ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

4, ఫిబ్రవరి 2010, గురువారం

కలుగనేటికి తల్లుల కడుపుచేటు


చేతులారంగ శివుని పూజింపఁడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని

దయయు సత్యంబులోనుఁగాఁ దలపఁడేనిఁ

గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.
(భాగ - ప్ర - ౧౨)


నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పద్యం ఇది. ఇలాంటి పద్యాలు మన వాళ్ళకు చిన్నతనంలోనే నేర్పితే,ఆ భావాలు వాళ్ళ మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి...మన సంస్కృతి బీజాలు వాళ్ళ మనసుల్లో మొలకెత్తి, పెరిగి, శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి.....మహావృక్షాలుగా కలకాలం నిలిచి ఉంటాయి...

చేతులారంగ శివుని పూజింపడేఁని నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేఁని---- నాన్న ఈ పద్యం చెప్పేప్పుడు చాలామందిలానే నాకూ ఓ అనుమానం వచ్చేది.అడిగేవాణ్ణి."నాన్నా! అంటే, చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరు నొప్పుట్టేట్లు హరినామసంకీర్తనం చెయ్యాలన్నమాట! అంతేగా! ఏం శివుణ్ణి కీర్తించి, విష్ణువుని పూజించకూడదా!". దానికి నాన్న "అలా ఏంకాదు...శివకేశవులిద్దరూ ఒకటే....అభేదప్రతిపత్తి....అసలు ఏ దేవుడికైనా ఇలానే చెయ్యాలి." అని చెప్పేవారు.....ఇక్కడ చేతులారా అంటే, వఠ్ఠి చేతులతో అని కాదు...మనసారా అని.....ఏ భావమైనా మనసు నిండుగా కలిగితేనే, ఆ పని చేతులు కూడా మెండుగా చేస్తాయి....(కాని కొంతమంది ఉంటారు,పక్కవాడు చూస్తున్నాడు కదా అని, మరీ బారలేసి చేస్తుంటారు...అలా కాకుండా,మనసారా పూజించమని మన పోతయ్య గారి భావం.).....
ఇక నోరునొవ్వంగ అంటే, మనం ఎక్కడ ఉన్నా,ఎంతమందిలో ఉన్నా ఎటువంటి అంతర్గతమైన అడ్డుగోడలు లేకుండా నామకీర్తనం చెయ్యాలి...చిన్నప్పుడు ఇంట్లో పూజలోనైనా, దేవాలయానికెళ్ళినా నాన్న ఏదో ఒక స్తోత్రమో,గోవిందనామమో పెద్దగా చదివేవాళ్ళు...నేను ఒకసారి,"నాన్నా!ఎందుకంత పెద్దగా చదువుతారు,చుట్టూ అందరూ మిమ్మల్నే చూస్తున్నారు!ఏమన్నా అనుకుంటారు, బాగుండదు."అన్నా...దానికి నాన్న ఈ పద్యం చెప్పి"ఎవరో ఏదో అనుకుంటారని చదవకపోతే, దేవుడు ఏమన్నా అనుకోడూ....పైగా, మనం పెద్దగా చదివితే ముందు వింతగా చూసినా, కాసేపటికి వాళ్ళల్లో కూడా భక్తిభావం పెరుగుతుంది."అన్నారు...అంతే నేను కూడా అన్ని అంతరాలూ వదిలేసి నాన్నతో గొంతు కలిపా..అంతే! వెంటనే మా చుట్టుపక్కలంతా కూడా "గోవింద"నామం మారుమోగింది...(ఒకసారి దుర్గగుళ్ళో,దసరాలప్పుడు క్యూ చాలా పెద్దగా ఉంది..నేను వరసగా నాకొచ్చిన స్తోత్రాలన్నీ గొంతంతా విప్పి, మైమరిచి చదువుకుంటున్నా..దర్శనం అయ్యి వచ్చేప్పుడు ఒకావిడ పిలిచి,"బాబూ!మేం ఎప్పుడు క్యూలో నుంచున్నా ఏదో ఒక సోది కబుర్లు చెప్పుకున్నేవాళ్ళం..కాని ఇవాళ,దర్శనం అయ్యేవరకు మనసు అసలు పక్క విషయాల మీదకు వెళ్ళలేదు" అంది.)....ఇంకా కొంతమంది అంటుంటారు..మనసులో అనుకుంటే చాలదా అని....అసలు ఆ అంతఃకరణ శుధ్ధ్హి కోసమే, ఈ నామ కీర్తనమూ, నవవిధభక్తిక్రమమూ....

దయయు సత్యంబులోనుఁగాఁ దలపఁడేఁనిఁ----దయ,సత్యం మనసు అంతరాల్లోంచి పుట్టుకురావాలి కానీ, పేరుప్రతిష్ఠల కోసం పైపై మెరుగులు మెరిపించకూడదు.....

కలుగ నేటికి తల్లుల కడుపుచేటు----అసలు ఈ పద్యం అర్థమంతా ఇందులోనే ఉంది....ఈ పద్యం నోటికి రానివాడు ఆంధ్రభారతీయుడు కాదు..దానంతటదే నోటికొస్తుంది.రాకుండా ఎలా ఉంటుంది?అది రాకుండా నువ్వు నీ నోటికొక తాళం వేసుకొంటే రాదేమో! ఎంత తాళం వేసుకున్నా తెరవొచ్చుకదా! కొన్ని తాళాలు సురక్షితంగా ఉంటయ్.అంటే వాటికి వేరే తాళంచెవి పట్టదు....ఎంత చిక్కుతాళమైనా గజదొంగలుంటారు..మనదేశంలో లేకపోయినా పాశ్ఛాత్యదేశాల్లో ఉంటారు.ఇప్పుడు మనవాళ్ళు కూడా వాళ్ళదగ్గర్నుండి అన్ని విద్యలూ సంపాదించుకున్నారు గనుక ఆ తాళంచెవులు కూడా సంపాదిస్తారేమో!

అసలు ఈ తాళాలు విలక్షణమైనవి.బయట చేసినవి కాదు.లోపల చేసినవే. అంటే వాడు నాస్తికుడై, ఇలాంటి పద్యాలు నేను చదవనని ప్రతిజ్ఞపూనటం..శివుడు,విష్ణువు భగవంతుని రూపాలు కాదనటం..అసలు భగవంతుడే లేడనటం.....తాళం వాడే చేశాడు, వాడే బిగించుకున్నాడు, చెవి వాడిదగ్గరే ఉంది...అల్లాంటి వారిని గురించి పోతన్నగారంటున్నారు,"కలుగనేటికి తల్లుల కడుపుచేటు"అని! ఆ మహానుభావుణ్ణి ఆ తల్లి తొమ్మిదినెలలు మోసింది....ప్రసూతిబాధ పడ్డది..వాడికి నానా చాకిరీ చేసింది..చివరకు వీడు సిద్ధ్హమైనాడు!!!

కాదయ్యా వీడు గొప్ప ఉద్యోగం చేశాడు,గొప్ప ప్రచారం చేశాడు,ఒక మంత్రి, ఒక కవి, ఒక కలెక్టరు, ఒక పత్రికాధిపతి, లోకాన్ని ఊగించి పడేశాడంటారేమో!నిజమే కావచ్చు.అనంతదేశాలలో,అనంతకాలంలో ఇలాంటి పనులు చేసినవాళ్ళు అంత సంఖ్య ఉన్నారు.ప్రయోజనమేముంది! చివరకు చనిపోయారు.అయితే శివపూజ చేసినవాడు,హరిభజన చేసినవాడు చావకుండా మిగిలారా అనేది ప్రశ్న? వాళ్ళూ పోయారు....చచ్చి ఉత్తమజన్మలు పొందారు....."అమ్మలగన్నయమ్మ" పద్యానికి రాసిన వ్యాఖ్యానం ఇక్కడ సంధించుకోవచ్చు,,,

ఈ పంచభూతాలు వేఱు, ఆ జీవుడు వేఱు...ఆ భక్తులు జీవలక్షణానికి సంబంధించినవారు. వీళ్ళు వట్టి మట్టిపదర్థానికి సంబంధించినవారు...అందువల్ల వీళ్ళు తల్లుల కడుపుచేటు. అంటే ఈ మట్టిలోకి(పంచభూతాత్మకమైన శరీరంలోకి) జీవుడు ప్రవేశించి సత్క్యార్యాలు చేస్తే మట్టికి చరితార్థం...ఆ మట్టిలో మళ్ళా మన్నే ప్రవేశిస్తే రెట్టింపు బరువు....తల్లుల కడుపుచేటంటే అర్థం ఇది...జీవుడు వెలుతురు,అగ్ని,ప్రకాశం. అది ప్రవేశించిన మట్టిపాత్ర తేలిపోతుంటుంది..అందులోనూ కొంత ఆకాశముంది.ఆ మట్టిపాత్ర తేలిక...కాని ఇలాంటి నాస్తిక జీవుడు ప్రవేశించిన పాత్ర, అసలది పాత్ర కాదు, వఠ్ఠి మట్టిముద్ద, లేకపోతే మన్నుతో నింపిన కుండ.........ఆ కుండ పదిరెట్లు బరువు...తల్లుల కడుపుచేటు కాదా!!!!

9 కామెంట్‌లు:

 1. నా చిన్నప్పుడు మా తాతతయ్య తెల్లవారు ఝామున నాలుగు న్నర కు లేచి తెల్లవారే దాక ఈ పద్యాలు పాడేవారు. మా అమ్మక్కయ్య తో దుర్గగుడి కి ఒకవేపు నుండి వెళ్లి ఇంకొకవేపు దిగే వాళ్ళం నడుచుకుంటూ. అవన్నీ మనసులో మెదులుతున్నాయి. మెదడులో న్యురోన్సు అప్పుడు శాశ్వితం గ కలిసిపోయినాయి ఈ చక్కటి భావాలతో. జీవితం లో చక్కటి మార్గం లో వెళ్ళటానికి మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారు మన పెద్దలు. చక్కటి పద్యాలు విడమర్చి చెబుతున్నారు. సంతోషం.
  రామకృష్ణ

  రిప్లయితొలగించండి
 2. నేను కూడా దేవాలయంలో పెద్దగా నామసంకీర్తనం చెయ్యాలంటే అదోరకమైన బిడియానికి లోనవుతుంటాను. ఇకనుంచి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకునైనా గట్టిగా నామజపం చెయ్యాలని నిర్ణయం తీసుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 3. @రామకృష్ణ గారు,
  అవునండీ,అలాంటి తియ్యటి బాల్యాన్ని ఇప్పటి పిల్లలకు అందించలేక పోతున్నామనే నా బాధ..
  @రవిచంద్ర,
  చాలా సంతోషంగా ఉంది,మీరు తీసుకున్న నిర్ణయానికి..

  రిప్లయితొలగించండి
 4. కౌటిల్య గారు,

  ఇప్పుడే మీ బ్లాగు చూసాను. పోతన పద్యాలు వివరణలతో ఎంతో బాగుంది. పోతన భాగవతంలో సృష్టి ఆదిలో బ్రహ్మ దేవుడు తన ఆది తెలుసుకోవాలని తామర తూడులో ప్రయాణించి, తెలుసుకోలేక వెనుదిరిగి వచ్చి, పద్మాసనుడై "తన్నుగన్న వానిని తనలోనే గనెను" అన్న పాదం ఉన్న పద్యం నాకు పంపగలరా?

  రిప్లయితొలగించండి
 5. శ్రీ కౌటిల్య గారికి, నమస్కారములు.

  ఎప్పటిలాగానే చక్కని, తియ్యని పద్యాలు చెప్పి, వాటి భావార్ధం చెప్పారు. బాగుంది. అయితే, పోతన గారి ఈ పద్యంలో, మొదటి రెండు చరణాలలో: " చేతులారంగ శివుని పూజింపఁడేని

  నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని

  ఇక్కడ "శివుని పూజింపమని; హరిని కీర్తింపమని" చెప్పటంలో, దీని వెనుకవున్న అంతరార్ధం లేదా తత్త్వం ఏమిటో ఊహించి చెప్పగలరా?

  భవదీయుడు,
  మాధవరావు.

  రిప్లయితొలగించండి
 6. Super andi... just now i called my elder son and read this poem to him and asked him to repeat after me and explained the meaning to him. Felt extreme happy. Def. i will try to teach my both sons. I will teach this poem to both of them. I want to buy Potana bhagavatam book. Can you pl. tell me where to get as i am searching very badly from long time on web as i live in chennai. Thank you very much again.

  రిప్లయితొలగించండి
 7. @శశిరేఖ గారు,
  చాలా ఆనందంగా ఉందండి, మీరు మీ పిల్లలకి నేర్పిస్తున్నారని తెలిసి...నేను బ్లాగు రాస్తున్న ముఖ్యఉద్దేశ్యం అదే...

  మీకు భాగవతం వ్యాఖ్యానంతో కావాలంటే, టిటిడి వాళ్ళు వేశింది బాగుంటుంది..మొత్తం ఐదు భాగాలు...వాళ్ళ పుస్తకాల షాపుల్లో ప్రయత్నించండి..

  రిప్లయితొలగించండి