ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

21, జనవరి 2010, గురువారం

కవితా సరస్వతి కన్నీళ్ళు తుడిచిన మన పోతన్నగారు




























మా చిన్నప్పుడు, రాత్రిపూట భోజనాలయ్యాక నాన్నగారు పిల్లలందర్నీ ఆరుబయట వెన్నెట్లో కూర్చోబెట్టుకుని,మన పురాణాల్లో కథలు చెప్పేవారు...వట్టి కథలు కాదండోయ్...పద్యాలతో సహా చెప్పేవారు..అందుకే ఆ పద్యాలన్నీ మా బుఱ్ఱల్లోకి తేలిగ్గా ఎక్కేవి...ఓ రోజు నేను "నాన్నా!పోతన్నగారు,ఇన్ని మంచి మంచి కథలు, పద్యాలతో సహా రాశారు కదా!అసలు ఆ పోతన్నగారి కథేంటో చెప్పవూ" అని అడిగా.(అప్పటికి నేను భక్తపోతన సినిమా చూళ్ళేదు)....నాన్న పోతన్నగారి కథంతా చెప్పి పడుకోబెట్టారు....నా మనసులో ఆ కథే తిరుగుతూ ఉంది....ముఖ్యంగా సరస్వతీదేవి పోతన్నగారి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునే సన్నివేశం.....అది గుర్తొస్తుంటే మనసుకు ఏదో తెలియని ఉద్వేగం......లోకంలో ఎక్కడన్నా భక్తుడు వెళ్ళి భగవంతుడితో తన బాధలన్నీ చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు......కానీ ఇక్కడ దేవుడే వచ్చి పోతన్నగారి దగ్గర బాధచెప్పుకున్నాడు....నిజంగా అంత అదృష్టం ఒక్క పోతన్నగారికే దక్కిందేమో....

అసలు పోతన్నగారి దగ్గరికి వచ్చి సరస్వతమ్మ ఏమని బాధపడిందంటే,....."ఏవయ్యా పోతన్నా!లోకంలో కవులందరూ,వాళ్ళ నాలుకల చివర నేను కూర్చుని పలుకుతుంటే, నన్ను,కవితాసరస్వతిని తీసుకెళ్ళి ఈ రాజులకీ,రమణప్పలకీ అమ్మేసి, వాళ్ళిచ్చే కానుకలతో ఆనందిస్తున్నారు.......నువ్వేదో భాగవతాన్ని రాముడికిచ్చి నన్ను సంతోషపెడతావనుకుంటే, నువ్వు కూడా వాళ్ళూ,వీళ్ళూ బలవంతపెట్టారనో, నీకేదో ఇబ్బందులొచ్చాయనో నన్ను ఆ దుష్టరాజులకిచ్చేస్తావా ఏంటి!.....ముందుకంటే ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ దుఃఖంగా ఉందయ్యా...." అందట..

అప్పుడు మన పోతన్నగారు ఏమన్నారంటే,

"కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల!యో మదంబ! యో
హాటకగర్భురాణి!నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ
! "

అప్పుడు సరస్వతీదేవి ఆనందపడి,పోతన్నగారిని ఆశీర్వదించి వెళ్ళిపోయిందట!

తర్వాత తనదగ్గరికి వచ్చి,భాగవతాన్ని రాజుకు అంకితం ఇవ్వమన్నవాళ్ళతో పోతన్నగారు ఇల్లా అన్నారట!

"ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరమువాసి కాలుచే
సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్."


సమ్మతి శ్రీహరి కిచ్చి----నేను భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాను.....నరాంకితం చెయ్యనని ప్రతిజ్ఞ పట్టాను...రాజులకైతే అసలే ఇవ్వను... అసలు రాజులకెందుకివ్వాలి?
పురంబులు వాహనంబులున్ సొమ్ములు----అగ్రహారాలిస్తారని, గుఱ్ఱాలు,నగలు ఇస్తారని....నాకవి అక్కర్లేదు.....దాని దుంపతెగిరితే! వాళ్ళకిస్తే నీకేం నష్టం.....వాళ్ళిచ్చేవి నువ్వు వాడుకోవద్దు....నీ కొడుకులు వాడుకొంటారు.....ఐనాకూడా ఇవ్వనంటావా! ఏం? ఎందుచేత?

ఇ+మనుజేశ్వరాధముల కిచ్చి--------వాళ్ళు పేరుకి మనుజేశ్వరులే కాని వట్టి అధములు..అంటే పాపులు, దుర్జనులు, జారులు, మనుషుల్ని పీడించుకుతింటారు...అధికారంకోసం దుష్టపు పనులెన్నైనా చేస్తారు...వాళ్ళకిస్తే పాపం....అందుకే ఇవ్వను...పైగా వాళ్ళకంకితమిచ్చాననుకోండి, వాళ్ళకు స్వర్గసుఖాలొస్తాయ్...వాళ్ళు నిజంగా దాతలు కారు, నేను వాళ్ళని దాతల్లాగా కనిపించేట్లు చేస్తాను........వాళ్ళ కీర్తి ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండి పోతుంది...వాళ్ళు అన్నాళ్ళూ స్వర్గంలో ఉంటారు.....దాని వల్ల నాకు వచ్చే ఫలితమేంటి?

శరీరము వాసి కాలుచే సమ్మెట పోటులంబడక-------నేను మామూలు జీవుణ్ణి..నాకు కామ,క్రోధాలుంటాయ్...నేనూ కొన్ని పాపాలు చేస్తాను,వాటి వల్ల నరకానికి పోతాను...అవి చాలవన్నట్లు, యముడు(కాలుడంటే యముడు) "పాపులైన రాజులకి నువ్వు మహాభాగవతాన్ని అంకితమిచ్చి, వాళ్ళు స్వర్గంలో ఉండేట్లు చేశావ్" అని నన్ను ఇంకా సమ్మెట పెట్లు పెడతాడు......దారిన పోవు తద్దినమా మాయింటికి రమ్మన్నట్టు- నేను చేసే కర్మప్రకారం నాకొచ్చే ధనం చాలనట్టు,ఈ కొత్త యమబాధలు కొని తెచ్చుకోవడమెందుకు?
అయితే, నువ్వు కావ్యం రాస్తున్నావు.దానివల్ల కొంత పుణ్యం వస్తుంది కదా! ఆ పుణ్యమంతా నువ్వే తీసుకుంటావా? నువ్వు చూస్తుంటే మంచివాడిలా ఉన్నావు....ఆ పుణ్యాన్ని కొంతమందికి పంచిపెట్టొచ్చు కదా! ఆ రామచంద్రుడేంచేసుకుంటాడూ! ఎవరికన్నా నువ్వు మంచివాడనుకున్నవాడికి అంకితమిచ్చి,వాడికి స్వర్గసుఖం చేర్చిపెట్టొచ్చు కదా!అదీ నీకు పుణ్యమే కదా! అంటే అలా కాదు. మరి ఎలా?

జగద్ధితంబుగన్----- నేను భాగవతం లోకహితం కోరి రాస్తున్నాను..ఈ పుణ్యం లోకానికి పంచిపెడ్తాను....ఆ పుణ్యం నేనే తీసుకుంటే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. అదే శ్రీరామచంద్రుడికి ఈ భాగవతాన్నిస్తే, ఈ లోకానికిచ్చినట్టు....ఈ లోకానికిస్తే వాళ్ళు దీనిని చదువుతారు...ఊరికే చదవరు,చింతన చేస్తారు(ఆలోచిస్తారు), భక్తులవుతారు. ఆ పుణ్యం వేలాది పిల్లల్ని పెడుతుంది.........నాతో పాటు లక్షలాదిమంది పుణ్యవంతులవుతారు....అదీ నా ఆకాంక్ష..
ఆహా!అదన్నమాట కారణం....నువ్వు అలా అంటే మేమింకేమంటాం.....మాదీ అదే మాట.......
"లోకాః సమస్తాస్సుఖినోభవంతు"

10 కామెంట్‌లు:

  1. పోతన గురించి చక్కగా చెప్పారు. ఉన్నదానితో సంతృప్తి పడటం అంటే ఏమిటో తెలుస్తుంది.
    'దీనార ట్టన్కాల తీర్ధ మాడిన్చితి దక్షిణా దీషు ముత్యాల శాల ". శ్రినదు దనుకుంటాను అన్నది.
    మీకా పద్యం గుర్తుంటే కొంచం వివరణ వ్రాయండి.
    మీరు వ్యాసం చక్కగా వ్రాస్తారు.. థాంక్స్.
    రామకృష్ణ

    ramakrishna

    రిప్లయితొలగించండి
  2. @village monkey,
    ధన్యవాదాలు.
    @మురళి,
    అంతా మీ అభిమానం.
    @రామకృష్ణ గారు,
    ధన్యవాదాలండీ...నేను ఆ పద్యం చిన్నప్పుడెప్పుడో విన్నానండీ...సరిగ్గా గుర్తులేదు...గురువు గారి పుస్తకాలన్నీ తిరగేశాను...ఎక్కడా దొరకలేదు..కాశీఖండం,హరవిలాసం చూశా..కనపడలేదు..మీ దగ్గర పద్యం ఉంటే పంపండి..వివరణ రాయటానికి ప్రయత్నస్తాను..

    రిప్లయితొలగించండి
  3. కౌటిల్య గారు, అందరికి ఇష్టమైన పద్యం తీసుకుని మీదైన వివరణ తో చక్కగా చెప్పారు. మీరు ఈ పద్యం గుర్తు చేస్తే నాకు “ అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ” గుర్తుకువస్తోంది.

    రిప్లయితొలగించండి
  4. @కల్పన గారు,
    తరువాత టపా ఆ పద్యానికే రాద్దామనుకుంటున్నానండీ..కాని కొంచెం వేదాంతం పాళ్ళు ఎక్కువ పడుతోంది..అందుకే సందేహిస్తున్నా...

    @రామకృష్ణ గారు,
    ఆ పద్యం దొరికిందండీ..శ్రీనాథుని చాటువులు అనే చిన్న పుస్తకంలో కనపడిందండీ...కానీ ఆ పద్యంలో అంత లోతైన వివరణ ఏమీ లేదండీ.. శ్రీనాథుడు సింగన్న భూపాలుడి ఆస్థానంలో, నైషధం రాసినప్పుడు తనకి మును జరిగిన కనకాభిషేకాన్ని గురించి,తను గౌడ డింఢిమ భట్టుని ఓడించి సార్వభౌమ బిరుదునందడాన్ని గురించి ఉదహరిస్తూ,ఇక్కడ ధీశాలి ఐన సింగన భూపాలుడి ముందు నాయందు సరస్వతి ఎలా పలుకుతుందో అంటూ ముగిస్తాడు..ఇక్కడ అన్ని చేసిన వాణ్ణి నీ ముందు నిలబడలేనా అని నర్మగర్భంగా రాజుని అవహేళన చేస్తున్నాడు శ్రీనాథుడు..

    రిప్లయితొలగించండి
  5. కౌటిల్య గారికి,
    మీకు తీరక ఉన్నప్పుడు వెబ్ లో పెట్టండి. నాకు తెలిసిన కథ ఒకటి ఉన్నది. నేను ఎక్కడ విన్నానో(చదివానో) గుర్తులేదు. పరిపాలించే రాజు కి రాజరికము పోతే శ్రీనాధుడు ఉద్యోగం కోల్పోతాడు. బతకటానికి లేక పొలం కౌలికి తీసుకుని సేద్యం చేస్తే దుర్భిక్షం మూలాన పంటలు పండవు. శిస్తు, కౌలు చెల్లించలేక కష్టాలు పాలౌతాడు. దుర్లభమైన జీవితం గడపాల్సోస్తుంది. అప్పుడు సభలో శిక్షించే వారి తో చెబుతాడు ఈ పద్యం. 'దీనార ట్టన్కాల తీర్ధ మాడిన్చితి దక్షిణా దీషు ముత్యాల శాల ". అటువంటి వాడికి ఈ దుర్గతి పట్టింది అని.
    పోతన కి శ్రీనాధుడి కి, (బావ మరుదులు), ఎంత కాంట్రాస్తో చుడండి.
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  6. కౌటిల్య has left a new comment on your post "12. మందాకిని ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు...":

    రామకృష్ణ గారూ..ఈ లింకు చూడండి..ఆ పద్యం దొరుకుతుంది....www.eemaata.com › సెప్టెంబర్ 2005 › వ్యాసాలు
    Thanks
    Ramakrishna

    రిప్లయితొలగించండి
  7. ఇమ్మనుజేశ్వరాధముల పద్యం ప్రక్షిప్తమని ఒక వాదన ఉంది. పోతనవంటి భాగవతోత్తముడు మరొకళ్ళ గురించి అంత తక్కువగా మాట్లాడి ఉండడని అంటారు.

    రిప్లయితొలగించండి
  8. నాగమురళి గారూ...ఈ పద్యం ప్రక్షిప్తమని నేనూ చాలా చోట్ల చదివా...కాని గురువుగారు మాత్రం చెప్పలేదు..అందుకనే నేనూ అనుసరించి వెళ్ళి పోయా....గురువు గారిది 'అద్వైత శేఖరము' అనే నాటకం ఉంది...అక్కడ కూడా పై రెండు పద్యాలు గురువుగారు పోతన పాత్రతో చెప్పిస్తారు.....భక్తపోతన సినిమాలో మాత్రం,చివర్లో రాజు చెప్తాడు..

    రిప్లయితొలగించండి