ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

10, ఫిబ్రవరి 2010, బుధవారం

భాగవత కల్పవృక్షం


















లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామమ్ము మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయన్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
(భాగ - ప్ర - ౨౦)





నా చిన్నప్పుడు,నాన్న క్షీరసాగరమథనం కథ చాలా అందంగా చెప్పేవారు....అందులో ఒక్కో వస్తువూ మెల్లగా రావడం మొదలెడతాయ్.....మొదట హాలాహలం వస్తుంది....దాన్ని మన శివయ్య తాగేస్తాడు....బైటే కాదు,శివుయ్య పొట్టలో కూడా మనలాంటి లోకాలుంటాయంట! అందుకని మన పార్వతీదేవి,శివుడి గొంతు గట్టిగా పట్టుకుని ఆ విషాన్ని అక్కడే ఆపేసిందట! అంతే మరి! నాన్నలకి మన మీద ప్రేమున్నా తొందరెక్కువ.....’అమ్మ’నే అన్నీ ఆలోచించి చేస్తుంది......సరే అది అయిపోయిందిగా! తర్వాత కల్పవృక్షం వచ్చిందట! అప్పుడు నేనున్నాగా అనుమానాల పుట్టని.....అడిగా..."నాన్నా!కల్పవృక్షమంటే ఏంటీ?" అని......"మన కోర్కెలన్నీ తీర్చేది" అని చెప్పాడు నాన్న......మనం ఒక్క అనుమానంతో ఆగం కదా! మళ్ళా అడిగా..."నాన్నా! మరి ఆ కల్పవృక్షం ఎలా ఉంటుంది? మన చెఱువొడ్డున జువ్విచెట్టుందే, అల్లా పెద్దగా ఉంటుందా!" అని.......అప్పుడు నాన్న నవ్వి ఈ పద్యం చెప్పి ,"కల్పవృక్షమంటే, మన భాగవతంలాంటిదన్నమాట!" అనేవారు....నేనేమో ఈ పద్యంలోలా కల్పవృక్షాన్ని,మన భాగవతంతో పోల్చుకుని తెగ ఊహించేసుకునేవాణ్ణి.........

ఇక మన పద్యంలోకొస్తే......

మన పోతన్నగారు భాగవత పురాణం యొక్క గొప్పదనాన్నంతా ఈ పద్యంలో చెప్తారు....భాగవతము కల్పవృక్షమల్లే చెప్పబడింది.......అంటే, వృక్షానికి ఉన్న లక్షణాలు, భాగవతానికి ఉన్న లక్షణాలు సరిపోల్చబడ్డాయన్నమాట......

భాగవతాఖ్య కల్పతరువు---- భాగవతపురాణమనే ఈ కల్పవృక్షం

ఉర్విన్----ఆ కల్పతరువు దేవలోకంలో ఉంటే, ఈ భాగవత కల్పవృక్షం మన భూలోకంలో వెలిసిందట, ఎందుకూ...

సద్ద్విజ శ్రేయమై---- మానవుల శ్రేయస్సుకోసమట...

వెలయన్-----ఆ భాగవతం ఎలా ఉందయ్యా అంటే...

లలితస్కంధము------- స్కంధము అంటే చెట్టుబోద; అంటే కల్పవృక్షం బోద అంత లలితంగా ఉందట!(మరీ అల్లా ఉంటే ఎల్లా! గట్టిగా గాలొస్తే పడిపోదూ! కాదులే,దేవతావృక్షం కదూ...ఏం అవదు)......మన భాగవతంలో కూడా పన్నెండు స్కంధాలున్నాయిగా! ఒక్కో స్కంధమూ మందార మకరందమూ,లలిత రసాల పల్లవమూ కదా! (భలే!మన భాగవతం పన్నెండు కల్పవృక్షాలతో సమానమన్నమాట!).

’కృష్ణ’మూలము-------- అంటే నల్లనివేళ్ళు కలది!(చాలా గట్టివేళ్ళన్నమాట!ఇంకెలా పడిపోతుందీ!).......భాగవతం కృష్ణుడు మూలమైన కథ కదా!

శుకాలాపాభిరామమ్ము----------శుకము అనగా చిలుక; ఆలాపము-మాట; అభిరామము-మనోహరము; అంటే, కల్పవృక్షం చిలకల కిల కిలలతో, మనోహరంగా ఉందట......మన భాగవతమంతా భారతీవిద్యాపరిపూర్ణుడైన శుకమహర్షి, పరీక్షిన్మ్గహారాజుకు ’సముడై’ సర్వోపనిషదర్థరూపంగా బోధించిన కథే కదా!

మంజులతా శోభితము-------- మంజు-మనోహరమైన; లతా-తీగల చేత; అందమైన తీగలు పాకి కల్పవృక్షం మహా మనోహరంగా ఉన్నదట!
మంజులతా----మనోహరత్వము చేత శోభితమైనది మన భాగవతం; భగవంతుని కథలు మనోహరములు కనుక......

సువర్ణ సుమనస్సుజ్ఞేయము------- సువర్ణ-బంగారు; సుమనః-పువ్వుల చేత; లేదా దేవతల చేత; సుజ్ఞేయము-చక్కగా తెలిసికొన దగినది.....అంటే, కల్పవృక్షానికి బంగారు వన్నెగల పువ్వులుంటాయన్నమాట! దాని కింద పసిడికాంతుల దేహాలతో దేవతలుంటారన్నమాట!
సువర్ణ--మంచి అక్షరాలు అనగా మంచి మాటలు; సుమనః--మంచి మనసు; సుజ్ఞేయము--తెలిసికొనదగినది.మన భాగవతం నిండుగా అన్నీ మంచి మాటలే,,,,మంచి మనసుతో అవన్నీ నేర్చుకోవలసిందే...

సుందరోజ్వల వృత్తంబు------- అందమైన ప్రకాశించుచున్న వృత్తము కలది......కల్పవృక్షం గొగ్గిరి,గొగ్గిరిగా కాకుండా చక్కగా గుండ్రంగా,నున్నగా ప్రకాశిస్తోందట......మన భాగవతం నిండా కూడా ఉత్పలమాల,చంపకమాల,శార్దూలం,మత్తేభం మొదలైన ఎన్నో అందమైన వృత్తాలతో పద్యాలున్నాయిగా! అవి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాయి..

విమల వ్యాసాలవాలంబు------ అలా ఆ కల్పవృక్షం ప్రతి భాగమూ చాలా అందంగా ఉన్నదట! మన భాగవతాన్ని మొదట వ్యాసమహర్షి ఎంతో అందంగా చెప్పాడు కదా!

మహా ఫలంబు--------- కల్పవృక్షం అన్ని కోరికలూ తీరుస్తుంది.....భాగవతం కూడా చదివినవారికీ,విన్నవారికీ సర్వవాంఛలనూ సమకూరుస్తుంది......

”సర్వేజనాస్సుఖినోభవంతు”

11 కామెంట్‌లు:

  1. కౌటిల్యగారు,

    బాగుందండి. తెలుగు భాగవత సుధలని ఆరారా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

    సద్ద్విజ శ్రేయమై - అన్నదానిలో కూడా శ్లేష ఉంది. ద్విజ అంటే పక్షులు అన్న అర్థం కూడా వస్తుంది. అంచేత మంచి పక్షులకి ఆశ్రయమిచ్చేది అని కల్పవృక్షార్థంలో చెప్పుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. సద్ద్విజుడు అంటే మానవుడు. దీని వ్యుత్పత్తి అర్థమేమిటో వివరించగలరా?

    రిప్లయితొలగించండి
  3. నా కొచ్చిన కొద్ది వ్యాకరణం తో: సత్ + ద్విజుడు . సత్ అంటే మంచి అనే అర్ధం ఉంది కదా ఇంకా ద్విజుడు అంటే రెండు జన్మలు గలవాడు అని అర్ధం అవుతుంది. రెండు జన్మలు గలవాడు బ్రాహ్మణుడు అంటారు. ఇక్కడ బ్రాహ్మణుడు అనే పదానికి 'న జాతో బ్రహ్మనే భవతే' వర్తిస్తుందనుకుంటాను. చివరికి మంచి మనషులు అని అర్ధమోస్తుంది. పెద్దలు తప్పులుంటే క్షమించండి. దిద్దుకొన గలను.

    కౌటిల్యగారూ చక్కగా చెప్పారు. నాకు మీమూలంగా మర్చిపోయిన తెలుగు గుర్తుకొస్తోంది. ధన్యవాదములు.
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  4. కౌటిల్యగారు
    మీరు భాగవతామృతాన్ని పంచే సత్కార్యమును చేపట్టినందుకు చాలాసంతోషము. మీరీ యజ్ఞమును నిర్విఘ్నంగా కొనసాగాలించాలని మనవి

    రిప్లయితొలగించండి
  5. @భైరవభట్ల గారు,
    మీ అభిమానానికి ధన్యవాదాలు....మీరు చెప్పిన శ్లేష కూడా రాద్దామనుకున్నా...ఎందుకో మరి గురువుగారు చెప్పలేదు,అందుకే నేను కూడా వద్దులే అనుకున్నా...ఇంకా,శుకాలాపాభిరామమ్ము దగ్గర పక్షులగురించి చెప్పాలికదా అని..పైగా ఆ వాక్యాన్ని పోల్చడం మొదలెట్టటానికి ముందే చెప్పేశాను,వివరణలో క్రమం పోతుందేమో అని రాయలేదు...అయినా తెలియపరచినందుకు ధన్యవాదములు...

    @రవిచంద్ర,
    మీరడిగిన అర్థం క్రింద రామకృష్ణ గారు చెప్పేశారు...

    @రామకృష్ణ గారు,
    మీ అభిమానానికి ధన్యవాదాలు..మీరు చెప్పిన అర్థమే నాకూ తెలుసునండీ..వేరే ఏదైనా ఉంటే పెద్దలెవరైనా చెప్పాలి..

    @దుర్గేశ్వర గారు,
    తప్పకుండా అండీ..మీలాంటి వాళ్ళ అభిమానం,గురువుగారి ఆశీస్సులు,ఆ దేవుడి దయ ఉంటే రాస్తూనే ఉంటా.....

    రిప్లయితొలగించండి
  6. కౌటిల్యగారు.. ఒక చిన్న సందేహమండీ.. ఈ పద్యానికి.. ఈ టపాకి. ఈ సందేహం పూర్తిగా సరియైనదో కాదో తెలియదుగానీ.. మనసులోవుంచుకోకుండా అడిగేస్తున్నా.

    పదానికి భావం ప్రకారం వెళితే ఒక అర్ధం వస్తుంది.. మళ్ళీ మధ్యలో కొన్ని పదాలు కలిపితే వేరేభావమొస్తుంది కదా. అంటే పైన భైరవభట్లగారు చెప్పినట్టుగా శ్లేషలు వుంటాయి కదా!

    అలాంటప్పుడు ఇలాంటి పద్యాలు పోతన్న గారు రాసినప్పుడు దానికి తాత్పర్యములు కూడా రాసేవారంటారా? లేక అప్పటి పండితులకు అవి సులువుగానే అర్ధం అయ్యేవా?.

    ఇదంతా ఎందుకడుగుతున్నానంటే.. అసలు పద్యాన్ని అర్ధంచేసుకునే విధానం ఎలాగని తెలుసుకోవటానికే.., నేనింకా ఇందులో ఒకటోతరగతి వాడినేనని.. అక్షరాలు మాత్రమే నేర్చుకున్నవాడినని మనవి.

    రిప్లయితొలగించండి
  7. శ్రీనివాసరాజు, మంచి ప్రశ్న అడిగారు.
    ఇది నేను చెబుతున్న నా ఉద్దేశం మాత్రమే. దీనికి నా దగ్గర ఏ చారిత్రక ఆధారాలు లేవు.
    1. ఆ కాలంలో ఏ రాజుగారి కొలువులోనో, లేక ఏదో గుళ్ళొ జరుగుతున్న సభలోనో కవిగారు తమ కవితాగానాన్ని వింపించడం జరిగేది. కవిత్వానికి శ్రోతలే కాని పాఠకులు ఉండేవారు కాదు.
    2. ఇట్లాంటి రకరకాల కావ్యాల్ని కంఠతాపట్టి రసవత్తరంగా గానం చెయ్యగల వృత్తికులాలు కొన్ని ఉండేవి. వీళ్ళు ఊరూరా తిరుగుతూ ఆయా సందర్భాల్లో (సంతలు, జాతరలు, ఉత్సవాలు, ఇత్యాది) కవితాగానం చేసేవారు.
    3. వింటున్న శ్రోతల్లో పండితులైన వారికి అర్ధమైనది అర్ధం కాగా, గానం చేస్తున్న కవిగారో, వృత్తి గాయకుడో కవిత్వంలోని సొగసుల్ని గురించి కొంత వివరణ కూడా ఇస్తుండేవారని నా అంచనా.
    4. ఇలాంటి ప్రదర్శన జరిగినప్పుడల్లా కవితా గానం చేస్తున్న వ్యక్తి చుట్టూ కోందరు పండితులు ఉండి, సందర్భోచితంగా ప్రశ్న అడగడం ద్వారానో, లేక తామే తమకి నచ్చిన అంశాన్ని విడమరిచి చెప్పడమే చేస్తుండేవారు. తద్వారా పామరులైన మిగతా శ్రోతలు ఇంకా ఎక్కువ ఆస్వాదించ గలిగేవారు.
    5. ఆ రోజుల్లో, ఇలా క్లిష్టమైన పాండిత్యంతో నిండి వున్న కవిత్వానికి ఆడియెన్సు చిన్నదే. జనసామాన్యానికి నచ్చే ప్రక్రియలు వేరే ఉండేవి. అందుకనే తమ కవిత్వం జనసామాన్యంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు కవులు ఆయా పద్ధతుల్ని అనుసరించారు. ఉదా. పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు విరివిగా ద్విపదలు రాశారు. అన్నమయ్య కవిత్వమంతా పదసాహిత్యమే.

    రిప్లయితొలగించండి
  8. రాజు గారూ..మంచి సందేహం...చాలా విపులంగా చెప్పినందుకు ముందుగా కొత్తపాళీ గారికి ధన్యవాదాలు...

    అసలు ఏ కవైనా తను కావ్యం రాసేటప్పుడే,దాన్ని రాజుగారితో ఇష్టాగోష్టిలోనో,లేకపోతే సభలోనో,తోటి పండిత మిత్రులతోనో ఎప్పటి కావ్య భాగాన్ని అప్పుడు చదివి వినిపించే వాళ్ళు..చర్చించే వాళ్ళు....

    మన పోతన్న గారు ఏ రాజునీ చేరనివ్వలేదు కాబట్టి, తన పండిత మిత్రులతో చర్చిస్తూ ఉండి ఉండవచ్చు...ఆలయాల్లో పురాణంగా చెప్తూ ఉండి ఉండవచ్చు కూడా! ఆ కాలంలో సామాన్యమైన వాళ్ళకి కూడా ఎంతోకొంత సాహిత్య పరిచయం తప్పకుండా ఉండేది....కాబట్టి తేలిగ్గానే అర్థం అయ్యేది....

    రిప్లయితొలగించండి
  9. Sri Kowtilya garu
    Chaalaa sweet ga nectar laga undi andi. Really thanks a lot for sharing nectar with every one in this high speed tech timings. I wish you continue like this not only with Bhagavatam but also Ramayanam, Maha Bharatam etc.

    రిప్లయితొలగించండి