ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

22, ఫిబ్రవరి 2010, సోమవారం

అంత్యానుప్రాస చక్రవర్తి మన పోతన్నగారు


భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యు చిత్త భీషణములు హృ
త్తోషణములు గల్యాణ వి
శేషణములు హరి గుణోపచిత భాషణముల్.
(భాగ - ప్ర - ౪౪)



మన పోతన్నగారు ముందు ఉపోద్ఘాతం పద్యాలయ్యాక, తన వంశ వర్ణనం చెప్తారు......తరువాత తన వేలుపుతండ్రి శ్రీ రామనారాయణునికి భాగవతాన్ని సమర్పిస్తున్నానంటూ, షష్ఠ్యంతాలు చెప్తారు......"హారికి నందగోకుల విహారికి","శీలికి నీతిశాలికి వశీకృతశూలికి","క్షంతకు కాళీయోరగ విశాల ఫణోపరినర్తన క్రియారంతకు","న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనస్స్థాయికి".......అంటూ చెప్తారు... అబ్బబ్బ.....ఏం పద్యాలు!..ఒక్కోటీ అంత్యానుప్రాసల అమృతగుళికలు.....తియ్యటి చక్కెర చిలకలు....

తర్వాత అద్భ్హుతమైన నైమిశారణ్య వర్ణన.........ఆ శ్రీవిష్ణుక్షేత్రమైన నైమిశంలో శౌనకాది మహామునులు హరిని చేరుకోవటానికి సత్రయాగం చేస్తున్నారట...ఆ యాగం సహస్రవర్షాలు అనుష్ఠానకాలం కలదట.....ఒకరోజు నిత్యహోమాదులైన తర్వాత మునులందరూ, సకల పురాణవ్రాతుడైన సూతమహాముని దగ్గరికొచ్చి మాకేవైనా నాలుగు మంచిమాటలు చెప్పమని అడిగార్ట......

అవికూడా ఎల్లాంటి మాటలయ్యా అంటే.......

భూషణములు వాణికిన్----సరస్వతికి నగలవ్వాలట,గొప్ప అలంకారాలుగా ఉండాలట....

అఘపేషణములు-------పాపాల్ని పిండిపిండి చేసెయ్యాలట!

మృత్యు చిత్త భీషణములు-----మృత్యువు యొక్క చిత్తానికి భయంగొలిపేవట, అంటే మనమా మాటలంటూంటే, మృత్యువు భయపడి పారిపోవాలట....దాని ఆలోచనా రూపాలైన రోగాలుకూడా దరిచేరకూడదట!

హృత్తోషణములు-------హృదయాన్ని సంతోషపెట్టునవి అంటే, మన మనసుని ఆనందపు జల్లుల్లో తడపాలన్నమాట!

కళ్యాణ విశేషణములు----శుభాలని విశేషంగా కల్పించేవట......

మరి ఇంతటి మహత్తు వేటికుందో కదా............
హరి గుణోపచిత భాషణముల్------అదీ! ఆ హరి, ఆ శ్రీమహావిష్ణువు గుణగణాలు కూర్చిన మాటలన్నమాట! (ఉపచిత-సమకూర్చబడిన)

మన పోతన్నగారి భాగవతంలో ఇలాంటి పద్యాలు చాలా ఉంటై....వీటిలో అంత్యప్రాసలు,యమకాలు సమకూర్చి ఉంటాయ్....ఒక మాటతో కందపద్యం మొదలు పెట్టటం, అలాంటి మాటలతోనే పద్యమంతా పూర్తచెయ్యటం...ఈరకమైన కందాన్ని వారే ప్రారంభించారు...వారే సమర్థించారు..వారే అక్కడ చక్రవర్తిగా ఏలారు....వట్టి చక్రవర్తి కాదు, ఏకఛ్ఛత్రాధిపత్యం వహించారు.......

ఇంకొకడు ఇలాంటి పద్యాలు వ్రాయలేడు...వ్రాసినా అంత అందంగా ఉండవు......ఇతర కవుల కొన్ని పద్యాల్ని అనుకరించవచ్చు.అనుకరిస్తే అనుకరించాడని తెలుస్తుంది......అనుకరణలో ఒక చమత్కారం ఉంది, అనుకరింపబడ్డవాడి లక్షణం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళా అనుకరించినవాడి లక్షణంకూడా కొంత కనిపిస్తూనే ఉంటుంది........కాని పోతన్నగారి ఇల్లాంటి పద్యాల్ని అనుకరిస్తే మనకు వాడు అనుకరించాడనే తెలియదు. పోతన్నగారి శక్తిలో వాడు మునిగిపోతాడు.అక్కడ వాడికి నామరూపాలుండవు.... పోతన్నగారే మనకి గోచరిస్తారు; పోతన్నగారి యిట్టి కందపద్యరచన అట్టిది.......ఆ పద్యం సర్వమూ పోతన్నగారి మయము..........

10 కామెంట్‌లు:

  1. మీరు బ్లాగు రాసిన మొదట్లో పద్యాన్ని పైపైనే చదివేసి సరాసరి వివరణకై వచ్చేసే వాణ్ణి. కానీ ఈ సారి నుంచి ముందుగా పద్యాన్ని తీరిగ్గా చదివి నేనర్థం చేసుకున్నంత చేసుకుని తరువాత మీ వివరణలోకి వస్తున్నాను. మంచి ఇంప్రూవ్‌మెంట్ కదా? :-)

    రిప్లయితొలగించండి
  2. why are you repeatedly adding an additional "N" to pothana? His name AFAIK was bammera pothana. Modifying names impedes reading the blog :-(

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగుకి నేను, క్రమం తప్పకుండా చదివే పాఠకుడిని. చాలా బావుంటున్నాయి మీ వివరణలు.

    మీరు పైన వివరించిన కోవలోనిదే నాకు నచ్చిన ఇంకో పోతన కందం....

    చిత్రంబులు త్రైలోక్య ప
    విత్రంబులు, భవలతా లవిత్రంబులు, స
    న్మిత్రంబులు, మునిజనవన
    చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబుల్

    రిప్లయితొలగించండి
  4. బమ్మెర పోతన అసలు పేరు కానీ వాడుకలో గౌరవప్రదంగా పోతన్న అంటాము కారణం దానిలో "అన్న" పదం ఇమిడి ఉంది. మన పోతన ఎంతో దగ్గర వాడు అవుతాడు.
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  5. @రవిచంద్ర,
    అవునండీ,చాలా మంచిగా ముందుకెళుతున్నారు...అందర్నీ నేను కోరుకున్నేదీ అదే..ముందు పద్యం చదివి వీలైనంతగా అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి...తర్వాత గురువుగారి వివరణలో తియ్యదనం బాగా తెలుస్తుంది..
    @శ్రీహర్ష గారు,
    చాలా ధన్యవాదాలు...భాగవతం నిండా ఇలాంటి తియ్యటి పద్యాలెన్నో....అందుకే చదువుకోని వాళ్ళ నోట్లో కూడా ఈ పద్యాలు ఎంత అందంగా దొర్లుతూ ఉండేవో...
    @రామకృష్ణ గారు,
    మీ వివరణకి ధన్యవాదాలు...

    @అయ్యా అజ్ఞాత గారు,
    మీకు రామకృష్ణగారు చెప్పిన వివరణ అర్థమైందనుకుంటా...ఎవర్నైనా అన్న,అయ్య,అమ్మ అని పేరు చివర చేర్చి పిలుచుకోడం మన భరతజాతి సంస్కారం,అందునా తెలుగువాళ్ళలో ముఖ్యంగా... (మీరు తెలుగువారేననుకుంటున్నాను!)ఆ పిలుపుల్లో ఒక గౌరవం ఉంది,ఒక ఆర్తి ఉంది,ఒక ఆర్ద్ఱత ఉంది,ఓ సౌహార్ద్ఱ భావన ఉంది...పెద్దన గారిని"పెద్దన్న" అన్నా,నన్నయామాత్యుణ్ణి "నన్నయ్య" అన్నా,తిక్కన,ఎఱ్రనలకి 'అన్న' అని చేర్చి పిల్చినా,తెనాలి వారిని "రామకృష్ణయ్య"చేసినా.....మనవాళ్ళు అన్నభావనే వాటిల్లో తొణుకుతుందిగానీ,వాళ్ళని తక్కువచెయ్యటమో,లేకపోతే వాళ్ళపేర్లని రూపాంతరం చెందించటమో కాదు....పైగా గురువుగారు ఎక్కడా కూడా "పోతన్నగారు" అనే వాడారు కానీ "పోతన" అని ఎక్కడా పిలవలేదు.....దానివల్ల నా బ్లాగు చదవడాన్ని ఆపుతుందనుకోను....ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. మొదటిసారి ఈ పద్యాలని చదువుతున్నా.. ఈ పద్యాలని చదవకుండా ఇంతకాలం ఎంతో కోల్పోయాను కదా అనిపిస్తుంది. ఇలాంటివి మాకు పాఠాలలో ఎందుకు చెప్పలేదా అనిపిస్తుంది. ఏదిఏమైనా మీ ద్వారా ఆ పాఠాలు నేర్చుకుంటున్నాం.. చాలా సంతోషంగా వుంది.. ఇలానే రాస్తుంటారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. మీరు ఇంత శ్రధ్ధగా చదువుతుంటే రాయకుండా ఎలా ఉండగలనండీ...

    రిప్లయితొలగించండి
  8. Sri Kowtilya garu

    Chaalaaa baaga undi andi meee blog. Instantly i liked your blog. I request you to please continue to post more and more potana bhagavata padyas so that we will have all nectar to our eyes and brains.

    రిప్లయితొలగించండి
  9. @శశిరేఖ గారు,
    తప్పకుండా...మీలాంటి పాఠకులు ఉంటే రాయకుండా ఎలా ఉంటాను...నా భాగవత గమనం సాగిస్తాను..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి