ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

15, ఆగస్టు 2010, ఆదివారం

అల్లసాని వారి "అల్లరి" వినాయకుడు



ఉ. అంకముఁజేరి శైలతనయా స్తన దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంక కుచంబుఁ గాన కహివల్లభహారముఁ గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికై.
(మను చరిత్రము-ప్ర.ఆ -౪)


మనుచరిత్ర, నేను చదివిన రెండో కావ్యం......మన తెలుగు ప్రబంధాలన్నీ కథారూపంగా చదుకున్నా, మొత్తం కావ్యంగా చదివింది రెండే రెండు.....మొదటిది కళాపూర్ణోదయం, రెండవది మనుచరిత్ర.......కళాపూర్ణోదయం చదవడం మాకు వారసత్వంగా వచ్చిన ఒక అలవాటులాంటిది అనుకోవచ్చు....మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర్నుంచో మరి అంతకుముందునుంచో మరి నాకు సరిగ్గా తెలియదు....మా అమ్మమ్మ కళాపూర్ణోదయం పేర్లన్నీ మా అమ్మవాళ్ళకి పెట్టేసింది...(అమ్మ పేరు సుగాత్రి, ఒక పిన్నిపేరు మధురలాలస, ఇంకో పిన్నిపేరు కలభాషిణి)......నాన్న అంటూ ఉంటారు.."అసలు, పేర్లు చూసే అనుకున్నా,మంచి సాహిత్య పరిచయం ఉన్న కుటుంబం అని....ఇంకో మాటలేకుండా పెళ్ళికి ఒప్పేసుకున్నా" అని.........నాకు కళాపూర్ణోదయం కథంటే చిన్నప్పట్నుంచీ ఎంత ఇష్టమో.....

ఇక మనుచరిత్ర విషయానికొస్తే.... నాకు కావ్యం చదవకముందు ఒఠ్ఠి కథ చదుకునేప్పుడు "ఎందుకు పెద్దన్న గారు, కథేమీలేకపోయినా కేవలం వరూథినీ ప్రవరాఖ్యం కోసం ఎందుకు మూడాశ్వాసాలు వృథా చేశాడా" అనిపించేది....నాకు మట్టుక్కు నాకు ఇప్పటికీ స్వరోచి కథే ఇష్టం....చక్కగా ఎంతమంది చుక్కల్లాంటి అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుంటాడో! కట్నంగా ఎన్ని "విద్యలు" తెచ్చుకుంటాడో! తర్వాత.... పదోతరగతి పుస్తకంలో "ఇందీవరాక్షుని వృత్తాంతం" ఉండేది....ఏడో తరగతిలో ఉన్నప్పుడు అక్క దగ్గర ఆ పుస్తకం తీసుకుని చదుకున్నా....(మనకి ముందు తరగతి పుస్తకాలు ముందు ముందే చదవడం కూడా జన్యురీత్యా వచ్చిన లక్షణమే!).....అసలే పద్యాలంటే బహు ఇష్టమాయే!..అందులో ఉన్న ఆ పద్యాల అందానికి,తియ్యదనానికి ఇక ఆపబట్టలేక మనుచరిత్ర తీసి పద్యం,పద్యం చదుకోడం మొదలెట్టా.....అర్థం కాకపోతే నాన్నని అడగడం,నిఘంటువుల్లో వెతుక్కోడం....అలా ఎట్టకేలకు ఒక సంవత్సరానికి ముగించా......తర్వాత గురువుగారి వ్యాఖ్యానాలు....అప్పుడర్థమైంది!! అసలు మనుచరిత్రంతా మొదటి మూడాశ్వాసాలే అని........కానీ ఇప్పుడు ఒక్క పద్యం కూడా,కనీసం లేశమాత్రంకూడా గుర్తులేవు......ఆ తియ్యటి పద్యాల్ని మళ్ళా గుర్తుచేసుకుంటూ, పనిలో పనిగా మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.......

ఇక మన పద్యంలోకొస్తే....

అంకము జేరి--- తొడనెక్కి.....తల్లి తీసి తొడమీద ఎక్కించుకోలేదు.....ఈయనే ఎక్కినాడు....ఎందుకోసమట అంత ఆరాటం?

శైలతనయా స్తన దుగ్ధములు------ తల్లియైన పార్వతి చనుబాలకోసమట! పాపం ఎంత ఆకలిమీదున్నాడో! అసలా తల్లి ఎవరు....కొండకూతురు....ఆమెయందు స్తన్యసమృద్ధి ఎంతయుండునో తెలియదు.....

బాల్యాంక విచేష్టన్----- బాల్యానికి చిహ్నమైన విశేషమైన చేష్టతో; ఆయన ఉంది శైశవంలో కాదట! బాల్యంలో.....అంటే ’మకురుపాలు’ తాగుతున్నాడు కాబోలు! ఆ తల్లి ఇంకా పాలు మాన్పించలేదన్నమాట!....మనిళ్ళల్లో ఐతే ఆర్నెల్లు నిండగానే మాయచేసో, అదిలించో మాన్పిస్తారు...... ఈయనకేం! పోటీ లేదుగా....వెనకాయనకి అఱువు తల్లులు ఆరుగురున్నారాయె!

తొండమున అవ్వలిచన్గబళింపబోయి---- పిల్లలు సాధారణంగా పాలుతాగుతూ విడిగాఉన్న చేత్తో తల్లి రెండవ ఱొమ్మును స్పృశిస్తుంటారు..పుణుకుతుంటారు....ఈ చేష్ట సరియే! కాని ఈ విఘ్నేశ్వరుడు తల్లి యొక్క అవ్వలి చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు.ఎందుకు?తనకు చెయ్యుంది కదా! ఇది అసలు బాల్యాంక విచేష్టకాదు......ఏనుగు మొగము ఉన్నవాని లక్షణము......

అవ్వలి చన్+కబళింపబోయి----- కబళించుట అనగా తినుట....కబళము - ముద్ద; (మాధవ కబళమని వింటూంటాం కదా!)....మరి చన్నును కబళింపబోవుట ఏమిటి?---సరే!

ఆవంక కుచంబు గానక---- వెదకినాడు...ఆతలనున్న చన్ను కనపడలేదట! మరి ఏం కనపడిందో!

అహివల్లభ హారము గాంచి----- హారముగానున్న పాము కనిపించింది. అహివల్లభుడే హారమట! ఇక్కడ పాము హారంగా ఎక్కణ్ణుంచొచ్చింది? అమ్మ ఎప్పుడూ పాములు మెళ్ళో వేసుకోదే! వేసుకునేదెవరు? ఆ అయ్య పరమేశ్వరుడు......అదన్నమాట సంగతి.....ఈ అమ్మ, ఆ అయ్యతో సగం మేనుగా కలిసి అర్థనారీశ్వరరూపంతో ఉన్నారన్నమాట!.....సరే ఆ పాముని చూచినాడు.చూచినాడనగా తెలుసుకున్నాడని అర్థం.....ఇక్కడ కాంచి అనకూడదు....ఎందుచేత?

మృణాళాంకుర శంకనంటెడి------ మృణాళాంకురమనగా తామరతూటి మొక్క; ఆయన అది ’అహివల్లభహారము’గా తెలుసుకోలేదట! అక్కడ అహివల్లభహారము ఉండటం చేత అది మృణాళాంకుర మనుకొన్నాడు.....అమ్మ మంచి తామరపూల హారం వేసుకుందనుకున్నాడో ఏమో! పైగా తామరతూండ్లంటే ఏనుగులకి బహు ప్రీతికరమైన వస్తువాయే! అసలిక్కడ అహివల్లభుడంటే వాసుకి.....వాసుకి సర్పాలకి రాజు....శివునికి భూషణం....ఆ వాసుకి శరీరము మహాదీర్ఘమై,మహాస్థూలమై ఉండి ఉండాలి! మరి అతనిని మృణాళాంకురం అనుకోవటం ఎల్లా?

గజాస్యుని------ ఇది అర్థనారీశ్వర మూర్తి వర్ణన....ఈతడు గజాస్యుడు...అంటే ఏనుగు మొగము కలవాడు...

కొల్తున్+అభీష్ట సిద్ధికై----- అభీష్ట సిద్ధికి ఇలాంటి గజాననుని కొలుస్తానంటున్నాడు మన పెద్దన్నగారు......అసలు ఇక్కడ అభీష్టసిద్దికై ఇతనిని కొలవటానికి అతనియందు అభీష్టాలు సమకూర్చే లక్షణాలు లేవు...అలాంటి లక్షణాలు ఇక్కడ వర్ణితం కాలేదు...

వ్యుత్పత్తిచేత ’గజ’ శబ్దానికి అర్థం "మదము కలది" అని...అనగా యదార్థ పరిశీలన చేయనిది. అది లోకం యొక్క స్వభావము...ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖము. ఈ లోకము వట్టి భ్రాంతిమయం....తెలిసికూడ వట్టి భ్రాంతి....చనిపోతామని ఎవరికి తెలియదు? లోకం యొక్క ప్రవర్తనకి ఈ తెలియటానికి ఏం సంబంధం? ఇది భ్రాంతి......

అర్థనారీశ్వరుడనగా ఈ లోకంయొక్క మహాతత్త్వము పుంజీభూతమై దేవతారూపము కట్టినవాడు.....పార్వతి, దుర్గ..ఆమే ప్రకృతి...పంచభూతముల సమాహారం....పరమేశ్వరుడు ఈ పంచభూతాలయందు అభివ్యాప్తమైయున్న చైతన్యము...ముఖ్య ప్రాణము...విజ్ఞానమయ బ్రహ్మము మొదలైనవి కావచ్చును....అట్టి వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టినాడు......మదమును మినహాయించినచో వీడు పరమ చైతన్య స్వరూపం....అతనిని కూడ మనము దేవతగా కల్పించి,(మన మదము మనకు తగ్గకూడదు.మన పనులు మాత్రం మనకి చక్కగా జరిగిపోవాలి) అట్టి విఘ్నేశ్వరుని స్తోత్రం చేస్తున్నాము............

దీనిని బట్టి ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే...... కావ్యకవులు సామాన్యంగా వేదాంతార్థాలని ఉద్దేశించి వ్రాయరు....వారికి కావలసింది వాక్చమకృతి, పాఠకుని మనస్సుకు చక్కిలిగింతలు పెట్టటం, లోకంలో ఉండే లీలలు చిత్రించటం...మనం మరీ లోపలకి వెళ్ళి చూడకూడదు......

అసలు ఈ కావ్యకవుల ఊహలో కవిత అంటే, చల్లని గాలికి తగిలినట్టు....వెన్నెల్లో విహరించినట్టు..... మాంఛి పచ్చకప్పురపు పొడి చల్లుకున్నట్టు...కమ్మటి జుంటి తేనె జుఱ్రుకున్నట్టు.....అంతే!

15 కామెంట్‌లు:

  1. అసలు ఈ కావ్యకవుల ఊహలో కవిత అంటే, చల్లని గాలికి తగిలినట్టు....వెన్నెల్లో విహరించినట్టు..... మాంఛి పచ్చకప్పురపు పొడి చల్లుకున్నట్టు...కమ్మటి జుంటి తేనె తాగినట్టు.....అంతే!

    నాలుగు ముక్కల్లో చక్కగా తేల్చి చెప్పేశారు కవిత్వ మంటే. భావగర్భితాలను ఆస్వాదిస్తూ మృదు మధుర మాధుర్యాలలో తేలిపోవటమే కవిత్వ మంటే. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. ఇంటర్మీడియేట్ లో అనుకుంటా, మా తెలుగు లెక్చరర్ ఈ పద్యంతో పాఠాల్ని ప్రారంభించారు.

    ఇప్పటి కార్టూనిస్టులకే కాదు, అప్పటి కవులకు కూడా హస్యానికి స్ఫూర్తి వినాయకుడే అనిపించింది.

    రిప్లయితొలగించండి
  3. >>వెనకాయనకి అఱువు తల్లులు ఆరుగురున్నారాయె!
    ఇది గుర్తుకు రావడం లేదు... ఎవరు?

    రిప్లయితొలగించండి
  4. వెనకాయన అంటే కుమారస్వామి.
    ఆయన్ని ఆరుగురు కృత్తికలు సాకారు అని అర్థం కామోసు.

    రిప్లయితొలగించండి
  5. బాగుంది వివరణ. ఈ పద్యం గురించి చదివితే నాకు సౌందర్యలహరిలో ఈ శ్లోక పాదాలు గుర్తొస్తాయి -
    యదాలోక్య ఆశంకాకులితహృదయో హాసజనకః
    స్వకుంభౌ హేరమ్బః పరిమృశతి హస్తేన ఝడితి||

    నాలాగా లాజిక్కుల్ని ఇష్టపడేవాళ్ళకి ఈ మాటలు అరిగించుకోవడం కొంచం కష్టంగానే ఉంటుంది -
    >>కావ్యకవులు సామాన్యంగా వేదాంతార్థాలని ఉద్దేశించి వ్రాయరు....వారికి కావలసింది వాక్చమకృతి, పాఠకుని మనస్సుకు చక్కిలిగింతలు పెట్టటం, లోకంలో ఉండే లీలలు చిత్రించటం...మనం మరీ లోపలకి వెళ్ళి చూడకూడదు......

    కానీ ప్రతిదానికీ ఉన్నా లేకపోయినా వేదాంత/అంతరార్థాలు తీస్తున్నా విసుగ్గానే ఉంటుంది లెండి. కాబట్టి ఒక్కోసారి ‘ఇంతకన్నా లోపలికి వెళ్ళి చూడకూడదు’ అనుకోడమే హాయి!!

    రిప్లయితొలగించండి
  6. "ఇది భ్రాంతి" - అవునండి - ఈ పద్యం - "శ్రీ వక్షోజకురంగ నాభమెదపై..." పద్యం ,,
    ఈ భ్రమలు కావ్యార్ధసూచకాలు అని బేతవోలు వారి పద్యకవితా పరిచయం లో చదివిన గుర్తు
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  7. విశ్వనాథ వారి "అల్లసానివారి అల్లిక జిగిబిగి" లో ఈ పద్యాలకి వివరణ చదివిన గుర్తు.
    లక్ష్మి స్తుతి భ్రాంతిమదలంకారమని, శివ స్తుతి విషమాలంకారమని, వినాయకుని స్తుతి మరల భ్రాంతిమదలంకారమని చెప్పి నాలుగు పుటలలపైనే కథని వ్యాఖ్యానించేరు.
    వారే యెక్కడో, ఈ పద్యానికి "ముక్కస్య ముక్క" అర్థం తీసుకుంటే యెంత అసమంజసమైందో చదివినట్లు గుర్తు. ఎందులోనో గుర్తు రావటం లేదు.
    DLI ernet site నుండి పై పుస్తకాన్ని చదవ వచ్చు.
    http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0004/236first=1last=114barcode=2020120004233
    సూర్యప్రకాష్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ కౌటిల్య గారికి, నమస్కారములు.

    చక్కని పద్యం; చక్కటీ వివరణ. "ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖము. ఈ లోకము వట్టి భ్రాంతిమయం...." అని వ్రాశారు. లోకం విఘ్నేశ్వరుని ముఖము అయినట్లైతే, అట్టి లోకం వట్టి భ్రాంతిమయం ఎట్లా అవుతుంది? గీతలో, పదవ అధ్యాయంలో, భగవానుడు, లోకములోని సమస్త చరాచరములు నాకంటే భిన్నముగాలేవు; నాకంటే అన్యముగా లేవు అని చెప్పటం జరిగింది. అటువంటప్పుడు లోకము భ్రాంతిమయం కాదు; దీనిని "చైతన్యమయం" అని తెలుసుకోవాలి.

    భవదీయుడు,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
  9. hey simha........chimpesav......chaala baaga raasaavu....aa profile description keko keka...........

    రిప్లయితొలగించండి
  10. hellooo simha garu
    try these sites for various themes

    http://www.bloggerstyles.com/
    http://www.bloggerthemes.net/

    రిప్లయితొలగించండి
  11. మనుచరిత్ర వంటి కావ్యరాజములను మాకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందండి. మీ శైలి, వివరణ అన్నిటికన్నా ముఖ్యంగా కావ్య సౌరభాన్ని అందరూ ఆఘ్రాణించాలనే మీ ఆలోచన చాలా బావున్నాయి.

    రిప్లయితొలగించండి
  12. @రావు గారు,
    ధన్యవాదాలు...ఆ నాలుగు ముక్కల్లో మూడు గురువుగారివేనండి...ఒక్కటి మాత్రమే నా పైత్యం...

    @WIT REAL గారు,
    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు...రవిచంద్రగారి అనుమానం రెండు ముక్కల్లో చక్కగా తీర్చినందుకు కూడా..

    @నాగమురళి గారు,
    మంచి శ్లోకాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు...అంతేనండి,గురువుగారు చెప్పింది అదే..ప్రతి దానికి లాజిక్కులు తీసుకుంటూ కూర్చుంటే అక్కడ ఉండే మాధుర్యాన్ని ఆస్వాదించలేం...

    రిప్లయితొలగించండి
  13. @ఊకదంపుడు గారు,
    అవునండీ....మొదట అవతారిక నాలుగు పద్యాలు, కావ్యార్థ సూచకాలే...వాటిని గురించి వివరంగా మరో టపా రాస్తాను...ధన్యవాదాలు..

    @సూర్యప్రకాష్ గారు,
    ధన్యవాదాలు...ఈ పద్యానికి ఇక్కడ నేను రాసిన వివరణ, గురువుగారి "కావ్యపరీమళము"లోనుంచి తీసుకుని,దానిని అనుసరించుకుని రాసిందండీ...."అల్లసాని వారి అల్లిక జిగిబిగి" లో ఆ నాలుగు పద్యాలనీ కావ్య కథకి అన్వయించి వివరిస్తారు గురువుగారు...

    @రాజన్ గారు,
    హమ్మయ్య ఇప్పటికి నాకు మనసు ప్రశాంతంగా ఉందండీ...ః-)

    రిప్లయితొలగించండి
  14. @వినయ్,
    నిజంగానే అంత చింపేశానంటావా! ఏదో నీ అభిమానం కాకపోతేను....

    @హరీష్,
    అబ్బాయ్..నా బ్లాగులో నీ కామెంటు చూసుకుంటే భలేగా అనిపించిందిలే...లింకులు ఇచ్చినందుకు మంగిడీలు..ః-)...

    @మాధవరావు గారు,
    ధన్యవాదాలు...ఇక్కడ నేను ఇచ్చిన వివరణ "గజ" శబ్దానికి అన్వయించుకుని తీసుకోవాలి....మీరు ఉదహరించిన భగవద్గీత వివరణ బాగుంది..కాని అక్కడ context ఇక్కడ context వేరు వేరు కదండీ...మనము చూసి నిత్యమనుకున్నే లోకం భ్రాంతిమయమే..దాన్ని పరమాత్మ దృష్టితో చూడగలిగితే అది నిత్యచైతన్య స్వరూపమే..

    రిప్లయితొలగించండి
  15. @రవిచంద్ర,
    ఇదిగో ఇక నీ అనుమానం దగ్గరకే వస్తున్నా....wit real గారు రెండు ముక్కల్లో చెప్పేశారు...నేను ఇంకొంచెం వివరంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను...మనఇళ్ళల్లో పూర్వం వెనక పిల్లవాడు లేకపోతే(ఒక్కొక్కసారి ఉన్నా మరీ ప్రేమ ఎక్కువైతే)ముందు వాళ్ళకి మూణ్ణాలుగేళ్ళు వచ్చేవరకు తల్లిపాలు ఇస్తూనే ఉండేవారు..ఇక్కడ వినాయకుడి దగ్గరికి వస్తే,ఆయనకి వెనకాయన కుమారస్వామి...పార్వతీదేవి పేరుకి తల్లే కాని కనలేదు,స్తన్యమిచ్చీ ఎరుగదు...
    తారకాసుర సంహారార్థం శివపుత్రుడు జన్మించాలి....లోకాల్ని కలవరపెడుతున్న ఆ శివతేజాన్ని అగ్ని స్వీకరిస్తాడు...అగ్ని ఆ తేజస్సుని భరించలేక స్వర్గవాహిని,హిమవంతుని జ్యేష్ఠపుత్రిక,పార్వతీదేవి అక్క ఐన "కుటిలా నది" లో విడిచిపెడతాడు..కుటిల కూడా ఆ శివతేజస్సుని ఓపలేక గంగలోకి నెడుతుంది...ఆ సమయంలో గంగలో స్నానమాడుతున్న ఆరుగురు కృత్తికల(అరుంధతి తక్క మిగతా సప్తర్షి భార్యలు)లోకి ఈ తేజస్సు ప్రవేశిస్తుంది...వారికి కళంకం కలగ కూడదని గంగ తిరిగి ఆ తేజస్సుని వారు విడువగా స్వీకరించి,ఒక ఱెల్లుబీడులో ఆ తేజాన్ని విడుస్తుంది...అక్కడే ఆ శివతేజం కుమారస్వామిగా అవతరిస్తుంది...ఆయన్ని చూచిన కృత్తికలకి పుత్రభావంకలిగి స్తన్యమివ్వబోతారు..కాని ఉన్నది ఒక్కడు, ఆరుగురు తల్లులాయె..అందుకే ఆ స్వామి ఆరు ముఖాలు ధరించి "షణ్ముఖుడు" అయ్యాడు...అలాగా కుమారస్వామి కృత్తికా పుత్రుడు కనుక "కార్తికేయుడు"గా,కుటిలా పుత్రుడు కనుక "కౌటిల్యుడు"గా,ఱెల్లులో పుట్టినందుకు "శరవణభవుడు"గా(శరవణం అంటే ఱెల్లుబీడు)పిలవబడ్డాడు...తరువాత పార్వతీ పుత్రుడై "కుమారుడు"అని పిలవబడ్డాడు...

    @సూర్యప్రకాష్ గారు,
    మీరు చెప్పిన "ముక్కస్య ముక్క" నేను ఎక్కడా చదవలేదండీ...మీకు తిరిగి ఎక్కడన్నా దొరికితే మాక్కూడా తెలియజేయగలరు...మీరు ఇచ్చిన dli link కి ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి