దేశించటం ఇంకా గొప్ప. ఇవి సాధించాలంటే వీళ్ళు ఆయా పనులు చెయ్య గలరు అని వాళ్ళ కా పనులు ఇవ్వటం చాలా చాలా గొప్ప. అందుకనే మన సంస్కృతి ఇంకా నిలిచి ఉంది.
    మీరు గమనించారో లేదో నేను చెప్పిన వన్నీ ఈ కాలంలో ప్రతీ కార్పోరేషణ్ లో జరిగే పనులు,కంపెనీ ఉంటుందా పోతుందా అని నిర్దారించేవి.
    మన పూర్వులు వేల సంవత్సరాల క్రిందే ఆ కాలంలో జరగవలసిన పనులకి Job descriptions వ్రాసి ఎవరు ఏపనులు చెయ్యగలరో గుర్తించి వాళ్ళ చేత ఆ యా పనులు చేయించ గలిగారు. ఎందుకు ఈ విధము గా జరిగింది అనే ప్రశ్నకి సమాధానం కావాలంటే వేల సంవత్సరాల క్రిందటి జీవన విధానము పరిశీలించాలి, నా మనస్సు అంత దాకా వెళ్ళలేదు.

    రామకృష్ణ

    రిప్లయితొలగించండి