ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

1, ఏప్రిల్ 2010, గురువారం

ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుని ఇరవయ్యొక్క అవతారాలు






భగవంతుండగు విష్ణువు

జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్

దగ నవ్వేళల దయతో

యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
(భాగ - ప్ర - ౬౩)






శౌనకాది మునులు, సూతమహర్షిని నారాయణుని కథలు తెలుపమని అడగగా, సకలపురాణ ద్రష్టయైన ఆ మహర్షి, శ్రీమద్భాగవత వక్తయైన శుకమునిని స్మరించి, వ్యాసుని పాదాలకు నమస్కారం చేసి,నరనారాయణులకున్నూ,భారతికిన్నీ మొక్కి ఇలా చెప్పటం మొదలెట్టాడు..."మునీంద్రులారా! సర్వలోకాలకీ మంగళప్రదమైన విషయాన్ని అడిగారు...కర్మనిర్మూలన హేతువులైన ఆ కమలలోచనుని కథలు ఎవడైతే వినడానికి ఇష్టపడతాడో, వాడికి ఇతరమైన విషయాలేవీ రుచించవు...పుణ్యశ్రవణ కీర్తనుడైన ఆ విష్ణువు తన కథలు వినేవాళ్ళ హృదయాల్లో నిలిచిఉండి సర్వశుభాల్నీ కలిగిస్తాడు..అశుభాల్ని పోగొడతాడు....అలాంటి వారికి నిశ్చలమైన భక్తి కలుగుతుంది...భక్తి ఉన్నవాడి మనస్సు అరిషడ్వర్గాలకి చిక్కక సత్వగుణప్రసన్నమై, ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకుంటుంది....అలాంటి వారికి సర్వ సంశయనివృత్తికలిగి, సర్వ కర్మలూ నశిస్తాయి......

అగ్ని ఒక్కటే ఐనా, వేరువేరు కట్టెలకి తగిలి మండేప్పుడు వేరువేరుగా కనిపించినట్టు, విశ్వాత్ముడైన ఆ ఆదిపురుషుడొక్కడే ఐనా అతడు దేవ,తిర్యక్, మనుష్య జాతుల్లో అవతరించి లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు.....ఆ భువనైకకర్త,బహుసుందరమైన పదునారు కళలతో,పంచమహాభూత భాసితుడై, శుద్ధసత్వుడై, సర్వావయవాలూ,సర్వేంద్రియాలూ వేలకొద్దీ("సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షా సహస్రపాత్" అని పురుషసూక్తం) వెలుగుతుండగా,హార కిరీటకుండలాలు పెక్కువేలతో, సహస్ర శిరస్కుడై పురుషరూపం ధరించి, అపారజలరాశి మధ్య,యోగనిద్రావిలాసియై వెలుగుతూ ఉంటాడు...అది సకలావతారాలకూ మూలమైన శ్రీమన్నారాయణుని దివ్యరూపం....దానిని పరమయోగీంద్రులైనవారు దర్శిస్తారు....ఆ పరమేశ్వరుని నాభికమలంలోనుంచి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ జన్మించాడు....ఆయన అవయవాలనుండే సర్వలోకాలూ సృష్టించబడ్డాయి.......

మొట్టమొదట ఆ శ్రీమన్నారాయణుడు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులనే నల్వురిపేర బ్రహ్మమానసపుత్రులుగా జన్మించి, బ్రాహ్మణుండై కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు....

రెండవసారి, జగజ్జననం కోసం యజ్ఞవరాహరూపంతో హిరణ్యాక్షుణ్ణి వధించి,ఆ హిరణ్యాక్షుడిచేత రసాతలానికి తొయ్యబడ్డ భూమిని, తన కోరలపై నిలబెట్టాడు.....

మూడవమారు, నారదుడను దేవరుషిగా బ్రహ్మమానసపుత్రుడై, సర్వకర్మనిర్మూలనము, సర్వపాపహారియగు వైష్ణవతంత్రాన్ని చెప్పి,మహతి అనే వీణను పూని నారాయణ కథాగానంతో లోకాల్ని పావనం చేశాడు......

నాల్గవపరి, నరనారాయణ రూపాలతో బదరికావనంలో దుష్క్రరమైన తపస్సొనరించాడు....

ఐదవ అవతారంలో, కర్దమ ప్రజాపతికి, స్వాయంభువమనువు రెండవపుత్రిక దేవహూతికి కపిలాచార్యుడుగా జన్మించాడు.....ఆ కపిలాచార్యుడు, దేవహూతికి పిండోత్పత్తిక్రమాన్ని ఉపదేశిస్తాడు....తత్త్వజ్ఞాన రూపమైన సాంఖ్యయోగాన్ని ఆసురి అనే బ్రాహ్మణునికి ఉపదేశిస్తాడు....

ఆరవ అవతారం దత్తాత్రేయుడు.....అనసూయాదేవియందు అత్రిమహామునికి జన్మించి, అలర్కుడు,ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యని బోధించాడు....

ఏడవరూపంలో, రుచి ప్రజాపతికి, స్వాయంభువమనువు పెద్ద కుమార్తె ఆకూతికి శ్రీయజ్ఞుడనే పేర జన్మించి, దివ్యమైన ప్రకాశంతో యామాది దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు....

ఎనిమిదవ అవతారం ఋషభుడు......ఈయననే ఉరుక్రముడనీ అంటారు......ఈయన మేరుదేవియందు నాభికి కలిగినవాడు....ఈ అవతారంలో ఆ మహావిష్ణువు సకల విద్ద్వజ్జనులకీ పరమహంస మార్గాన్ని బోధించాడు......

తొమ్మిదవదైన అవతారంలో, ఋషుల కోరికమీద పృథుచక్రవర్తిగా జన్మించి, భూమిని ధేనువుగా చేసి సకల ఓషధులనీ పిదికె.....

పదవది మత్స్యావతారం.....మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో,వేదాల్ని దొంగిలించిన సోమకుణ్ణి వధించి,సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావనెక్కించి, సప్తర్షులతో,సకల బీజాల్నీ,ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు.....ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వత మనువు......

పదకొండవదైన కూర్మావతారంలో, క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు...

పన్నెండవ అవతారం ధన్వంతరి.....క్షీరసాగరమథనంలో చివరిగా అమృత కలశహస్తుడై జన్మించి,దేవవైద్యుడై, సర్వ వైద్యవిద్యలకీ ఒజ్జయై విలసిల్లాడు...

పదమూడవది అసురులని మోహింపజేసి, సురలకి అమృతాహారాన్నందించి,పరమేశ్వరుణ్ణి సైతం మోహింపజేసిన జగన్మోహినీ అవతారం.....

పద్నాల్గవదైన ఉగ్రనరసింహరూపంతో, కనకకశిపుని వధించి,ప్రహ్లాదుణ్ణి రక్షించాడు....

పదిహేనవదైన కపటవామనావతారంతో బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు....

పదహారవది పరశురామావతారం....కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు....

పదిహేడవరూపంలో వ్యాసుడై, అల్పులైన మానవులని కరుణించ, వేదాల్ని విభజించి, అష్టాదశపురాణాల్ని రచించాడు....

పద్ధెనిమిదవ అవతారంలో శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు....

పందొమ్మిది,ఇరవై అవతారాలైన బలరామ,కృష్ణావతారాలతో భూమి భారాన్ని తగ్గించాడు....

కలియుగాదిలో రాక్షససమ్మోహనంకోసం, కీకటదేశంలో(మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్ధ్హుడనే పేర ప్రకాశిస్తాడు...అదే ఇరవై ఒకటవ అవతారం......

చివరగా కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు....సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు....." అని వివరించి సూతమహర్షి ఇంకా ఇలా అన్నాడు..

" అతిరహస్యంబైన హరిజన్మకథనంబు
మనుజుఁ డెవ్వఁడేని మాపురేపుఁ
జాలభక్తి తోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు."
(భాగ - ప్ర -౬౪)

14 కామెంట్‌లు:

  1. అగ్ని ఒక్కటే ఐనా, వేరువేరు కట్టెలకి తగిలి మండేప్పుడు వేరువేరుగా కనిపించినట్టు, విశ్వాత్ముడైన ఆ ఆదిపురుషుడొక్కడే ఐనా అతడు దేవ,తిర్యక్, మనుష్య జాతుల్లో అవతరించి లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు.....

    అవతారాలను గురించి ఎంత చక్కగా చెప్పబడింది. థాంక్స్

    రిప్లయితొలగించండి
  2. " అతిరహస్యంబైన హరిజన్మకథనంబు
    మనుజుఁ డెవ్వఁడేని మాపురేపుఁ
    జాలభక్తి తోడఁ జదివిన సంసార
    దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు."

    సంతోషమండీ!!

    రిప్లయితొలగించండి
  3. @అశ్విన్,@kvrn గారు,@జగదీష్ గారు,@మందాకిని గారు,
    మీ అభిమానానికి ధన్యవాదాలు...

    @నందం నరేష్,
    చాలా రోజుల తర్వాత కనిపించారు...ధన్యవాదాలు...

    @రామకృష్ణ గారు,
    నా ప్రతి టపా చదివీ,నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.. నా భాగవత ప్రయాణం అంతా ఇలానే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను...

    రిప్లయితొలగించండి
  4. శ్రీ కౌటిల్య గారికి, నమస్కారములు.

    అవతారాల్ని గురించి చక్కగా వివరించారు.

    భవదీయుడు,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
  5. ఈ టపా ద్వారా తెలియని చాలా విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు కౌటిల్య గారు

    రిప్లయితొలగించండి
  6. భలే విషయాలు చెప్తున్నారే :)థేంక్యూ

    రిప్లయితొలగించండి
  7. @మాధవరావు గారు,
    ధన్యవాదాలు..
    @రాజన్ గారు,
    వింటున్నకొద్దీ విష్ణుకథలు నిత్యనూతనంగా ఉంటాయండీ..
    @నేస్తం గారు,
    పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట..

    రిప్లయితొలగించండి
  8. నారాయణుని అవతారక్రమాన్ని చాల వివరంగా, అందంగా చెప్పారు కౌటిల్య.. చాల బాగుంది. Keep it up!!!

    రిప్లయితొలగించండి
  9. చాలా మంచి టపాలు రాస్తున్నారు. ఇంకా భాగవతంలోని విశేషాలు రాస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  10. మీ అభిమానానికి ధన్యవాదాలు...మీలాటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే రాస్తూనే ఉంటానండీ

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కౌటిల్యగారికి, నమస్కారములు.

    నూతన సంవత్సర శుభాకాంక్షలు; సంక్రాంతి పండుగకు ముందుగా శుభాకాంక్షలు.
    ఏమిటి, చాలా కాలంగా ఏమీ వ్రాయటంలేదు. వైద్య వృత్తిలోనే బిజీగా వుంటున్నారా. గుంటూరులోనే వున్నారా.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి

  12. బహు కాల 'నో' దర్శనం!

    జిలేబి

    రిప్లయితొలగించండి