ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

28, జనవరి 2010, గురువారం

అమ్మలగన్నయమ్మఅమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
(భాగ -ప్ర -౮)

ఇది దుర్గాదేవి స్తోత్రం...."అమ్మ" అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన పోతన్న గారి అసమాన ప్రతిభ....భక్తుడికీ,భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి పిలుపు....,"దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా,ప్రేమగా పిలుచుకునే భావనని,భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు నా శతకోటి వందనాలు......ఈ పద్యం రాసిందెవరో తెలియకపోయినా కూడా ఎప్పుడోకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడుండనుకుంటా.....నా నిత్యపూజలో ఎన్ని స్తోత్రాలు చదివినా,ఎన్ని మంత్రాలు జపించినా,,’అమ్మ’పూజ మొదలెట్టేది మాత్రం ఈ తియ్యటి పిలుపుతోనే..ఈ మహామంత్రంతోనే....

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ------ అసలు స్త్రీ దేవతలంతా దుర్గనుండే పుట్టారట!! లక్ష్మీ,సరస్వతీ,పార్వతులు..చిట్టచివరకు గంగానమ్మ వరకు గూడా దుర్గమ్మ అంశతో పుట్టినవారేనట!! అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింపబడ్డది........ పురుష లక్షణంకల దేవతలందఱు విష్ణువునుండి గాని,శివుడినుండి గాని పుట్టినట్టు చెప్పబడరు.... కాని కాళీ,దుర్గ,లలిత,మహేశ్వరి,పార్వతి,లక్ష్మి,సరస్వతి మొదలైన దేవతలు..వారాహి,చండీ,బగళా మొదలైన మాతలు....రేణుక ఇత్యాది శక్తులు...చివరకు గ్రామదేవతలు కూడా శ్రీమహాదుర్గా దేవతాంశసంభూతులుగా చెప్పబడతారు...దీనికి కారణమేంటి?
ఏంటంటే...
ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది....పురుషుడు ప్రాణదాత, స్త్రీ శరీరదాత్రి.....అసలు ఈ కార్యకారణ సంఘాతమంతా పంచభూతాలనుండి పుడుతోంది.....చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు..............కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం...అంతా ఒక ముద్ద...ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహారమై, పంచేంద్రియ లక్షణ భూతమై పుడుతోంది....(పంచభూతాలంటే భూమి,గాలి,నీరు,అగ్ని,ఆకాశం....పంచేంద్రియాలంటే ప్రపంచాన్ని చూసే కళ్ళు, రకరకాల వాసనలు పీల్చే ముక్కు, ప్రతి పదార్థం రుచినీ తెలిపే నాలుక, ఈ సృష్టిలో శబ్దాలన్నిటినీ వినిపించే చెవులు, స్పర్శని తెలియజేసే చర్మం...ఈ ఐదిటివల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి)............కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటోంది...అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది.....బహుజీవులుగా పుడుతోంది, చస్తోంది,,మళ్ళాజన్మిస్తోంది.............కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు.అది సర్వదా ఒక్కటే శక్తి.......రూపాన్ని బట్టి, దేశకాల పరిస్థితులని బట్టీ భిన్నమౌతుందే కాని,,,, చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మనిబట్టి మారదు......అదే మహాశక్తి.....ఆమే దుర్గ....

చాల పెద్దమ్మ-------- ఆమె సనాతని....ఇప్పటిదికాదు....ఎప్పటిదో......ఈ సృష్టి ఉన్నప్పుడూ,లేనప్పుడూ ఆమే ఉంది..

సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ ---------- నాకు మొదట్నుంచీ ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చదివితే ఓ లాగా అనిపిస్తాయి......కలిపి చదివితే---- సురారులు అంటే రాక్షసులు..వారి తల్లి దితి...వీళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు,బాధ....మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది మన అమ్మలగన్నయమ్మ(ఆఱడి అంటే గాయం,బాధ....పుచ్చుట అంటే మాన్పటం).............
విడదీసి చదివితే------సురారులమ్మ----ఆ తల్లి దేవతలకే కాదు,రాక్షసులకీ తల్లే....మంచివాళ్ళకీ,చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా!!.....కడుపాఱడి పుచ్చినయమ్మ----మనకి ఏ బాధ వచ్చినా,కష్టమొచ్చినా తీర్చేది ఆ అమ్మేకదా (శ్యామశాస్త్రుల వారి కడుపు బాధ కూడా)...

తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ----- వేల్పుటమ్మల అంటే సర్వదేవతామూర్తులయందు నిలిచిఉండెడిదని.....తనని లోనుగా తలచిన వారికి మనసులోనే నిలిచిఉంటుందని అర్థం.....

కృపాబ్ధియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్------అలాంటి అమ్మవు, మాయమ్మవు, సముద్రమంత కృపతో మాకు సర్వసంపదల్నీ (అంటే ధనమే కాదు,విద్యనీ,కవితా శక్తినీ,ఆయురారోగ్యాల్నీ) ప్రసాదించు తల్లీ!!!


21, జనవరి 2010, గురువారం

కవితా సరస్వతి కన్నీళ్ళు తుడిచిన మన పోతన్నగారు
మా చిన్నప్పుడు, రాత్రిపూట భోజనాలయ్యాక నాన్నగారు పిల్లలందర్నీ ఆరుబయట వెన్నెట్లో కూర్చోబెట్టుకుని,మన పురాణాల్లో కథలు చెప్పేవారు...వట్టి కథలు కాదండోయ్...పద్యాలతో సహా చెప్పేవారు..అందుకే ఆ పద్యాలన్నీ మా బుఱ్ఱల్లోకి తేలిగ్గా ఎక్కేవి...ఓ రోజు నేను "నాన్నా!పోతన్నగారు,ఇన్ని మంచి మంచి కథలు, పద్యాలతో సహా రాశారు కదా!అసలు ఆ పోతన్నగారి కథేంటో చెప్పవూ" అని అడిగా.(అప్పటికి నేను భక్తపోతన సినిమా చూళ్ళేదు)....నాన్న పోతన్నగారి కథంతా చెప్పి పడుకోబెట్టారు....నా మనసులో ఆ కథే తిరుగుతూ ఉంది....ముఖ్యంగా సరస్వతీదేవి పోతన్నగారి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునే సన్నివేశం.....అది గుర్తొస్తుంటే మనసుకు ఏదో తెలియని ఉద్వేగం......లోకంలో ఎక్కడన్నా భక్తుడు వెళ్ళి భగవంతుడితో తన బాధలన్నీ చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు......కానీ ఇక్కడ దేవుడే వచ్చి పోతన్నగారి దగ్గర బాధచెప్పుకున్నాడు....నిజంగా అంత అదృష్టం ఒక్క పోతన్నగారికే దక్కిందేమో....

అసలు పోతన్నగారి దగ్గరికి వచ్చి సరస్వతమ్మ ఏమని బాధపడిందంటే,....."ఏవయ్యా పోతన్నా!లోకంలో కవులందరూ,వాళ్ళ నాలుకల చివర నేను కూర్చుని పలుకుతుంటే, నన్ను,కవితాసరస్వతిని తీసుకెళ్ళి ఈ రాజులకీ,రమణప్పలకీ అమ్మేసి, వాళ్ళిచ్చే కానుకలతో ఆనందిస్తున్నారు.......నువ్వేదో భాగవతాన్ని రాముడికిచ్చి నన్ను సంతోషపెడతావనుకుంటే, నువ్వు కూడా వాళ్ళూ,వీళ్ళూ బలవంతపెట్టారనో, నీకేదో ఇబ్బందులొచ్చాయనో నన్ను ఆ దుష్టరాజులకిచ్చేస్తావా ఏంటి!.....ముందుకంటే ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ దుఃఖంగా ఉందయ్యా...." అందట..

అప్పుడు మన పోతన్నగారు ఏమన్నారంటే,

"కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల!యో మదంబ! యో
హాటకగర్భురాణి!నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ
! "

అప్పుడు సరస్వతీదేవి ఆనందపడి,పోతన్నగారిని ఆశీర్వదించి వెళ్ళిపోయిందట!

తర్వాత తనదగ్గరికి వచ్చి,భాగవతాన్ని రాజుకు అంకితం ఇవ్వమన్నవాళ్ళతో పోతన్నగారు ఇల్లా అన్నారట!

"ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరమువాసి కాలుచే
సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్."


సమ్మతి శ్రీహరి కిచ్చి----నేను భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాను.....నరాంకితం చెయ్యనని ప్రతిజ్ఞ పట్టాను...రాజులకైతే అసలే ఇవ్వను... అసలు రాజులకెందుకివ్వాలి?
పురంబులు వాహనంబులున్ సొమ్ములు----అగ్రహారాలిస్తారని, గుఱ్ఱాలు,నగలు ఇస్తారని....నాకవి అక్కర్లేదు.....దాని దుంపతెగిరితే! వాళ్ళకిస్తే నీకేం నష్టం.....వాళ్ళిచ్చేవి నువ్వు వాడుకోవద్దు....నీ కొడుకులు వాడుకొంటారు.....ఐనాకూడా ఇవ్వనంటావా! ఏం? ఎందుచేత?

ఇ+మనుజేశ్వరాధముల కిచ్చి--------వాళ్ళు పేరుకి మనుజేశ్వరులే కాని వట్టి అధములు..అంటే పాపులు, దుర్జనులు, జారులు, మనుషుల్ని పీడించుకుతింటారు...అధికారంకోసం దుష్టపు పనులెన్నైనా చేస్తారు...వాళ్ళకిస్తే పాపం....అందుకే ఇవ్వను...పైగా వాళ్ళకంకితమిచ్చాననుకోండి, వాళ్ళకు స్వర్గసుఖాలొస్తాయ్...వాళ్ళు నిజంగా దాతలు కారు, నేను వాళ్ళని దాతల్లాగా కనిపించేట్లు చేస్తాను........వాళ్ళ కీర్తి ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండి పోతుంది...వాళ్ళు అన్నాళ్ళూ స్వర్గంలో ఉంటారు.....దాని వల్ల నాకు వచ్చే ఫలితమేంటి?

శరీరము వాసి కాలుచే సమ్మెట పోటులంబడక-------నేను మామూలు జీవుణ్ణి..నాకు కామ,క్రోధాలుంటాయ్...నేనూ కొన్ని పాపాలు చేస్తాను,వాటి వల్ల నరకానికి పోతాను...అవి చాలవన్నట్లు, యముడు(కాలుడంటే యముడు) "పాపులైన రాజులకి నువ్వు మహాభాగవతాన్ని అంకితమిచ్చి, వాళ్ళు స్వర్గంలో ఉండేట్లు చేశావ్" అని నన్ను ఇంకా సమ్మెట పెట్లు పెడతాడు......దారిన పోవు తద్దినమా మాయింటికి రమ్మన్నట్టు- నేను చేసే కర్మప్రకారం నాకొచ్చే ధనం చాలనట్టు,ఈ కొత్త యమబాధలు కొని తెచ్చుకోవడమెందుకు?
అయితే, నువ్వు కావ్యం రాస్తున్నావు.దానివల్ల కొంత పుణ్యం వస్తుంది కదా! ఆ పుణ్యమంతా నువ్వే తీసుకుంటావా? నువ్వు చూస్తుంటే మంచివాడిలా ఉన్నావు....ఆ పుణ్యాన్ని కొంతమందికి పంచిపెట్టొచ్చు కదా! ఆ రామచంద్రుడేంచేసుకుంటాడూ! ఎవరికన్నా నువ్వు మంచివాడనుకున్నవాడికి అంకితమిచ్చి,వాడికి స్వర్గసుఖం చేర్చిపెట్టొచ్చు కదా!అదీ నీకు పుణ్యమే కదా! అంటే అలా కాదు. మరి ఎలా?

జగద్ధితంబుగన్----- నేను భాగవతం లోకహితం కోరి రాస్తున్నాను..ఈ పుణ్యం లోకానికి పంచిపెడ్తాను....ఆ పుణ్యం నేనే తీసుకుంటే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. అదే శ్రీరామచంద్రుడికి ఈ భాగవతాన్నిస్తే, ఈ లోకానికిచ్చినట్టు....ఈ లోకానికిస్తే వాళ్ళు దీనిని చదువుతారు...ఊరికే చదవరు,చింతన చేస్తారు(ఆలోచిస్తారు), భక్తులవుతారు. ఆ పుణ్యం వేలాది పిల్లల్ని పెడుతుంది.........నాతో పాటు లక్షలాదిమంది పుణ్యవంతులవుతారు....అదీ నా ఆకాంక్ష..
ఆహా!అదన్నమాట కారణం....నువ్వు అలా అంటే మేమింకేమంటాం.....మాదీ అదే మాట.......
"లోకాః సమస్తాస్సుఖినోభవంతు"

15, జనవరి 2010, శుక్రవారం

పోతన్నగారి సరస్వతీ ప్రార్థన


పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్

నెట్టంగల్గను గాళిఁగొల్వను బురాణింపన్ దొరంకొంటి మీ

దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్

పట్టున్నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ!దయాంభోనిధీ!
(భాగ - ప్ర -౭)పోతన్న గారు,భాగవతం మొదట్లో రాసిన పద్యాల్లో ఇది కూడా ఒకటి...అసలు ఈ పద్యాలన్నీ ఒకనాడు ప్రతి తెలుగింటా మారుమోగినవే......అసలు ఏ కవీ ఉపోద్ఘాతంగా చెప్పిన పద్యాలు ఇంతగా జనబాహుళ్యంలోకి చొచ్చుకు పోయుండవు......అలా పోతన్నగారి ’వాణి’ ప్రతి తెలుగువాడి నాలుకమీద ఆడి, మనస్సుల్లో పాతుకుపోయింది.....నాకు ఈ పద్యాల్లో ఏది నోట్లో ఆడినా,మాంఛి నల్లచెరుకు రసం నోట్లో నలిగినట్లనిపిస్తుంది.....

ఇది కూడా సరస్వతీ స్తోత్రమే...ముందు రాసిన, "తల్లీ!నిన్ను దలంచి", "క్షోణితలంబునన్" పద్యాలు పోతన్నగారు మనందరి కోసం రాశారు.....ఈ పద్యం మాత్రం తనకోసం రాసుకున్నాడు......ఈ పద్యం చదుతుంటే,నాకు నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయ్....."మన పెద్దవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు.వాళ్ళు ఎన్నో గొప్ప పనులు చేశారు.....మనం వాళ్ళను మించి చెయ్యలేకపోయినా కనీసం వాళ్ళని అనుసరించటానికి ప్రయత్నించాలి....ఒకవేళ చేసినా,వినయంగా అణిగే ఉండాలి....". పోతన్నగారి అణుకువ మనకు ఈ పద్యంలో తెలుస్తుంది.....

పోతన్నగారేమంటున్నారంటే........

పుట్టం బుట్ట----నేను పుట్టలో పుట్టలేదు...అంటే వాల్మీకిని కాదు,ఆయన రామాయణం రాసినంత గొప్పగా రాయలేనుగా...

శరంబునన్ మొలవన్---- శరము అంటే మూడర్థాలున్నయ్.౧)బాణము ౨)నీరు ౩)ఱెల్లు.....ఇక్కడ శరము అంటే ఱెల్లు అని అర్థం. శరవణము అంటే ఱెల్లుతోట......ఈ ఱెల్లుతోటలో పుట్టినవాడెవరు?....శరవణభవుడు--కుమారస్వామి అన్నమాట...నేను ఱెల్లులో మొలవలేదు,అంటే కుమారస్వామిని కాదు.....అసలిక్కడ అందరూ కవులతో కదా పోల్చుకుంటున్నాడు,మధ్యలో కుమారస్వామిని ఎందుకు తీసుకొచ్చినట్టు??....ఏంటీ! కుమారస్వామి కూడా కవా!.........మరి. అలాంటి,ఇలాంటి కవి కాదు.....మహాకవి!!!....స్కాందమహాపురాణం రాశాడు....ఆ స్వామి చెప్పినంత గొప్పగా నేను ఈ భాగవత పురాణం చెప్పలేను కదా!

అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను--------అంభః అంటే నీరు అని అర్థం.......అంభోయాన పాత్రము అంటే పడవ....పడవ కదులుతూ ఉండగా పుట్టినవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తూ వ్యాసమహర్షి.....ఆయన రాసిన సంస్కృత భాగవతాన్ని నేను తెనిగీకరిస్తున్నాను....ఆ మహానుభావుడు రాసినట్టు నేను రాయలేను కదా!

కాళిఁగొల్వను----కాళిని కొలిచి మహాకవి అయిన కాళిదాసునంతటివాడను కాను........

పురాణింపన్ దొరంకొంటి------వీళ్ళలో నేను ఎవ్వరూ కాకపోయినా అంటే వాళ్ళంతటి శక్తి నాకు లేకపోయినా, పురాణం రాయటం ప్రారంభించాను.

మీదెట్టే వెంటఁజరింతు------ఇక్కడ రెండు భావాలున్నాయి...మీదన్+ఎట్టు+ఏ వెంటన్---అంటే పైన చెప్పిన వాళ్ళ బాటలోనే
మీదు+ఎట్టు+ ఏ వెంటన్---తరువాత ఎలా వెళ్తానో,ఎలా రాస్తానో....

తత్సరణి నాకీవమ్మ-----ఆ మహాకవుల మార్గంలోనే నేను నడిచేట్లు చెయ్యి తల్లీ!

మేల్ పట్టున్నాకగుమమ్మ-----నువ్వు కూడా నాలో నిలిచి నన్ను నడిపించవమ్మా!

దయాంభోనిధీ-----కృపకు సముద్రమైన దానా!
ఇంతకీ ఇదంతా ఎవర్ని అడుగుతున్నాడు?
బ్రాహ్మీ!-----బ్రహ్మకు భార్య ఐన సరస్వతీదేవిని........

నమ్మితిఁజుమీ-----అమ్మా!నిన్నే నమ్ముకున్నా....అంతా నీదే భారం...


9, జనవరి 2010, శనివారం

పోతన్నగారి పలుకులు


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగునఁట
పలికెద వేఱొండు గాధఁ బలుకఁగ నేలా.

(భాగ -ప్ర -౧౬)ఇది పోతన్నగారు భాగవతం మొదట్లో ఉపోద్ఘాతంగా రాసిన పద్యాల్లో ఒకటి....భాగవతం గొప్పదనమంతా ఈ పద్యంతో మనకు తెలుస్తుంది.... ఈ పద్యం కూడా పూర్వం, దాదాపు మన తెలుగుబళ్ళన్నిట్లో పిల్లలందరి చేతా కంఠతా పట్టించేవాళ్ళు...వాళ్ళూ అంతే ఉత్సాహంగా నేర్చుకున్నేవాళ్ళు...

నాన్నగారు మా చిన్నప్పుడు ఈ పద్యం చెప్పేప్పుడు, నాకో పే....ద్ద అనుమానం వచ్ఛేది.(అప్ప్తట్లో నా బుజ్జిబుఱ్ఱ నిండా అన్నీ అనుమానాలే). అడిగేసేవాణ్ణి, "నాన్నా! పోతన్నగారు రాముడి భక్తుడు కదా....మరి భాగవతం కృష్ణుడి కథాయె....రాముడి కథ రాయకుండా కృష్ణుడి కథెందుకు రాశాడూ.."అని. దానికి నాన్న నవ్వుతూ, "రాముడు,కృష్ణుడు ఒకటే....వేరు,వేరు కాదు.....అందుకే రాశాడు" అని చెప్పేవారు.....కాని నా బుల్లిబుఱ్ఱకి అంత పేద్ద సమాధానం అర్థమవ్వలా....నేనే ఆలోచించా....చించగా...చించగా....ఓ గొప్ప్ప్ప సమాధానం నా బుఱ్ఱలో వెలిగింది...అదేంటంటే........
’రాముడు,కృష్ణుడు మాంఛి స్నేహితులయ్యుంటారు....రాముడి మీదేమో చా....లామంది పెద్దపేద్ద పుస్తకాలు(రామాయణాలు) రాశారు(వాల్మీకి,ఆంజనేయుడు,తులసీదాసు,మొల్ల,........)..ఆఖరికి మన గురువుగారు,విశ్వనాథవారు కూడా.....మరి కృష్ణుడికేమో ఒఖ్ఖ పుస్తకం కూడా లేదాయె...ఉన్న భారతం ముప్పాతిక వంతు పాండవులకే సరిపోయె...అందుకే పోతన్నగారి దగ్గరికొచ్చి రాముడు "పోతన్న గారూ!మా కృష్ణుడి మీద భాగవతం రాసిపెట్టండి" అని అడిగుంటాడు......కానీ...మన పోతన్నగారు రామభక్తుడు కదా,అందుకే పనిలోపనిగా మధ్యలో రామాయణం కూడా ఇరికించి ఉంటారు’ అని.....

ఇక మన పద్యంలోకొస్తే....గురువుగారు ఏం చెప్పారంటే.....

భాగవతము----భక్తి, జ్ఞానం, వైరాగ్యం...ఈ మూడు తత్త్వాలనీ బోధించేది అని మన పెద్దలు చెప్తుంటారు.....ఇక్కడ పోతన్నగారు పలికేది అటువంటి పుస్తకం.

పలికించెడి వాడు రామభద్రుండట----అసలు పోతన్నగారు పలకటంలేదట!!! శ్రీరామచంద్రుడు పలికిస్తున్నాడట.......అంటే పోతన్నగారు వట్టి సాధనము....కర్త పరమేశ్వరుడు....
విశ్లేషించి చూస్తే......
మనం చేసే ఏ పనికైనా మన శరీరం సాధనం...లోపలున్న జీవుడు కర్త....ఇక్కడ ఆ జీవుడు రెండు రకాలు.....వాడి కర్మవశాన ప్రవర్తించేవాడు ఒకడైతే, భగవంతుడు ఎలా చెయ్యమంటే అలా చేసేవాడు రెండోవాడు.........ఎలా అంటే, మనం "ఏది ఎలా జరిగితే అలా జరగనీ!నాకేం" అని, ఏమీ చెయ్యకుండా కూర్చున్నా,కొన్ని పనులు వాటంతట అవి జరిగిపోతుంటై (శ్వాస పీల్చడం,నాడి కొట్టుకోడంలాంటివి).అవి భగవంతుడు చేయించినట్లే......అలానే రామచంద్రుడు,పోతన్నగారి నోట పలికిస్తున్నాడన్నమాట...

పోతన్నగారిని పండితులు ప్రామాణికుడనరు.....కాదనీ అనరు.....ఆయన స్థితి ఒక సంధిలో ఉంది. కవిత్రయం,సోమన్న,శ్రీనాథుడు,పెద్దన్న మొదలైనవారి రాశిలో, భాషాదృష్టితో పోతన్నగారిని జమకట్టరు....జమకడితే ఏమవుతుంది? అసలు పలికించినవాడు రాముడు కనుక, ఆ రామచంద్రుని ఖర్మకాలి కవిత్రయాదుల వంటివాడు కావాలి...అంతటి రామచంద్రుడు కోరక కోరక మన మహాపండితులు పరిగణించే ప్రామాణిక తెలుగుకవి కావాలని కోరుకోవాలా? కనీసం కాళిదాసు,వ్యాసుడు,వాల్మీకి వంటి వాళ్ళ రాశిలో అన్నా చేరకూడదా? అంతకుమించిన వేదాలు,స్మృతులు రాసిన మహా ఋషులున్నారు.వాళ్ళల్లో ఎందుకు చేరకూడదు? ఏమైతేనేం....పోనివ్వండి....ఆ యోగ్యత అంతటి రాముడికే లేనప్పుడు, ఇక పోతన్నగారికెందుకు???!!!

నే పలికిన భవహరమగునట------అంటే భవబంధాలన్నీ తొలగిపోతాయట...జన్మరాహిత్యమవుతుందట....అంటే, మోక్షం వస్తుందట!--ఎవరికి? తనకొక్కడికేనా? పోతన్నగారు అటువంటి వాడు కాడే! మరి..........
జగద్ధితమ్ముగన్----అని [ముందు "ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి" అన్న పద్యంలో] రాశారు కదా! అంచేత మనందరికీ [భాగవతం చదివిన,విన్న వారందరికీ] కూడా అన్నమాట!

వేఱొండు గాథఁ బలుకఁగ నేలా----ఇంత గొప్ప భాగవతాన్ని చెప్తుంటే, ఇక వేరేవాళ్ళ గురించి(రాజులూ,రమణప్పలూ) చెప్పాల్సిన అవసరమేముంది...అలా చెప్పటంవల్ల వచ్ఛేదేదైనా నిరుపయోగమే......

6, జనవరి 2010, బుధవారం

నల్లనివాఁడు..కృపారసంబు పైఁ జల్లెఁడు వాఁడు


నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెఁడు వాఁడు మౌళి పరిసర్పిత పింఛము వాఁడు నవ్వు రా
జిల్లెఁడుమోము వాఁడొకఁడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ చెప్పరే.
(భాగ-దశ-౧౦౧౩)


ఇది పోతన్న గారి తెలుగు నుఁడికారాన్నంతా చూరయిచ్చే పద్యం..ఈ పద్యం తెలుగువారందరికీ
తప్పకుండా నోటికి రావలసిన పద్యాలలో ఒకటి, అని గురువుగారి అభిప్రాయం..నాది కూడా..


చిన్నప్పుడు మా ఇంట్లో భాగవతం పురాణం చదివేప్పుడు నాన్నగారు మొదట ఈ పద్యం ప్రార్థన గా చదివేవారు.....మేం కూడా గొంతు కలిపేవాళ్ళం...కళ్యాణి రాగం లో ఆ పద్యం చదుతుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది....నా ఊహల్లో పోతన్న గారి 'తెనుఁగు'కృష్ణుడు మల్లెపొదల మాటున నిల్చొని చిరునవ్వులు చిందించేవాడు...

ఒక్క విషయం అస్సలు అర్థం అయ్యేదికాదు,కృష్ణుడు అసలలా వెళ్ళి ఎందుకు దాక్కున్నాడా అని. నాన్న ఈ పద్యానికి అర్థం చెప్పేప్పుడు అమాయకంగా అదే అడిగేవాణ్ణి...ఇంకో అనుమానం కూడా వచ్చేదండోయ్. "నాన్నా!మన టీవీ భారతంలో కృష్ణుడు ఇలా లేడుగా"అని అడిగేవాణ్ణి...నాన్న నవ్వుతూ "ఆయన హిందీ కృష్ణుడు, ఈయన తెలుగు కృష్ణుడు" అని చమత్కారంగా చెప్పేవారు..మా ఊళ్ళో చెన్నకేశవస్వామి కూడా నాకు అచ్చు ఈ పద్యంలోలానే అ(క)నిపించే వాడు...వేయిపడగల్లో వేణుగోపాలస్వామిలా..........నాన్న చెప్పిన గురువుగారి వ్యాఖ్యానంతో నా మొదటి అనుమానం కూడా తీరిపోయింది....

అదేంటంటే.....

ఇది "గోపికా గీతల" లోని మొదటి పద్యం.....

శ్రీ కృష్ణుడు గోపికలతో విహరిస్తూ,విహరిస్తూ మధ్యలో మాయమయ్యాడు..వాళ్ళు వెదకటం మొదలెట్టారు... కనపడ్డ వారినందర్నీ అడుగుతున్నారు...తప్పిపోయిన వాళ్ళ గుర్తులు చెప్పాలిగా మరి, లేకపోతే ఎలా...అందుకే ఇల్లా చెప్పటం మొదలెట్టారు.....

నల్లనివాడు,పద్మనయనమ్ముల వాడు----ఆయన శరీరపు వన్నె,కన్నుల వైశాల్యం చెప్పారు సరే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా బృందావనంలో...(పద్మనయనాలంటే, వైశాల్యమే కాదండీ..ఇంకో అర్థం కూడా ఉంది ...ఆయన కన్నులు మూసి తెరుస్తుంటే, తామర విచ్చుకున్నంత అందంగా ఉందట.నల్లనివాడంటే,పైన బొమ్మలోలా నలుపేనండీ..మన సినిమాల్లోలా నీలం కాదు..అసలు అందం నలుపులోనే ఉంది. )

మౌళి పరిసర్పిత పింఛము వాడు----తలకి నెమలీకలు చుట్టుకున్నాడా..కొంపదీసి అడివిలో తిరిగే చెంచులవాడా ఏంటి...

నవ్వురాజిల్లెడు మోమువాడు---ఎప్పుడూ మోము నవ్వుతున్నట్లే ఉంటుందా,....ఏడ్చినా నవ్వినట్లే ఉంటే ఎలా....ఏంటీ..అసలు ఏడుపు,కోపం రానే రావా...ఏం..భగవంతుడా ఏమి...విడ్డూరంగా ఉందే,భగవంతుడైతే మీకు,మాకు అసలు కనబడతాడా ఏంటి....పిచ్చిగాని పట్టలేదుగా మీకు...

కృపారసమ్ము పై జల్లెడు వాడు-----దయారసమును మన మీద చల్లుచుండునా? ఇదేమి గుర్తు!ఎలా తెలుసుకోవాలి?మనమెలాంటి వాళ్ళమైనా మన మీద దయజూపుతాడన్నమాట....చూపుతున్నట్టు మనకు కనపడతాడన్నమాట.మరి అలాంటి వాడైతే ఖచ్చితంగా భగవంతుడే...మనకెలా కనబడతాడు...మనకు తెలియకుండా మన మీద దయచల్లుచుండును కాబోలు..చేతైతే గుర్తుపట్టాలి...కాని ఎలా?

ఓ మల్లియలార----ఏమిటి?మల్లెలని అడుగుతున్నారా!వాటికేం తెలుస్తుంది! అవేం గుర్తుపడతాయో! ఐనా వాటిని అడగటమెందుకు.....వెనుక దాక్కొనుంటే మీరే చూడొచ్చుగా...ఏంటీ వెనుక కూడా లేడా....మరి ఆ మల్లెపొదలకెలా తెలుస్తుంది....

"అయ్యా!ఇందాకటి నుంచి మా బుఱ్ర తింటున్నావు...చెప్తాం విను....మల్లియలకు కూడా ప్రాణం ఉంటుంది...చైతన్యం ఉంటుంది..మనలో,మానవుల్లో భగవంతుని లక్షణం తెలుసుకోలేని వాళ్ళు ఎక్కువమంది ఉంటారు...కాని లతాతరువులలో ఉండటం జరగదు..మన అనుభూతి కృతకం...అవి మాత్రం భగవంతుని దయని సహజంగా అనుభవిస్తాయి...ఎలా అంటే పెద్దవాళ్ళ దయానిర్దయలు చిన్నపిల్లలు ఎలా సహజంగా అనుభవిస్తారో అలా అన్నమాట....................!!!!!!!!!!!!!!!!!!!!!!!....ఓహో! ఇప్పుడు తెలిసిందయ్యా, కృష్ణుడు ఎందుకు మాయమయ్యడో.....ఆ భగవంతుడు మాలోనే ఉన్నాడు.....ఆత్మశోధన చేసి కనుగొనమని కాబోలు...అలాగే...వెళుతున్నాం.....మాలోనే వెతుక్కుంటాం కృష్ణుణ్ణి......."


హమ్మయ్య నా అనుమానం తీరిపోయిందోచ్......మరి మీది...

4, జనవరి 2010, సోమవారం

చదువుల తల్లి
తల్లీ ! నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్త్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!ఇది మన తెలుగు వారి సరస్వతీ స్తోత్రం..మనకు చాలా సరస్వతీ స్తోత్రాలు తెలుసు.అన్నీదాదాపు సంస్కృతం లోనే.


పూర్వం మన తెలుగిళ్ళల్లో పిల్లవాడికి మొదట పుస్తకం పట్టించేప్పుడు ఈ పద్యం చెప్పేవాళ్ళు..ఇక రోజూ బళ్ళో మొదట పొత్తం తియ్యగానే ఈ పద్యం గాఠ్ఠిగా చదివి అప్పుడు మిగతా చదువు మొదలెట్టేవాళ్ళు....


మేం కూడా పొద్దున్నే పుస్తకం తీసే ముందు ఈ పద్యం స్పష్టంగా చదవాల్సిందే...బాగా గుర్తు..నాన్నగారు ఎదురుగా నుంచునేవారు(ఒక్కోసారి కఱ్ర కూడా పట్టుకునేవారనుకోండి).నేను,అన్నయ్య పోటీపడి,ఇంటికప్పు లేచిపోయేంత పెద్దగా చదివేవాళ్ళం...ఇలా చదివితే మాట స్పష్టంగా వస్తుందని,చదివింది బాగా బుఱ్రకెక్కుతుందని నాన్న చెప్పేవారు..ఇప్పటికీ నేను పొద్దున్నే పూజలో ఈ పద్యం చదవాల్సిందే....


ఇక గురువుగారి వ్యాఖ్యానానికొస్తే.....


ఉల్లము అంటే హృదయం అని అర్థం..బుద్ధ్హ్హ్హి అని కూడా......హృదయం,బుద్ద్హ్హి,మనసు ఈ మూడూ ఎప్పుడూ కలిసే ఉంటాయి....అందుకని అమ్మని అక్కడ నిల్చి ఉండి,ప్రతిమాటా ఒద్దికగా పలికింపమని కోరటం అన్నమాట.


ఉక్తుల్-మాటలు...
జృంభణముగా-విస్పష్టంగా,అంటే నాభి దగ్గర పుట్టిన శబ్దం పూర్తిగా గాలితో నిండి,ఎటువంటి వాక్కు దోషాలూ లేకుండా
వాగ్దోషాలు చాలా ఉన్నాయి...నంగి,నత్తి, నాలుక మందంగా ఉండి మాట ముద్దగా రావటం...అసలు గొంతులో శక్తి తక్కువై మాట సన్నగా రావటం...ఇలా

సుశబ్దమ్ము- అంటే ప్రతి శబ్దంలో అన్ని అక్షరాలూ,అవయవాలూ,ప్రత్యయాలూ ఖచ్చితంగా పలకాలి,,,అప్పుడే ఆర్థం సరిగ్గా వస్తుంది...లేకపోతే రాదు.(మన టీవి యాంకర్లు పెళ్ళిని పెల్లి అన్నట్టు)


జగన్మోహినీ- ఇక్కడ భావమేమిటంటే, వాణి అంటే మాట..కొంతమంది ఉపన్యాసం చెప్తుంటే సంగీతంలా ఉంటుంది...అర్థం,భావం చక్కగా తెలుస్తాయి. జనం మూగి వింటారు...అలా ఆకర్షించగలిగే మాటని ప్రసాదించమని ప్రార్థించడం...మనకి ఒక సామెత ఉంది.."నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది"


ఫుల్లాబ్జాక్షీ- ఫుల్ల అంటే వికసించిన అని అర్థం....వికసించిన తామర వంటి కన్నులు కలది అని శబ్దార్థం.....
లోతుకు వెళితే, అక్షి అంటే దూరంగా వ్యాపించునది అని అర్థం...అంటే వాక్కు చాలా దూరం వ్యాపిస్తుంది....కాలంలో,దూరంలో రెంటిలో కూడా,(ఆనాటి వేదాలు ఇప్పటికీ ఉన్నయి,అన్ని దేశాలకి వెళ్తున్నయి)అంటే మన వాక్కుకి కూడా అంతగా వ్యాపించే కీర్తిని ఇవ్వమని కోరుకోవటం......

పూర్ణేందుబింబాననా- పున్నమి చంద్రుని వంటి మోము కలదానా అని అర్థం.....గూఢార్థమేంటంటే, సంపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించమని..ఈ పద్యాన్ని భావయుక్తంగా,రోజూ చదివితే వాగ్దోషాలన్నీ తొలగిపొయి,మంచి జ్ఞానం కలుగుతుందని నానుడి.

ఏవైనా తప్పులుంటే, మన్నించి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.

ఆచార్య దేవోభవ


గురుః బ్రహ్మః గురుర్విష్ణుః

గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మః

తస్మైః శ్రీ గురవే నమః