ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

27, జులై 2010, మంగళవారం

ద్రౌపది సౌశీల్యం - ౨


అశ్వత్థామతో ద్రౌపది ఇంకా ఇల్లా అంటోంది..

"తండ్రీ! భూసురుడవు...పైగా వీరాగ్రేసరుడివి..సకల ధర్మాలూ ఎరిగినవాడివి..దయ, కరుణ ఇవే కదా విప్రులకు ఆభరణాలు... దయమాలి చిన్నపిల్లలని కౄరంగా వధించావు..ఇలాంటి రాక్షసకృత్యం నీకు తగునా!"

"ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాపల రణప్రౌఢ క్రియాహీనులన్
నిద్రాసక్త్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!"
(భాగ - ప్ర - ౧౬౧).

ఇది కూడా ద్రౌపది అశ్వత్థామను ఊటాడిన మాటలలోనిదే.....

ఉద్రేకంబునరారు శస్త్రధరులై--- ఆ నా చిన్నపిల్లలు ఎప్పుడూ ఆవేశకావేశాలతో ఆయుధాలు పట్టుకుని ఎవరిమీదకీ ఊరకే వెళ్ళినవారు కాదు..

యుద్ధావనిన్ లేరు---- ఒక వేళ యుద్ధభూమిలో ఉంటే చంపావనుకోను అదీ కాదు కదా!

కించిత్+ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో---- మితిమీరిన బలగర్వంతో నీకు ఏ ద్రోహమూ చేసినవారు కాదు కదా! కనీసం మాటమీరి తూలనాడిన వారైనా కాదే!

భద్రాకారుల, పిన్నపాపల, నిద్రాసక్తుల--- ఆ ఉపపాండవులు ఎంతో అందమైన పిల్లవాండ్రు....పైగా నిద్రపోతున్నారు

రణప్రౌఢ క్రియాహీనులన్---- యుద్ధవిద్యలలో అంత ఆరితేరినవారైన కాదు..రేపు నిన్నెదిరించి పోరాడతారనుకోవటానికి....

సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!----అలాంటి వారిని చంపటానికి నీకు చేతులెట్లు వచ్చెను. నీ చేతులెట్లాడెనో?

ఇక్కడ అందమేమిటంటే? తనకు మహాపకారం చేసిన బ్రాహ్మణుడు ఎదురుగా ఉన్నాడు.అతడు గురుపుత్రుడవటం కొంత విచారింపదగిందే....అయినా ద్రౌపది తన దుఃఖాన్ని ఎంత ఆకట్టుకుంది! ఎంత మాటనియమాన్ని పాటిస్తోంది! ఒక్క తూలుమాట లేదు. ఇక్కడ ద్రౌపది శీలము ఎంతో ఉదాత్తంగా ఉంది.....వెనుక పద్యంలో మా మగవారలనుట, ఇందులో నీ చేతులెట్లాడెనో అనటం, హృదయాన్ని కదిలిస్తున్నాయి.....ఇలాంటి మాటలతోనే హృదయం కదులుతుంది.........రససాక్షాత్కారానికి హృదయాన్ని పట్టిచ్చే ఇలాంటి భావాలు,ఇలాంటి మాటలే ఆయువుపట్లు....

ఇలా అంటూ, ఒక్కసారి వెఱగుపడి," అయ్యో!ఇక్కడ పుత్రశోకంతో నేనెంత దుఃఖిస్తున్నానో! నిన్ను అర్జునుడు పట్టి తేవటం సహించలేక నీ తల్లి ఇంకెంత దుఃఖిస్తుందో కదా!" అని పలికి కృష్ణార్జునులను చూచి ఇలా అంది." ద్రోణుని భార్య ’కృపి’, భర్తతో సహగమనం చెయ్యక ఇంటనే ఉంది.ఆ తల్లి ఆశలన్నీ ఈ బిడ్డపైనేకదా!బిడ్డల చావుకి నేనెంత కలతపడుతున్నానో, తన బిడ్డకోసం ఆ తల్లీ అంతే కదా! పైగా హంతకుడైనా, బ్రాహ్మణుణ్ణి హింసించటం మహాపాపం.....భూపాలకులకి విప్రులను బాధించటం తగదు....విప్రులకోపం మహాగ్ని వంటిది.అది దేశమంతటినీ కాల్చివేస్తుంది...కనుక అందరి క్షేమంకోరి ఈతడిని విడిచిపెట్టండి".

ఇక్కడ కూడా ద్రౌపది ఉదాత్తత,ధర్మవిచక్షణ మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది...తను ఎంత వేదనతో ఉన్నా, సాటి స్త్రీ దుఃఖాన్ని ఆలోచించగలటం....ఆ క్షమాగుణం,ఆ ధర్మవిచక్షణ పోల్చసరిలేనివి..అందుకే ద్రౌపది భారతనారీశిరోమణి అయింది....మగువలందరికీ ఆదర్శమూర్తిగా నిలిచింది..

ఇలా పొగడదగ్గ రీతిలో, ఎంతో సమంజసంగా, ఎంతో దయతో ద్రౌపది పలికిన మాటలకి, ధర్మరాజు సంతోషించాడు.(తన సద్భావాలకు అనుగుణంగా భార్య నడుచుకుంటే, అంతకన్నా భర్తకి వేరే ఆనందమేముంటుంది.) కృష్ణార్జునులు, నకుల సహదేవులు కూడా సమ్మతించారు. కాని భీముడు ఒప్పుకోక ఆవేశంతో ఇలా అన్నాడు."తన బిడ్డలని చంపాడని ఒకింతైనా కోపపడదే! పైగా విడిచి పెట్టమంటోంది....ఎంత వెఱ్ఱిది ఈ ద్రౌపది! భాలఘాతకుడు వీడు విప్రుడా! కానేకాదు. వీడిని వదలవద్దు.తక్షణం వధించండి...చంపటానికి మీరు వెనకాడితే, ఒక్క పిడికిటి పోటుతో వీడి శిరస్సు వెయ్యివక్కలు చేస్తాను.చూడండి."

ఇలా ఆవేశంగా పలికి, అశ్వత్థామ మీదికి లంఘిస్తున్న భీముణ్ణి చూచి, ద్రౌపది అశ్వత్థామకి అడ్డునిలబడింది.(అంతటి ధీరోదాత్త ద్రౌపది.తన పతి ఎక్కడ ధర్మచ్య్తుతుడౌతాడోనని ఆ సాధ్వి తలచి చేసిన మెచ్చదగిన పని ఇది.) భీముని సంరంభం చూసి వెంటనే, కృష్ణుడు చతుర్భుజుడై వచ్చాడు. రెండు చేతులతో భీముణ్ణి వారించి,రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు నెట్టి, నవ్వురాజిల్లెడి ఆ మోముతో(ఎంతటి ఆవేశాన్నైనా,ఏ మనస్తాపాన్నైనా ఇట్టే పోగొట్టగల ముగ్ధమోహన దరహాసం మరి, భీముడి కోపం ఎప్పుడో కరిగిపోయుంటుంది.) ఇలా అన్నాడు." భీమసేనా! వీడు శిశుహంతకుడు, విడిచిపెట్టదగిన వాడు కాదు.కాని విప్రుడన్న మాట మాత్రం నిజం. "బ్రాహ్మణో న హంతవ్య" అని వేదం నిర్దేశిస్తోంది కదా! అందువలన ధర్మదృష్టితో చూచి వీడిని విడిచిపెట్టు."

ఇలా మెత్తటి మాటలతో ఆ పవనపుత్రుణ్ణి శాంతపఱచి,కృష్ణుడు అర్జునుణ్ణి చూచి," అర్జునా! నాకు, ద్రౌపదికి, భీమసేనునికి సమ్మతమయ్యేట్లు, నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరేట్లు ఈ శిశుహంతకుణ్ణి శిక్షించు"అని పలికాడు. అప్పుడా శక్రసూనుడు(శక్రుడనగా ఇంద్రుడు), అశ్వత్థామ శిరోజాలు తఱిగి, అతని తలలో మహాకాంతితో వెలుగుతున్న మణిని గ్రహించాడు...పిమ్మట అతని కట్లు విప్పి "పొమ్మ"ని శిబిరం బైటకి నెట్టివేశాడు. మణిని, తేజస్సుని పోగొట్టుకుని ఆ ద్రౌణి సిగ్గుతో, వడి వడిగా ఆ ప్రదేశం విడిచి వెళ్ళాడు.

" ధనము గొనుటయొండెఁ దలఁ గొఱుగుట
యొండె నాలయంబు వెడలనడచుటొండెఁ
గాని చంపఁదగిన కర్మంబు సేసినౕఁ
జంపఁదగదు విప్రజాతిఁ బతికి"

(భాగ - ప్ర - ౧౭౩)

" ఎంతటి ఘోరకృత్యం చేసినా రాజు విప్రులని వధించరాదు. ధనహీనుణ్ణి చెయ్యటం, తల గొఱిగించటం, దేవాలయ ప్రవేశం నిషేధించటం బ్రాహ్మణునికి మరణదండనతో సమానం".

లోకాః సమస్తాస్సుఖినో భవంతు.

25, జులై 2010, ఆదివారం

ద్రౌపది సౌశీల్యం - ౧


















అర్జునుడు అశ్వత్థామను కట్టితెచ్చి ద్రుపదరాజనందిని ముందు పడవేశాడు......ద్రౌపది అశ్వత్థామ వంక చూచింది..అప్పుడా అశ్వత్థామ ఎల్లా ఉన్నాడయ్యా అంటే,సిగ్గుతో తలవంచుకుని ఉన్నాడట....ఎందుకూ?ఆమె అయిదుగురు పుత్రుల్నీ,నిద్రపోతున్నవారిని అతికిరాతకంగా చంపింది తానే కదా మరి!పైగా అది ఎంత అధర్మమో ఎరిగినవాడయ్యె తను....అలా ఉన్న అశ్వత్థామను చూచి ముందు నమస్కరించింది ఆ మహాసాధ్వి....తనకు ఎంత ద్రోహం చేసినా విప్రుడాయె,పైగా గురుపుత్రుడాయె....అంతటి ధర్మ విచక్షణగలది ద్రౌపది..అంతటి సుస్వభావ...

అప్పుడు ఇలా అంది,

"పరఁగన్ మా మగవార లెల్లరును మున్బాణ ప్రయోగోప సం
హరణాద్యాయుధ విద్యలన్నియు ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్రాకృతి నున్న ద్రోణుఁడవు నీ చిత్తంబులో లేశమున్
కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే!"
(భాగ - ప్ర - ౧౫౯)

ఈ పద్యం చాలా ప్రసిద్ధమైన పద్యం.....ఇక్కడ మనం తిక్కనగారి ద్రౌపదిని,పోతనగారి ద్రౌపదిని చక్కగా పోల్చుకోవచ్చు....అక్కడ అభిమన్యుడు,ఘటోత్కచుడు,బభ్రువాహనుడు మొదలైన వాళ్ళు కూడా తనకు పుత్రు(సమాను)లే...వాళ్ళు మరణించినపుడు ఎంతో ఉద్వేగ పడుతుంది...కాని ఇక్కడ ఎంత ఊటాడినా దైన్యాన్నే ప్రదర్శిస్తుంది....

పరగన్-- ఈ మాటతో ఈ పద్యం మొదలౌతుంది..ఇది కొందరికి వ్యర్థమైన మాటగా కనిపిస్తుంది.కొందఱు మధ్యకాలపు కవులు ఇల్లాంటి మాటలకు వెగటు పడటం నేర్చుకున్నారు.ఆధునికులైన యువకులలో కొన్ని వెఱ్ఱివేషాలున్నై...అవి కొంత పెద్దజీతము,ఒక పదవి ఉన్నవాడి సాహిత్యాభిప్రాయాలలో వెఱ్ఱులు...అవి వారికపకారం చేసేది చాలక, వాడి అనుయాయులకు కూడా చేస్తున్నై. వీళ్ళంతా ఆ వెఱ్ఱులు పెట్టుకోటం మూలంగా ఆంధ్రసరస్వతి సమిష్టి స్వరూప పరిజ్ఞానం లేని వాళ్ళవుతున్నారు.ఒక మహాకావ్య నిర్మాణానికి సమర్థులు కాలేకపోతున్నారు.....ఏవో అల్పపు రాతలతో మురిసి పోతుంటారు.వాటిల్లో ఉండే మంచిగుణాలు కూడా లేకపోలేదు........కానీ, వాళ్ళు ఇల్లాంటి సంకుచితాభిప్రాయాల వల్ల సర్వంకషమైన ప్రతిభగల కావ్యాలు రాయటానికి చాలకున్నారు....

మనం మాటాడేప్పుడు కొన్ని అనవసరమైన శబ్దాలు ప్రయోగిస్తాం. "అదికాదురా- వాడు నన్నలా అన్నాడు!", ఈ ’అదికాదు’ కి అర్థంలేదు...." మరి, నువ్వెప్పుడు వచ్చావు?!",,..ఇక్కడ ఈ ’మరి’ కీ అర్థంలేదు....మన ప్రసంగంలోని మాటపాటులిలాంటివి.ఇల్లాంటి శబ్దాలకి వాక్యాలంకారాలని పేరు...ఇలాంటివి ఏ భాషలోనైనా ఉంటాయి.--భాషా స్వభావము తెలియని వాళ్ళు చెప్పే మాటలు వేఱుగా ఉంటాయి. పరగన్ - అన్నమాటకి అర్థముందా, లేదా? సరిపోతుందా, లేదా? వాక్యాలంకారమవుతుందా, కాదా? అనేకమైన జీవితశాఖలలో ఎంతో మందికి ఎన్నో రకాలైన వెఱ్ఱులుంటై...కాని ఇలాంటి వెఱ్ఱులు పెట్టుకున్నవాడు రసాస్వాదనం చెయ్యలేడు..అది చెయ్యలేని కావ్యపఠనం ఎందుకూ కొఱగాదు......

మా మగవారలెల్లను--- ఇలాంటి పదాల వల్లనే పోతన్నగారి వాణి తెలుగువాళ్ళ హృదయానికి హత్తుకుపోయింది....’మా మగవారలు’ అనటంలో ఎంతో స్త్రీత్వముంది..సంసార లక్షణముంది.

మున్+బాణ ప్రయోగోపసంహారణాయుధ విద్యలన్నియు---- ధనుర్విద్య రెండు రకాలు..ఒకటి శస్త్ర విద్య. అంటే లాఘవంగా అమ్ముతొడిగి గురి తప్పకుండా కొట్టగలగటం,ఒక్కసారి వదిలిన తర్వాత ఇక వెనక్కు తేవడం ఉండదు....రెండవది అస్త్రవిద్య. బ్రహ్మాస్త్రం,ఆగ్నేయాస్త్రం,వారుణాస్త్రం,వాయవ్యాస్త్రం... ఇల్లాంటివి. ఇది మంత్ర స్వ్రరూపమైనది...ఆయా అస్త్రాలకి ఒక్కో అధిదేవత ఉంటుంది..ఆ అస్త్రాధిదేవతని ఎంతో నిష్ఠతో అర్చించాలి...ఇక్కడ ప్రయోగం, ఉపసంహారం రెండూ ఉంటాయి....రెండిటినీ తెలిసినవాడే ప్రయోగించాలి..దానికి ఎంతో పరిశ్రమ కావాలి...సర్వాస్త్రఘాతి అని ఒక అస్త్రముంది..అది అన్ని అస్త్రాలకీ ఉపసంహరణ......ఇక్కడ మనం కొంత ఆక్షేపణ అన్వయించుకోవచ్చు.(ముందు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాన్ని ఉపసంహారం తెలియకుండానే ప్రయోగిస్తాడు కదా.)...

ద్రోణాచార్యుచే నభ్యసించిరి---- ఇక్కడ ’ద్రోణాచార్యుతో’ అనో, ’ద్రోణాచార్యువల్ల’ అనో అనలేదు...చదువైతే ’తో’ అనవచ్చు....కానీ ఇది ధనుర్విద్య, కనుక ’చే’........అభ్యసించిరి- ఇక్కడ ప్రాస ’పరగన్’ అన్న శబ్దం మూలంగా రమణీయంగా అతికింది....ఈ రామణీయకత కోసం ’పరగన్’ అన్న మాటతో మొదలు పెడితే తప్పేంటి?

పుత్రాకృతినున్న ద్రోణుడవు----- నీకును, ద్రోణుడికి ఆకృతిలో భేదమే తప్ప యదార్థమైన స్వరూపంలో, ఆత్మలో భేదం లేదని అర్థం......" ఆత్మావై పుత్రనామాసి".

నీ చిత్తంబులో లేశమున్ కరుణాసంగము లేక--- ఏమయ్యా! నీ మనసులో ఏ మూలన కూడా కొంచెమైనా కరుణ,దయ ఆర్ద్రత అనేవి లేవే!

శిష్యుసుతులన్--- వాళ్ళు నీ తండ్రి శిష్యుల కొడుకులు కాదు, నీ శిష్యుల కొడుకులే....

ఖండింపగా పాడియే --- వధించటం నీకు ధర్మమేనా!

19, జులై 2010, సోమవారం

పుత్ర హంతకుడైన అశ్వత్థామను అర్జునుడు బంధించి తెచ్చుట











"వెఱచినవాని దైన్యమున వేఁదుఱు
నొందినవాని నిద్ర మై

మఱచినవాని సౌఖ్యముగ మద్యము ద్రావినవాని భగ్నుఁడై

పఱచినవాని సాధు జడభావము వానిని గావుమంచు వా

చఱచినవానిఁ గామినుల జంపుట ధర్మముగాదు ఫల్గునా!"



ఇవి, పుత్రహంతకుడైన అశ్వత్థామను బంధించి, చంపబోతున్న అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసూక్ష్మాలు......
" అర్జునా! భయపడ్డవాణ్ణి, ఉన్మత్తుడై అతిదీనంగా ఉన్నవాణ్ణి, మైమరిచి నిద్రించేవాణ్ణి, మధువు సేవించి మత్తులో ఉన్నవాణ్ణి, శక్తి ఉడిగిపోయి భంగపడి ఉన్నవాణ్ణి, సాధువై తపస్సు చేసుకుంటూ కదలక,మెదలక ఉన్నవాణ్ణి, రక్షించమని గొంతెత్తి అడిగినవాణ్ణి, స్త్రీలను చంపటం ధర్మంకాదు."


"నారదమహర్షి వెళ్ళిన తర్వాత వ్యాసుడు, బ్రహ్మనదియైన సరస్వతీనదికి పడమటి ఒడ్డునున్న తన ఆశ్రమానికి వెళ్ళాడు...అది ఫలవంతాలైన రేగుచెట్లతో (అందుకే వ్యాసుణ్ణి "బాదరాయణుడు" అంటారు. బదరీ వృక్షం=రేగుచెట్టు) నిండిఉంది...దానిపేరు శమ్యాప్రాసం.....అక్కడ వ్యాసుడు పవిత్ర సరస్వతీ జలాల్లో స్నానమాచరించి,సంధ్య వార్చుకుని వచ్చి ఒడ్డున కూర్చుని, భక్తినిండిన మనస్సుతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు....మాయామోహితుడైన జీవికి హరిభక్తి తప్ప వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకుని........... ఈ భూమిమీద ఎవ్వరైనా,ఎప్పుడైనా,ఎక్కడైనా విన్న,చదివినంత మాత్రాన, ఈ సర్వ భవబంధాల్ని తొలగించి ముక్తిని ప్రసాదించే ఆ హరిభక్తిని కలిగించేటువంటి భాగవతమహాపురాణాన్ని రచించాడు....దానిని తన కుమారుడైన శుకమహర్షి చేత చదివించాడు...." అని సూతమహర్షి వివరించాడు...అది విన్న శౌనకుడు" శుక మహర్షి సర్వ విరాగి కదా! ఏ కారణంచేత భాగవతాన్ని పఠించాడు" అని అడిగాడు.....

అప్పుడు సూతుడు," మునులు నిరపేక్షులు...వాళ్ళు కారణమేమీ లేకుండానే హరిని కీర్తిస్తుంటారు...ఏదో ప్రయోజనం ఆశించి చెయ్యరు! అలా ఆ హరితత్పరుడైన బాదరాయణి(శుకుడు), త్రైలోక్య మంగళకరమైన భాగవతాన్ని భక్తితో పఠించాడు.....వేదాలు వెయ్యిమార్లు చదివినా ముక్తి మార్గం సులభంకాదు..కానీ ఈ భాగవతవేదాన్ని శ్రద్ధ్హతో ఒక్కమారు చదివినా మోక్షమార్గం ఎంతో సులభమౌతుంది.......ఇక పరీక్షిత్తు జన్మకర్మ ముక్తినీ, పాండవుల మహాప్రస్థానాన్నీ, కృష్ణకథోదయాన్నీ చెప్తాను వినండి." అని పలికి ఇంకా ఇలా చెప్పసాగాడు......

"కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది....ఎన్నో అక్షౌహిణుల సైన్యం నాశనమయ్యింది..ఎందరో వీరులు స్వర్గగతులయ్యారు.....భీముడి గదాఘాతానికి దుర్యోధనుడు తొడలువిరిగి నేలకూలాడు....అప్పుడు అశ్వత్థామ తన రాజు,మిత్రుడు ఐన దుర్యోధనుడికి ప్రియం చేకూర్చాలని భావించి, నిద్రపోతున్న ద్రౌపదీపుత్రుల శిరసులు ఖండించి తెచ్చి సమర్పించాడు.....ఇది మహా కౄరకర్మ అని లోకులు నిందించారు.....

తనయుల చావువార్త విన్న ఆ ద్రుపదరాజపుత్రి ఎంతో కలతపడ్డది.కన్నీళ్ళు చెక్కిళ్ళవెంట ధారగా కారుతుండగా దుఃఖించి,దుఃఖించి నేలపైబడి మూర్ఛిల్లింది....అది చూసిన అర్జునుడు ద్రౌపదిని కూర్చుండబెట్టి,సేదదీర్చి, తలనిమురుతూ, మెత్తటి గొంతుకతో ఇలా అన్నాడు.."మహారాజ పుత్రివి, మరో మహారాజు ఇల్లాలివి...ఇలా బేలవై దుఃఖించుట తగునా? ఆ ద్రోణపుత్రుడు నిర్దయుడై బాలుర్ని హతమార్చాడు...నేడు, నా గాండీవం వదిలే భీకర శరాలతో వాని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదాల దగ్గర పడవేస్తాను...అది చూచి నువ్వు ఆనందనర్తనం చెయ్యాలి.."....అని ద్రౌపదిని ఓదార్చి అర్జునుడు, కవచం తొడిగి,గాండీవం ధరించి....తన సఖుడు,భగవంతుడు ఐన ఆ శ్రీకృష్ణుడు సారథికాగా, కపిధ్వజయుతమైన రథాన్ని అశ్వత్థామ వద్దకు పరుగెత్తించాడు...

తనని చంపటానికి వస్తున్న అర్జునుణ్ణి చూసి అశ్వత్థామ, భయంతో ప్రాణాలరచేత పట్టుకుని,రథమెక్కి పారిపోవటం మొదలెట్టాడు....అలా ఓపికున్నంత వరకూ వెళ్ళాడు...గుర్రాలు కూడా అలిసిపోయాయి.... వెనక అర్జునుడు తరుముతూ వస్తున్నాడు....ఇక ప్రాణరక్షణకి వేరే మార్గంలేదని నిశ్చయించుకుని, జలాన్ని అభిమంత్రించి, అర్జునుడి మీదకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని(ప్రయోగమే కాని,ఉపసంహారం తెలియక పోయినా ప్రాణరక్షణకోసం) ప్రయోగించాడు...ఆ అస్త్రాగ్ని దిక్కులన్నీ వ్యాపించి, ఆకాశమంతా కమ్ముకుని మహాభీకరంగా వస్తుంటే చూసి అర్జునుడు ఆ వాసుదేవునితో,"కృష్ణా! భక్తాభయప్రదా!పరమపురుషుడవు, నీ ప్రబొధంతో మాయను అణచివేస్తావు..... ఇదేదో మహాగ్ని భూమ్యాకాశాలూ,దిక్కులన్నీ నిండి ఎదురుగా వస్తున్నది..ఏంటో అర్థం కాకుండా ఉంది....నాకు త్వరగా,వివరంగా చెప్పు దేవేశా!" అని ప్రార్థించాడు...

అప్పుడు ఆ శ్రీహరి," అర్జునా! ప్రాణేఛ్ఛతో పారిపోతున్న ద్రోణపుత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు...ఇది ఆ మహాస్త్రాగ్ని...తిరుగు బ్రహ్మాస్త్రంతోగానీ దీన్ని నివారించలేము..కనుక త్వరగా నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు." అన్నాడు....అప్పుడు అర్జునుడు ఆ శ్రీహరికి ప్రదక్షిణచేసి, జలాన్ని అభిమంత్రించి. అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రంపైకి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.....అప్ఫుడా రెండు మహాస్త్రాలూ, తమ అగ్నితో భూనభోంతరాళాలు నింపుతూ తలపడగా లోకమంతా గడగడలాడింది....ప్రజలు యుగాంతమేమోనని భయపడ్డారు....అప్పుడు ఆ శ్రీహరి ఆజ్ఞమేరకు, అర్జునుడు రెండు అస్త్రాలనీ ఉపసంహరించాడు....అప్పుడు ఆ ధనంజయుడు,రోషారుణిత నేత్రుడై, అశ్వత్థామను తఱిమి పట్టుకుని బంధించి, శిబిరానికి తీసుకువెళ్ళి వధిస్తానని పలకగావిని కృష్ణుడు ఇలా అన్నాడు.."అర్జునా! ఎదురాడలేని పసిపాపలని, నిద్రలో ఉన్నవారిని,రాత్రివేళ చంపిన ఈ పాతకుణ్ణి వదలవద్దు...కానీ ప్రాణభయంతో పారిపోయేవాడిని వధించరాదని ధర్మం చెప్తోంది...కనుక ఈ విప్రుణ్ణి రాజధర్మానుసారం దండించు...".

అని ఇలా కృష్ణుడు ఆనతివ్వగా అర్జునుడు, బ్రాహ్మణుడు ఎంత అపరాధియైనా, వధింపదగడనే ధర్మాన్ని తలచి, చంపక, ద్రౌపదికి తానిచ్చినమాట గుర్తుకుతెచ్చుకుని బంధితుడైన అశ్వత్థామను తీసుకుని శిబిరం దగ్గరికి వచ్చి,

"సురరాజసుతుఁడు సూపెను
దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకున్
బరిచలితాంగ శ్రేణిం
బరుష మహాపాశబద్ధ పాణిన్ ద్రౌణిన్."

12, జులై 2010, సోమవారం

నారదుని పూర్వజన్మ వృత్తాంతము





























సీ. విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును
లేదు విశ్వమునకు
భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీ ముఖమున
నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము కావున హరిపరాక్రమములెల్ల

ఆ. వినుతిసేయు మీవు వినికియుఁ జదువును
దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమికెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

నారద మహర్షి వ్యాకులతతో ఉన్న వ్యాసునితో ఇంకా ఇల్లా చెప్పసాగాడు......"మునీంద్రా! ఈ విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువే. ఆతనికి మించినది,వేరైనది ఏదీ ఈ విశ్వాంతరాళంలో లేదు.సర్వ సృష్టి,స్థితి,వృద్ధి,లయాలన్నీ ఆ పరమేశ్వరుని వలననే జరుగునని నీకు తెలిసిన విషయమే కదా! నీవు ఈ లోకకళ్యాణానికై విష్ణ్వంశతో జన్మించినాడవు..కావున ఆ హరి లీలలన్నిటినీ భాగవత కథారూపాన లోకానికి వివరించు..ఆ కమలనాభుని కీర్తించగలిగినప్పుడే కదా సర్వ రూపమైన తపస్సులూ,సర్వమైన సంపదలూ సఫలాలౌతాయి!

మహాత్మా! నేను నా పూర్వజన్మలో(ఇంతకు ముందు కల్పాన) సదాచారులైన వేదవాదుల ఇంటి దాసికి జన్మించాను. వాళ్ళు,నా చిన్నతనంలో ఒక వానాకాలంలో, చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకచోట నిలిచి ఉండే యోగులకు పరిచర్య చేయటానికి నన్ను నియమించారు.(చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి-శయనైకాదశి తో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది.ఈ నాల్గునెలలూ నిత్య సంచారులైన యోగులు ఒక్కచోట కదలకుండా ఉండి ఆ నారాయణున్ని అర్చిస్తారు.) నేను నేర్పుగా,ఓర్పుగా అన్ని పనులు చేస్తూ, అందరు బాలురవలే ఆటలకు వెళ్ళక, ఏ ఇతర జంజాటాలు లేకుండా భక్తితో వారిని సేవించాను. వారు మిగిల్చిన ఎంగిలి శుభంగా భావించి భుజిస్తూ,ఎండ వానల్ని లెక్కచేయకుండా వారిని వర్షాకాల,శరత్కాలాలు సేవించాను.వాళ్ళు విష్ణుచరితలు చదువుతూ,పాడుతూ ఉంటే, అవి నా చెవులకు అమృతంలా అనిపించేవి.మనసుకు అపరిమితమైన ఆనందం కలిగేది.దానితో నేను కూడా హరినామకీర్తనం చెయ్యటం మొదలెట్టాను.అలా ఆ మహాజనులవల్ల నాలో రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’ కలిగింది.....

కొంతకాలానికి వారి చాతుర్మాస్య వ్రతం ముగిసి, ఆ యోగులు తిరిగి దేశాటనానికి బయల్దేరారు...అంతట వారు, ఎటువంటి అపచారం లేకుండా భక్తితో నిత్యపరిచర్య చేసిన నన్ను పిలిచి, పరమ ప్రీతితో,కరుణతో నాకు అతిరహస్యమైన ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశం వల్ల ఆ వాసుదేవుని సర్వ మాయావిలాసాన్ని తెలుసుకున్నాను. ఏ పదార్థం వలనైతే వ్యాధి వస్తుందో, ఆ వ్యాధి మాన్చటానికి అదే పదార్థం ఎలా పనికిరాదో, అలానే సంసారహేతుకమైన కర్మలు ఈశ్వర సన్నిధానానికి ప్రతిబంధకాలుగా మారతాయి.వాటిని ఈశ్వరార్పితంగా భావించి ఆచరించాలి. అప్పుడు భక్తియోగం కలుగుతుంది. ప్రణవ సహితంగా వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అనే ఈ నాలుగు నామాల్ని భక్తి పూర్వకంగా పలికి, నమస్కారం చేసి, మంత్రమూర్తియైన ఆ యజ్ఞపురుషుని పూజించిన వాడు సమ్యగ్దర్శనుడౌతాడు.నేను ఆ విధంగా చేయగా, ఆ హరి సంతసించి తనయందలి పరమేశ్వర జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.నా తల్లి మా యజమానుల ఇంట భక్తితో పనులన్నీ చేసి, నావద్దకు రేపు మాపు వచ్చి నేను అలసితినని, ఆకొంటినని నాకు అన్నమిడి, నన్ను ముద్దాడి, చుంచు దువ్వి, నన్ను కౌగిలించుకుని ప్రేమగా ఒళ్ళంతా నిమిరెడిది. ఒకనాటి రాత్రి, నా తల్లి పాలు పితకటానికి వెళ్ళ్గి చీకటిలో చూడక పాముతోక తొక్కగా,అది వెంటనే నా తల్లిని కరిచింది. ఆ విషప్రభావాన నా తల్లి విగతజీవియై వెంటనే నేలకూలింది.అది చూచి నేను మోహం పొందక, సంసారబంధాలు తొలగిపోయాయని భావించి,విష్ణుపద ధ్యానంమీద బుద్ధి నిలిపి ఇల్లు వదిలి ఉత్తరాభిముఖంగా బయలుదేరాను.అలా బయలుదేరి, పట్టణాలు,జనపదాలు,పల్లెలు,నదులు,పర్వతాలు,అడవులు దాటి సర్వజంతు వాసితమైన ఒక భీకరారణ్యం ప్రవేశించాను.అక్కడ ఒక సరస్సులో స్నానమాడి, శుచినై, ఒక రావిచెట్టు క్రింద కూర్చుని, నేను విన్న విధంగా నా హృదయగతుడైన ఆ పరమాత్మని,హరిని చింతించాను.అలా ధ్యాననిమగ్నుడనైన నాకు, ఆనందాశ్రువులు రాలగా, రోమాంచం కలుగుతుండగా, నా తలపులో ఆ దేవదేవుడు కనిపించినట్లైంది.కాని ఆ హరి దివ్యరూపం నా కన్నులకు కనపడలేదు.ఆ హరికోసం శోకిస్తూ, నేను ఆ వనం అంతా కలియతిరుగుతుండగా, నన్నుద్దేశించి ఆ హరి మృదు మధుర స్వరంతో ఇలాపలికాడు."కుమారా!దుఃఖించకు.ఈ జన్మలో నన్ను చూడలేవు. నీవు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట, నా భక్తుడవై జన్మిస్తావు.ఈ సృష్టి లయం జరిగి, పునఃసృష్టి జరిగినప్పుడు నా కృపతో జన్మించి, శుద్ధసత్వులందరిలోకి అగ్రగణ్యుడవై వర్ధిల్లుతావు."

అలా ఆ అశరీరవాణి పలుకగా, నేను తలవంచి నమస్కరించితిని. కామక్రోధాదులైన అరిషడ్వర్గాన్ని వర్జించి, ఆ అనంతుని నామాలు పఠిస్తూ,విషయవిరక్తుణ్ణై, కాలానికై ఎదురుచూస్తూ తిరుగుతూ ఉండగా కొంతకాలానికి మెఱుపు మెఱిసినట్టు మృత్యువు రాగా,ఈ పాంచభౌతికదేహాన్ని విడిచి, ఆ శ్రీహరి కృపవల్ల శుద్ధసత్వమయమైన భాగవత దేహాన్ని పొందాను.అంత ముల్లోకాల్నీ లయంచేసి, ఆ ప్రళయకాల జలరాశిమధ్య శయనించి ఉన్న నారాయణమూర్తి యొక్క నాభికమలగతుడై శయనించబోతున్న బ్రహ్మ నిశ్వాస వెంట ఆతని లోనికి ప్రవేశించాను.తరువాత వెయ్యి యుగాల కాలం గడిచిన తర్వాత నిద్రలేచి, లోకాల్ని సృష్టించడానికి ఉపక్రమిస్తున్న ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాస వెంట నేను, మరీచి మొదలైన మునులు జన్మించాము. అప్పుడు నేను అఖండమైన బ్రహ్మచర్యాన్ని పూని, ఈశ్వరదత్తమై,బ్రహ్మనుంచి పుట్టిన సప్తస్వరాలని తనంతట తానుగా మోగించే ఈ మహతి(అనే వీణ)ని పూని, ఈ ముల్లోకాలలో ఆ నారాయణుని అనుగ్రహంతో ఏ అడ్డంకి లేకుండా, నారాయణ కథాగానం చేస్తూ చరిస్తూ ఉన్నాను.అంత ఆ మహావిష్ణువు పిలిచిన పలికే వాని లాగా నా మనసులో నిత్యం దర్శనమిస్తుంటాడు.మునీంద్రా!ఈ సంసారమనే సాగరంలో మునిగి, కర్మ వాంఛలచేత వేదన పడేవారికి, ఆ శ్రీహరి నామకీర్తనం తెప్పలాంటిది.అందువల్ల ఆ హరికథామృతాన్ని ప్రవచించి లోకాల్ని పావనం చెయ్యి." అని చెప్పి నారదుడు వ్యాసుని వద్ద వీడ్కోలు తీసుకుని వీణానాదం చేస్తూ ఆకాశమార్గాన వెళ్ళాడు అని సూత మహర్షి చెప్పి ఇలా అన్నాడు.

"వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుంద గీతములు జగములకున్
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే! "

లోకాఃసమస్తాస్సుఖినో భవంతు.

4, జులై 2010, ఆదివారం

శ్రీమద్భాగవత రచనాది వృత్తాంతము - వ్యాకుల చిత్తుడైన వ్యాసుని వద్దకు నారదుడు ఏతెంచుట





"హరినామ స్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరసస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ

హరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమైయుండ దయోగ్య దుర్మద నదత్కాకోల గర్తాకృతిన్."






ఇది నాకు ఎంతో ఇష్టమైన పద్యం.....వేదాల్ని విభజించినా, పురాణేతిహాసాలెన్ని రాసినా తెలియని వెలితితో చింతిస్తున్న వ్యాసునితో నారదమహర్షి అన్న మాటలివి...."హరిని కీర్తించే కావ్యమేదైనా బంగారు కమలాలతో,హంసలతో నిండి ఉన్న మానససరోవరంలా శోభిస్తుంది. కాని హరినామకీర్తన లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది....".

నారాయణుని అవతారాల్ని వర్ణించిన పిమ్మట, సూతముని ఇలా అన్నాడు," సకలపురాణ రాజము, భువనేశ్వరుడైన ఆ శ్రీహరి చరితము ఐన భాగవతాన్ని భగవంతుడైన వ్యాసమహర్షి రచించి, మొదట తన కుమారుడైన శుకుని చేత చదివించాడు....సకల వేదేతిహాస సారమైన ఈ మహా పురాణాన్ని ఆ శుక మహర్షి, ఘనవిరక్తితో గంగ మధ్యలో సకల మునులతో కూడి ఉన్న ఆ పరీక్షిన్మహారాజు అడుగగా వినిపించాడు....ఆ మునివల్ల నే విన్నది అంతా మీకు వినిపిస్తాను,వినండి. కలికాల దోషాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జనులకు ఈ భాగవతం, కమలబాంధవుడైన ఆ సూర్యుని వలె వెలుగునిచ్చి దారిచూపుతుంది..".

అది విన్న శౌనకుడు,"మహర్షీ! ఏ కారణంచేత,ఎవరు కోరితే వ్యాసమహర్షి భాగవతాన్ని రచించాడు?అసలు ఆ శుకముని నిత్య నిర్వికల్పుడు కదా! ఆ మహాముని గృహస్థుల ఇళ్ళలో, ఆవు పాలు పిదికినంత తడవు కూడా నిలవడంటారే! ఆ మాత్రం నిలిచిన చోటు మహా తీర్థమవుతుంది కదా! అలాంటిది అంతకాలం ఆ ముని ఒక్కచోట,హస్తినలో ఎలా నిలిచి ఉన్నాడు? అంత ప్రీతితో పరీక్షిత్తుకి భాగవతాన్ని ఎలా వినిపించాడు! అదియును గాక, మహా గాఢకీర్తియగు ఆ మహారాజు,రాజ్యాన్ని విడిచి ఏ కారణాంతరం చేత ప్రాయోపవేశం చేసి, గంగ మధ్యలో విరక్తితో ఉన్నాడు?ఆ కథనంతా మాకు వివరించు" అన్నాడు.

అప్పుడు సూతమహాముని ఇల్లా చెప్పటం మొదలెట్టాడు.
"మూడవదైన ద్వాపరయుగం చివరలో, ఉపరిచరవసువు వీర్యాన జన్మించిన సత్యవతియందు పరాశరునకు, హరి అవతారంగా మహాజ్ఞానియైన వ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆ మహాముని బదరికాశ్రమంలో,సరస్వతీనదిలో స్నానమాచరించి,ఎవరూలేని చోట ఒంటిగా కూర్చుని,"యుగధర్మాలకు భువి సాంకర్యం చెందుతుంది.యుగయుగానికీ భౌతికశక్తి సన్నగిల్లుతోంది. మానవులు ధైర్యహీనులుగా, మందబుద్ధితో,అల్పాయువులుగా,దుర్బలులుగా అవుతారని", దివ్యదృష్టితో వీక్షించాడు. అంత సర్వ వర్ణాశ్రమాలకీ హితం చేయాలని సంకల్పించి, నలుగురు హోతలచే అనుష్ఠింపబడి, ప్రజాశ్రేయస్సు చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు ఎడతెగకుండా జరిగేందుకు వీలుగా, ఒకటిగా ఉన్న వేదాన్ని, నాలుగుగా విభజించాడు. మిగిలిన ఇతిహాసాలు, పురాణాలు అన్నీ పంచమవేదం అని చెప్పాడు.

వాటిలో ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదం వైశంపాయనుడు, నాల్గవదైన అధర్వాన్ని సుమంతుడు పఠించారు. సకల పురాణేతిహాసాల్ని మా తండ్రి రోమహర్షణుడు చదివాడు. ఇలా ఆయా మునులు తాము నేర్చిన వేదాల్ని, తమ తమ శిష్యులకు బోధించారు. అలా వారి వలన ఆ వేదజ్ఞానమంతా ఈ భూమి మీద విస్తరించింది.తరువాత దీనవత్సలుడైన వ్యాసుడు, స్త్రీలకు శూద్రులకు వేదార్హత లేదు కనుక వారి మేలుకొరకు మహాభారతాన్ని రచించాడు.

కాని ఎంత చేసినా మనసులో ఆనందం,తృప్తి కలగకపోవడంతో ఒకనాడు సరస్వతీ తీరాన కూర్చుని తనలో తాను ఇలా వ్యాకుల పడసాగాడు. "సర్వ కర్మానుష్ఠాన రూపమైన వేదాల్ని ప్రవచించాను. సర్వ వేదార్థ భావాన్ని మహాభారత మిషతో తెలిపాను.ఇంత జేసినా ఆత్మలో ఈశ్వరుడు సంతసించినట్లు లేదు. ఏం చేయాలి?ఏం చేస్తే ఈ వెలితి తీరుతుంది?"అని ఆలోచిస్తుండగా......మింటనుండి, మధుర నారాయణ గానం చేస్తూ, మహతిమీద మంద్ర మధుర స్వరాలు పలికిస్తూ, కపిలవర్ణంతో ఉన్న జటలు సూర్య సమాన దీప్తిని ప్రసరిస్తుండగా నారదమహర్షి అరుదెంచాడు......
అలా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షికి, వ్యాసుడు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదుల పూజించి, కూర్చుండబెట్టిన పిమ్మట, నారద మహర్షి నవ్వు మోముతో,విపంచికా తంత్రిని మీటుతూ వ్యాసునితో,"వ్యాసమహర్షీ! వేదార్థ పదార్థ విజ్ఞాతవు.... మహాభారత ప్రవక్తవు.... కామ,క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించినవాడవు.....బ్రహ్మతత్వాన్ని చక్కగా ఎఱిగి బ్రహ్మసూత్రాల్ని నిర్దేశించిన వాడవు...ఇలా వ్యాకులత చెందడానికి కారణమేమిటయ్యా!" అని అడిగాడు.

దానికి వ్యాసుడు ఇలా అన్నాడు."మహానుభావా! నీవు బ్రహ్మమానసపుత్రుడవు.నిరంతర నారాయణ కీర్తనా గాన విలాసివి.సూర్యుడిలా ముల్లోకాలూ చుట్టివస్తావు.వాయువులా అన్ని లోకాల జనులతో మెలుగుతావు. నీవు సర్వజ్ఞుడివి.నీకు తెలియనిది ఈ ముల్లోకాల్లోనూ లేదు.....కనుక నా మనసులో ఉన్న ఈ కొఱతేమిటో, ఆ వెలితిని పూడ్చే ఉపాయమేమిటో దయతో నాకు వివరింపగలవు".

అంతట నారదుడు లేనగవుతో,

"అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం
చించుకగాని విష్ణుకథలేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!"

.సర్వేజనాస్సుఖినో భవంతు.