ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

28, జనవరి 2010, గురువారం

అమ్మలగన్నయమ్మఅమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
(భాగ -ప్ర -౮)

ఇది దుర్గాదేవి స్తోత్రం...."అమ్మ" అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన పోతన్న గారి అసమాన ప్రతిభ....భక్తుడికీ,భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి పిలుపు....,"దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా,ప్రేమగా పిలుచుకునే భావనని,భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు నా శతకోటి వందనాలు......ఈ పద్యం రాసిందెవరో తెలియకపోయినా కూడా ఎప్పుడోకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడుండనుకుంటా.....నా నిత్యపూజలో ఎన్ని స్తోత్రాలు చదివినా,ఎన్ని మంత్రాలు జపించినా,,’అమ్మ’పూజ మొదలెట్టేది మాత్రం ఈ తియ్యటి పిలుపుతోనే..ఈ మహామంత్రంతోనే....

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ------ అసలు స్త్రీ దేవతలంతా దుర్గనుండే పుట్టారట!! లక్ష్మీ,సరస్వతీ,పార్వతులు..చిట్టచివరకు గంగానమ్మ వరకు గూడా దుర్గమ్మ అంశతో పుట్టినవారేనట!! అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింపబడ్డది........ పురుష లక్షణంకల దేవతలందఱు విష్ణువునుండి గాని,శివుడినుండి గాని పుట్టినట్టు చెప్పబడరు.... కాని కాళీ,దుర్గ,లలిత,మహేశ్వరి,పార్వతి,లక్ష్మి,సరస్వతి మొదలైన దేవతలు..వారాహి,చండీ,బగళా మొదలైన మాతలు....రేణుక ఇత్యాది శక్తులు...చివరకు గ్రామదేవతలు కూడా శ్రీమహాదుర్గా దేవతాంశసంభూతులుగా చెప్పబడతారు...దీనికి కారణమేంటి?
ఏంటంటే...
ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది....పురుషుడు ప్రాణదాత, స్త్రీ శరీరదాత్రి.....అసలు ఈ కార్యకారణ సంఘాతమంతా పంచభూతాలనుండి పుడుతోంది.....చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు..............కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం...అంతా ఒక ముద్ద...ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహారమై, పంచేంద్రియ లక్షణ భూతమై పుడుతోంది....(పంచభూతాలంటే భూమి,గాలి,నీరు,అగ్ని,ఆకాశం....పంచేంద్రియాలంటే ప్రపంచాన్ని చూసే కళ్ళు, రకరకాల వాసనలు పీల్చే ముక్కు, ప్రతి పదార్థం రుచినీ తెలిపే నాలుక, ఈ సృష్టిలో శబ్దాలన్నిటినీ వినిపించే చెవులు, స్పర్శని తెలియజేసే చర్మం...ఈ ఐదిటివల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి)............కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటోంది...అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది.....బహుజీవులుగా పుడుతోంది, చస్తోంది,,మళ్ళాజన్మిస్తోంది.............కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు.అది సర్వదా ఒక్కటే శక్తి.......రూపాన్ని బట్టి, దేశకాల పరిస్థితులని బట్టీ భిన్నమౌతుందే కాని,,,, చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మనిబట్టి మారదు......అదే మహాశక్తి.....ఆమే దుర్గ....

చాల పెద్దమ్మ-------- ఆమె సనాతని....ఇప్పటిదికాదు....ఎప్పటిదో......ఈ సృష్టి ఉన్నప్పుడూ,లేనప్పుడూ ఆమే ఉంది..

సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ ---------- నాకు మొదట్నుంచీ ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చదివితే ఓ లాగా అనిపిస్తాయి......కలిపి చదివితే---- సురారులు అంటే రాక్షసులు..వారి తల్లి దితి...వీళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు,బాధ....మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది మన అమ్మలగన్నయమ్మ(ఆఱడి అంటే గాయం,బాధ....పుచ్చుట అంటే మాన్పటం).............
విడదీసి చదివితే------సురారులమ్మ----ఆ తల్లి దేవతలకే కాదు,రాక్షసులకీ తల్లే....మంచివాళ్ళకీ,చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా!!.....కడుపాఱడి పుచ్చినయమ్మ----మనకి ఏ బాధ వచ్చినా,కష్టమొచ్చినా తీర్చేది ఆ అమ్మేకదా (శ్యామశాస్త్రుల వారి కడుపు బాధ కూడా)...

తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ----- వేల్పుటమ్మల అంటే సర్వదేవతామూర్తులయందు నిలిచిఉండెడిదని.....తనని లోనుగా తలచిన వారికి మనసులోనే నిలిచిఉంటుందని అర్థం.....

కృపాబ్ధియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్------అలాంటి అమ్మవు, మాయమ్మవు, సముద్రమంత కృపతో మాకు సర్వసంపదల్నీ (అంటే ధనమే కాదు,విద్యనీ,కవితా శక్తినీ,ఆయురారోగ్యాల్నీ) ప్రసాదించు తల్లీ!!!


19 కామెంట్‌లు:

 1. ఈ ఐదిటివల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి)...
  మనోవికాసాలు అంటే ఇంకా బాగుంటుందేమో . చక్కగా వ్రాసారు. నాకయితే సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ - విడతీసిన అర్ధం బాగుంది.
  థాంక్స్
  రామకృష్ణ

  రిప్లయితొలగించండి
 2. గొప్ప విషయాలెన్నో చెప్పారు.
  త్రిమూర్తులూ, ముగురమ్మలూ కూడా ఓం అనే శక్తి స్వరూపం నుండి ఉద్భవించినవారే.
  మీరు చదివినన్ని గొప్ప పుస్తకాలు చదివే భాగ్యం కలగలేదనుకోండి. అయినా ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు.

  రిప్లయితొలగించండి
 3. కౌటిల్య గారు,
  ఇది నాకుబాగా ఇష్టమైన పద్యం. అయితే ఒక్కటే సందేహం. ఇది పోతన గారు రాసిన పద్యం అని మా నాన్నగారు చెప్పినట్లు గుర్తు. కాదా?

  రిప్లయితొలగించండి
 4. అవును సృష్టి మొత్తం జగన్మాత స్వరూపమే. ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టించేవాడు బ్రహ్మ.

  రిప్లయితొలగించండి
 5. @కల్పన గారు,
  @రవి గారు,
  నిస్సందేహంగా ఈ పద్యం పోతన్నగారిదేనండీ..ఆ విషయం మొదటి వాక్యంలోనే చెప్పాను కదండీ..ఐనా ఆ అనుమానం ఎందుకొచ్చింది...ఓహో.."ఈ పద్యం రాసిందెవరో తెలియకపోయినా కూడా ఎప్పుడోకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడుండనుకుంటా..." ఈ వాక్యం గురించా...రాసిన కవి ఎవరో తెలియని తెలుగువాడు కూడా,ఎప్పుడోకప్పుడు వాడి జీవితంలో ఈ పదాల్ని అంటాడని నా భావం అండీ..
  @రామకృష్ణ గారు,
  ధన్యవాదాలు...మనోవికారాలంటే వ్యతిరేకార్థ్హం కాదండీ..మనసుకి కలిగే ప్రతీ స్పందన..అది మంచి కావచ్చు,చెడు కావచ్చు..
  @మందాకిని గారు,
  ధన్యవాదాలు..
  @రవిచంద్ర గారు,
  అవునండీ..అంతా అమ్మే..

  రిప్లయితొలగించండి
 6. ఎంతో చక్కగా వ్రాసారండి. పద్యం మరింత తియ్యగా అన్పించింది. నెనర్లు!

  రిప్లయితొలగించండి
 7. aksharamohanam.blogspot.com28 జనవరి, 2010 3:53 PMకి

  mee padya vishleshana chaala hrudyamgaavundi.

  రిప్లయితొలగించండి
 8. ఈ పద్యంలో ఆరడిపుచ్చడం అంటే, బాధని కలిగించడం అనే అర్థం వస్తుందనుకుంటాను. ఇక్కడ పుచ్చు అంటే తీర్చు అని అర్థంకాదు. "నిద్రపుచ్చు", "కప్పిపుచ్చు", "మోసపుచ్చు", "చిన్నపుచ్చు" ఇలాగే "ఆరడిపుచ్చు".
  సురారులని (రాక్షసులని) సంహరించడంవల్ల వాళ్ళ అమ్మ కడుపుకి కోతే కదా. "సురారులమ్మ కడుపారడిపుచ్చిన యమ్మ" అంటే రాక్షసులని సంహరించడం ద్వారా వారి తల్లికి కడుపుకోత కలిగించిన తల్లి అని అర్థమని నేను చదువుకున్నాను. విశ్వనాథ వారు సాహిత్యసురభిలో కూడా ఇదే అర్థమిచ్చినట్టు గుర్తు.

  రిప్లయితొలగించండి
 9. కామేశ్వరరావు గారు చెప్పిన అర్ధంలోనే నేనూ చదువుకున్నానండీ.
  మీ ప్రయత్నం బహుదా ప్రసంశనీయము. ఇలాగే వీలైనన్ని పద్యాల అర్ధాలు తెలియజెప్పండి.ఋణపడి ఉంటాం. ఏమీ అనుకోపోతే, ఆంగ్లవ్యాఖ్యలని తిరస్కరించండి.
  కామేశ్వరరావుగారు, పద్యం.నెట్ పెట్టినతరువాత చాలా కొత్తనెలవులు వెలిశాయి. మంజూష ని ఆధునీకరించాలేమో

  రిప్లయితొలగించండి
 10. @అక్షరమొహనం గారు,@అమ్మ ఒడి గారు,@ అజ్ఞాత గారు,
  ధన్యవాదాలు...

  @కామేశ్వరరావు గారు,@ఊకదంపుడు గారు,
  మీలాంటి పెద్దవాళ్ళు నా టపాకి వ్యాఖ్య పెట్టటం చాలా ఆనందాన్నిచ్చింది...ఇక 'కడుపాఱడి పుచ్చిన' అర్థ్హం విషయానికొస్తే...గురువు గారు(విశ్వనాథ వారు),సాహిత్యసురభిలోనే కాదండీ,ఎక్కడా కూడా ఈ వాక్యానికి అర్థ్హం చెప్పలేదండీ..ఆయన ఒకటి చెప్తే,దానికి ఎదురు రాసేటంత ధైర్యం,జ్ఞానం నాకు లేవండీ..నేను ఆయన పాదాలు పట్టుకునే నడిచాను,నడుస్తాను కూడా..అసలు ఆ మహానుభావుణ్ణుంచి నా మనసు పక్కకు కూడా వెళ్ళదండీ...

  ఇక నేను రాసిన వ్యాఖ్యానం ...నిఘంటువుల్లో నేను చదువుకున్న అర్థ్హాలనుంచే తీసుకున్నాను..
  పుచ్చి--పోవజేయు,పంపు..
  పుచ్చివైచు--పూర్తిగా తొలగించు,మాన్చివేయు..

  ఆఱడిపుచ్చు---వ్యర్థ్హము చేయు,భంగపరచు,చెడగొట్టు,
  దుఃఖపెట్టు..

  నాకు మీకు చెప్పిన అర్థ్హం కూడా తట్టింది..కాని ఎంతో లలితంగా ఆ లలితాపరాభట్టారికని కీర్తించిన పోతన్నగారు అలా ఎవరికైనా దుఃఖభాజనంగా భావించి ఉంటారంటే నా మనసు ఒప్పుకోలేదు....అందుకే వీలైనంతవరకూ అనుకూలార్థాన్నే తీసుకుని రాశాను...అమ్మ ఎవరినీ దుఃఖపెట్టదనే నా ప్రగాఢ విశ్వాసం...

  రిప్లయితొలగించండి
 11. క్షమించాలి..పై వ్యాఖ్యలో కొన్ని అచ్చుతప్పులు వచ్చాయి..
  ౧)అక్షర మోహనం గారు,
  ౨)నాకు మీరు చెప్పిన అర్థ్హం కూడా తట్టిందండీ..

  రిప్లయితొలగించండి
 12. కౌటిల్య గారు.
  ఆఱడిపుచ్చు---వ్యర్థ్హము చేయు,
  కడుపు ఆఱడిపుచ్చు--- కడుపు వ్యర్థ్హము చేయు; ( దైత్యులను అంతము చేయు)

  ఇలా అన్వయం చెప్పుకోవడం దోషము కాదని నా అనుకోలు. పైగా దానవోద్రేకస్తంభకు అనే శ్రీకారము చుట్టినారుగదా.
  ఇక, నన్ను పెద్దవారి జాబితా లో చేర్చడం భావ్యం కాదు.
  వయస్సులో చిన్నవారైనప్పటికీ, రాఘవ, కామేశ్వరరావు గారూ ఆ జాబితాలో ఉండదగిన వారు.

  ఇక పెద్దలు చింతా రామకృష్ణారావు గారు , పంతుల జోగారావు గారు కంది శంకరయ్య గారు బ్లాగులలో అందుబాటులో ఉన్నారు. వారి వివరణకై కూడా చూద్దాం
  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 13. ఊకదంపుడు గారు,
  ఇక్కడ ఎలా తీసుకున్నా అమ్మ దైత్యులని సంహరించిందనే అర్థ్హం అండీ...కాని ఆ తల్లికి దాని వల్ల బాధకలిగిందా,బాధపోయిందా అన్నదే చర్చ..తపస్సు వల్ల జ్ఞానం వస్తుందని గురువు గారు చెప్పారు,,నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ పద్యాన్ని మహామంత్రంగా భావించి నిత్యం పఠిస్తున్నా..నాకు ఏ రోజూ కూడా బాధకలిగిందన్న అర్థం స్ప్హురించలేదండీ..

  ఇంకా,"కలుగనేటికి తల్లుల కడుపు చేటు" పద్యానికి గురువు గారి వ్యాఖ్యానం తర్వాత టపాలో రాస్తానండీ..అది ఇక్కడ కూడా అన్వయించుకోవచ్చండీ..

  రిప్లయితొలగించండి
 14. బాగుందండి. మధురమైన వ్యాఖ్యానంతో పాటు..ఆశక్తికరమైన చర్చలకు కూడా తావిస్తున్నందుకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. కౌటిల్య గారికి, నమస్కారములు.

  మీ రచనలన్నింటినీ ఏకబిగిన ఇప్పుడే చదివాను. చాలా చక్కగా, అర్ధవంతంగా వ్రాసారు. ఇవి చదువుతున్నప్పుడు, గుంటూరులొ, హిందూకాలేజిలొ ఇంటర్‌మీడిఏట్ చదువుతున్నప్పుడు, మా గురువారైన శ్రీ ప్రసాదరాయ కులపతి గారు తెలుగు-పొయిట్రీ చెబుతున్నట్లు అనిపించింది.

  మీరు మా వూరు వారు అయినందుకు చాలా సంతోషం. నా స్నేహితుడు డా.డి.మురళి, లాపరోస్కొపిక్ సర్జెన్ అక్కడే వున్నాడు. మా చుట్టాలు ఫ్రొఫ్.డా.రాజరాజేశ్వరి, డా.ప్రకాష్ బ్రాడీపేటలొ వున్నారు.
  ఇంకా ఎన్నో చక్కటి రచనలు మీ నుంచి రావాలని కోరుకుంటూ,

  భవదీయుడు,
  మాధవరావు.

  రిప్లయితొలగించండి
 16. @రాజన్ గారు,
  ధన్యవాదాలు.
  @మాధవరావు గారు,
  ధన్యవాదాలండీ..అంత పెద్దవాళ్ళతో నేను పోల్చతగనేమోనండీ..
  డి.మురళి అంటే,ధూళిపాళ వారేనా!రాజరాజేశ్వరి గారంటే మైక్రోబయాలజీ ప్రొఫెసరేనా అండీ...ప్రకాష్ గారు ఎవరో తెలియరాలేదండీ..

  రిప్లయితొలగించండి
 17. కౌటిల్యగారికి, నమస్కారములు.

  డా.మురళి, ధూళిపాళ మురళీనే. డా.రాజేశ్వరిగారుకూడా మీరు చెప్పినవారే. మా వదిన చెల్లెలు.వాళ్ళ అబ్బాయే డా.ప్రకాష్.
  నా బ్లాగ్ లింక్ క్రింద ఇస్తున్నాను. మీకు వీలున్నప్పుడు చదివి, మీ అమూల్యమైన అభిప్రయాల్ని తెలియచేయండి.

  భవదీయుడు,
  మాధవరావు.

  http://madhavaraopabbaraju.wordpress.com/

  రిప్లయితొలగించండి