ఆచార్య దేవోభవ
15, జనవరి 2010, శుక్రవారం
పోతన్నగారి సరస్వతీ ప్రార్థన
పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్
నెట్టంగల్గను గాళిఁగొల్వను బురాణింపన్ దొరంకొంటి మీ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్
పట్టున్నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ!దయాంభోనిధీ!
(భాగ - ప్ర -౭)
పోతన్న గారు,భాగవతం మొదట్లో రాసిన పద్యాల్లో ఇది కూడా ఒకటి...అసలు ఈ పద్యాలన్నీ ఒకనాడు ప్రతి తెలుగింటా మారుమోగినవే......అసలు ఏ కవీ ఉపోద్ఘాతంగా చెప్పిన పద్యాలు ఇంతగా జనబాహుళ్యంలోకి చొచ్చుకు పోయుండవు......అలా పోతన్నగారి ’వాణి’ ప్రతి తెలుగువాడి నాలుకమీద ఆడి, మనస్సుల్లో పాతుకుపోయింది.....నాకు ఈ పద్యాల్లో ఏది నోట్లో ఆడినా,మాంఛి నల్లచెరుకు రసం నోట్లో నలిగినట్లనిపిస్తుంది.....
ఇది కూడా సరస్వతీ స్తోత్రమే...ముందు రాసిన, "తల్లీ!నిన్ను దలంచి", "క్షోణితలంబునన్" పద్యాలు పోతన్నగారు మనందరి కోసం రాశారు.....ఈ పద్యం మాత్రం తనకోసం రాసుకున్నాడు......ఈ పద్యం చదుతుంటే,నాకు నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయ్....."మన పెద్దవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు.వాళ్ళు ఎన్నో గొప్ప పనులు చేశారు.....మనం వాళ్ళను మించి చెయ్యలేకపోయినా కనీసం వాళ్ళని అనుసరించటానికి ప్రయత్నించాలి....ఒకవేళ చేసినా,వినయంగా అణిగే ఉండాలి....". పోతన్నగారి అణుకువ మనకు ఈ పద్యంలో తెలుస్తుంది.....
పోతన్నగారేమంటున్నారంటే........
పుట్టం బుట్ట----నేను పుట్టలో పుట్టలేదు...అంటే వాల్మీకిని కాదు,ఆయన రామాయణం రాసినంత గొప్పగా రాయలేనుగా...
శరంబునన్ మొలవన్---- శరము అంటే మూడర్థాలున్నయ్.౧)బాణము ౨)నీరు ౩)ఱెల్లు.....ఇక్కడ శరము అంటే ఱెల్లు అని అర్థం. శరవణము అంటే ఱెల్లుతోట......ఈ ఱెల్లుతోటలో పుట్టినవాడెవరు?....శరవణభవుడు--కుమారస్వామి అన్నమాట...నేను ఱెల్లులో మొలవలేదు,అంటే కుమారస్వామిని కాదు.....అసలిక్కడ అందరూ కవులతో కదా పోల్చుకుంటున్నాడు,మధ్యలో కుమారస్వామిని ఎందుకు తీసుకొచ్చినట్టు??....ఏంటీ! కుమారస్వామి కూడా కవా!.........మరి. అలాంటి,ఇలాంటి కవి కాదు.....మహాకవి!!!....స్కాందమహాపురాణం రాశాడు....ఆ స్వామి చెప్పినంత గొప్పగా నేను ఈ భాగవత పురాణం చెప్పలేను కదా!
అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను--------అంభః అంటే నీరు అని అర్థం.......అంభోయాన పాత్రము అంటే పడవ....పడవ కదులుతూ ఉండగా పుట్టినవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తూ వ్యాసమహర్షి.....ఆయన రాసిన సంస్కృత భాగవతాన్ని నేను తెనిగీకరిస్తున్నాను....ఆ మహానుభావుడు రాసినట్టు నేను రాయలేను కదా!
కాళిఁగొల్వను----కాళిని కొలిచి మహాకవి అయిన కాళిదాసునంతటివాడను కాను........
పురాణింపన్ దొరంకొంటి------వీళ్ళలో నేను ఎవ్వరూ కాకపోయినా అంటే వాళ్ళంతటి శక్తి నాకు లేకపోయినా, పురాణం రాయటం ప్రారంభించాను.
మీదెట్టే వెంటఁజరింతు------ఇక్కడ రెండు భావాలున్నాయి...మీదన్+ఎట్టు+ఏ వెంటన్---అంటే పైన చెప్పిన వాళ్ళ బాటలోనే
మీదు+ఎట్టు+ ఏ వెంటన్---తరువాత ఎలా వెళ్తానో,ఎలా రాస్తానో....
తత్సరణి నాకీవమ్మ-----ఆ మహాకవుల మార్గంలోనే నేను నడిచేట్లు చెయ్యి తల్లీ!
మేల్ పట్టున్నాకగుమమ్మ-----నువ్వు కూడా నాలో నిలిచి నన్ను నడిపించవమ్మా!
దయాంభోనిధీ-----కృపకు సముద్రమైన దానా!
ఇంతకీ ఇదంతా ఎవర్ని అడుగుతున్నాడు?
బ్రాహ్మీ!-----బ్రహ్మకు భార్య ఐన సరస్వతీదేవిని........
నమ్మితిఁజుమీ-----అమ్మా!నిన్నే నమ్ముకున్నా....అంతా నీదే భారం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
once more :)
రిప్లయితొలగించండిచాలా బావుందండి.
రిప్లయితొలగించండిమీ వివరణ చాలా బాగుందండీ.
రిప్లయితొలగించండిచాలా గొప్పగా విశదీకరించారు
రిప్లయితొలగించండిడాక్టర్ గారికి ఇంత విశ్లేషించడానికి సమయమెక్కడైదా అని ఒక పక్క ఆశ్చర్యంగానూ, ఇంత సౌందర్య భరితంగా రాస్తున్నందుకు ఆనందంగానూ, ఇంత బాగా రాయలేకపోతున్నందుకు జెలసీ గానూ....కౌటిల్యా, రక రకాలుగా ఉందనుకోండి!
రిప్లయితొలగించండిరసాలూరే పోతన పద్యాన్ని ఇంత అందంగా వివరించినందుకు మరో సారి చప్పట్లు!
chaala baagundi
రిప్లయితొలగించండిdaya chesi ilaa vaaraaniki 3 or 4 padyaalu cheppandi
thank you
బావుంది కౌటిల్య గారు
రిప్లయితొలగించండితెలుగువారందరూ చదవదగిన బ్లాగ్.తెలుగుతనమును తెలిపే బ్లాగ్. తెలుగుసొబగులు తెలిపే బ్లాగ్. చక్కని వ్యాఖ్య. చిక్కని భావం.డాక్టర్‌గారూ!బహుపరాక్. మా అందరికోసం మీరలా రాస్తూనే ఉండండి. ధన్యులం.
రిప్లయితొలగించండిచాలా చక్కని బ్లాగ్ చూసామండి పండుగరోజు
రిప్లయితొలగించండి@మురళి,@అశ్విన్,@సుజాత గారు
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహంతోనే,బ్లాగు మొదలెట్టా...నా ప్రతి టపా చదివి,వ్యాఖ్యలు పెట్టి నన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు...
@నరసింహ గారు,
మీలాంటి పెద్దల దగ్గర్నుంచి కామెంట్ అందుకోడం చాలా ఆనందంగా ఉందండీ...
@SRగారు,
ధన్యవాదాలండీ..
@అజ్ఞాత గారు,
ధన్యవాదాలు..వారానికి మరీ ౩-౪ అంటే కష్టం అవుతుందండీ..వీలు దొరికినప్పుడల్లా తప్పకుండా రాస్తుంటాను..
@పాండురంగ శర్మ గారు,
మీలాంటి పెద్దలు నా బ్లాగు చదివి..వ్యాఖ్య పెట్టడం చాలా ఆనందంగా ఉంది...
@కొత్తపాళీ గారు,
రిప్లయితొలగించండిమీ అభిమానానికి ధన్యవాదాలు....మీరు నాన్నగారి గురించి అడిగారు కదా..నాన్నగారు నాకు మంచి స్నేహితుడు,మార్గదర్శి,...ఈ రోజు రెండు తెలుగు మాటలు రాయగల్గుతున్నానంటే,కారణం నాన్నగారే...తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న సాహిత్యజ్ఞానాన్ని,మాకు అరటిపండు వలిచిపెట్టినట్టు అందించేవారు..నాన్నగారు విశ్వనాథవారి ఏకలవ్యశిష్యులు..అలానే మేం కూడా..వృత్తిపరంగా ప్రభుత్వోద్యోగి(bsnl)...మహర్షి ప్రోక్తమైన జ్యోతిషం,వాస్తుల్లో దిట్ట...ఇదండీ నాన్నగారి గురించి క్లుప్తంగా...వివరంగా ఎప్పుడైనా ఓ టపా రాస్తాను....
కౌటిల్య గారు, మీరు చేస్తున్నది చాలా మంచి ప్రయత్నం. తప్పకుండా మీ నాన్నగారి గురించి కూడా రాయండి. తెలుసుకుంటాం.
రిప్లయితొలగించండిఅందమైన పద్యాలను ఇలా వ్యాఖ్యానంతో సహా చదువుకొని ఆనందించే అవకాశాన్ని కలిగిస్తున్నారు. మీకు నా అభినందనలు. మీకు ప్రేరణ కలిగించిన మీ గురువు గారు స్వర్గలోకవాసి అయిన విశ్వనాథ వారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిఅసలు గ్రాంథిక తెలుగంటే జనాల్ని భయపెట్టిన వాళ్ళ మీద కోపం వస్తుంది నాకు ఈ టపాను చూస్తుంటే...ఇంతటి మాధుర్యం ఇప్పటి భాషలో నాకు కనిపించదు.
రిప్లయితొలగించండిadhbutham kautilya gaaru
రిప్లయితొలగించండికౌటిల్యా,
రిప్లయితొలగించండినిజంగా మాటలు లేవు నా దగ్గర..... మా కౌటిల్యుడేనా ఈ బ్లాగు రాస్తున్నది అన్న ఆశ్చర్యం నుండీ ఇంకా తేరుకోలేదు... దాదాపు నువ్వు బ్లాగు మొదలుపెట్టి నెల దాటుతున్నా కనీసం ఇటువైపు చూడనందుకు కాస్త బాధగా అనిపించింది ( కొత్త వ్యాపారం మొదలవటం, ఇంట్లో ఇంకా ఇంటర్నెట్ రాకపోవటం వగైరా వగైరా ఇలా అనేక కారణాల వలన నీ బ్లాగ్ చూడలేకపోయాను సోదరా!!!)
అందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది- కౌటిల్య చాలా బాగా రాస్తున్నాడు అని--- ఇప్పటివరకు ఇంకా నువ్వు రాసిన విషయాలను పూర్తిగా చదవలేదు కానీ పైపైన చూశాను ఇప్పుడే.... సుజాత గారు, చదువరి గారు, సోదరులు మురళీ, అశ్విన్ & రవిచంద్రల వ్యాఖ్యలు చూస్తేనే అర్ధం అయ్యింది బాగా రాస్తున్నావని....
ఇలాగే విశ్వనాధుల వారి సాహిత్యాన్నీ, పట్టు తేనె లాంటి తెలుగు పద్యం అందచందాలనూ అందరికీ అందిస్తావని ఆశిస్తూ.....
సతీష్ కుమార్ యనమండ్ర
(బ్లాగుని ఆలస్యంగా చూసినందుకు క్షమించు సోదరా)
super(5)
రిప్లయితొలగించండిAswin budaraju garu.. Mee blogs anni chadivanu.. Chala chala bavunnayandi.. Mimmalni google lo antha vethikanu. Almost anni kuda chadivesanandi. Mimmalni facebook lo kuda vethikanu, but meerandulo leranukunta. Meeru inka active ga kathalu rasthunte na email "sreenivas.c84@gmail.com" ki url send cheyagalarani ashisthunna..
తొలగించండిMee abhimani.. Sreenivas