ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

9, జనవరి 2010, శనివారం

పోతన్నగారి పలుకులు


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగునఁట
పలికెద వేఱొండు గాధఁ బలుకఁగ నేలా.

(భాగ -ప్ర -౧౬)



ఇది పోతన్నగారు భాగవతం మొదట్లో ఉపోద్ఘాతంగా రాసిన పద్యాల్లో ఒకటి....భాగవతం గొప్పదనమంతా ఈ పద్యంతో మనకు తెలుస్తుంది.... ఈ పద్యం కూడా పూర్వం, దాదాపు మన తెలుగుబళ్ళన్నిట్లో పిల్లలందరి చేతా కంఠతా పట్టించేవాళ్ళు...వాళ్ళూ అంతే ఉత్సాహంగా నేర్చుకున్నేవాళ్ళు...

నాన్నగారు మా చిన్నప్పుడు ఈ పద్యం చెప్పేప్పుడు, నాకో పే....ద్ద అనుమానం వచ్ఛేది.(అప్ప్తట్లో నా బుజ్జిబుఱ్ఱ నిండా అన్నీ అనుమానాలే). అడిగేసేవాణ్ణి, "నాన్నా! పోతన్నగారు రాముడి భక్తుడు కదా....మరి భాగవతం కృష్ణుడి కథాయె....రాముడి కథ రాయకుండా కృష్ణుడి కథెందుకు రాశాడూ.."అని. దానికి నాన్న నవ్వుతూ, "రాముడు,కృష్ణుడు ఒకటే....వేరు,వేరు కాదు.....అందుకే రాశాడు" అని చెప్పేవారు.....కాని నా బుల్లిబుఱ్ఱకి అంత పేద్ద సమాధానం అర్థమవ్వలా....నేనే ఆలోచించా....చించగా...చించగా....ఓ గొప్ప్ప్ప సమాధానం నా బుఱ్ఱలో వెలిగింది...అదేంటంటే........
’రాముడు,కృష్ణుడు మాంఛి స్నేహితులయ్యుంటారు....రాముడి మీదేమో చా....లామంది పెద్దపేద్ద పుస్తకాలు(రామాయణాలు) రాశారు(వాల్మీకి,ఆంజనేయుడు,తులసీదాసు,మొల్ల,........)..ఆఖరికి మన గురువుగారు,విశ్వనాథవారు కూడా.....మరి కృష్ణుడికేమో ఒఖ్ఖ పుస్తకం కూడా లేదాయె...ఉన్న భారతం ముప్పాతిక వంతు పాండవులకే సరిపోయె...అందుకే పోతన్నగారి దగ్గరికొచ్చి రాముడు "పోతన్న గారూ!మా కృష్ణుడి మీద భాగవతం రాసిపెట్టండి" అని అడిగుంటాడు......కానీ...మన పోతన్నగారు రామభక్తుడు కదా,అందుకే పనిలోపనిగా మధ్యలో రామాయణం కూడా ఇరికించి ఉంటారు’ అని.....

ఇక మన పద్యంలోకొస్తే....గురువుగారు ఏం చెప్పారంటే.....

భాగవతము----భక్తి, జ్ఞానం, వైరాగ్యం...ఈ మూడు తత్త్వాలనీ బోధించేది అని మన పెద్దలు చెప్తుంటారు.....ఇక్కడ పోతన్నగారు పలికేది అటువంటి పుస్తకం.

పలికించెడి వాడు రామభద్రుండట----అసలు పోతన్నగారు పలకటంలేదట!!! శ్రీరామచంద్రుడు పలికిస్తున్నాడట.......అంటే పోతన్నగారు వట్టి సాధనము....కర్త పరమేశ్వరుడు....
విశ్లేషించి చూస్తే......
మనం చేసే ఏ పనికైనా మన శరీరం సాధనం...లోపలున్న జీవుడు కర్త....ఇక్కడ ఆ జీవుడు రెండు రకాలు.....వాడి కర్మవశాన ప్రవర్తించేవాడు ఒకడైతే, భగవంతుడు ఎలా చెయ్యమంటే అలా చేసేవాడు రెండోవాడు.........ఎలా అంటే, మనం "ఏది ఎలా జరిగితే అలా జరగనీ!నాకేం" అని, ఏమీ చెయ్యకుండా కూర్చున్నా,కొన్ని పనులు వాటంతట అవి జరిగిపోతుంటై (శ్వాస పీల్చడం,నాడి కొట్టుకోడంలాంటివి).అవి భగవంతుడు చేయించినట్లే......అలానే రామచంద్రుడు,పోతన్నగారి నోట పలికిస్తున్నాడన్నమాట...

పోతన్నగారిని పండితులు ప్రామాణికుడనరు.....కాదనీ అనరు.....ఆయన స్థితి ఒక సంధిలో ఉంది. కవిత్రయం,సోమన్న,శ్రీనాథుడు,పెద్దన్న మొదలైనవారి రాశిలో, భాషాదృష్టితో పోతన్నగారిని జమకట్టరు....జమకడితే ఏమవుతుంది? అసలు పలికించినవాడు రాముడు కనుక, ఆ రామచంద్రుని ఖర్మకాలి కవిత్రయాదుల వంటివాడు కావాలి...అంతటి రామచంద్రుడు కోరక కోరక మన మహాపండితులు పరిగణించే ప్రామాణిక తెలుగుకవి కావాలని కోరుకోవాలా? కనీసం కాళిదాసు,వ్యాసుడు,వాల్మీకి వంటి వాళ్ళ రాశిలో అన్నా చేరకూడదా? అంతకుమించిన వేదాలు,స్మృతులు రాసిన మహా ఋషులున్నారు.వాళ్ళల్లో ఎందుకు చేరకూడదు? ఏమైతేనేం....పోనివ్వండి....ఆ యోగ్యత అంతటి రాముడికే లేనప్పుడు, ఇక పోతన్నగారికెందుకు???!!!

నే పలికిన భవహరమగునట------అంటే భవబంధాలన్నీ తొలగిపోతాయట...జన్మరాహిత్యమవుతుందట....అంటే, మోక్షం వస్తుందట!--ఎవరికి? తనకొక్కడికేనా? పోతన్నగారు అటువంటి వాడు కాడే! మరి..........
జగద్ధితమ్ముగన్----అని [ముందు "ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి" అన్న పద్యంలో] రాశారు కదా! అంచేత మనందరికీ [భాగవతం చదివిన,విన్న వారందరికీ] కూడా అన్నమాట!

వేఱొండు గాథఁ బలుకఁగ నేలా----ఇంత గొప్ప భాగవతాన్ని చెప్తుంటే, ఇక వేరేవాళ్ళ గురించి(రాజులూ,రమణప్పలూ) చెప్పాల్సిన అవసరమేముంది...అలా చెప్పటంవల్ల వచ్ఛేదేదైనా నిరుపయోగమే......

10 కామెంట్‌లు:

  1. సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ఒక్క పద్యం పోతన యొక్క వ్యక్తిత్వాన్ని విశదీకరిస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన పద్యం. పరిచయం చేసినందుకు కౌటిల్య అభినందనీయులు

    రిప్లయితొలగించండి
  2. బాగుందండి కౌటిల్య గారు....మంచి పద్యం చెప్పారు. మెలిమెల్లిగా భాగవతం మొత్తం చెప్పెయ్యండి. రోజుకి కనీసం ఒక పద్యమైనా చెప్పండి.

    రిప్లయితొలగించండి
  3. కౌటిల్య గారు...విశ్వనాథ వారి ప్రసిద్ధ కావ్యం 'వేయి పడగలు' దేనికి (కథా వస్తువు) సంబంధిచినదండి?

    రిప్లయితొలగించండి
  4. కౌటిల్య గారికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. రాజన్ గారూ..మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు...రోజూ రాద్దామనే ఉందండీ..కానీ నాకు దగ్గర్లో పీజి ఎంట్రన్స్ ఉందండీ..బుఱ్ర వేడెక్కిపోతోంది..ఇంక వేయిపడగలు విషయానికొస్తే,అందులో ఇది అనే కథావస్తువు నేను చెప్పలేనండీ..అది తెలుగువాడి మహాభారతం అని ఓ పెద్ద కవి అన్నాడట...మన సంస్కృతి,సంప్రదాయాలు ఎంత గొప్పవో,అవి ఇప్పుడు ఎలా నశించి పోతున్నాయో చదివితే,మీకు వివరంగా తెలుస్తుంది...

    రిప్లయితొలగించండి
  6. "బ్లాగు ప్రచారం ద్వారా ఏంవస్తుంది? బ్లాగుల సంఖ్య పెరగటం వలన ప్రయోజనం ఎమిటీ?" అని చాలామంది అడిగారు. ఈ బ్లాగు ఒక సమాధానం. ఈ బ్లాగులో వస్తున్న మంచి టపాల ద్వారా ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఏం నేర్పించాలో తెలుస్తుంది. సరిగా పద్యాలు,కావ్యాలు తెలియని నాలాంటి యువకులకు కూడా ఉపయోగపడుతుంది. జయహో విశ్వానాధ కౌటిల్య విజయీభవ దిగ్విజయీభవ.

    రిప్లయితొలగించండి
  7. పద్యం ఒక్కసారి చదివాను.. సగం అర్ధమయ్యింది.. మొత్తం పోస్టు చదివాకా మరళా పద్యం చదువుతుంటే.. కంఠస్తం వచ్చేస్తుంది.. అంత వివరంగా రాసారు..

    రిప్లయితొలగించండి
  8. వివరంగా నేను రాయలేదండీ..అంతా గురువుగారు చెప్పిందే!అన్నీ కంఠతా పట్టేస్తున్నారా!

    రిప్లయితొలగించండి