ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

6, జనవరి 2010, బుధవారం

నల్లనివాఁడు..కృపారసంబు పైఁ జల్లెఁడు వాఁడు


నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెఁడు వాఁడు మౌళి పరిసర్పిత పింఛము వాఁడు నవ్వు రా
జిల్లెఁడుమోము వాఁడొకఁడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ చెప్పరే.
(భాగ-దశ-౧౦౧౩)


ఇది పోతన్న గారి తెలుగు నుఁడికారాన్నంతా చూరయిచ్చే పద్యం..ఈ పద్యం తెలుగువారందరికీ
తప్పకుండా నోటికి రావలసిన పద్యాలలో ఒకటి, అని గురువుగారి అభిప్రాయం..నాది కూడా..


చిన్నప్పుడు మా ఇంట్లో భాగవతం పురాణం చదివేప్పుడు నాన్నగారు మొదట ఈ పద్యం ప్రార్థన గా చదివేవారు.....మేం కూడా గొంతు కలిపేవాళ్ళం...కళ్యాణి రాగం లో ఆ పద్యం చదుతుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది....నా ఊహల్లో పోతన్న గారి 'తెనుఁగు'కృష్ణుడు మల్లెపొదల మాటున నిల్చొని చిరునవ్వులు చిందించేవాడు...

ఒక్క విషయం అస్సలు అర్థం అయ్యేదికాదు,కృష్ణుడు అసలలా వెళ్ళి ఎందుకు దాక్కున్నాడా అని. నాన్న ఈ పద్యానికి అర్థం చెప్పేప్పుడు అమాయకంగా అదే అడిగేవాణ్ణి...ఇంకో అనుమానం కూడా వచ్చేదండోయ్. "నాన్నా!మన టీవీ భారతంలో కృష్ణుడు ఇలా లేడుగా"అని అడిగేవాణ్ణి...నాన్న నవ్వుతూ "ఆయన హిందీ కృష్ణుడు, ఈయన తెలుగు కృష్ణుడు" అని చమత్కారంగా చెప్పేవారు..మా ఊళ్ళో చెన్నకేశవస్వామి కూడా నాకు అచ్చు ఈ పద్యంలోలానే అ(క)నిపించే వాడు...వేయిపడగల్లో వేణుగోపాలస్వామిలా..........నాన్న చెప్పిన గురువుగారి వ్యాఖ్యానంతో నా మొదటి అనుమానం కూడా తీరిపోయింది....

అదేంటంటే.....

ఇది "గోపికా గీతల" లోని మొదటి పద్యం.....

శ్రీ కృష్ణుడు గోపికలతో విహరిస్తూ,విహరిస్తూ మధ్యలో మాయమయ్యాడు..వాళ్ళు వెదకటం మొదలెట్టారు... కనపడ్డ వారినందర్నీ అడుగుతున్నారు...తప్పిపోయిన వాళ్ళ గుర్తులు చెప్పాలిగా మరి, లేకపోతే ఎలా...అందుకే ఇల్లా చెప్పటం మొదలెట్టారు.....

నల్లనివాడు,పద్మనయనమ్ముల వాడు----ఆయన శరీరపు వన్నె,కన్నుల వైశాల్యం చెప్పారు సరే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా బృందావనంలో...(పద్మనయనాలంటే, వైశాల్యమే కాదండీ..ఇంకో అర్థం కూడా ఉంది ...ఆయన కన్నులు మూసి తెరుస్తుంటే, తామర విచ్చుకున్నంత అందంగా ఉందట.నల్లనివాడంటే,పైన బొమ్మలోలా నలుపేనండీ..మన సినిమాల్లోలా నీలం కాదు..అసలు అందం నలుపులోనే ఉంది. )

మౌళి పరిసర్పిత పింఛము వాడు----తలకి నెమలీకలు చుట్టుకున్నాడా..కొంపదీసి అడివిలో తిరిగే చెంచులవాడా ఏంటి...

నవ్వురాజిల్లెడు మోమువాడు---ఎప్పుడూ మోము నవ్వుతున్నట్లే ఉంటుందా,....ఏడ్చినా నవ్వినట్లే ఉంటే ఎలా....ఏంటీ..అసలు ఏడుపు,కోపం రానే రావా...ఏం..భగవంతుడా ఏమి...విడ్డూరంగా ఉందే,భగవంతుడైతే మీకు,మాకు అసలు కనబడతాడా ఏంటి....పిచ్చిగాని పట్టలేదుగా మీకు...

కృపారసమ్ము పై జల్లెడు వాడు-----దయారసమును మన మీద చల్లుచుండునా? ఇదేమి గుర్తు!ఎలా తెలుసుకోవాలి?మనమెలాంటి వాళ్ళమైనా మన మీద దయజూపుతాడన్నమాట....చూపుతున్నట్టు మనకు కనపడతాడన్నమాట.మరి అలాంటి వాడైతే ఖచ్చితంగా భగవంతుడే...మనకెలా కనబడతాడు...మనకు తెలియకుండా మన మీద దయచల్లుచుండును కాబోలు..చేతైతే గుర్తుపట్టాలి...కాని ఎలా?

ఓ మల్లియలార----ఏమిటి?మల్లెలని అడుగుతున్నారా!వాటికేం తెలుస్తుంది! అవేం గుర్తుపడతాయో! ఐనా వాటిని అడగటమెందుకు.....వెనుక దాక్కొనుంటే మీరే చూడొచ్చుగా...ఏంటీ వెనుక కూడా లేడా....మరి ఆ మల్లెపొదలకెలా తెలుస్తుంది....

"అయ్యా!ఇందాకటి నుంచి మా బుఱ్ర తింటున్నావు...చెప్తాం విను....మల్లియలకు కూడా ప్రాణం ఉంటుంది...చైతన్యం ఉంటుంది..మనలో,మానవుల్లో భగవంతుని లక్షణం తెలుసుకోలేని వాళ్ళు ఎక్కువమంది ఉంటారు...కాని లతాతరువులలో ఉండటం జరగదు..మన అనుభూతి కృతకం...అవి మాత్రం భగవంతుని దయని సహజంగా అనుభవిస్తాయి...ఎలా అంటే పెద్దవాళ్ళ దయానిర్దయలు చిన్నపిల్లలు ఎలా సహజంగా అనుభవిస్తారో అలా అన్నమాట....................!!!!!!!!!!!!!!!!!!!!!!!....ఓహో! ఇప్పుడు తెలిసిందయ్యా, కృష్ణుడు ఎందుకు మాయమయ్యడో.....ఆ భగవంతుడు మాలోనే ఉన్నాడు.....ఆత్మశోధన చేసి కనుగొనమని కాబోలు...అలాగే...వెళుతున్నాం.....మాలోనే వెతుక్కుంటాం కృష్ణుణ్ణి......."


హమ్మయ్య నా అనుమానం తీరిపోయిందోచ్......మరి మీది...

12 కామెంట్‌లు:

 1. అద్భుతం కౌటిల్య. ఒక మెడికో వ్రాసిన పోస్టు ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మన జనరేషన్ సాహిత్యాన్ని,పురాణాలని వదిలేసారనేవాళ్ళకి నువ్వొక సమాధానం. నీ మార్గంలో మమ్మల్ని నడిపించి ఇలాంటి పద్యాలు మాకు తెలిసేలా చెయ్యు. బిందువు బిందువు కూడగడితే ఒక సింధువవుతుంది.

  రిప్లయితొలగించండి
 2. చాలా చాలా ధన్యవాదాలు మురళీ...తప్పకుండా తీరిక దొరికినప్పుడల్లా రాస్తుంటా..నాకు కావల్సిన్ది కూడా ఇదే..మన తరం వాళ్ళు కూడా మన సాహిత్యాన్ని,అందులో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలనే..

  రిప్లయితొలగించండి
 3. కంగ్రాట్స్ కౌటిల్యా! ఒక డాక్టర్ గారు రాసిన బ్లాగ్ పోస్టు లాగే ఉంది. తెలుగులో డాక్టరేట్ తీసుకున్న డాక్టర్ రాసిన పోస్టులా!

  చాలా చాలా బావుంది.ఇలానే మంచి రసాలూరు పద్యాలను మాకు అందిస్తూ ఉండండి.

  రిప్లయితొలగించండి
 4. చాలా ధన్యవాదాలు సుజాత గారూ...అంతా మీ ప్రోత్సాహమేనండీ..తెలుగులో,సంస్కృతంలో డాక్టరేట్ చెయ్యాలని చిన్నప్పుడు కోరికుండేది..అది ఇవ్వళ తీరిపోయిందండీ, మీరిచ్చిన కితాబుతో...

  రిప్లయితొలగించండి
 5. బాగా రాసారండి. పద్యార్థాలను విడమర్చి చెప్పే మరో బ్లాగన్నమాట.

  అన్నట్టు, ఈ "నవ్వు రాజిల్లెడి మోము" అనేమాట చదవగానే ఉషశ్రీ గుర్తుకొస్తాడు. కృష్ణుడి గురించి చెప్పేటపుడు నవ్వు రాజిల్లెడి మోముతో అని ఆయన ఎక్కువగా వాడేవాడు.

  అలాగే "కృపారసంబు పై జల్లెడివాడు" అనే ముక్క చదవగానే చంద్రమోహన్ గారి (చంద్రిమ బ్లాగు) టపా ఒకటి గుర్తుకొచ్చింది. "జేశ్వరాధములూ, జల్లెడు మోము వాడూ!" అనే ఆ టపా ఓసారి చూడండి. చంద్రిమలో చక్కని పద్య విశేషాలు చూడొచ్చు మీరు.

  రిప్లయితొలగించండి
 6. అవునండీ..మాకూ చిన్నప్పుడు ఇలానే గజిబిజిగా ఉండేది..కాని నాన్నగారు ప్రతి పద్యం చెప్పేప్పుడు,అర్థవంతంగా ఎలా చదవాలో చెప్పేవారు..తర్వాత భాష బాగా తెలిసిన తర్వాత అదే అలవాటైపోయింది..

  రిప్లయితొలగించండి
 7. చాలా బాగుందండి. పోతన గారి భాగవతంలో ప్రతి పద్యం ఒక అమృత భాండమే. వాటి మధురిమలను బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు మొదలైన వారి అద్భుత ప్రవచనాల రూపంలో వింటూ వస్తుంది. ఇలా ఇప్పుడు మీరు ఒక్కో భాగవత పద్యాన్ని వ్యాఖ్యానించడం చాలా అనందాన్నిస్తుంది. ఇలాంటి మరిన్ని మధురిమలను మాకు అందించాలని కోరుకుంటూ...

  రిప్లయితొలగించండి
 8. ధన్యవాదాలు రాజన్ గారూ..కాని ఇది పూర్తిగా నా వ్యాఖ్యానం కాదండీ..గురువు గారు చెప్పిందానికి నా ఊహలని జోడించి రాస్తున్నానంతే..వీలు దొరికినప్పుడల్లా తప్పకుండా రాస్తుంటానండీ..

  రిప్లయితొలగించండి
 9. ద్రాక్షాపాకంలా ఉంది మీ వ్యాఖ్యానం. తెలుగు భాషపై మంచి ఆసక్తి ఉండి పద్యాలను చదివి అర్థం చేసుకోవడానికి బద్దకించే వాళ్ళను మీ బ్లాగు వైపుకు లాగండి. :-)

  రిప్లయితొలగించండి
 10. కౌటిల్య చాలా బా రాస్తున్నారు. నేను ముందే ఊహించాను. మీరు ఇలా రాయగలరని. గుడ్ గోయింగ్

  రిప్లయితొలగించండి
 11. చాలా బాగా రాస్తున్నారు, చిరపరిచయమైన పద్యాలనీ, ఇంతకు ముందు కనబడని పద్యాలనీ.
  సంతోషం.
  ఇప్పటికే మీ నాయనగారి ప్రసక్తి చాలా సార్లు తెచ్చారు. వారిని గురించి ఏమైనా చెప్పండి.

  రిప్లయితొలగించండి
 12. కౌటిల్య గారు మీ లో ఇంత సాహిత్యం దాగి ఉందని నాకు ఇవ్వాల్టి వరకు తెలియలేదు సుమండీ . ఇక నుండి మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతానండి

  రిప్లయితొలగించండి